దిల్లీ మైనర్ బాలిక హత్య: ప్రేమించినంత మాత్రాన చంపే హక్కు వస్తుందా? అబ్బాయిలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నసీరుద్దీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది షాకింగ్ న్యూస్. సమాజంలో మనం హింసాత్మకంగా, అమానవీయంగా, పిరికిగా ఉన్నామని తెలిపే ఘటన. దిల్లీలో సాహిల్ అనే యువకుడు మైనర్ బాలికను అతి దారుణంగా హత్య చేశాడు. హత్య దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

నేరానికి పాల్పడే సమయంలో సాహిల్ ఎంత నిర్భయంగా ఉన్నాడో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బాలికపై అతనెలా దాడి చేయగలిగాడు?

ఒకవైపు హత్య జరుగుతుండగా మరోవైపు జనం తీరిగ్గా చూస్తూ, వెళ్తున్నారు. ఒక్కరూ ఆగడం లేదు. ఆపడం లేదు.

చాలాసేపటి తర్వాత పోలీసులకు వార్త తెలిసింది. అయితే ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు ఈ లోకంలో లేదు.

వీరిద్దరికి మధ్య 'ప్రేమ సంబంధం' ఉందని చెబుతున్నారు. ఇదంతా ఓ ఉన్మాదంతో జరిగింది. ప్రేమలో ఉంటే ఏమైనా చేయవచ్చా? ఆ ప్రేమ ఇలా హింసాత్మకంగా మారుతుందా?

మరి మనం చర్చిస్తున్నదేమిటి? చంపే అనాగరిక పద్ధతి గురించి, హంతకుల, హతుల మతం గురించి. అయితే ఈ చర్చలో అబ్బాయిల ప్రవర్తన విస్మరిస్తున్నాం.

ఈ రకమైన మగపిల్లల ప్రవర్తన ఫలానా మతం అనుసరించేవారిలో కనిపించదని ఎవరైనా గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? సమాధానం అబ్బాయిలను కాదు, అమ్మాయిలను, మహిళలను అడగండి.

కాబట్టి ఆ హింసకు గల మూలాన్ని తెలుసుకోవడం గురించి మాట్లాడుకోవడం మంచిది.

పురుషాధిక్యత కారణమా?

ప్రేమ గురించి మాట్లాడి, తిరిగి, జీవితాంతం కలిసి బతుకుతామని ప్రమాణం చేసే పురుషులలో చంపేంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది?

ఈ ధైర్యానికి మూలం ఉంది. అదే పురుషాధిపత్య ధోరణి. ఈ పురుషాధిక్యత అన్నింటినీ నియంత్రించాలనుకుంటోంది.

ఇది మనుషులపై, మానవ జీవితాలపై కూడా నియంత్రణ కోరుకుంటుంది.

ఆడపిల్లలను ఆస్తిలాగా తన ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటోంది. అతని కోరిక మేరకు వారిని ఆడించాలనుకుంటోంది.

అలాంటి మగతనానికి అమ్మాయి స్వతంత్ర వ్యక్తిత్వం, కోరికలపై పట్టింపు లేదు.

ఆ వ్యక్తి ఉద్వేగభరితంగా కనిపిస్తాడు. ఇంత హింసాత్మక వ్యక్తిని మజ్నూ లేదా రోమియో అని అనడం కూడా ఆ ప్రేమికులను అవమానించడమే.

మైనర్ బాలిక హత్య
ఫొటో క్యాప్షన్, నిందితుడు సాహిల్ ఆమెను బండరాయితో తలపై బాదాడు

ఇంతకీ షహబాద్ డెయిరీలో ఏం జరిగింది?

దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం రాత్రి 16 ఏళ్ల బాలికను 20 ఏళ్ల యువకుడు సాహిల్ కత్తితో పొడిచి చంపాడు.

బాలికను 16 సార్లు పొడిచి, ఆపై రాయితో తలపై ఐదుసార్లు దాడిచేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దిల్లీ పోలీసులు సాహిల్‌ను సోమవారం అరెస్టు చేశారు.

నిందితుడు మైనర్ బాలిక ప్రియుడని చెబుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.అయితే, ఈ ఘటన వెనుక మతపరమైన కోణం లేదని దిల్లీ పోలీసులు తెలిపారు.

సమాజంలో కొంతమంది హింసాత్మక స్వభావం పురుషులు ఉన్నారు. వారి సమస్యలను కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు.

ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అబ్బాయిలకు అహింసా మార్గం కనిపించదు. ఆధిపత్య పురుషాధిక్యత వారికి అహింసా ప్రవర్తననేది నేర్పలేదు.

వారికి హింస ఒకటే తెలుసు. అది మాటలతో గానీ భౌతిక దాడితో గానీ కావచ్చు. ఆధిపత్య పురుషాధిక్యత గల వ్యక్తులు 'నో' అనే పదం వినడానికి ఇష్టపడరు.

వారి ఆలోచనల్లో.. మనసుకు వ్యతిరేకంగా ఉన్న దేనినైనా సహించవద్దని, హింసతో సమాధానం చెప్పాలనుకుంటారు.

దీంతో వారే హింసాత్మకంగా మారుతున్నారు. అమానవీయంగా ఉంటున్నారు.

ఇది వారిపై, వారితో నివసించే వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. అయితే ఒకరిని చంపడం పౌరుషమా?

ప్రతీకాత్మక చిత్రం

అలాంటి పురుషులను గుర్తించడం ఎలా?

అటువంటి హింసాత్మక మనస్తత్వం గల అబ్బాయిలు లేదా పురుషులను గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి.

అలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ ప్రేమ కోసం వెంపర్లాడుతారు. కానీ వారి ప్రేమ ఎదుటి వ్యక్తి స్వతంత్రతను అంగీకరించనివ్వదు. వారు తమ బానిసలు అనుకుంటుంది. అవతలి వ్యక్తి నుంచి 'లేదు, వద్దు' అనే పదాలను వినడం వాళ్లుకు రుచించదు.

అమ్మాయిలు మిగతావారితో మాట్లాడటం, దగ్గరవ్వడం వంటివి చూడలేరు. తమకు నచ్చిన వ్యక్తి రాకపోకలు, ఫోన్ సంభాషణలు, సోషల్ మీడియా యాక్టివిజం..ఇవన్నీ నియంత్రించాలనుకుంటారు.

వారు దూకుడుగా ఉంటారు. కోపాన్ని అదుపు చేసుకోలేరు. ప్రేమతో పాటు భయాన్ని కూడా చూపిస్తారు. తమ మొండితనంలో ఎవరి మాట వినరు. ఇతరుల భావాలను పట్టించుకోరు.

స్త్రీ శరీరాన్ని ఉపయోగించుకోవడం వారికి మరింత ముఖ్యం. వాళ్లు శరీరాన్నిప్రేమిస్తారు. వారి శరీరంపై విజయం సాధించాలనుకుంటారు.

న్యాయం

ఫొటో సోర్స్, Getty Images

'వద్దు'ని గౌరవించడం నేర్చుకోవాలి

ప్రేమ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల సమ్మతి. కోరిక ఒకవైపే ఉండొచ్చు.

మనం ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు అనిపించినట్లే, మరొకరు మనల్ని ఇష్టపడటం లేదని అనుకోవడం సహజమే.

ఏకపక్ష ప్రేమను ప్రేమ అని పిలవలేం. ఇంత సులువైన విషయం మనకు ఎందుకు అర్థం కాలేదు?.

'కాదు' అనే ఒకరి అభిప్రాయాన్ని గౌరవించడం ప్రేమకు మొదటి మెట్టు. ప్రేమలో సమానత్వం ఉంటుంది. ఏకపక్ష ప్రేమ లేదా అనుబంధంలో సమానత్వం ఉండదు.

హత్య

ఫొటో సోర్స్, Getty Images

హింస అనే ఊహే ప్రమాదకరం..

అబ్బాయిలలో హింస అనే ఊహ చాలా భయంకరమైనది. ప్రమాదకరమైనది.

ఇది మొత్తం సమాజానికి పెద్ద ముప్పుగా మారింది. ఆడపిల్లల జీవితాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

అమ్మాయిల పట్ల అబ్బాయిలు హింసకు పాల్పడుతున్న తీరు సమాజంలోని ఇతర రకాల హింసాత్మక ఘటనలకు భిన్నంగా ఏమీ లేదు.

ఇతర హింసాత్మక ఘటనల్లో కూడా పురుషుల ప్రవర్తన అదే విధంగా ఉంటుంది. వారు తాము హింసకు పాల్పడవచ్చని అనుకుంటారు.

ఎవరినైనా కొట్టినా, చంపినా హాయిగా జీవించవచ్చని, వారిని ఎవరూ శిక్షించలేరని అనుకుంటారు.

మరీ ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలలో నిర్భయంగా హింసకు పాల్పడుతున్నారు.

న్యాయం కోసం నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రేమలో కుతంత్రాలకు, కపటత్వానికి తావు లేదు..

ప్రేమ అంటే త్యాగం. అయితే త్యాగానికి బదులుగా ఏవైనా కోరికలు తీర్చుకుంటుంటే దాన్ని ఒప్పందం అని పిలుస్తారు, ప్రేమ అని కాదు.

మనం ప్రేమించే వ్యక్తికి హాని చేయడం, చంపడం ఎలా సాధ్యం? అన్ని హద్దులు దాటి క్రూరంగా ఎలా చంపుతారు?

ప్రేమ అంటే తప్పుడు వాగ్దానాలు కాదు. ఇందులో కుతంత్రాలకు, కపటత్వానికి తావు లేదు.

ఏ దురాశలో ప్రేమ అనే మాట ఉండదు. ప్రేమలో కులం-మతం-భాష-లింగం అనే అడ్డుగోడలు ఉండవు. ప్రేమలో ఏకపక్ష మత మార్పిడికి తావు ఉండకూడదు.

ప్రేమలో విధ్వంసం ఉండకూడదు. ఇది స్త్రీలను ఆస్తి, పగ, ద్వేషంగా భావించే భావనల నుంచి వచ్చింది. ఇది విష పురుషత్వం.

ప్రేమ

పాతవి మర్చిపోవాలి, కొత్తవి నేర్చుకోవాలి

ప్రేమలో చంపడం లేదా యాసిడ్‌తో ముఖాన్ని కాల్చడం లాంటి చర్యలన్నీ సమాజం భరిస్తూ వస్తోంది. సమాజం హింసను పట్టించుకోకుండా, జీవించడం అలవాటు చేసుకుంది. అలాంటి వారికీ జీవితంలో చోటు కల్పించింది.

అందుకే మగపిల్లలు ఇప్పటిదాకా పౌరుషం పేరుతో నేర్చుకున్న వాటన్నింటినీ తీసివేయాలి.

వారు కొత్త పద్ధతిలో పురుషాధిక్యతను అలవర్చుకోవాలి. అదే సానుకూల మగతనం అవుతుంది. ఈ పురుషత్వంలో అహింస, సోదరభావం ముఖ్యం.

ఇది ప్రేమ, సహజీవనం, ఒకరిపై ఒకరు నమ్మకం, ఒకరికొకరు ఆరాటం, సున్నితత్వం, అందరి పట్ల గౌరవం, సానుభూతి, నిజాయితీపై ఆధారపడి ఉంటుంది.

ప్రజాస్వామ్యవాదిగా ఉండటం నేర్చుకోవాలి. అంటే తన మనసుకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని వినడం అలవాటు చేసుకోవాలి.

భిన్నాభిప్రాయాలను వినడం, దానిని గౌరవించడం అలవాటు చేసుకోవాలి. మీ అభిప్రాయాన్ని అందరూ అర్థం చేసుకోవడానికి మీరు మీ మొండితనాన్ని వదులుకోవాలి.

ఇతరులకు, ముఖ్యంగా అమ్మాయిల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. ఇది జరిగినపుడే మనం 'ప్రేమ బంధం'లో హింస గురించి వినిలేం.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)