రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?

బ్రిజ్ భూషణ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై నెల రోజుల కిందట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్ల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.

తమపై, మైనర్ రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లు బహిరంగంగా ఆరోపించడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

అయితే రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ ఖండించారు.

మహిళలపై కంటే మైనర్లపై లైంగిక హింసను మరింత తీవ్రమైన నేరంగా భారత చట్టాలు పరిగణిస్తాయి.

ఇలాంటి కేసుల కోసం 2012లో ప్రత్యేకంగా పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంలో మైనర్‌కు రక్షణ కల్పించడం, పరిమిత సమయంలో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ వంటి నిబంధనలు ఉన్నాయి.

2019లో ఈ చట్టం కింద శిక్షలు మరింత కఠినతరం చేశారు. గరిష్ఠ శిక్షను జీవిత ఖైదు నుంచి మరణశిక్షకు పెంచారు.

రెజ్లర్ల ఆరోపణలతో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మే 28న దిల్లీలోని కొత్త పార్లమెంట్ వరకు రెజ్లర్లు మార్చ్ చేపట్టారు. అయితే దిల్లీ పోలీసులు రెజ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI

పోక్సో చట్టం ఏం చెబుతోంది ?

ఫిర్యాదుదారుల గుర్తింపు రహస్యంగా ఉంచడానికి, వారి భద్రత కోసం బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ బహిరంగపరచలేదు.

అయితే బీబీసీకి అందిన సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్‌లోని లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్లు 354, 354A, 354D కాకుండా పోక్సో చట్టంలోని సెక్షన్ (10) 'తీవ్రమైన లైంగిక వేధింపులు'' కింద నమోదు చేశారు.

అత్యాచారం, సామూహిక అత్యాచారం వంటి తీవ్రమైన నేరారోపణతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేయాలి.

అయితే సెక్షన్ 10 లోని 'తీవ్రమైన లైంగిక హింస' ఆ కోవలోకి రాదు. ఈ సెక్షన్‌లో దోషికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.

పోక్సో సెక్షన్ 10లో బెయిల్ పొందే అవకాశం ఉందని, నిందితులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముందస్తు బెయిల్ పొందే అవకాశాలున్నాయని బాలల హక్కుల ఎన్జీవో 'హక్' న్యాయవాది కుమార్ శైలభ్ తెలిపారు.

"ఈ సెక్షన్‌ ప్రకారం అరెస్టు చేసే అవకాశం తక్కువ. కానీ, దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని లేదా నిందితులు పారిపోతారని పోలీసులు భావిస్తే, అరెస్టు చేయవచ్చు" అని చెప్పారు.

రెజ్లర్ల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

‘అరెస్టు చేయకపోతే తప్పుడు సందేశం’

బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ అంత తేలికగా నమోదు కాలేదు.

పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంతో మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కోర్టు పోలీసులకు నోటీసులిచ్చిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

లైంగిక ఉద్దేశంతో మైనర్ జననాంగాలను తాకడం, లేదంటే తన అంగాన్ని తాకమని మైనర్‌ను బలవంతం చేయడం 'లైంగిక హింస' నిర్వచనం కిందకు వస్తుంది.

ఆ వ్యక్తి శక్తివంతంగా ఉండి, అతని పదవి, ఉద్యోగం మొదలైన హోదాను అడ్డంపెట్టుకుని మైనర్‌‌పై అసభ్యంగా ప్రవర్తించినా అది 'తీవ్రమైన లైంగిక వేధింపు'గా పరిగణిస్తారు.

నిందితుడి బలం, పలుకుబడి కారణంగా బాధితులు, సాక్షులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అనుమానం రెజ్లర్లలో ఉందని, అందుకే బ్రిజ్ భూషణ్‌‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని కుమార్ శైలభ్ అభిప్రాయపడ్డారు.

"ఈ ఘటనలో చర్య తీసుకోకపోవడం తప్పుడు సందేశాన్ని పంపుతోంది. పోక్సో చట్టం ఉద్దేశం, ప్రాముఖ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది" అని శైలభ్ తెలిపారు.

సాక్షి మాలిక్

ఫొటో సోర్స్, @SAKSHIMALIK

లైంగిక వేధింపుల విచారణ కమిటీ ఏం తేల్చింది?

బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు మొదట ఈ ఏడాది జనవరిలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా కలిసి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినపుడు తెరపైకి వచ్చాయి.

ఆ సమయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి, అవగాహన కల్పించడానికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 'ఇంటర్నల్ కమిటీ' లేదు.

లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం పని ప్రదేశం సురక్షితంగా ఉండటానికి ప్రతి ప్రధాన కార్యాలయానికి ఇటువంటి కమిటీని ఏర్పాటు చేయడం అవసరమని, ఇలాంటి కమిటీలలో సభ్యులుగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీ మూర్తి అభిప్రాయపడ్డారు.

"ఫిర్యాదులపై మాత్రమే కమిటీని ఏర్పాటు చేస్తే, అది అంత ప్రభావవంతంగా ఉండదు. ఫిర్యాదుదారు, ఎవరిపై ఆరోపణలు చేశారు, స్వయంప్రతిపత్తిని బట్టి సభ్యుల ఎంపిక ఉండాలి. లేకపోతే ఆ కమిటీపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి" అని లక్ష్మీ మూర్తి బీబీసీతో అన్నారు.

జనవరిలో ఈ ఘటనపై 'ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్' పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికలో కొంత భాగాన్ని ఏప్రిల్‌లో వెల్లడించారు.

''విచారణ కమిటీ సిఫార్సులను పరిశీలిస్తున్నాం, కొన్ని ప్రాథమిక అంశాలు బయటకు వచ్చాయి. లైంగిక వేధింపుల నివారణ, అవగాహన కోసం సమాఖ్యలో అంతర్గత కమిటీ లేదు. సమాఖ్య, ఆటగాళ్ల మధ్య మెరుగైన సంభాషణ, దానిలో పారదర్శకత ఉండాలి" అని క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మహిళా రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI

తీర్పు వెలువడే వరకు మహిళా రెజ్లర్లు సురక్షితమేనా

"కమిటీ పని తీరును ఇప్పటికే రెజ్లర్లు ప్రశ్నించారు. ఈ సభ్యులందరు మొత్తం ఆ వ్యవస్థలో భాగమే. కమిటీలో బయటి నుంచి సభ్యులు ఉంటే అత్యంత ప్రభావవంతంగా ఉండేది" అని లక్ష్మీ మూర్తి తెలిపారు.

''ప్రస్తుత వాతావరణంలో యూనియన్, ఆటగాళ్ల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడంలో పర్యవేక్షణ కమిటీ నివేదికను బహిరంగపరచడం మొదటి అడుగు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఆరోపణలు రుజువైతే శిక్షగా పదవి నుంచి తొలగించడం లేదా సస్పెండ్ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. అయితే బ్రిజ్ భూషణ్ ఇప్పటికీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు'' అని లక్ష్మీ మూర్తి గుర్తుచేశారు.

రెజ్లర్ల ఆరోపణలు అనంతరం రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ పనులను ఇద్దరు సభ్యుల 'అడ్‌హక్ కమిటీ' చూస్తోందని క్రీడామంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ కమిటీ రాబోయే రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను కూడా నిర్వహించనుంది.

బ్రిజ్ భూషణ్ సింగ్ గత పన్నెండేళ్లుగా ఫెడరేషన్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆయన తదుపరి ఎన్నికల్లో పోటీ చేయలేరు.

అయినప్పటికీ బ్రిజ్ భూషణ్ ఆధిపత్యం కారణంగా తమ కెరీర్ ముగిసిపోతుందని రెజ్లర్లు భయపడుతున్నారు.

మరోవైపు 'పర్యవేక్షణ కమిటీ' నివేదిక సీల్డ్ కవర్‌లో దిల్లీ పోలీసులకు అందింది.

అయితే నివేదిక బయటికొచ్చేవరకు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై ఆరోపణలను ధ్రువీకరించలేం.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)