సెంగోల్: అధికార మార్పిడికి గుర్తుగా నెహ్రూ ఈ దండాన్ని అందుకున్నారా? ఇందులో నిజమెంత?

- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తిరువావడుదురై ఆధీనం మఠం నెహ్రూకు ఇచ్చిన రాజదండాన్ని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఈ రాజదండాన్ని బ్రిటీష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి సంకేతంగా నెహ్రూ అందుకున్న మాట నిజమేనా?
‘‘1947లో లార్డ్ మౌంట్ బాటన్ సెంగోల్‌ను స్వీకరించి దాన్ని నెహ్రూకు ఇచ్చారు’’ అని తిరువావడుదురై మఠానికి చెందిన అంబలవన దేశీగ పరమచార్య స్వామిగల్ నేడు మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ రాజదండం నేపథ్యానికి సంబంధించి, ఒక సంఘటనను మీడియా సమావేశంలో ప్రభుత్వం వివరించింది.
"భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే రోజు సమీపిస్తుండగా, అధికార మార్పిడికి గుర్తుగా ఏదైనా కార్యక్రమం చేపడుతున్నారా అని అప్పటి జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, నెహ్రూని అడిగారు. ఈ విషయంలో నెహ్రూ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియ సి.రాజగోపాలాచారి(రాజాజీ) సలహాను కోరారు.
రాజాజీ వెంటనే ఒక ఆలోచన చేశారు. చోళులు ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికారం బదిలి చేసే సమయంలో ఇచ్చే సమయంలో ఒక రాజదండాన్ని మార్చుకునే వారని గుర్తు చేసుకున్నారు. అలాంటిదే రాజదండం తయారు చేసి, బ్రిటీష్ వారి నుంచి అధికార బదిలీకి చిహ్నంగా ఉపయోగించాలని భావించారు. తనకు అయిదు అడుగుల పొడవు గల రాజదండం కావాలని తంజావూరులోని తిరువావడుదురై ఆధీనం మఠాధిపతిని కోరారు రాజాజి.
చెన్నైకి చెందిన ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ అనే సంస్థ ఈ రాజదండాన్ని రూపొందించింది. ఆగస్ట్ 14న ముగ్గురు వ్యక్తులు దండాన్ని తీసుకుని ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆ ముగ్గురూ వ్యక్తులలో ఒకరు అధీనం మఠం ఉపప్రధాన పూజారి కుమారస్వామి తాంబిరన్ కాగా, రెండోవారు నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై, మూడో వ్యక్తి మఠం గాయకుడు మాణిక్కం.
ఈ ముగ్గురు ఆ దండాన్ని లార్డ్ మౌంట్‌బాటన్ చేతిలో పెట్టి, తిరిగి తీసుకున్నారు. తర్వాత దానికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై దానినిక నెహ్రూకు ఇచ్చేందుకు ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రధాన అర్చకులు దేవర కీర్తనలు ఆలపిస్తుండగా నెహ్రూ దాన్ని అందుకున్నారు’’ అని వీడియోలో తెలిపింది.

అధికార మార్పిడికి గుర్తుగా ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారని లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూను అడిగినట్లు హోంమంత్రి అమిత్ షా కూడా, మే 24న నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ దండాన్ని తిరువావడుదురై మఠానికి చెందిన వ్యక్తులు నెహ్రూకు ఇచ్చినట్లు పత్రికా కథనాలు, ఫొటో ఆధారాలు ఉన్నాయి. ఒక ఫొటోలో తన నుదిటిపై రాజదండం పెట్టుకుని నిలబడి కనిపిస్తారు నెహ్రూ.
అయితే రాజాజీ ఇలాంటి సలహా ఇచ్చాడని చెప్పడానికి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, రాజాజీని నెహ్రూ సలహా కోరినట్ల అమిత్ షా వెల్లడించారు.
ఆగస్ట్ 25, 1947 నాటి టైమ్ మేగజైన్‌లో ఈ రాజదండం నెహ్రూకు ఎలా చేరిందన్న విషయం ఉంది.
‘‘దేవుడిపై నమ్మకం లేని జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధాని అయ్యే ముందు సాయంత్రం మాత్రం ఆధ్యాత్మిక భావనలోకి వెళ్లారు. దక్షిణ భారతదేశంలోని తంజావూరులోని ఒక మఠానికి అధిపతి అయిన అంబలవాన దేశికర్ అనుచరులు నెహ్రూ దగ్గరికి వచ్చారు.
ప్రాచీన రాజుల వలే నెహ్రూ కూడా హిందూ సాధువుల నుంచి రాజదండాన్ని పొందితే బాగుంటుందని తంజావూరు మఠాధిపతి అంబాలవాన దేశికర్ అప్పట్లో భావించారు. దేశికర్ ఇద్దరు అనుచరులతోపాటు నాదస్వర విద్వాన్ రాజరత్న పిళ్లై కూడా వారితో వచ్చారు. ఆగస్టు 14న వారు పాత ఫోర్డ్ కారులో నెహ్రూ ఇంటికి ఊరేగింపుగా వచ్చారు.
నెహ్రూ ఇంటికి చేరుకున్నాక రాజరత్నం పిళ్లై నాదస్వరం వాయించడం ప్రారంభించారు. మిగిలిన ఇద్దరు నెహ్రూ పిలుపు కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. కాసేపటి తర్వాత వారు నెహ్రూ గదిలోకి ప్రవేశించారు.
వారి దగ్గర ఐదు అడుగుల పొడవు, 2 అంగుళాల మందం ఉన్న రాజదండం ఉంది. తంజావూరు నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని ఒకరు నెహ్రూ తలపై చల్లారు. నెహ్రూ నుదుటిపై విభూతి పూశారు. నెహ్రూకు పీతాంబరాన్ని చుట్టి, దండాన్ని ఆయనకు సెంగోల్ ను బహూకరించారు. ఆ రోజు ఉదయం నటరాజ స్వామి కోసం తయారు చేసిన ప్రసాదాన్ని కూడా వారు నెహ్రూకు అందించారు" అని టైమ్ మ్యాగజైన్ వివరిస్తుంది.

టైమ్ మ్యాగజైన్ కథనం ప్రకారం, అధికార మార్పిడికి చిహ్నంగా నెహ్రూ సన్యాసుల నుంచి రాజదండాన్ని పొందాలని మఠాధిపతులు భావించారు. అందులో భాగంగానే అంబలవాన దేశికర్ నుండి నెహ్రూకు రాజదండం చేరుకుంది.
డొమినిక్ లాపియర్, లారీ కాలిన్స్ రచించిన ‘ది ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ అనే పుస్తకం భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన సమయం గురించి సమగ్రం వివరించే పుస్తకం.
ఈ పుస్తకంలో కూడా నెహ్రూ రాజదండం అందుకున్న సమాచారం కూడా ఉంది. ఈ సంఘటన టైమ్ మ్యాగజైన్‌లో "14 ఆగస్ట్ 1947" అనే ఎపిసోడ్‌లో ఉంది. కానీ రాజాజీ సలహా గురించి కానీ, మౌంట్‌బాటన్‌కు రాజదండం ఇచ్చి నెహ్రూకి తిరిగి ఇవ్వడం గురించి కానీ సమాచారం లేదు.
ఆగస్ట్ 14న ఏం జరిగిందో ‘ది హిందూ’ పత్రిక ఆగస్ట్ 15న ప్రచురించింది. దీని ప్రకారం, ఆగస్టు 14, గురువారం అర్ధరాత్రి, భారత రాజ్యాంగ సభ చరిత్రాత్మక సమావేశం జరిగింది.
రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. అనంతరం సభలో సభ్యులు తమ సేవను దేశానికి అంకితం చేస్తూ తీర్మానం చేసి ప్రసంగించారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆ తర్వాత భారతీయ మహిళల తరపున శ్రీమతి హంసా మెహతా జాతీయ జెండాను సమర్పించారు. అనంతరం సభ శుక్రవారం ఉదయానికి వాయిదా పడింది.
ఈ సమయంలో మౌంట్ బాటన్ నుంచిగానీ, మరెవరి నుంచి గానీ నెహ్రూ రాజదండం అందుకున్నట్లు ఎక్కడా రాయలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వీపీ మీనన్ రాసిన ‘‘ది ట్రాన్స్ ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’’ అనే పుస్తకంలో కూడా రాజదండం అందజేసినట్లు ప్రస్తావన లేదు.
ఆధినం మఠానికి చెందిన సన్యాసులే నెహ్రూకు దండను అందజేసినట్లు అర్థమవుతోంది. ఆలయ ప్రసాదాలను కూడా వారు నెహ్రూకు అందజేశారు. అంటే వారు ఆగస్టు 14వ తేదీనే విమానంలో దిల్లీకి చేరుకుని ఉంటారని అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజున భారత వైస్రాయ్ కరాచీలో ఉన్నారు. అదే రోజు పాకిస్తాన్ స్వాతంత్ర్య వేడుకలు ఉండటంతో అందులో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.
ఆగస్టు 14, 15 తేదీలలో వైస్రాయ్ ఎక్కడ ఉంటారు అన్నది జులై 10నే నిర్ణయం జరిగిపోయింది. ఈ రెండు రోజుల్లో భారత, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలవుతాయి.
సౌతాంప్టన్ యూనివర్సిటీలో ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ పత్రాల ప్రకారం, ఆగస్టు 14న వైస్రాయ్ ఉదయం 8 గంటలకు బయలుదేరి, 11.30కి కరాచీ చేరుకున్నారు. తిరిగి 3:30కి కరాచి నుంచి బయలుదేరి రాత్రి 7:00 గంటలకు దిల్లీ వచ్చారు.
అధికార మార్పిడి విషయంలో యూనియన్ జాక్‌ను అవనతం చేయడం, భారత జాతీయ జెండాను ఎగరవేయడం మినహా, రాజదండం ప్రస్తావన ఎక్కడా ఆయన పేపర్లలో కనిపించ లేదు.
ఫొటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ను చూసినా, ఆధీనం మఠానికి చెందిన వ్యక్తులు ఈ దండాన్ని నెహ్రూకు అందజేసినట్లు ఫొటోలలో కనిపిస్తుంది. మౌంట్ బాటన్ ఇచ్చినట్లు ఎక్కడా ఫొటో ఆధారాలు లేవు.

ఆ తర్వాత ఈ రాజదండం ఏమైంది?
ఈ రాజదండం ఏమైందో చాలాకాలం వరకు ఎవరికీ తెలియకుండానే ఉండిపోయింది. నెహ్రూకు రాజదండం అందజేస్తున్న ఫొటో తిరువావడుదురై ఆధీనం మఠంలో ఉండటాన్ని 2018లో కొందరు గమనించారు. ఈ విషయం తర్వాత బయటి ప్రపంచానికి తెలిసి, ఓ వారపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. చెన్నైలోని ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ షాపులో ఈ రాజదండం తయారైందని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇది గమనించిన ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ సభ్యులు ఈ దండం ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఇందుకోసం వారు దేశంలోని అనేక మ్యూజియాలకు లేఖలు కూడా పంపారు. చాలా నెలల తర్వాత, అలహాబాద్‌లోని మ్యూజియం వారు తమ వద్ద ఇలాంటి రాజదండం ఉందని సమాధానం పంపారు. మూడు నెలల తర్వాత దానికి సంబంధించిన ఫొటోను కూడా పంపించారు.
దీనిని చూసిన ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ సభ్యులు మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ ఈ దండంను నెహ్రూ రాజదండంగా పేర్కొంటూ ప్రదర్శనకు పెట్టి ఉంది. రాజదండం పూర్వాపరాలను మ్యూజియంకు వివరించి, చెన్నైకి తిరిగి వచ్చిన ఈ జ్యుయెలర్ వ్యాపారులు సంబంధిత వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశారు.
"వీడియో వైరల్‌గా మారింది. కొందరు ముఖ్యులు చూశారు. వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పుడు దానిని పరిశీలించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది" అని ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ మేనేజింగ్ పార్ట్ నర్ అమరేంద్రన్ చెప్పారు.
ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ వద్ద ప్రస్తుతం ఈ దండ తయారీకి ఎంత ఖర్చయింది, ఎంత బంగారం అవసరమైంది అనే సమాచారం లేదు.

2019లో ఉమ్మిడి బంగారు జ్యుయెలర్స్ మేనేజింగ్ పార్ట్ నర్ అమరేంద్రన్ ఆన్‌లైన్ పత్రికకు ఒక వ్యాసం రాశారు. అందులో ‘‘భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం. ఇందుకు గుర్తింపుగా మీరు ఏం చేయబోతున్నారు’’ అని లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూ అడిగినట్లు, ఆ తర్వాత నెహ్రూ రాజాజీని సలహా కోరగా, తమిళ సంప్రదాయంలో రాజుల అధికార మార్పిడి సమయంలో జరిగే రాజదండం తరహాలో ఇక్కడ కూడా మార్చుకోవచ్చని సలహా ఇచ్చినట్లు రాశారు.
అంబలవాన దేశికర్ (1937 - 1951) భారతదేశంలోని శైవ మఠాలలో ఒకటైన తిరువావడుదురై ఆధీనం మఠానికి 20వ గురు. రాజాజీ ఆయనను సంప్రదించి, అధికార మార్పిడి కోసం ఏదైనా ప్రక్రియ చేపట్టాలని కోరారు.
ఇదే వ్యాసంలో మాసిలమణి పిళ్లై, అంబలవాన దేశికర్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఉటంకించారు. ‘‘ ఆధీనం అధిపతి ఆ సమయంలో జ్వరంతో బాధపడుతున్నారు. అదే సమయంలో ఆయన చెన్నైలోని ప్రముఖ ఆభరణాల వ్యాపారి ఉమ్మిడి బంగారు చెట్టియార్ కు శైవ చిహ్నంతో కూడిన బంగారు దండాన్ని తయారు చేయమని కోరాడు. దాని బరువు, ధర ఇప్పుడు నాకు గుర్తు లేదు. రాజాజీ ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ విమానంలో, తిరువావడుదురై ఆధీనం మఠానికి చెందిన పూజారి కుమారస్వామి తాంబిరన్‌ను, మరో ఇద్దరిని దిల్లీకి పంపారు.’’ అని వెల్లడించారు.
“దేశం విభజన, ఆ తర్వాత జరిగిన హింసకాండ కారణంగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని హడావుడిగా నిర్వహించారు. ఇది చట్టబద్ధమైన ఈవెంట్ కాదు కాబట్టి ఇది ఎక్కడా నమోదు కాలేదు. దీని కారణంగా, ఈ రాజదండం, ఈ సంఘటన భారత ప్రభుత్వ జ్ఞాపకాల నుంచి అదృశ్యమయ్యాయి" అని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ సభ్య కార్యదర్శి సచ్చిదానంద్ జోషి ‘ది హిందూ’లోని ఒక కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














