వాలంటైన్స్ డే: డేటింగ్ చేయటం, ప్రేమలో పడటం నేర్పించే ‘మాక్ డేట్’ సర్వీసులు

ఫొటో సోర్స్, THE INTIMACY CURATOR
- రచయిత, చెరీలాన్ మొలాన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
ఆకాంక్షకి తనతో డేట్‌కి వచ్చిన వ్యక్తి ఎదురుగా కూర్చోవడంతో తనలో చాలా కంగారు పెరిగింది. ఆ కంగారు వల్ల టేబుల్‌పై ఉన్న స్పూన్లను అటు ఇటూ కదుపుతూ, అతడి వైపు చూడకుండా చూపు తిప్పేసుకుంటోంది ఈ 26 ఏళ్ల యువతి.
కానీ, తనతో డేట్‌కి వచ్చిన వ్యక్తి ఆమె వైపు వంగి, కంగారు పడొద్దని చెప్పారు. దీంతో తను కాస్త రిలాక్స్ అయింది. చేతులు టేబుల్ కింద పెట్టుకుని కంగారు తగ్గించుకునేందుకు, గట్టిగా శ్వాస తీసుకుంది.
అయితే, ఆమెకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆకాంక్ష నిజంగా డేట్‌కి వెళ్దామనుకున్న వ్యక్తి కాదు. వారు ''డేటింగ్ సరోగేట్''. అంటే ఆమెతో పాటు మాక్ డేట్‌కు వెళ్లడానికి అతడిని కుదుర్చుకున్నారు. ఈ డేట్‌లో ఆమె ప్రవర్తనను గమనించి, తన అసలైన భాగస్వామితో డేట్‌కి వెళ్లే సమయంలో ఎలాంటి కంగారు లేకుండా హ్యాపీగా ఆ సమయాన్ని ఆస్వాదించేలా మెలకువలను నేర్పిస్తుంటారు.
ఇలాంటి డేటింగ్, రిలేషన్‌షిప్, ఇంటిమసీ కోచింగ్ సర్వీసెస్‌ను ఆన్‌లైన్‌లో అందించే సంస్థ ఇంటిమసీ క్యూరేటర్. ఈ సంస్థకు చెందిన డేటింగ్ సరోగేట్‌ను మూడు నెలల కిందట ఆకాంక్ష ఆశ్రయించింది.
డేటింగ్ ఎలా చేయాలి, మీకు తగ్గ వారిని ఎలా ఎంపిక చేసుకోవాలనే వాటిపై అవగాహన కల్పించే డేటింగ్ యాక్సిలేటర్ లాంటి సర్వీసులను అందించే సంస్థలు, యాప్‌లు ప్రస్తుతం చాలా పుట్టుకొచ్చాయి.
భారతీయులు ఇప్పటికీ చాలా వరకు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లనే చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు సెక్స్ చాలా వరకు నిషిద్ధం. అయితే, ఈ కంపెనీలు అమ్మాయిలు, అబ్బాయిలు డేట్‌కి ఎలా వెళ్లాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, ప్రేమలో ఎలా పడాలి వంటి విషయాలను సరికొత్త విధానాల్లో వివరిస్తున్నాయి.
ఈ యాప్ యూజర్లలో చాలా వరకు వరల్డ్ ట్రెండ్స్‌ను అనుసరిస్తూ పెద్ద పెద్ద నగరాల్లో జీవిస్తున్న వారే. వారు ఎలాంటి ప్రేమ కోసం వెతుకుతున్నారన్నది వయసు పరంగా ఆ యూజర్లలో చాలా వరకు తేడా ఉంటుంది.
కొందరు ఆకాంక్ష మాదిరి, డేటింగ్ విషయంలో వారికున్న అపోహలను, అభ్యంతరాలను తొలగించాలనుకుంటున్నారు. మరికొందరు సంబంధాల విషయంలో మరోసారి తమ భావనలను తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఇంటిమసీ క్యూరేటర్ డేటింగ్ సరోగసీ ప్యాకేజీ తీసుకోవాలనుకున్న వారు రూ. 12 వేల నుంచి రూ. 80 వేల మధ్యలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. డేటింగ్ కోచ్‌లు ఇచ్చే పలు ఆన్‌లైన్ సెషన్స్‌లో వారు పాల్గొనాలి.
మీరెందుకు డేట్‌కి వెళ్లాలనుకుంటున్నారు, మీరు కావాలనుకునే భాగస్వాముల నుంచి మీరేం కోరుకుంటున్నారు వంటి విషయాలను వారు తెలుసుకుని, మాక్ డేట్స్ ఇప్పించేందుకు, వారికి డేటింగ్ పరంగా కోచింగ్ ఇచ్చేందుకు డేటింగ్ సరోగేట్లను ఏర్పాటు చేస్తాయి ఇంటిమసీ క్యూరేటర్ డేటింగ్ సంస్థలు.
''ఈ అనుభవం ద్వారా నేను నిజంగా డేట్‌కి వెళ్లిన సమయంలో చాలా సౌకర్యవంతంగా భావించాను'' అని ఆకాంక్ష చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొన్నేళ్ల క్రితం ఆకాంక్ష తనను 'క్వీర్' (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు)గా ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత, డేటింగ్ ప్రపంచంలో తనకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. మహిళలతో డేట్‌కి వెళ్లడం చాలా కష్టమని తనకి అనిపించింది.
సిస్జెండర్ (నాన్ ట్రాన్స్‌జెండర్), హెటిరో సెక్సువల్ ప్రజలకు చాలా మంది డేటింగ్ మార్గదర్శకులు ఉన్నప్పటికీ, క్వీర్ వ్యక్తులకు డేటింగ్ గురించి అవగాహన కల్పించే వారు దొరకడం చాలా కష్టం.
తాను డేట్‌కి వెళ్లిన సమయంలో ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఆ వ్యక్తిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవరు డోర్ తీయాలి, కూర్చోమని చైర్‌ను ఎలా ఆఫర్ చేయాలి వంటి విషయాల్లో చాలా తికమకపడేది. సాధారణంగా ఒక మహిళతో డేట్‌కి వెళ్లినప్పుడు చాలా వరకు అవన్ని అబ్బాయిలే చేస్తూ ఉంటారు.
''ఒక మహిళగా నాకు తెలుసు, ఆ సమయంలో కాంప్లిమెంట్లను ఎలా ఫీల్ అవుతామో. కానీ, నాకు ఒకరి దగ్గర తక్కువ అవ్వాలని కానీ, వారు నన్ను అసహ్యించుకోవాలని కానీ అనుకోలేదు. నా ఆసక్తిని వారికి తెలియజేయాలనుకున్నాను'' అని ఆకాంక్ష తెలిపింది.
ఆకాంక్ష లాంటి యువతరం.. సెక్స్, డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి విషయాల్లో వారి విధానాల్లో చాలా ఆచరణాత్మకంగా ఉంటున్నారని డేటింగ్ కోచ్ సిమ్రాన్ మంఘారమ్ అన్నారు.
జీవిత భాగస్వామిని వెతుక్కోవడం లేదా వారితో ఒక సంబంధాన్ని ఏర్పరుచుకోవడం కాకుండా, వారి అవసరాలు, జీవన విధానాలకు అనుగుణంగా డేట్‌లను ఎంపిక చేసుకుంటున్నారని చెప్పారు.
ఇది ఎలాంటి కమిట్‌మెంట్ లేని రొమాంటిక్, సెక్సువల్ సంబంధాలు(సిచ్యువేషన్‌షిప్స్) ఎందుకనే విషయాన్ని తెలియజేస్తుంది. బహుళ భాగస్వామి సంబంధాలు పెరుగుతున్న ఈ సమయంలో గత ఏడాది జనరేషన్ జెడ్ డేటింగ్ ట్రెండ్స్‌లో సిచ్యువేషన్‌షిప్స్ కూడా ఒక భాగంగా మారాయి.
ఇంటిమసీ క్యూరేటర్ వ్యవస్థాపకురాలైన ఐలి సెఘెట్టి కూడా ఐదుగురు డేటింగ్ సరోగేట్లలో తాను ఒకరిగా మారారు. డేట్‌కి వెళ్లేందుకు ఆకాంక్ష సౌకర్యవంతంగా ఉండేలా తాను సాయం చేశారు. తనతో కలిసి మూడుసార్లు సెఘెట్టి డేట్‌కి వెళ్లారు. ఒకసారి ఆర్ట్‌గ్యాలరీకి, మరోసారి అవుట్‌డోర్ వాకింగ్‌కు, మరోసారి డిన్నర్‌కి కలిసి వెళ్లారు.
ఈ డేట్స్‌కి వెళ్లిన సమయంలో, ఆకాంక్ష మాట్లాడే విధానం, తను ప్రవర్తించే తీరు, ఒత్తిడిని అధిగమించే విషయంపై, స్టయిల్‌గా ఎలా ఉండాలి అనే విషయాలపై సెఘెట్టి పలు సూచనలను, సలహాలను ఇచ్చారు.
''ఒకవేళ మీతో పాటు డేట్‌కి వచ్చిన వ్యక్తి చుట్టూ చేతులు వేసి, ముద్దు పెట్టుకోవాలనుకుంటే ఆ విషయాలను వారిని అడగడం చాలా ఇబ్బందిగా, భయంగా భావిస్తాం. కానీ, మాక్ డేట్స్‌కి వెళ్లడం వల్ల వారితో ఈ మాటలు మాట్లేందుకు నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు'' అని ఆకాంక్ష తెలిపారు. అప్పటి నుంచి చాలా డేట్స్‌ను తాను సంతోషంగా చేపట్టినట్టు చెప్పారు.

ఫొటో సోర్స్, THE INTIMACY CURATOR
ముంబైకి చెందిన 40 ఏళ్ల రాజీవ్ చివరిసారి 2012లో డేట్‌కి వెళ్లారు. గత ఏడాది తాను మళ్లీ డేటింగ్‌లోకి రావాలనుకున్నప్పుడు, చాలా విషయాలు తనకు కొత్తగా అనిపించాయి. 'ఘోస్టింగ్(ఎలాంటి వివరణలు లేకుండా ఒకరితో సంబంధాన్ని తెంచుకోవడం)', 'డ్రై డేటింగ్(ఆల్కాహాల్ ఫ్రీ డేట్స్)' వంటి పదాల అర్థాలు కూడా తెలియలేదు. వారు కేవలం ఓపెన్ రిలేషన్‌షిప్‌లనే కోరుకుంటున్నట్టు రాజీవ్‌కి చెప్పారు.
అమ్మాయిలతో కనెక్ట్ అయ్యే విషయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు రాజీవ్ చెప్పారు.
చిన్నప్పటి అనుభవాలు, భయాందోళనతో ఇతరులను నమ్మే విషయంలో రాజీవ్ చాలా ఒత్తిడికి గురయ్యారు. డేట్స్‌లో తన గురించి తాను తక్కువగా మాట్లాడేవారు. ఈ భయాలతో తన డేటింగ్ ప్రపంచంలో తాను చాలా నిరుత్సాహంగా, ఏదో కోల్పోయిన భావనను పొందేవారు.
తన సరోగేట్ డేట్ సాయంతో అమ్మాయిలను మెల్లమెల్లగా బయటికి తీసుకెళ్లడం, వారిని ఆకర్షించడం, శారీరకంగా దగ్గరయ్యేలా చేసుకోవడం తెలుసుకున్నారు.
తన గత గురించి ఎలా మాట్లాడాలో సరోగేట్ డేట్ నేర్పించింది. తన భావోద్వేగాలను గుర్తించి, వారితో ఎలా మెలగాలి, ఎలా సంభాషించాలో తెలిపింది.
అప్పటి నుంచి తిరస్కరణతో కూడిన ప్రేమను కూడా ఎలా స్వీకరించాలో తెలుసుకున్నారు. తన డేట్‌ను ఎలా రిజక్ట్ చేయాలి, ఒకవేళ అమ్మాయి తిరస్కరిస్తే దాన్నెలా స్వీకరించాలో తెలుసుకున్నారు. రాజీవ్‌పై ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవని అమ్మాయి ఫోన్ కాల్‌లో చెప్పినప్పుడు, ఆ విషయాన్ని ఎలా స్వీకరించాలనే దాన్ని తాను, తన సరోగేట్ డేట్ ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేశారు.
అయితే, డేటింగ్‌లో అత్యంత భయానక భాగం తిరస్కరణే అని రాజీవ్ అంటున్నారు. తనకు సరితూగని విషయాలకు ముగింపు పలకడం కూడా సరైనదేనని తాను తెలుసుకున్నట్టు చెప్పారు. ఒకరి నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు.
మరొకరి హృదయాన్ని మానిపులేట్ చేయడం తన పని కాదని, తమకు నచ్చినట్టు ఎలా జీవించాలో నేర్పించడమే తన పనని సెఘెట్టి చెప్పారు.
''నైపుణ్యాలు కలిగిన సీరియల్ డేటర్‌గా మారేలా సాయపడటం మా మాక్‌డేట్ల ఉద్దేశ్యం కాదు. మీ గురించి మీరు మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలిగేలా సాయపడటమే మా ఉద్దేశ్యం. దీని వల్ల మీ గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది'' అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?
- భారత్ పురాతన స్మార్ట్‌ఫుడ్ ఎలా సూపర్‌ఫుడ్‌గా మారుతోంది?
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
- స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్: రాత్రిళ్లు స్మార్ట్‌ఫోన్ చూస్తే కళ్లు పోతాయా? హైదరాబాద్ యువతి సమస్యపై డాక్టర్ ట్వీట్ వైరల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















