మనిషిని చంపేసి ఇంటర్నెట్‌లో ఏం వెతుకుతున్నారు? శవాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారు?

హరిహరకృష్ణ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నవీన్‌ హత్యకు ముందు హత్య సమాచారం కోసం అతడి స్నేహితుడు హరిహర కృష్ణ (ఫొటోలోని యువకుడు) ఇంటర్నెట్‌లో వెతికాడని పోలీసులు చెప్పారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గమనిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్నికలిచివేయొచ్చు.

చంపడం, మృతదేహాన్ని ముక్కలు చేయడం, ఆధారాలు లేకుండా చేసేందుకు అనువైన మార్గాల కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు హంతకులు.

‘‘ఆధారాలు దొరకకుండా శవాన్ని ఎలా పారేయాలి?’’

‘‘మృతదేహాన్ని ముక్కలుగా ఎలా కోయాలి?’’

2022 మే 18నదిల్లీలో శ్రద్ధా వాల్కర్‌ను హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఇంటర్నెట్‌లో వెతికిన ప్రశ్నలివి.

2023 మే 12న హైదరాబాద్‌లో యర్రం అనురాధా రెడ్డి అనే మహిళను హత్య చేసిన చంద్ర మోహన్ కూడా ‘‘డెడ్ బాడీ నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?’’ అని ఆన్‌లైన్‌లో వెతికాడు.

ఇంత క్రూరమైన పని చేయాలనే ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని పరిశోధిస్తే ఇంటర్నెట్ అందుకు అనువుగా మారిందనే వాదనలు ఉన్నాయి.

ఇలా హత్యలు చేయడానికి, లేదా చేసిన హత్యల నుంచి తప్పించుకోవడానికి నేరస్థులు ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తీరు కనిపిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన అనా వాల్స్‌ హత్యకు గురయ్యారు. గూగుల్ సెర్చ్ హిస్టరీ ద్వారా ఆ హత్య చేసింది అనా వాల్స్ భర్త, బ్రయాన్ వాల్స్‌ అని పోలీసులు గుర్తించారు.

‘‘ఫార్మాల్డిహైడ్ అంటే ఏంటి?’’

‘‘బాడీని పడేసేందుకు 10 మార్గాలు?’’

‘‘డీఎన్‌ఏ ఎంత కాలం ఉంటుంది?’’

‘‘రక్తపు మరకలను ఎలా తుడవాలి?’’

ఇలా అనేక ప్రశ్నలను బ్రయాన్ వాల్స్ గూగుల్‌లో వెతికాడని పోలీసులు తెలిపారు.

హత్య

ఫొటో సోర్స్, Getty Images

అలాంటి ఆలోచనలు ముందు నుంచే ఉంటాయా?

హత్య చేసే ముందు ఇలాంటి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు మానసిక నిపుణులు, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

ఇలా నేరాలు చేసే ముందు ఇంటర్నెట్‌లో వెతికే వారు, ముందు నుంచే ఆ ఆలోచనలతో ఉంటారని సైకాలజిస్ట్ సి.బీనా తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా బీనా సుదీర్ఘకాలం పనిచేశారు. తెలంగాణ జైళ్లలోని ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఆమె పని చేస్తున్నారు.

‘‘ఇలాంటి దారుణమైన నేరాలు చేసే వారు మరే ఇతర విషయాలపైనా సరిగ్గా దృష్టి పెట్టరు.

కొన్ని రోజుల ముందు నుంచి అదే ఆలోచనలో ఉంటారు. కొందరు క్షణికావేశంలో హత్య చేశామని చెబుతుంటారు. కానీ, వారిలో ముందు నుంచే ఆ ఆలోచన ఉంటుంది’’ అని బీనా చెప్పారు.

హత్య

ఫొటో సోర్స్, Getty Images

హత్య చేసే ముందు ఏం చేస్తారు?

  • ఒకే విషయం మీద దృష్టి పెడతారు.
  • ఇతర విషయాలను పట్టించుకోరు.
  • అనవసరంగా చికాకు పడుతుంటారు.
  • కావాలని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు.
  • చిన్న తప్పుకే అతిగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు.
  • మొండితనం పెరుగుతుంది.
  • ఎవరితోనూ కలవరు. ఒంటరిగా ఉంటారు.
  • ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగి ఉంటారు.

‘‘ఈ లక్షణాలు నేరస్థులు అందరిలో ఒకే తీరుగా ఉండవు. వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. క్షణికావేశంలో చేశామని కొన్నిసార్లు చెబుతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో అవి అప్పటికప్పుడు అనుకుని చేసినవి కాదు. చాలా రోజుల ముందు నుంచే పథకం సిద్ధం చేస్తారు. లోలోపల కసితో రగిలిపోతుంటారు. బయటకు మామూలుగా కనిపించినా, లోపల మాత్రం విపరీతమైన ద్వేషం ఉంటుంది’’ అని ప్రొఫెసర్ సి.బీనా వివరించారు.

హత్య

ఫొటో సోర్స్, Getty Images

హంతకుల మెదళ్లు ఒకేలా ఉంటాయా?

నేరాల విషయంలో బ్రిటిష్ న్యూరోసైంటిస్ట్, ప్రొఫెసర్ అడ్రియన్ రైన్ తొలిసారి కాలిఫోర్నియాలో ఒక ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు.

హంతకుల మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు తీసిన స్కానింగ్‌లపై ప్రొఫెసర్ రైన్, ఆయన బృందం కొన్నేళ్ల పాటు అధ్యయనం చేసింది. హంతకుల మెదళ్లలో వచ్చే మార్పులు దాదాపుగా ఒకేలా ఉన్నాయని వారి అధ్యయనంలో తేలింది.

భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని ముందు భాగం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు తగ్గడాన్ని గుర్తించారు. అందువల్ల హంతకులు ఎక్కువగా ఆవేశానికి, ఆగ్రహానికి గురవుతారని, అదే సమయంలో తమపై తాము నియంత్రణ కోల్పోతారని అధ్యయనంలో గుర్తించారు.

చిన్నతనంలో హింసకు గురవడం వల్ల వారి మెదడుకు భౌతికంగా నష్టం జరుగుతుందని, ప్రత్యేకంగా మెదడులోని ముందు భాగం దారుణంగా దెబ్బతింటుందని రైన్ అధ్యయనంలో గుర్తించారు.

అందువల్ల వారు హంతకులుగా మారే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

హత్య

ఫొటో సోర్స్, Science Photo Library

హత్యలకు దారితీస్తున్న ప్రధాన కారణాలు

  • వ్యక్తిగత విభేదాలు
  • ప్రతీకారం
  • ఆర్థిక లావాదేవీలు
  • తీవ్రమైన ప్రేమ వ్యవహారాలు
  • మానసిక అనారోగ్యం
  • సైకోపతి
  • యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్
  • భ్రమలు
  • మానసిక రుగ్మతలు

‘‘వ్యక్తిగత గొడవల వల్లే ఇలాంటి నేరాలు చేస్తారు. చేసిన హత్యను బట్టి ఆ వ్యక్తి మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు’’ అని తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాంచందర్ చెప్పారు.

హత్య

ఫొటో సోర్స్, Getty Images

ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ కేసులో ఏం జరిగింది?

హత్య చేయడం, చేసిన తర్వాత ఆధారాలు మాయం చేయడం వంటి వాటి గురించి సమాచారం ఇంటర్నెట్‌లో లభిస్తోంది.

మూడు నెలల కిందట హైదరాబాద్ శివారులో ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకు గురయ్యాడు. అతని స్నేహితుడు హరిహర కృష్ణ ఆ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు ముందు సమాచారం కోసం హరిహర కృష్ణ ఇంటర్నెట్‌లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య చేయాలనే ఆలోచన వ్యక్తులకు వచ్చినప్పుడు, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణమవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

హత్యలకు పురిగొల్పే సమాచారం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ఉంది. తాజాగా జరిగిన ఘటనల తాలూకు వీడియోలు కూడా ఉన్నాయి.

ఆన్‌లైన్ కంటెంట్ మీద తమకు నియంత్రణ పెద్దగా ఉండదని సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ బీబీసీతో అన్నారు.

‘‘హత్యలను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్ మా దృష్టికి వచ్చినప్పుడు, ఆ కంటెంట్‌ను తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాస్తాం. సోషల్ మీడియాపైనా నిఘా ఉంచుతాం. మహిళలను వేధించేలా ఉన్న కంటెంట్ ఉంటే కూడా తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లకు చెబుతాం. ప్రస్తుతం అంతకుమించి ఎక్కువ ప్రొసీజర్ లేదు’’ అని ఆమె చెప్పారు.

ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నేరాలను ప్రోత్సహించే కంటెంట్ మీద నిషేధం విధించే నిబంధనలేవీ లేవని సాయిశ్రీ వెల్లడించారు.

ఈ విషయంపై సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు ధన్య మేనన్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ఇంటర్నెట్ నుంచి సమాచారం పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. దాని బదులు పర్యవేక్షణ ఉండడం ముఖ్యం. నేరాలను ప్రేరేపించే కంటెంట్ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు చొరవ తీసుకుని నియంత్రించాలి’’ అని ధన్య మేనన్ సూచించారు.

'మత్తు ఓ ఉత్ప్రేరకం'

నేరాలకు పాల్పడే ప్రవర్తన, లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాంచందర్ తెలిపారు.

‘‘అలాంటి వారిని ఆల్కహాల్, మత్తు పదార్థాల జోలికి వెళ్లనివ్వకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అప్పటికే ఉన్న ఆలోచనలకు మత్తు పదార్థాలు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. వారిని ఒంటరిగా వదలేయకూడదు. వీలైనంత త్వరగా సైకాలజిస్టు వద్దకు కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్లాలి. వారు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అందిస్తారు. ఈ తరహా ప్రవర్తనకు ప్రత్యేకంగా మందులు ఉండవు. కౌన్సిలింగ్ ద్వారానే వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాల్సి ఉంటుంది’’ అని ఆయన బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి: