జ్వరం ఎందుకు వస్తుంది? ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
సాధారణంగా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు జ్వరం వస్తుంది.
జ్వరం వస్తే బాడీ టెంపరేచర్ ఎంత ఉందో ప్రతి పూటా టెస్ట్ చేసుకునేవాళ్లను చూస్తుంటాం.
అయితే, మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత, ఎంత ఉష్ణోగ్రత దాటితే జ్వరం అనాలి?
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ మన మెదడులోని హైపోతలామస్‌లో ఉంటుంది.
మన చర్మంపై, రక్తం ఉష్ణోగ్రతను బట్టి వివిధ రకాలుగా మన శరీరాన్ని సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడానికి అది సహాయ పడుతుంది.
చలి ఎక్కువగా ఉన్నపుడు ఉష్ణోగ్రతను పెంచడానికి వణకడం, అలాగే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించడానికి చెమటలు పట్టడం శరీరంలో జరిగే రక్షణ ప్రక్రియలు.

ఎవ్వరికైనా ఉష్ణోగ్రత 98.6°F కన్నా ఎక్కువ ఉంటే జ్వరం అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అది అంత తేలిక కాదు.
శరీర ఉష్ణోగ్రత అనేది ఆ వ్యక్తి వయసు, లింగం, రోజువారీ జీవితం, కొలిచిన స్థలం, కొలిచిన సమయం, వాతావరణం/ కాలం వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.
మన శరీర ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉండేది ఉదయం ఆరు గంటలకు. అత్యంత అధికంగా ఉండేది సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య.
అందుకే ఉదయం సమయంలో 98.9°F కన్నా ఎక్కువ ఉంటే, సాయంత్రం 99.9°F కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే జ్వరం అని అనాలి.
మహిళల్లో రుతు క్రమాన్ని బట్టి కూడా శరీర ఉష్ణోగ్రత మారుతుంది.
నెలసరి మొదలయిన మొదటి రెండు వారాల కన్నా, నెలసరి రావడానికి ముందు ఉండే రెండు వారాలలో శరీర ఉష్ణోగ్రత 0.9°F అధికంగా ఉంటుంది.
అయితే 'లో జ్వరం' అనే ఒక పదం కూడా తరుచూ వినిపిస్తూ ఉంటుంది.
నిజానికి అలాంటిది ఏమీ ఉండదు. నోటి దగ్గర చిన్న కురుపులు రావడం అనేది రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కలిగే ఒక వైరల్ ఇన్ఫెక్షన్.
నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు, ఆ అనారోగ్య స్థితిని 'లో జ్వరంగా' చెప్తుంటారు.
ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు తిని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే అది తగ్గిపోతుంది.
వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగినప్పటికీ ఎక్కువగా పెరగకపోవచ్చు. అందుకే వృద్ధుల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరిగినా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.
చిన్న పిల్లల్లో, ముఖ్యంగా అయిదు నెలల నుండి, అయిదు సంవత్సరాల వయసు వారికి జ్వరం తీవ్రంగా వస్తుంది. దాన్ని వెంటనే అదుపు చేయకపోతే మూర్ఛ (fits) వచ్చే ప్రమాదం ఉంది.
ఉష్ణోగ్రత ఎక్కడ చూస్తున్నాం అనేది కూడా ముఖ్యం. నోట్లో thermometer పెట్టి చూస్తే ఉష్ణోగ్రత సగటున 98.6° F ఉంటుంది. నోటితో ఊపిరి తీసుకునే వారికి అది ఇంకా తక్కువగా ఉండవచ్చు.
సామాన్యంగా పిల్లల శరీర ఉష్ణోగ్రత కొలిచేటప్పుడు మల ద్వారం వద్ద (rectal temperature), చెవిలో (tympanic) చూసే ఉష్ణోగ్రత 0.5°-1°F ఎక్కువగా ఉంటుంది. చేతుల కింద (axillary) చూస్తే 97.7°F ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
జ్వరం రావడానికి కారణాలు
* వైరల్ ఇన్ఫెక్షన్లు
* బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు
* మలేరియా లాంటి వ్యాధులు
* స్వయం ప్రతిరక్షక వ్యాధులు
* కొన్ని రకాల మందులు (ముఖ్యంగా కొన్ని యాంటీ బయాటిక్‌లు, మానసిక రుగ్మతలకు వాడేవి)
* టీకాలు (పిల్లలకు ఇచ్చే డీపీటీ నుంచి కోవిడ్ వరకు)
* శరీరంలో ఎక్కడైనా ఉన్న క్యాన్సర్
* హార్మోన్లు (థైరాయిడ్, కార్టిసోన్, ప్రాజెస్టరోన్)
* ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతల వల్ల

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా కారణంతో జ్వరం వస్తే వీలైనంత తొందరగా దాన్ని నియంత్రించడం చాలా అవసరం. లేదంటే ఒంట్లో నీరు తగ్గిపోయి (dehydration) నీరసంగా అవుతారు.
ఎన్ని గంటలు అధిక ఉష్ణోగ్రతతో ఉంటారో, అంతకు రెట్టింపు సమయం కోలుకోవడానికి పడుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తత చాలా అవసరం.
జ్వరం ఉన్నప్పుడు నీళ్ళు మరియు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
గోరు వెచ్చని నీటితో ఒళ్ళు తుడుస్తూ ఉంటే, ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
చల్లటి నీటితో తుడిస్తే వణుకు వచ్చే ప్రమాదం ఉంది.
శరీరమంతా ఒకేసారి కాకుండా ఒక సారి చేతులు, కాళ్లు తుడిచి, కొంత సమయం తరవాత శరీరాన్ని తుడిస్తే మంచిది.
జ్వరానికి మందు పారాసెటమాల్. ఆ మందుతో జ్వరం అదుపు కాకుండా రోగి నీరసించడం, ఆహారం తీసుకోకపోవడం వంటివి జరిగినా, రెండు రోజులైనా జ్వరం తగ్గకపోతే వైద్యులను కలవాలి.
అంతేకానీ, జ్వరం వచ్చిన మొదటి రోజే పరీక్షలు చేయడం వల్ల అందులో ఏమీ తెలియక పోవచ్చు.
రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చికిత్స ఆలస్యం చేయొచ్చు. అలాగే అనవసరంగా యాంటీ బయాటిక్‌లు వాడడం వల్ల శరీరం మరింత నీరసంగా మారొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
జ్వరంతో జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలకు 80-85% కారణం వైరల్ వ్యాధులు. అలాగే నీళ్ల విరేచనాలకు 75-80% కారణం వైరల్ ఇన్ఫెక్షన్.
బాక్టీరియా వల్ల కలిగే మిగతా ఇన్ఫెక్షన్లలోనూ అనేక సార్లు, అవి వాటంతట అవే తగ్గిపోయేవి ఉంటాయి. అంటే లక్షణాలకు తగిన చికిత్స ఇస్తే అవే తగ్గిపోతాయి. అంతే కానీ వైరస్‌పై యాంటీ బయాటిక్స్ అయితే పని చేయవు. అనవసరంగా యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల వాటి దుష్ప్రభావాలతో ఆకలి తగ్గి, నిద్ర పట్టక మరింత నీరసిస్తారు.
సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు తీవ్రమైన లక్షణాలతో ఉంటాయి, కానీ వారం లోపు తగ్గిపోతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తక్కువ తీవ్రతతో మొదలై క్రమేణా పెరుగుతూ, ఎక్కువ రోజులు ఉంటాయి. చలి జ్వరం అనేది మూత్రంలో ఇన్ఫెక్షన్, మలేరియా, నిమోనియా, ఎక్కడైనా చీము పట్టడం వల్ల వస్తుంది.
జ్వరం ఒక లక్షణం. దాన్ని తడి గుడ్డ పెట్టడం, నీళ్లు బాగా తాగడం, పారాసెట్‌మాల్ వేసుకోవడంతో నియంత్రించుకోవచ్చు.
ఆ లక్షణానికి కారణం ఏంటో తెలుసుకొని దానికి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
(రచయిత వైద్యురాలు. ఆరోగ్య సమస్యలపై స్థూలమైన అవగాహన కోసమే ఈ వ్యాసం. నిర్దిష్టమైన చికిత్స కోసం నేరుగా వైద్యులను సంప్రదించాలి.)
ఇవి కూడా చదవండి:
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














