బైపోలర్ డిజార్డర్: ఉన్నట్టుండి తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకుంది.. ఆమెకు ఏమైంది?

రోజీ వివా

ఫొటో సోర్స్, ROSIE VIVA

    • రచయిత, బెథ్ రోజ్
    • హోదా, బీబీసీ యాక్సస్ ఆల్

మోడల్ రోజి వైవ్‌కు అప్పుడు 22 ఏళ్లు. ఉత్తర లండన్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయం నుంచి ఆమె ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమె విమానాశ్రయంలో ఫైర్ అలారం నొక్కారు. దీంతో విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత తెలిసిందేమిటంటే, రోజికి బైపోలర్ డిజార్డర్ ఉంది.

రోజీకి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఇటలీలోని క్రోసియాలో ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు ఆమెంతో ఉత్సాహంగా ఉన్నారు. తన తల్లిదండ్రులతో కలిసి కొన్ని రోజులు వెకేషన్‌ను ఎంజాయ్ చేయాలనుకున్నారు.

అంతకు కొన్ని రోజుల క్రితమే రోజికి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ తర్వాత ఆమెకు సరిగ్గా నిద్ర పట్టలేదు.

రాత్రి ఒంటి గంటప్పుడు లండన్‌లోని వీధుల్లో నడవాలని తనకు అనిపించింది. అలా నడిచిన తర్వాత రోజీ నిద్రపోకుండానే నేరుగా విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో తను కల కంటున్నట్లు రోజీ భావించింది. అలా నడుచుకుంటూ వెళ్లేటప్పుడే, ఎవరో తెలియని ఒక వ్యక్తిని రోజీ ముద్దు పెట్టుకుంది.

ఆరోగ్యం గురించి చర్చించే ‘బీబీసీ యాక్సస్ ఆల్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రోజీ, ఆ రోజు తనకు జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు.

‘‘అది నిజమైన జీవితం కాదని నేననుకున్నాను’’ అని ఆమె చెప్పారు.

ఆమె చూడటంలో, వినికిడిలో ఏదో తేడా అనిపించిందన్నారు. "గుండె వేగం కూడా బాగా పెరిగింది. ఆ సమయంలో నాకేదో జరుగుతోందని నాకనిపించింది" అని రోజీ చెప్పారు.

స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకున్న తర్వాత, తనకు జరుగుతున్నది చూసుకుని తన‌కు ఆశ్చర్యమేసిందన్నారు. ఆ సమయంలో తన తల్లికి ఫోన్ చేయాలని ఆమె అనుకున్నారు.

‘‘మా అమ్మ కాల్ ఎత్తగానే నా భ్రమలన్నీ తొలగిపోయాయి’’ అని రోజీ చెప్పారు.

‘‘అప్పుడే నాకు నిజ జీవితంలో ఏం జరుగుతోందో అర్థమైంది. ఆ సమయంలో నేను చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాను. దిగ్భ్రాంతి చెందాను" అని రోజీ తెలిపారు.

విమానాశ్రయంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన తాను చేతితో ఫైర్ అలారం గ్లాస్‌ను బద్దలు కొట్టారు. ఆ తర్వాత, ఆ అలారం పెద్దగా మోగింది. దీంతో, పోలీసులు తన వైపు పరిగెత్తుకుంటూ వచ్చినట్లు మాత్రమే తనకు గుర్తుందని రోజీ చెప్పారు.

పోలీసులు రోజీని కస్టడీలోకి తీసుకున్నారు. కొంత సేపటి క్రితం వరకు ప్రయాణికులతో కిటకిటలాడిన విమానాశ్రయంలో రోజీ చేసిన పనికి ఒక్క మనిషి కూడా కనిపించలేదు.

మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, CHANNEL 4

తనకేదో జరుగుతోందని రోజీకి అనిపించింది. తీవ్ర ఆందోళనకు గురైన రోజీ, ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. తన మనసులో ఏవేవో భ్రమలున్నాయి.

పోలీసులు ఆమెను తీసుకెళ్తున్నప్పుడు తనకు వారు సాయం చేస్తున్నట్టు అనిపించింది.

ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందు కూడా, రోజీకి ఏదో అయినట్లు అనిపించింది. ఏదైనా సంఘటనపై తన స్నేహితులు స్పందించే తీరుతో పోలిస్తే రోజీ స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది.

‘‘ఆ సమయంలో నేనెంతో ఒత్తిడికి గురయ్యాను. నా బాయ్‌ఫ్రెండ్ నన్నొక దెయ్యంలా భావించారు. నేను కూడా అదే ఆలోచించాను. ఎవరేం చెబుతున్నారో నాకు పట్టించుకోలేకపోయాను, తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లాను. నేనెందుకు అలా చేస్తున్నానో, నాకసలు ఐడియా లేదు’’ అని రోజీ చెప్పారు.

తనకేదో జరిగిందనేందుకు తొలి సంకేతంగా ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందని రోజీ చెప్పారు. స్నేహితులు దీన్ని గుర్తించారు.

ఆ తర్వాత రోజీ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆధ్యాత్మిక శక్తులను ఎక్కువగా నమ్మడం ప్రారంభించారు.

‘‘నాకొక సోదరుడు ఉండేవారు. అతనికి ఏడేళ్లున్నప్పుడే లుకేమియాతో మరణించాడు. అతను మళ్లీ పుట్టాడని నేను భావించాను. దీన్ని నేను సోషల్ మీడియాలో పంచుకున్నాను’’ అని రోజీ చెప్పారు.

రోజీ ఈ ప్రవర్తనతో ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని అర్థమైంది. సరిగ్గా నిద్ర లేకపోవడంతో, రోజీ ఏదో భ్రమలో ఉండేవారు. ఈ ఊహా ప్రపంచంలో, నిజజీవితానికి, భ్రమకు మధ్యనున్న తేడాను కూడా ఆమె చెప్పలేకపోయేవారు.

స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రమాదం తర్వాత, అంబులెన్స్‌లో రోజీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే 24 గంటల పాటు ఉన్నారు. రోజీ పరిస్థితి తెలుసుకున్న తర్వాత, క్రోసియా నుంచి ఆమె తల్లి, అక్క లండన్‌కు వచ్చారు.

తనకెదురవుతున్న ప్రమాదం గురించి చెప్పిన రోజీ, ‘‘నాకేం జరుగుతుందో నాకు తెలుసు. కానీ, నేను ఒకటి అడగదలుచుకున్నాను. హాలిడేకి నేను వెళ్లొచ్చా’’ అని ప్రశ్నించారు.

సైకియాట్రిక్ వార్డు‌కు రోజీని షిఫ్ట్ చేశారు. మూడు నెలల పాటు ఆమెకు ట్రీట్‌మెంట్ అందించారు.

‘‘రెండు నెలల పాటు నిద్ర పోలేదు. చెప్పాలంటే, రెండు వారాల పాటు నేను నా తల్లిదండ్రులను గుర్తించలేదు’’ అని రోజీ చెప్పారు.

ఆ సమయంలో తనకు ఎదురైన చాలా విషయాలను తాను మాటల్లో చెప్పలేకపోయారు.

కొన్ని రోజుల పాటు సైకియాట్రిక్ వార్డులో ఉన్న తర్వాత, రోజీ ఇన్ఫెక్షన్ రిపోర్ట్‌లు వచ్చాయి. ఆమెకు టైప్ 1 బైపోలర్ డిజార్డర్ ఉన్నట్లు గుర్తించారు.

తనకు జరిగిన దాన్ని అర్థం చేసుకునేందుకు, తనకెందుకు ఈ చికిత్స అవసరమో తెలుసుకునేందుకు రోజీకి ఆరు వారాలు పట్టింది.

మానసిక ఆరోగ్యం

ఫొటో సోర్స్, CHANNEL 4

వ్యాయామం, ప్రాణాయామం, డైట్

బ్రిటన్‌లోని మానసిక ఆరోగ్య సంస్థ మెంటల్ హెల్త్ యూకే చెబుతున్న వివరాల ప్రకారం, టైప్ 1 బైపోలర్ డిజార్డర్‌లో కనీసం ఒక వారం పాటు ఈ భ్రమ ఉంటుంది. దీన్నే మానియా అంటారు. ఈ సమయంలో సంబంధిత రోగులు తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోతారు.

రోజీకి సైక్లోథెమియా వచ్చింది. దీని వల్ల తరచూ మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి.

ఈ వ్యాధి జీవితకాలం ఉంటుంది. టాబ్లెట్లతో పాటు ఇతర విధానాల్లో ఈ వ్యాధికి చికిత్స ఇవ్వొచ్చు.

‘‘దీనికి ఇదే చేయాలి, అదే చేయాలనే రూల్స్ లేవు. కానీ, ప్రస్తుతం నేను దీన్ని ఎదుర్కొంటున్నాను. నేను వ్యాయామం చేస్తాను. నాకు వచ్చిన ఈ సమస్యను నేను స్వీకరించాను. రాబోయే ఏళ్లలో కూడా ఈ వ్యాధి నాతోనే ఉంటుంది.

ఒకవేళ ఏదైనా నన్ను ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తే, నేను ప్రాణాయామం చేసేందుకు ప్రయత్నిస్తాను. నా నిరాశను, ఒత్తిడిని ప్రాణాయామం పూర్తిగా తొలగిస్తుందని కాదు. కానీ, దీనిపై నేను మరింత స్పష్టంగా ఆలోచించగలను’’ అని ఆమె చెప్పారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా రోజీ బ్రిటన్‌లోని ఎన్‌హెచ్ఎస్ సంస్థతో గత మూడేళ్లుగా కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆమె ఈ పరిస్థితికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలో ఎన్‌హెచ్ఎస్ సూచిస్తుంది.

తక్కువ ఆల్కాహాల్ తీసుకుని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మంచి నిద్రపోయినప్పుడు రోజీకి మరింత శక్తిమంతంగాా, బలంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది.

ఫోన్ లేకుండా వాకింగ్‌‌కు వెళ్లడం, వివిధ రకాల శబ్దాల నుంచి తప్పించుకోవడం ద్వారా ఆమె అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కష్టకాలం నుంచి తప్పించుకునేందుకు ఇవి చాలా సాయపడుతున్నాయి.

తన ఈ అనుభవంతో ‘మోడలింగ్, మానియా అండ్ మీ’ పేరుతో ఫిల్మ్ తీశారు. బ్రిటన్‌లోని ఛానల్ 4లో దీన్ని ప్రదర్శించారు. తన జీవితంలో బైపోలర్ డిజార్డర్ కారణంగా చోటు చేసుకున్న వాటిని వివరించారు.

స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిన నాలుగేళ్లవుతోంది.

ఈ వ్యాధితో కలిసి జీవించడం రోజీ నేర్చుకున్నారు. ఆమె తన మోడలింగ్ కెరీర్‌ను కూడా కొనసాగిస్తున్నారు. పలు పెద్ద బ్రాండ్లతో కలిసి ఆమె పనిచేస్తున్నారు.

‘‘నేనింకా 27 ఏళ్ల సాధారణ అమ్మాయినే. ఏమైనా విషయాలు నా మనసులోకి వచ్చినప్పుడు నేను వాటితో ఏం చేస్తా అన్నదే ప్రశ్న. ఇది అంత తేలిక కాదనేది నిజం. కానీ, నన్ను నేను మెరుగుపరుచుకోవాలి’’ అని రోజీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)