జగనన్న భూ రీ సర్వే: గిరిజనుల భూములు చేతులు మారాయా, రికార్డులు తారుమారయ్యాయా?

జగనన్న భూ రీ-సర్వే
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న భూ రీ-సర్వే’తో సాగులో లేనివారికి పట్టాలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జగనన్న భూముల రీ-సర్వేలో తమ పేర్లు రికార్డుల్లో కనిపించకుండా చేశారని, తరాలుగా సాగులో ఉన్న తమకు అన్యాయం చేసి గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చారంటూ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పనసలపాడు గ్రామ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగనన్న భూరక్ష హద్దు రాయి

‘భూముల రీ-సర్వే తర్వాతే తెలిసింది’

రోలుగుంట మండలంలోని రత్నంపేట పంచాయతీ పనసలపాడు గిరిజన గ్రామంలో 12 కుటుంబాలు తరాలుగా గ్రామంలోని భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.

ఈ గ్రామంలో ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరుతో అధికారులు నిరుడు అక్టోబర్, నవంబర్ మధ్య కాలంలో సర్వే జరిపారు.

దీనినే 'జగనన్న భూముల రీ-సర్వే' అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌లో పాస్ పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

తమకు పాస్ పుస్తకాలు వస్తాయని ఆశించిన గిరిజనులకు నిరాశే ఎదురైంది. పనసలపాడులో నివాసమంటున్న 12 గిరిజన కుటుంబాలకు కాకుండా, ఆ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను గిరిజనేతరులకు ఇచ్చారని వారికి తెలిసింది.

దాంతో, వారు అధికారుల చుట్టూ తిరగడం ప్రారంభించారు.

‘భగత తెగకు చెందిన మేం పూర్వం నుంచి వంశపారంపర్యంగా పనసలపాడు గ్రామంలోనే ఉంటూ దాదాపు 20 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాం. మా గ్రామంలో భూముల రీ-సర్వే జరిపారు. దీంతో మాకు పట్టాలు వస్తాయని ఆశపడ్డాం. కానీ తీరా చూస్తే సాగు చేస్తున్న మాకు కాకుండా, గిరిజనేతులకు పట్టాలు ఇచ్చారు. అంటే రీ-సర్వే పేరుతో మమ్మల్ని సాగుకు, భూమికి దూరంగా చేశారు. రికార్ట్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్ చట్టం ప్రకారం, సాగులో లేని వారికి పట్టాలు ఎలా ఇస్తారు?” అని పనసలపాడు గ్రామానికి చెందిన గిరిజనుడు గెమ్మిలి చినబ్బాయ్ ప్రశ్నించారు.

జగనన్న భూ రీ-సర్వే

‘వివాదం ఈ సర్వే నెంబర్లలోనే...’

పనసపాడు గ్రామంలో 6/1, 6/9, 8/1 సర్వే నెంబర్లలో ఉన్న భూములు తమ అధీనంలో ఉన్నాయని పనసలపాడు గిరిజనులు చెప్తున్నారు. ఈ భూముల్ని వారే సాగు చేస్తున్నారు.

జగనన్న భూముల రీ-సర్వే చేసిన తర్వాత వీటికి గిరిజనేతరుల పేరుతో పాస్ పుస్తకాలు ఇచ్చారు. దీంతో, ప్రభుత్వం చేస్తున్న రీ సర్వేలో గిరిజనేతరులకు పట్టాలు ఎలా ఇస్తున్నారంటూ గిరిజనులు ఆందోళనకు దిగారు.

“6/9 సర్వే నెంబరులో గెమ్మిలి మల్లుదొర కుటుంబీకుల పేరుతో 4 ఎకరాలుకు పైగా భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. రికార్డుల్లో మా పేర్లు స్పష్టంగా ఉన్నాయి. కానీ రీ-సర్వే తర్వాత పాస్ పుస్తకాలను మాత్రం మాజీ సర్పంచ్ తమటాపు సత్యనారాయణ పేరుతో ఇచ్చేశారు. మా పేరుతో భూముల రికార్డులు ఉంటే, ఆయన పేరుతో పాసు పుస్తకాలు ఎలా ఇచ్చారు? ఈ భూముల విషయంలో మేం ఎవరితోనూ, ఎప్పుడూ ఎటువంటి రాతకోతలు చేయలేదు" అని పనసలపాడుకు చెందిన గిరిజనుడు గెమ్మలి చినబ్బాయ్ బీబీసీతో చెప్పారు.

“8/1 సర్వే నెంబరులోని రెవెన్యూ రికార్డుల్లో గెమ్మిలి సింగన్నదొర పేరుతో ఉన్న భూములను రీ-సర్వే తర్వాత గిరిజనేతరుడు ఆర్లి సోమరాజు పేరుతో 1.16 సెంట్లు భూమిని అసైన్‌మెంట్ భూమిగా చూపిస్తున్నాయి. రికార్డుల ప్రకారం హక్కుదారుడు గెమ్మిలి సింగన్న దొర. కానీ పాస్ బుక్ మాత్రం ఆర్లి సోమరాజు పేరుతోనే ఇచ్చారు. హక్కుదారులైన గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు ఎలా పాస్ పుస్తకాలు ఇచ్చారు?” అని గెమ్మిలి సింగన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు.

జగనన్న భూ రీ-సర్వే

‘రికార్డులున్నా, సాగులో ఉన్నా…పాస్ పుస్తకాలు ఇవ్వలేదు’

రికార్డుల్లో ఉన్న భూమి, సాగులో ఉన్న భూమిని కూడా గిరిజనేతరుల పేరుతోనే పాస్ పుస్తకాలు అధికారులు ఇచ్చారని గిరిజనులు ఆరోపిస్తున్నారు .

6/1 సర్వేలో గెమ్మిలి కుటుంబాలకు చెందిన 10 మంది సాగులో ఉన్నారు. ఇక్కడ గిరిజన కుటుంబీలకు ఉన్న 4 ఎకరాకలు పైగా భూమిని గిరిజనేతరురాలైన భగవతి మైథిలికుమారి పేరుతో పాస్ పుస్తకాలు ఇచ్చారు.

ఇక్కడ సాగులో ఉన్నా కూడా తనకు పాస్ పుస్తకం రాలేదని గెమ్మిలి నూకినాయుడు తెలిపారు.

ఇలా రికార్డుల్లో ఉన్నా, సాగులో ఉన్న గిరిజనులకు జగనన్న భూ రీ-సర్వేలో పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదనే విషయంలో గెమ్మిలి నూకినాయుడు, గెమ్మిలి సింగన్నదొర, గెమ్మిలి చిన్నబ్బాయ్ విషయాల్లో తేలింది.

ఇలా పనసలపాడులో నివాసముంటున్న 12 గిరిజన కుటుంబాలకు ఇదే జరిగింది. దీంతో, జగనన్న రీ సర్వేలో తమకు అన్యాయం జరిగిందని, అధికారులు గిరిజనేతరులకు వత్తాసు పలుకుతున్నారని గిరిజనులు ఆరోపించారు.

తక్షణమే వీటిని రద్దుచేసి అర్హులైన సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని పనసలపాడు గ్రామానికి చెందిన గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

జగనన్న భూ రీ-సర్వే

‘రీ-సర్వేతో తారుమారైన రికార్డులు’

జగనన్న భూముల రీ-సర్వే ముందు వరకు రికార్డులు సరిగానే ఉన్నాయని, ఈ సర్వే పేరుతో అధికారులు గిరిజనేతరులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

“అనకాపల్లి జిల్లా కలెక్టర్ పనసలపాడు గ్రామానికి వచ్చి సెక్షన్ 9(2) ప్రకారం సర్వే చేసి, దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకొని డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ (డీఎల్ఆర్) నమోదు చేయాలి. ఈ పద్ధతి పనసలపాడు రెవెన్యూ పరిధిలో జరగలేదు. సర్వే నెంబర్లు 6/1, 6/9, 8/1 సర్వే నెంబరులో భూములకు గిరిజనులు పట్టాదారులుగా, సాగు హక్కుదారులుగా ఉన్నప్పటికీ... భూముల రీ-సర్వే తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు గిరిజనేతరులకి ఎలా ఇస్తారు?” అని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ అధ్యక్షులు కొరువాడ గోవిందరావు బీబీసీతో అన్నారు.

“భూముల రీ-సర్వే నిబంధల ప్రకారం జరపలేదు. రీ సర్వేలో భాగంగా గ్రామసభ రెవెన్యూ గ్రామంలో నిర్వహించాలి. దానికి నోటీసులు ఇవ్వాలి. అదేమీ లేకుండా అసలు గిరిజనులకు భూముల రీ-సర్వేపై అవగాహన కల్పించకుండా ఎక్కడో మారుమూల గ్రామంలో నిర్వహించి గ్రామసభ అయిందనిపించారు. ఈ సర్వేకు ఆధారమైన సెటిల్ మెంట్ రికార్డులు, డ్రాప్ట్ ల్యాండ్ రిజిస్టర్ లో గిరిజనులు పేర్లు ఉన్నా కూడా, రీ సర్వేలో ఆ పేర్లు తారుమారైపోయాయని, ఇది అధికారులు గిరిజనులకు చేసిన అన్యాయం” అని కొరువాడ గోవిందరావు అన్నారు.

జగనన్న భూ రీ-సర్వే

‘వివాదస్పద భూములుగా మార్చిన అధికారులు’

జగనన్న రీ-సర్వేలో గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగలేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

ఆ భూములు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగాయో, వారికే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామని రోలుగుంట డిప్యూటీ తహసీల్దార్ హెచ్. త్రివేణీ బీబీసీతో చెప్పారు.

"పనసలపాడులో నివాసముంటూ అక్కడ భూములను సాగు చేస్తున్న గిరిజనులకు రికార్డులు లేవు. సాగులో లేకపోయినా ఆ భూములపై భగవతి మైథిలికుమారి, తమటాపు సత్యనారాయణ వంటివారు 2012లో రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నారు. కాబట్టి వారి పేర్లతో పాస్ పుస్తకాలు ఇచ్చాం. దీనిపై గిరిజనులు అందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవోతో కలిసి గ్రామాన్ని సందర్శించాం. అక్కడ పరిస్థితిని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ భూములను వివాదస్పద భూములుగా గుర్తించి, ఈ భూములపై అధికారం ఎవరికి లేదని రిపోర్ట్ రాశాం” అని డిప్యూటీ తహసిల్దార్ త్రివేణి చెప్పారు.

ఈ భూములకు రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అమ్మకాలు, కొనుగోలు జరగాలి.

కానీ గిరిజనులు సాగులో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరగాలంటే ఆర్వోఆర్ఎఫ్ చట్టం ప్రకారం అది వీలుకాదని గిరిజన సంఘాలు అంటున్నాయి.

వీడియో క్యాప్షన్, పచ్చళ్ల పల్లెగా గుర్తింపు పొందిన నార్కెడిమిల్లి

‘గిరిజనులు కోర్టుకు వెళ్లాలి’

జగనన్న రీ-సర్వే తర్వాత వివాదస్పద భూములుగా మారిన పనసలపాడులోని భూములకు పరిష్కారం ఎలా అని రోలుగుంట డిప్యూటీ తహసీల్దార్‌ను బీబీసీ ప్రశ్నించింది.

‘‘రీ-సర్వే తర్వాత పాస్ పుస్తకాలు ఇచ్చిన వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే, వాటిని కోర్టులోనే తేల్చుకోవాలి. ఇది మా పరిధిలో లేదు. గిరిజనులు, గిరిజనేతురులైనా తమ వద్ద అధికారిక పత్రాలు ఉంటే వాటిని పట్టుకుని కోర్టులో విషయాన్ని తేల్చుకోవాలి” అని డిప్యూటీ తహిసీల్దార్ త్రివేణి చెప్పారు.

ఇప్పటికే 8/1 సర్వే నెంబరులో భూ వివాదం విషయంలో గత మూడేళ్లుగా కోర్టులో గిరిజనులకు, గిరిజనేతరులకు కేసు నడుస్తోందని పనసలపాడు గిరిజనులు బీబీసీతో చెప్పారు. మళ్లీ తాము కోర్టుకి వెళ్తే తమ జీవితాలకు కోర్టు చుట్టూ తిరగడంతోనే సరిపోతుందని అన్నారు.

“ఏళ్ల తరబడి సాగులోనే కాకుండా హక్కుదారులుగా ఉన్న భూమిని పొందాలంటే మళ్లీ గిరిజనులు కోర్టులకు వెళ్లమనడమంటే దీనిలోనే కుట్ర దాగి ఉంది. ఇది అంత త్వరగా తేలే వ్యవహారం కాదు. పైగా ఖర్చుతో కూడుకున్న పని. వివాదస్పద భూముల కింద మార్చడమంటేనే గిరిజనేతులకు మేలు చేయడం. దీనిపై జాయింట్ కలెక్టర్ స్థాయిలో నిర్ణయం తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని గిరిజన సంఘం నాయకులు కొమరాడ గోవింద్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)