అమెరికాలో క్వీన్ ఎలిజబెత్ 2ను చంపడానికి జరిగిన కుట్ర ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్లోయీ కిమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1983వ సంవత్సరం.
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై హత్యాయత్నం జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వచ్చాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఈ వారం విడుదల చేసిన కొన్ని పత్రాలు చెబుతున్నాయి.
క్వీన్ ఎలిజెబెత్ విదేశీ పర్యటనల సమయంలో భద్రతా విషయంలో ఎఫ్‌బీఐ సహాయం అందించేది.
క్వీన్‌కు ఐఆర్ఏ (ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ) నుంచి ఉన్న ముప్పు గురించి ఎఫ్‌బీఐ ఆందోళన చెందిన విషయం ఆ పత్రాలో వెల్లడైంది.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ పోలీసు అధికారికి క్వీన్‌కు ప్రాణాపాయం ఉందన్న సంకేతం అందింది.
ఎఫ్‌బీఐ విడుదల చేసిన పత్రాల ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఐరిష్ పబ్‌కు తరచుగా వెళ్లే ఒక పోలీసు అధికారి, అక్కడ తను కలుసుకున్న ఓ వ్యక్తి నుంచి వచ్చిన కాల్ గురించి ఫెడరల్ ఏజెంట్లను హెచ్చరించారు.
తన కూతురి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆ వ్యక్తి భావిస్తున్నట్టు ఆ పోలీసు అధికారి తెలిపారు. ఆయన కూతురు ఉత్తర ఐర్లాండ్‌లో రబ్బర్ బుల్లెట్ తగిలి చనిపోయారు.
1983 ఫిబ్రవరి 4న ఈ ప్రమాద హెచ్చరిక వచ్చింది. ఆ వచ్చే నెలలో క్వీన్ ఎలిజబెత్ 2, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కాలిఫోర్నియా సందర్శించనున్నారు.
"ఆ వ్యక్తి క్వీన్ ఎలిజబెత్ 2కు హాని కలిగించే ప్రయత్నంలో ఉన్నారు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్దకు రాయల్ యాచ్ బ్రిటానియా రాగానే పై నుంచి ఏదైనా వస్తువును వారి పైకి విసిరి లేదా క్వీన్ ఎలిజబెత్ యోస్మైట్ నేషనల్ పార్క్‌ను సందర్శించినప్పుడు ఆమెను చంపుదామని ప్లాన్ చేశారు" అని ఆ పత్రాల్లో బయటపడింది.
ఈ హెచ్చరిక రాగానే అమెరికా సీక్రెట్ సర్వీస్ అప్రమత్తమైంది. యాచ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జిని సమీపిస్తున్నప్పుడు నడక మార్గాలను మూసివేయాలని నిర్ణయించింది. య్యోస్మైట్‌లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో పత్రాల్లో స్పష్టంగా లేదు. అయితే, తరువాత రాణి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఎవరినీ అదుపులోకి తీసుకున్నట్టు ఎఫ్‌బీఐ ప్రకటించలేదు.
అమెరికా మీడియా సంస్థలు చేసిన సమాచార స్వేచ్ఛా చట్టం అభ్యర్థనను అనుసరించి 102 పేజీల పత్రాలను ఎఫ్‌బీఐ సమాచార వెబ్‌సైట్ వాల్ట్‌లో సోమవారం అప్లోడ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర ఐర్లాండ్‌లో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలోనే క్వీన్ ఎలిజబెత్ పలుమార్లు అమెరికా పర్యటనలు చేయాల్సి వచ్చింది.
1976లో క్వీన్ ఎలిజబెత్ న్యూయార్క్‌లో అమెరికా ద్విశతాబ్ది వేడుకలకు హాజరయ్యారు.
క్వీన్ దగ్గర బంధువు లార్డ్ మౌంట్ బాటన్ 1979లో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లోని కౌంటీ స్లిగో తీరంలో జరిగిన ఐఆర్ఏ బాంబు దాడిలో మరణించారు.
1989లో క్వీన్ ఎలిజబెత్ 2 కెంటకీ రాష్ట్రానికి వ్యక్తిగత పని మీద వెళ్లే ముందు తయారుచేసిన ఎఫ్‌బీఐ అంతర్గత పత్రాల్లో "బ్రిటిష్ రాచరికానికి ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ (ఐఆర్ఏ) నుంచి ముప్పు ఎప్పటికీ ఉంటుంది" అని రాసి ఉంది.
"బోస్టన్, న్యూయార్క్ ఐఆర్ఏ నుంచి క్వీన్ ఎలిజబెత్ 2కు పొంచి ఉన్న ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమాచారం అందిన వెంటనే కెంటకీలోని లూయిస్‌విల్లేకు సమాచారం అందించాలని" అందులో రాసి ఉంది.
క్వీన్ ఎలిజబెత్‌కు చాలా రేసుగుర్రాలు ఉండేవి. కెంటకీలో రేసుగుర్రాల పోటీలు ఎక్కువగా జరుగుతుండేవి. వాటిలో పాల్గొనడం కోసం ఆమె తరచూ అక్కడికి వెళ్లేవారు.
1991లో అమెరికా వెళ్లినప్పుడు, క్వీన్, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ హెచ్ బుష్‌తో కలిసి బాల్టిమోర్ ఓరియోల్స్ బేస్ బాల్ గేమ్ చూడ్డానికి ప్రణాళిక సిద్ధమైంది.
ఐరిష్ సమూహాలు స్టేడియం వద్ద నిరసనలు తెలిపేందుకు ప్లాన్ చేస్తున్నాయని ఎఫ్‌బీఐ, అమెరికా సీక్రెట్ సర్వీస్‌ను హెచ్చరించింది.
ఈ పత్రాలే కాక ఇంకా చాలా పత్రాలు ఉన్నాయని ఎఫ్‌బీఐ ఎన్‌బీసీ న్యూస్‌కు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కేరళ: ఏ తప్పూ చేయకున్నా 54 రోజులు జైలు... వ్యక్తి జీవితంతో ఆడుకున్న 'సీసీటీవీ ఫోటో'
- మహేంద్ర సింగ్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం ఏమిటి?
- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చుట్టూ వివాదాలు... నిలువునా చీలిన ప్రతిపక్షాలు
- జీ-20 సదస్సు: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేశాక శ్రీనగర్‌లో పరిస్థితులు ఎలా మారాయి?
- తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలోకి దళితులను రానివ్వరు.. ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోరు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














