వందల ఏళ్ల కిందట కూలీలుగా వెళ్లారు, ఇప్పుడు ఇండియాలోని సొంత బలగాన్ని కలుసుకుంటున్నారు

డేవిడ్ లఖన్ కుటుంబం

ఫొటో సోర్స్, GEETA LAKHAN

ఫొటో క్యాప్షన్, 2020లో భారత్‌లోని తమ బంధువులను కలుసుకున్న డేవిడ్ లఖన్ కుటుంబం
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

‘ఎన్నో రోజులుగా దూరమైన నా కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. పట్టరాని సంతోషమేసింది. ఇది నాకు ఏదో సాధించానన్న తృప్తిని కలిగించింది’ అని శాంషు డీన్ చెప్పారు.

కరీబియన్ ద్వీపదేశమైన ట్రినిడాడ్ టొబాగోకు చెందిన 76 ఏళ్ల డీన్, ఆ దేశంలోని కుటుంబాలకు భారత్‌లో ఉన్న తమ దూరపు బంధువులను కలుసుకునేందుకు సాయం చేస్తున్నారు.

ఇప్పటి వరకు 300 మందికి పైగా తాను సాయం చేసినట్లు ఆయన చెప్పారు.

1800లలో, 1900 ప్రారంభంలో వీరి పూర్వీకులు ఒప్పంద కార్మికులుగా ఒకప్పటి బ్రిటిష్ కాలనీ అయిన కరీబియన్ దీవులకు వచ్చారు.

ఆ తర్వాత క్రమక్రమంగా భారత్‌లో ఉన్న తమ కుటుంబాలతో వారికి సంబంధాలు తెగిపోయాయి.

జాగ్రఫీ టీచర్ అయిన డీన్, ఆ తర్వాత జెనాలజిస్ట్(కుటుంబాల మూలాలను శోధించే వ్యక్తి) గా మారారు.

కరీబియన్ ప్రాంతాల్లో భారత ఒప్పంద కార్మికులకు చెందిన వారసులను, స్వదేశంలో తమ ప్రియమైన వారిని కలుసుకునేందుకు ఆయన సాయపడుతున్నారు.

భారత్‌ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బానిసత్వాన్ని రద్దు చేశారు. కానీ, కార్మికుల కొరత ఉన్న బ్రిటిష్ రాజ్యాలలో ‘‘చీప్ లేబర్’’గా ఈ ఒప్పంద కార్మికులను వాడేవారు.

చాలా మంది భారతీయులు తమ దేశం నుంచి కరీబియన్, దక్షిణాఫ్రికా, మారిషస్, ఫిజి వంటి బ్రిటిష్ కాలనీలకు తరలి వెళ్లారు. 1838 నుంచి 1917 మధ్య కాలంలో వీరు చెరకు తోటలలో పనిచేశారు.

ఒప్పంద కార్మికులు లాగా బ్రిటీష్ కాలనీలకు వెళ్లిన భారతీయులు
ఫొటో క్యాప్షన్, ఒప్పంద కార్మికులు లాగా బ్రిటీష్ కాలనీలకు వెళ్లిన భారతీయులు

చాలా మంది కార్మికులు కావాలనే ఆ ప్రాంతాలకు వెళ్లినప్పటికీ, అక్కడ ఎదురు కాబోయే పరిస్థితులపై వారికి అవగాహన ఉండేది కాదు. వారు నిరక్షరాస్యులు కావడంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేవారు. కొందర్ని బలవంతంగా విదేశాలకు తీసుకెళ్లారు.

ఒప్పంద కార్మికులు అనే విధానాన్ని సరికొత్త బానిస వ్యాపారంగా కొందరు చరిత్రకారులు వర్ణించే వారు.

డీన్‌కి ఈ విధానం తెలుసుకోవాలని ఉండేది. తన ముత్తాత మున్రాడిన్ ఒప్పంద కార్మికుడిగా కరీబియన్ దీవులకు వచ్చారని డీన్ తెలుసుకున్న తర్వాత, ఈ విధానం తమ కుటుంబాలపై ఏ మేర ప్రభావం చూపిందో తెలుసుకోవాలనుకున్నారు.

తాను ఉంటున్న ఇంటి భూమిని ముత్తాత మున్రాడిన్ కొనుగోలు చేశారన్న విషయం డీన్ స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో తెలిసింది.

అంతే తప్ప, తన ముత్తాత మున్రాడిన్ గురించి తమ కుటుంబంలో ఎవరూ కూడా తనకేమీ చెప్పలేదని డీన్ చెప్పారు.

కోల్‌కతా నుంచి ట్రినిడాడ్‌ వెళ్లిన ముత్తాత

తన ముత్తాత గురించి తెలుసుకునేందుకు 1972లో డీన్ ట్రినిడాడ్‌లోని రెడ్ ‌హౌస్‌కి వెళ్లారు. అదే ఆ తర్వాత న్యాయవ్యవహారాల మంత్రిత్వ శాఖగా మారింది.

ఈ హౌస్‌లో తన ముత్తాత గురించి డాక్యుమెంట్లను వెతికారు. నాలుగు గంటల పాటు వెతికిన తర్వాత, మోత్-ఈటెన్ బుక్‌లో చివరి పేజీలో తన ముత్తాత పేరును, ఆయన గురించి వివరాలను డీన్ కనుగొన్నారు.

జనవరి 5, 1858లో మున్రాడిన్ కోల్‌కతా విడిచిపెట్టారని, అదే ఏడాది ఏప్రిల్ 10న ట్రినిడాడ్ చేరుకున్నారని డీన్ తెలుసుకున్నారు.

‘‘ఆయన చదువుకున్న వారని మాకు తెలుసు. ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. చక్కెర తోటల్లో మున్రాడిన్ పనిచేశారు. ఆ తర్వాత ట్రాన్స్‌లేషన్ వర్క్ చేయడం ప్రారంభించారు. ఆయన ఒప్పంద కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత టీచర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత ఆ దేశంలోనే రెండు దుకాణాలను తెరిచారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు. ఆయన తన ఇంటిని వారసత్వంగా పిల్లలకు రాశారు. కానీ, ఆ తర్వాత ఇది అగ్నిప్రమాదంలో పాడైపోయింది.’’ అని డీన్ తెలిపారు.

ఆ తర్వాత క్రమక్రమంగా తన తల్లి పూర్వీకుల గురించి కూడా డీన్ తెలుసుకున్నారు. కరీబియన్, భోంగీకి వెళ్లడం ద్వారా డీన్ తన కుటుంబానికి చెందిన ఇతర బంధువులను కలుసుకున్నారు.

తన తల్లి కూడా ఏడేళ్ల వయసులో ఆమె తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులతో కలిసి 1872లో ట్రినిడాడ్ వచ్చారని డీన్‌కి తెలిసింది.

జాగ్రఫీ టీచర్‌‌గా పనిచేసిన డీన్.. సంబంధాలు తెగిపోయిన బంధువులను కనుగొనడంలో ఆయన సాధించిన విజయం ట్రినిడాడ్‌లోని భారత రాయబార కార్యాలయ దృష్టిని ఆకర్షించింది.

10 హిందూ, 10 ముస్లిం కుటుంబాలకు చెందిన బంధువులను గుర్తించినందుకు భారత రాయబార కార్యాలయం ఆయనకు స్కాలర్‌షిప్ ఇచ్చింది.

ఆ తర్వాత ఇదే డీన్ వృత్తిగా మారింది. డీన్ జెనాలజిస్ట్‌గాా మారారు. ట్రినిడాడ్, భారత్‌లో పరిశోధన బృందాలకు సాయం చేసేందుకు ఆయనకు డబ్బులు చెల్లించే వారు.

‘ట్రినిడాడ్ అండ్ టొబాగో‌’ ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులు బస్డియో పాండే, కమల పర్సాద్ బిస్సేస్సార్‌ల కుటుంబాలను కలపడానికి కూడా డీన్ సాయపడ్డారు.

ట్రినిడాడ్‌కు చెందిన 65 ఏళ్ల డేవిడ్ లఖన్ తన తాత గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్నారు. డేవిడ్ లఖన్ తాత ఆయనకు 22 ఏళ్ల వయసున్నప్పుడు 1888లో భారత్‌ నుంచి ట్రినిడాడ్‌కు వచ్చారు.

‘‘డాక్యుమెంట్‌లో కేవలం లఖన్ అనే పేరును మాత్రమే ఇచ్చారు. అయితే, ఇంత దూరం తన తాత లఖన్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమేంటి అనేది తెలుసుకోవాలనుకున్నాను’’ అని డేవిడ్ లఖన్ బీబీసీకి చెప్పారు.

శాంషు డీన్ కుటుంబంలోని చిట్టచివరి ఒప్పంద కార్మికురాలు భోంగీ

ఫొటో సోర్స్, SHAMSHU DEEN

‘భాష కోసం ట్రాన్స్‌లేషన్ టూల్స్ వాడతాం’

లఖన్ తాత సోదరుడు, తండ్రి, కులం, ఆయన ఊరుకి చెందిన వివరాలున్న ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను డేవిడ్ లఖన్ కోసం డీన్ సంపాదించారు.

ఆ తర్వాత తనకున్న కాంటాక్ట్‌లను వాడుతూ భారత్‌లోని లఖన్ బంధువులెవరో కనుగొన్నారు.

2020లో భారత్‌లో లఖన్ కుటుంబ రీయూనియన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

‘గ్రామమంతా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మేం అసలు అనుకోలేదు. వారు మాకు పూలమాల వేశారు’’ అని లఖన్ భార్య గీత తెలిపారు.

అప్పటి నుంచి భారత్‌లోని తమ బంధువులతో చాలా మందితో టచ్‌లో ఉన్నామని ఆమె చెప్పారు. భాషాపరమైన సమస్యలను అధిగమించేందుకు ట్రాన్స్‌లేషన్ టూల్స్‌ను వాడుతున్నట్లు తెలిపారు.

వారికి, తమకు చాలా విషయాల్లో సారూప్యత ఉందని, ఎందుకంటే తమ సాంస్కృతిక, జీవన విధానాలు చాలా వరకు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పాటిస్తున్నట్లు చెప్పారు.

డిజిటల్ మ్యాప్స్ పెరగడం, చారిత్రక రికార్డులను తేలిగ్గా పొందగలుగుతుండటంతో తన కెరీర్ ప్రారంభించినప్పటితో పోలిస్తే ప్రస్తుతం సంబంధాలు తెగిపోయిన బంధువులను, ప్రజల్ని గుర్తించి, కలపడం తేలికవుతుందని డీన్ చెప్పారు. కానీ, ఇంకా కొన్ని సవాళ్లున్నట్లు తెలిపారు. ప్రతి కేసులో 80 శాతం సక్సెస్ రేటును పొందుతున్నట్లు ఆయన అంచనావేశారు.

 శాంషు డీన్

ఫొటో సోర్స్, SHAMSHU DEEN

ఫొటో క్యాప్షన్, ప్రతి కేసు ఒక పజిల్ లాంటిదన్న శాంషు డీన్

‘ప్రతి కేసు ఒక పజిల్’

‘‘ప్రతి ఒక్కరి పూర్వీకుల వివరాలను నేను గుర్తించలేను. కొన్ని కేసుల్లో, డాక్యుమెంట్లలో తప్పుడు సమాచారం ఇస్తుంటారు’’ అని డీన్ వివరించారు.

కొంత మంది కార్మికులు ట్రినిడాడ్‌కు వచ్చే సమయంలోనే మరణించారని కూడా తెలిపారు. అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ట్రినిడాడ్ చేరుకున్న కొంతమంది, తమ నివాసాలను అధికారికంగా ఎక్కడా కూడా డాక్యుమెంట్ చేయలేదు.

కానీ, ఒప్పంద కాంట్రాక్ట్‌లు ముగిసిన తర్వాత చాలా మంది కార్మికులు స్వచ్ఛందంగా ట్రినిడాడ్‌లోనే ఉండిపోయారు. వారు ఇక్కడ స్వేచ్ఛగా బతకగలిగారని డీన్ చెప్పారు.

తాను పదవీ విరమణ పొందిన తర్వాత కూడా తన పనిని వదిలిపెట్టలేదని డీన్ చెప్పారు. పదవీ విరమణ పొందిన తర్వాత వెంటనే 1996లో ఆరు నెలల కోసం భారత్ వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రయాణంలో భాగంగా 14 మంది కుటుంబాలను కూడా డీన్ కనుగొన్నారు.

తన పని ఇప్పటికీ తనకి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు.

ప్రతి కేసు కూడా ఒక ముడివిప్పని పజిల్‌లా ఉంటుందని, ఏ రెండు కేసులు ఒకేలా ఉండవన్నారు.

‘‘ఇతర మనుషులందరిలాగానే మేమందరం కూడా వలసదారులం. కానీ, భారతీయ సంప్రదాయం మాలో నిండి ఉంది’’ అని డీన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)