అరగంటలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఫొటో సోర్స్, RIMS
- రచయిత, రవి ప్రకాష్
- హోదా, రాంచీ నుంచి బీబీసీ కోసం
మే 22న అంకితకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు.. ఇలా అరగంటలో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని పెద్దాసుపత్రి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఒక మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది.
దాదాపు ఏడేళ్ల తర్వాత తమకు పిల్లలు పుట్టడంతో తల్లి అంకిత కుమారి, తండ్రి ప్రకాష్ కుమార్ సావ్ సంతోషంలో ఉన్నారు. వారిలో ఈ ఆనందంతో పాటు కొంత ఆందోళన కూడా ఉంది.
తల్లి, పిల్లల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆమె మరికొన్ని వారాలు ఆస్పత్రిలోనే ఉండాలన్నారు.
అప్పుడే పుట్టిన శిశువులను రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.
మే 7న రిమ్స్‌లోని ప్రొఫెసర్, డాక్టర్ శశిబాల సింగ్ ప్రసూతి విభాగంలో అంకిత కుమారి చేరారు.
అంకిత గర్భంతో ఉండగా పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH
ఇది కొత్తేమీ కాదు
ఒకేసారి ఐదుగురు శిశువులు జన్మించడం రిమ్స్‌లో ఇదే తొలిసారి అని డాక్టర్ శశిబాల సింగ్ ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ బులుప్రియ చెప్పారు.
గతంలో ఒక మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చిందని, ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైందన్నారు.
''ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. అయితే, మరీ ఆశ్చర్యకరమైన ఘటనేమీ కాదు. ప్రపంచంలో, దేశంలో పలుచోట్ల ఇలాంటి ప్రసవాలు జరిగాయి. గర్భాశయంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంది'' అని డాక్టర్ బులుప్రియ బీబీసీకి చెప్పారు.
దీని వల్ల అంత ప్రమాదమేమీ లేదు కానీ, ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉన్నప్పుడు నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయని ఆమె తెలిపారు.
''అంకిత విషయంలోనూ అదే జరిగింది. ఆమెకు 7వ నెలలోనే కాన్పు చేయాల్సి వచ్చింది. పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు. ఆమె ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి. అందువల్ల ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
కృత్రిమ గర్భధారణ
కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా అంకిత గర్భం దాల్చిందని డాక్టర్ బులుప్రియ చెప్పారు. సహజంగా తల్లిదండ్రులు కాలేని వారికి కృత్రిమ గర్భధారణ ఒక అద్భుతమేనని ఆమె అన్నారు.
''ఏడేళ్లైనా అంకిత తల్లి కాలేకపోయింది. అందువల్ల ఆమె హజారీబాగ్‌లోని ఓ ఆస్పత్రిలో కృత్రిమ గర్భధారణ చేయించుకుంది. ఆమె చాలా నెలలు అక్కడి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది.
అక్కడ చేసిన పరీక్షల్లో ఆమె గర్భంలో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత రిమ్స్‌కు వెళ్లాలని ఆమెకు సూచించినట్లు తెలిసింది.'' అని డాక్టర్ బులుప్రియ చెప్పారు.
అంకిత 28 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు తమ దగ్గరకు వచ్చిందని, ఆమెకు సాధారణ ప్రసవం జరుగుతుందని భావించాం, కానీ ముందుగానే కాన్పు చేయాల్సి వచ్చిందని డాక్టర్ చెప్పారు.
సాధారణ ప్రసవం జరగడం మంచి విషయమని, ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాలేదన్నారు.
''మా సీనియర్ డాక్టర్ నీలమ్, ఆమె బృందం అంకితకు కాన్పు చేశారు. పుట్టిన బిడ్డల్లో ముగ్గురు బాగానే ఉన్నారు. మరో ఇద్దరికి చిన్న సమస్యలున్నాయి. అంకిత ఆరోగ్యం నిలకడగానే ఉంది.
ఆరోగ్యంగా ఉంటే కొన్ని వారాల్లోనే ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం. అయితే, శిశువులు మరికొద్ది వారాలు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.'' అని డాక్టర్ బులుప్రియ చెప్పారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH
'బెడ్లు లేవని చెప్పారు'
27 ఏళ్ల అంకితది జార్ఖండ్‌లోని చత్రా జిల్లా మల్కాపూర్ గ్రామం. ఇట్ఖోరీ తాలూకాలో ఉంటుందీ గ్రామం. ఆమె భర్త ప్రకాష్ సావ్ బండిపై పండ్లు అమ్ముతుంటారు.
అంతకుముందు ఆయన ఒక హోటల్‌లో పనిచేసేవారు. ఆ ఉద్యోగం పోవడంతో పండ్లు అమ్మడం మొదలుపెట్టారు. ఆయన అన్నదమ్ముల్లో ప్రకాషే పెద్దవారు.
''ఒకేసారి ఐదుగురు కూతుళ్లు పుడతారని అస్సలు అనుకోలేదు. పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం చాలా సంతోషం కలిగించింది. కానీ, ఈ పిల్లలను కాపాడడం గురించే ఆందోళన.
రిమ్స్‌లో ఎన్‌ఐసీయూ బెడ్లు లేకపోవడంతో ఇద్దరు పిల్లలను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. మిగిలిన ముగ్గురు పిల్లలు రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు'' అని ప్రకాష్ సావ్ బీబీసీకి చెప్పారు.
తన భార్యను ఆస్పత్రిలో చేర్చి 16 రోజులైందని, అయినా ఇప్పటికీ రిమ్స్‌లో పిల్లల కోసం బెడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రకాష్ ప్రశ్నిస్తున్నారు.
''ఐదుగురు పిల్లలు పుట్టారని అందరికీ తెలుసు. రిమ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో బెడ్లు ఖాళీగా లేవని హఠాత్తుగా చెప్పడంతో రాత్రికి రాత్రి ఇద్దరు పిల్లలను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. నేను పేదవాడిని. ప్రైవేటు ఆస్పత్రి బిల్లులు కట్టడం చాలా కష్టం'' అని వాపోయారు.

ఫొటో సోర్స్, RAVI PRAKASH
'అది వివక్ష చూపించడానికి కాదు'
ప్రకాష్ ఆరోపణలపై రిమ్స్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, చిన్నపిల్లల విభాగంలో ఎన్‌ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవని అక్కడి వైద్యులు చెప్పారు.
అందుకే ఇద్దరు పిల్లలను మాత్రమే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చాలని సూచించినట్లు చెబుతున్నారు.
''ఎన్‌ఐసీయూలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బెడ్లు ఉన్నాయి. అప్పుడే పుట్టిన పిల్లలతో ఆ బెడ్లు నిండిపోయాయి. వాళ్లు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నందున వారిని తిప్పి పంపలేం.
ముందస్తు ప్రసవం జరిగినప్పుడు వెంటిలేటర్, లేదా ఇంక్యుబేటర్‌ను రిజర్వ్ చేయడం ఎలా కుదురుతుంది'' అని సీనియర్ వైద్యులు ఒకరు బీబీసీకి చెప్పారు.
ఆయన పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు.
''ఆమె భర్త ప్రకాష్ సావ్ ఆరోపణలు సరికాదు. వాళ్ల పిల్లల ప్రాణాలు కాపాడేందుకే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. పిల్లలకు వైద్యం అందించేందుకే తమ ప్రాధాన్యం. అంతేకానీ వివక్ష చూపించేందుకు కాదు'' అని ఆయన అన్నారు.
పిల్లలకు మంగళవారం సాయంత్రం బర్త్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఆ తర్వాత వారిని ఆయుష్మాన్ కార్డులలో నమోదు చేశారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రిలో బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.
అయినప్పటికీ, వైద్యం కోసం, భోజన ఖర్చులు, మందులు కొనుగోలు చేసేందుకు అప్పు చేయాల్సి వచ్చిందని ప్రకాష్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, SALOUM ARBY
మొరాకో మహిళ గిన్నిస్ రికార్డ్
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఒకేసారి ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన రికార్డు మొరాకోకు చెందిన హలీమా సిస్సే పేరిట ఉంది.
2021 మేలో ఆమె ఒకేసారి 9 మంది పిల్లలకు జన్మనిచ్చారు. అందులో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు.
ఇవి కూడా చదవండి:
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- డ్రెస్‌కోడ్..వారానికోసారి ఇలా బట్టల్లేకుండా కాసేపు
- భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీసి, సగం కాలిన వారి శరీరాలను బ్రిటిషర్లు నదిలోకి ఎందుకు విసిరేశారు?
- సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి?
- అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








