సింగపూర్: 180 ఏళ్ల చరిత్ర ఉన్న గుర్రపు పందేలను ఎందుకు ఆపేస్తున్నారు?

ఫొటో సోర్స్, www.turfclub.com.sg
- రచయిత, అన్నాబెల్లె లియాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సింగపూర్‌లో 180 ఏళ్ల గుర్రపు పందేల సుదీర్ఘ చరిత్రకు బ్రేక్ పడనుంది.
ఈ చిన్న ఆగ్నేయాసియా దేశంలోని ఏకైక రేస్‌కోర్సు అయిన 'సింగపూర్ టర్ఫ్ క్లబ్' వచ్చే ఏడాది దాని చివరి గుర్రపు పందెం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
120 హెక్టార్ల రేస్ కోర్సు స్థలాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హౌసింగ్ నిర్మాణాల కోసం సింగపూర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుండటమే దీనికి కారణం.
క్వీన్ ఎలిజబెత్ II పేరు మీద ఈ రేసు ప్రారంభమైంది. ఆమెకు రేసు గుర్రాలు పెంచడం, గుర్రపు పందేలు అంటే ఆసక్తి.
1972లో రాణి సింగపూర్ పర్యటన సందర్భంగా మొదటి 'క్వీన్ ఎలిజబెత్ II కప్'ను అందించారు. ఆమె 2006లో రెండోసారి ఈ ఫీచర్ రేస్‌కు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, SINGAPORE TURF CLUB
"సింగపూర్‌లో గుర్రపు పందేలకు సుదీర్ఘ, విశిష్టమైన చరిత్ర ఉంది" అని సింగపూర్ టర్ఫ్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.
"2024 అక్టోబరు 5న జరిగే 100వ గ్రాండ్ సింగపూర్ గోల్డ్ కప్ వరకు రేసులు కొనసాగుతాయి. క్లబ్ ప్రతి రేసు క్రీడాస్ఫూర్తి, భద్రత, సమగ్రతను కొనసాగిస్తుంది" అని తెలిపింది.

ఫొటో సోర్స్, SINGAPORE TURF CLUB
ఈ రేస్ కోర్సును ప్రారంభించిందెవరు?
స్కాటిష్ వ్యాపారి విలియం హెన్రీ మాక్లియోడ్ రీడ్, పలువురు ఔత్సాహికులు 1842లో సింగపూర్ స్పోర్టింగ్ క్లబ్‌ను స్థాపించారు.
సెంట్రల్ సింగపూర్‌లోని ఫారర్ పార్క్‌లో కొద్దిగా చిత్తడిగా ఉన్న నేలను వారు రేస్‌కోర్స్‌గా మార్చారు. 1924లో ఈ స్థలాన్ని సింగపూర్ టర్ఫ్ క్లబ్‌గా మార్చారు.
గుర్రపు పందేలు యూరోపియన్లనే కాకుండా సంపన్నులైన మలేసియా, చైనీస్ వాసులను కూడా ఆకర్షిస్తున్నాయి.
1933లో సెంట్రల్ సింగపూర్‌లో గుర్రపు పందేలకు జనాదరణ పెరగడంతో, ఈ కోర్సు పశ్చిమ సింగపూర్‌లోని బుకిట్ తిమాహ్ వద్దగల భారీ ప్రదేశానికి మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏమంటోంది?
సింగపూర్ టర్ఫ్ క్లబ్ 2000 మార్చిలో ఈ ద్వీపానికి ఉత్తరాన ఉన్న ప్రస్తుత క్రాంజి స్థానానికి మారింది.
దాదాపు 3 వేల కోట్ల రూపాయల విలువ గల ఈ రేస్‌కోర్స్ ఐదు అంతస్తుల గ్రాండ్‌స్టాండ్‌ను కలిగి ఉంది. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది.
అయితే పదేళ్లుగా సింగపూర్ టర్ఫ్ క్లబ్‌కు హాజరయ్యేవారి సంఖ్య తగ్గింది.
భవిష్యత్తు భూ అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ గృహాల కోసం ఈ భూమిని తిరిగి అభివృద్ధి చేయనున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
"సింగపూర్ పరిమిత భూమితో కూడిన నగరం. నేటి అవసరాలను తీర్చడానికి, భావి తరాల అవసరాలకు సరిపడ భూమి అందుబాటులో ఉంచేలా చూడటానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు భూ వినియోగ ప్రణాళికలను సమీక్షిస్తుంటుంది" అని చెప్పింది.
విశ్రాంతి, వినోద సదుపాయాలు, ఇతర అవసరాలకు భూమిని వినియోగించే అవకాశాలను కూడా పరిశీలిస్తామని సింగపూర్ జాతీయ అభివృద్ధి శాఖ చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక: గేదెలను చంపుతున్నారు, గోవులను వధిస్తే ఇబ్బంది ఏమిటన్న మంత్రి.. ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్
- తెలంగాణ: 43 కులాలకు భవనాలు, స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం, కులాల జనాభాను ఎందుకు రహస్యంగా పెట్టింది?
- తలనొప్పి: ఎన్ని రకాలు? ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏవి?
- సాక్షి మలిక్: రైల్వే ఉద్యోగంలో తిరిగి చేరా, లైంగిక వేధింపులపై పోరాటం కొనసాగిస్తా
- ఆంధ్రప్రదేశ్: మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ... ఎనిమిదేళ్ళ కింద ఏర్పాటైన ఆఫీసులో ఎవరైనా ఉన్నారా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














