తలనొప్పి: ఎన్ని రకాలు? ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏవి?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
తలనొప్పి అనేది దాదాపు అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్య. గణాంకాల ప్రకారం ఏటా ప్రతి నలుగురిలో ఇద్దరి నుంచి ముగ్గురు తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
వారిలో 30 శాతం మంది మైగ్రేన్ తలనొప్పి కోసం మందులు వాడతారు. ఆసుపత్రుల్లోని అత్యవసర విభాగానికి, అవుట్ పేషెంట్ విభాగానికి వచ్చే వారిలో తలనొప్పితో వచ్చే రోగులు ఎక్కువగా ఉంటారు.
తలనొప్పి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ప్రైమరీ తలనొప్పి, రెండోది సెకండరీ తలనొప్పి
ప్రైమరీ: ఇందులో తలనొప్పి రావడమే ప్రధాన సమస్య. ఒత్తిడి వల్ల 70 శాతం తలనొప్పి రాగా, మైగ్రేన్ తలనొప్పి 16 శాతంగా ఉంటుంది. ఈ రెండు రకాలను ప్రైమరీ తలనొప్పిగా భావిస్తారు.
సెకండరీ: ఇతర కారణాల వల్ల తలనొప్పి కలుగుతుంది. అంటే ఇన్ఫెక్షన్లు లేదా తలకు దెబ్బ తగలడం వల్ల వచ్చే తలనొప్పులను సెకండరీ తలనొప్పిగా భావించాలి. ఇందులో ఆ కారణానికి తగిన చికిత్స అందించాలి.

ఫొటో సోర్స్, iStock
ఏ తలనొప్పికి ఏ లక్షణాలు ఉంటాయి?
మైగ్రేన్ ఉన్నవారికి తలలో ఒక వైపు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ మొదలయ్యే ముందు అసాధారణమైన వాసనలు, కళ్ళల్లో ఏవో కాంతులు కనిపించడం, వికారం, వాంతులు, శబ్ధాలు వినలేకపోవడం, వెలుతురును చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం నిద్రలేచిన కాసేపటికి మొదలై కొన్ని గంటల వ్యవధిలో ఇది తీవ్ర నొప్పిగా మారుతుంది.
ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పి సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటుంది. తల చుట్టూ నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా తల వెనక భాగం, మెడలో ఎక్కువ నొప్పి ఉంటుంది. నిద్రపోయి లేవగానే ఈ రకమైన తలనొప్పి తగ్గిపోతుంది.
చూపు సమస్యల వల్ల కలిగే నొప్పి కూడా సాయంత్రం అధికంగా ఉంటుది. తల వెనుక భాగంలో నొప్పిని కలిగిస్తుంది. ఈ రకమైన నొప్పిని గుర్తించడానికి ఒక చిట్కా ఏంటంటే దూరపు అక్షరాలను లేదా వస్తువులను సరిగ్గా చూడలేకపోవడం. కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను తేలికగా పరిష్కరించవచ్చు.
సైనస్ వల్ల కలిగే తల నొప్పి, ఉదయం లేవగానే తీవ్రంగా ఉంటుంది. తలను ముందుకు వంచి ఉంచినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. సైనస్ వల్ల తలనొప్పి వచ్చినప్పుడు జలుబు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని సైనస్ తలనొప్పి అని సులభంగా గుర్తించవచ్చు.
జ్వరంతో కలిగే తలనొప్పిని ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్న నొప్పిగా భావించాలి. దెబ్బ తగలడం వల్ల కలిగే నొప్పిని సులభంగానే గుర్తించవచ్చు.
తలలో రక్తస్రావం అవ్వడం వల్ల, లేదా రక్తనాళాలలో ఏదైనా సమస్య వల్ల ఒక్కసారిగా తీవ్రంగా తలనొప్పి కలుగుతుంది. అలాంటప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేసుకోవాలి.
కొన్ని రోజులుగా తలనొప్పి క్రమంగా పెరగడం, మెల్లి మెల్లిగా కళ్లు మసకబారడం, వాంతులు అవ్వడం, నడక తడబడటం లేదా ఇతర పక్షవాత లక్షణాలు కనిపిస్తున్నాయంటే మెదడులో ఏదైనా గడ్డ పెరుగుతోందని అనుమానించాలి. ఇలాంటి లక్షణాలున్న చాలా మంది రోగులకు మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇవే కాకుండా బీపీలో హెచ్చుతగ్గుల వల్ల, లేదా షుగర్ తగ్గిపోవడం వల్ల, లేదా అధిక సమయం కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని వెంటనే గుర్తిస్తే త్వరగా ఈ బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాద ఘంటికలు
తలనొప్పిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే వైద్యులను తప్పకుండా సంప్రదించాలి.
- అర్ధరాత్రి నిద్రలో అకస్మాత్తుగా తీవ్రంగా తలనొప్పి వస్తే,
- ఉదయం లేవగానే తలనొప్పి తీవ్రంగా ఉంటే,
- రోజు రోజుకూ తలనొప్పి పెరుగుతూ ఉంటే,
- తల కదిలించినా, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముందుకు వంగితే నొప్పి ఎక్కువ అవుతుంటే,
- తీవ్రమైన జ్వరంతో, మెడ పట్టేసినట్టు ఉంటూ కదిలించ లేనంతగా తలనొప్పి వస్తే,
- వాంతులు, లేదా మూర్ఛ కలిగించే తల నొప్పి
- స్పృహ కోల్పోవడం, అధికంగా నీరసం, నడక తడబడటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు,
- తలకు దెబ్బ తగిలిన అయిదు రోజులలో కలిగే తలనొప్పి
- చూపు మందగించటం, రెండుగా కనిపించడం, మెల్ల కన్ను రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి.

ఫొటో సోర్స్, iStock
పరీక్షలు
ముందుగా బీపీ, షుగర్ పరీక్షలతో పాటు చూపు పరీక్ష, సైనస్ కోసం ఎక్స్‌రే వంటి పరీక్షలు చేస్తారు.
ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే తలనొప్పికి రక్త పరీక్షలు, అవసరమైతే వెన్ను పూస నుంచి నీరు తీసి దాన్ని పరీక్షిస్తారు. ఇలా చేయడం వల్ల సమస్యను నిర్ధరించవచ్చు.
తలకు చేసే సీటీ స్కాన్ అందుబాటులో ఉంటూ తక్కువ ధరలో సులువుగా అయ్యే పరీక్ష. కానీ, అందులో అన్ని కారణాలను, అన్ని సమస్యలను గుర్తించలేకపోవచ్చు.
ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేయడం ద్వారా అధిక శాతం సమస్యలను గుర్తించవచ్చు. కొన్ని సార్లు రక్తనాళాలను పరిశీలించడానికి ఎంఆర్‌ఏ, ఎంఆర్వీ వంటి పరీక్షలు చేయాల్సి రావొచ్చు.

చికిత్స
తలనొప్పికి కారణాన్ని బట్టి, దాని రకాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పికి, మైగ్రేన్ నొప్పికి వేర్వేరు చికిత్సలు ఉంటాయి.
వైద్యుల సలహా మేరకే వారు సూచించిన మాత్రలనే వాడాలి. సొంత వైద్యం పనికిరాదు.
తరచుగా మైగ్రేన్ నొప్పి వస్తుంటే అంటే నెలకు నాలుగు సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు మైగ్రేన్ నొప్పి వస్తుంటే వారు మూడు వారాల పాటు మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నొప్పి రావడానికి కారణాన్ని గుర్తించి దాన్ని తగ్గించుకోవాలి. ఉదాహరణకు ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల వస్తుంటే దాన్ని పరిమితం చేయాలి.
సైనస్ వల్ల కలిగే నొప్పికి చికిత్స ఏంటంటే సైనస్‌లను పొడిగా ఉంచడం. ఈ రకమైన తలనొప్పికి జలుబు మాత్రలతో పాటు, వేడి నీటితో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతీసారి యాంటీబయాటిక్ వాడటం మంచిది కాదు. తరుచుగా జలుబు బారిన పడకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే చల్లటి పదార్థాలు, దుమ్ము, కాలుష్యానికి దూరంగా ఉండాలి.
చూపు సమస్యల వల్ల మలబద్దకంతో లేదా ఎసిడిటీ (గ్యాస్), బీపీ, షుగర్ హెచ్చుతగ్గులు, ఇన్ఫెక్షన్లు, కూర్చునే పద్దతి వల్ల కలిగే తలనొప్పికి ఆయా సమస్యలను పరిష్కరించడమే చికిత్స. ఏవైనా లక్షణాలు తీవ్రంగా కనిపిస్తుంటే వెంటనే వైద్యులను కలిసి, పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవాలి.
(గమనిక: రచయిత వైద్యురాలు. ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం.)
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














