ఆస్టియోపొరోసిస్: వయసుతో సంబంధం లేకుండా ఎముకలు ఎందుకు విరుగుతాయి? అవి బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

ఎముకలు

ఫొటో సోర్స్, Getty Images

వయసు మరీ ఎక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే ఎముకలు బలహీనపడతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల తక్కువ వయసులోనే ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకలు బలహీనపడే సమస్యలు తలెత్తుతున్నాయి.

ఆస్టియోపొరోసిస్ అంటే?

ఎముకలు బలాన్ని కోల్పోయి బలహీనంగా మారడాన్నే ఆస్టియోపొరోసిస్ అంటారు. బలహీన పడటం వలన చిన్నచిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

జారిపడినప్పుడు పెద్దవాళ్ల తుంటి ఎముకలు విరగడాన్ని మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అందుకు కారణం ఎముకలు బలహీనపడటమే.

శక్తి తగ్గి ఎముకలు పెలుసు బారడం అనేది ఆస్టియోపొరోసిస్‌కు దారి తీస్తుంది.

50 ఏళ్లకు పైబడి ఉండే ప్రతి అయిదుగురు మగవారిలో ఒకరు ఆస్టియోపొరోసిస్ బారిన పడతారు. ప్రతి ఇద్దరు ఆడవారిలో ఒకరికి ఈ సమస్య తలెత్తుతుందని రాయల్ ఆస్టియోపొరోసిస్ సొసైటీ చెబుతోంది.

ఆస్టియోపొరోసిస్ వల్ల మణికట్టు, తుంటి ఎముకలు, వెన్నెముక భాగాలు ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి.

35 ఏళ్లు దాటిన తరువాత వయసులో వచ్చే మార్పుల వల్ల ఎముకల కణజాలంలో సమస్యలు వస్తాయి. ఎముకకు బలాన్ని ఇచ్చేది బయటి పొరలో ఉండే కణజాలమే.

సాధారణంగా ఈ కణజాలంలోని కొన్ని కణాలు చనిపోతూ ఉంటే వాటి స్థానంలో కొత్తవి వస్తూ ఉంటాయి. పుట్టుకొచ్చే కణాల కంటే చనిపోయేవే ఎక్కువగా ఉంటే ఎముక బలహీనపడటం మొదలవుతుంది. దీన్నే ‘‘బోన్ థిన్నింగ్’’ అంటారు.

బయటకు చూడటానికి ఎముక బాగానే కనిపిస్తుంది. కాకపోతే గట్టిగా ఉండే బయటి పొర లోపల అతిచిన్న రంధ్రాలు పడతాయి. ఫలితంగా ఎముక బలం తగ్గి బలహీనంగా మారుతుంది.

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారడానికి ఇదే కారణం.

ఎముకల ఆరోగ్యం

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

ఆస్టియోపొరోసిస్ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉండొచ్చు.

జన్యువులు: తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువుల ఆధారంగా ఎముకల ఆరోగ్యం మారుతూ ఉంటుంది.

వయసు: వయసు పెరిగే కొద్దీ ఎముకలు పెలుసుబారి పోతుంటాయి.

జాతి: ఆఫ్రో-కరీబియన్ల జాతి ప్రజలతో పోలిస్తే ఆసియన్లు లేదా కాకాసియన్లకు ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

తక్కువ బరువు: బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) 19 కంటే తక్కువ ఉంటే ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పొగతాగడం: పొగతాగేవాళ్లలో ఎముకలు బలహీనపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

పొగతాగే అలవాటు ఎక్కువగా ఉన్న వారిలో ఆస్టియోబ్లాస్ట్స్ జరిగే అవకాశం ఉంది. ఎముకలు ఏర్పడే కణాల ఉత్పత్తి తగ్గిపోవడాన్ని ఆస్టియోబ్లాస్ట్స్ అంటారు.

పొగతాగడం వల్ల మహిళల్లో మెనోపాజ్ ముందుగా వచ్చే అవకాశం ఉంది. దానితో పాటు, నడుము ఎముక విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పొగతాగడం మానేసిన మహిళల్లో ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుముఖం పట్టినట్లు తేలింది.

మద్యపానం: పరిమితికి మించి మద్యాన్ని తీసుకోవడం ఆస్టియోపొరోసిస్ ముప్పును పెంచుతుంది.

అతిగా మద్యం తాగడం వల్ల ఎముకలు పెలుసుబారి విరిగిపోవడం, ఆస్టియోపొరోసిస్‌కు దారితీసే ప్రమాదం ఎక్కువ. కొద్దిగా మద్యం మత్తులో ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువే. దానివల్ల ఎముకలు విరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇతర అనారోగ్య సమస్యలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆడవారిలో ఈస్ట్రోజెన్ స్థాయులు తక్కువగా ఉండటం, థైరాయిడ్, మగవారిలో టెస్టోస్టిరోన్ తక్కువగా ఉండటం, పక్షవాతం వంటి సమస్యల వలన ఎముకలు బలహీనపడొచ్చు.

కొన్ని రకాల మందులు కూడా ఆస్టియోపొరోసిస్‌కు దారి తీస్తాయి.

ఎముకల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి?

శరీరం పెరుగుతున్న దశ అంటే బాల్యం నుంచి 25 ఏళ్ల మధ్య ఎముకల బలానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చిన్న పిల్లలకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారంతోపాటు అన్ని రకాల పోషకాలు అందేలా చూడటం వల్ల వారిలోని ఎముకల బలం బాగా పెరుగుతుంది.

పండ్లు, కూరగాయలు, ఆలుగడ్డలు, పాస్తా, సెరియల్స్, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులు వంటి వాటిని తీసుకోవాలి.

బరువులతో చేసే వ్యాయామం వల్ల కూడా ఎముకలు గట్టిగా తయారవుతాయి.

కాల్షియం: ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. పాలు, నువ్వులు, బాదం పప్పు, ఆకు కూరలు వంటివి తీసుకోవడం వల్ల సహజంగానే మనకు కావాల్సిన కాల్షియం లభిస్తుంది.

విటమిన్-డి: శరీరం కాల్షియాన్ని గ్రహించి, కండరాలు బలంగా ఉండటానికి విటమిన్-డి ఉపయోగపడుతుంది. ఎండతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల మనకు విటమిన్-డి లభిస్తుంది.

మారుతున్న జీవనశైలి వల్ల ఎండకు తిరగడం తగ్గిపోతోంది కాబట్టి, ఎప్పటికప్పుడు విటమిన్-డి టెస్టులు చేయించుకోవడం మంచిది. తద్వారా విటమిన్-డి తగిన స్థాయిలో ఉందో, లేదో తెలుస్తుంది.

వ్యాయామం: ఎముకల ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. శరీరంలోని ఎముకల గూడును బలోపేతం చేసేందుకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది.

జాగింగ్, ఏరోబిక్స్, టెన్నిస్, డ్యాన్సింగ్, వేగంగా నడవడం వంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికి మంచిది.

వయసు పెరుగుతున్నప్పటికీ ఉత్సాహంగా ఉండేందుకు ఈత కొట్టడం, తోటపని చేయడం, గోల్ఫ్ ఆడడం వంటివి కండరాల బలాన్ని పెంచుతాయి.

వాటివల్ల శరీరం బ్యాలెన్స్‌, కండరాల మధ్య సంయమనం పెరిగి గాయాలపాలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఆస్టియోపొరోసిస్ ఉన్నవారు భారీ వ్యాయామాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఎలాంటి వ్యాయాయాలు చేయొచ్చు? ఎలాంటివి చేయకూడదు అనే విషయాలను తెలుసుకునేందుకు డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.

ఎముకల ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

శరీర బరువు: భారీగా బరువు పెరగడం, లేదా భారీగా బరువు తగ్గడం వల్ల ఆస్టియోపొరోసిస్, ఎముకలు విరిగే ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తర్వాత సరైన బరువు ఉన్నప్పటికీ, ఎముకలను రక్షించే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది.

ఒకవేళ మీ బరువు గురించి ఆందోళన ఉంటే డాక్టర్‌ని సంప్రదించవచ్చు.

ఎక్కువ బరువు ఉండడం మాత్రం ఎముకలకు మంచిది కాదు. అది కేవలం ఎముకలు విరిగిపోవడం వంటి ప్రమాదాలనే కాకుండా, మరిన్ని ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా కావొచ్చు.

ఎముకల సాంద్రత పరీక్ష(డీఎక్స్ఏ): డెన్సిటోమెట్రీ ఎక్స్ – రే(డీఎక్స్ఏ) ద్వారా ఎముకల సాంద్రతను నిర్ధరిస్తారు. ఒకవేళ ఎముకల సాంద్రత తక్కువగా ఉంటే విరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు లెక్క.

ఎముకల ఆరోగ్యానికి చేయాల్సినవి: ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.

వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వాటిలో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం ఉండేలా చూసుకోవాలి.

శరీరానికి అవసరమైన మేరకు విటమిన్ డి అందేలా కొద్దిసేపు ఎండలో తిరిగేలా ప్లాన్ చేసుకోవాలి.

అలాగే, పొగతాగడం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వంటి వాటిని దూరం పెట్టడం ద్వారా ఆస్టియోపొరోసిస్ ముప్పును తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: