ఒడిశా రైలు ప్రమాదం: ఆత్మీయుల ఆచూకీ దొరకక తల్లడిల్లుతున్న కుటుంబాలు

బాలాసోర్‌లోని బిజినెస్ పార్క్ వెలుపల ఒక మహిళ
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన బాలాసోర్‌ ఘటనలో మరణించిన వారి సంఖ్య 275కి చేరుకుంది. ఇప్పటివరకు 187 మంది మృతదేహాలను ఇంకా గుర్తించలేదు.

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే బాధిత కుటుంబాలు బాలాసోర్‌కు రావడం ప్రారంభించాయి.

మృతదేహాలను బాలాసోర్‌లోని ఒక పెద్ద బిజినెస్ పార్క్‌లో ఉంచారు.

బాలాసోర్ శివార్లలో ఉన్న ఎన్ఓసీసీఐ బిజినెస్ పార్క్‌లో పెద్ద పెద్ద కార్యాలయాలు, ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్, అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

సాధారణ రోజుల్లో కార్యాలయాల సిబ్బంది, ప్రతినిధులతో నిండి ఉండే ఈ సెంటర్ ఆదివారం బాధితుల కుటుంబాలతో నిండిపోయింది.

బాలాసోర్‌ ఘటన

శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన తరువాత నుంచి ఈ బిజినెస్ పార్కుకు 150కి పైగా మృతదేహాలను తరలించినట్టు ఒక అధికారి బీబీసీతో చెప్పారు.

ప్రమాదంలో తప్పిపోయినవారి గురించి కూడా ఈ కేంద్రంలో సమాచారం అందిస్తున్నారు.

మృతదేహాల మధ్య తమ ఆత్మీయుల కోసం వెతుకున్నవారి మనసులో బాధ వారి కళ్లల్లో కనిపిస్తోంది. తమవాళ్లు కనిపిస్తారన్న ఆశ ఒకవైపు, కనిపిస్తే వచ్చే దుఃఖం మరోవైపు.

ఒడిశా రైలు ప్రమాదం

పార్క్ మెట్లపై పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాకు చెందిన సీమా చౌదరి దిగులుగా కూర్చుని ఉన్నారు. ఆమె తన భర్త దీపాంకర్ మండల్ కోసం వెతుకుతున్నారు.

సీమ ఫోన్‌లో ఎవరితోనో బెంగాలీలో మాట్లాడుతూ ఏడుస్తున్నారు.

"ఆస్పత్రికి వెళ్లాను. అక్కడున్న మృతదేహాలలో వెతికాను. కానీ, ఆయన కనిపించలేదు" అంటూ అమె రోదిస్తున్నారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పలు ఆస్పత్రులకు కొన్ని మృతదేహాలను తరలించారు. అక్కడికి వెళ్లి చూస్తానని ఆమె చెప్పారు.

అదే ఊరికి చెందిన కంచన్ చౌదరి ఆమె పక్కనే ఉన్నారు. ఆమె కూడా సీమ భర్త కోసం గాలిస్తున్నారు. అన్ని ఆస్పత్రులకు వెళ్లి చూశారు.

"అన్నిచోట్లా వెతికాను. కానీ, ఎక్కడా కనిపించలేదు" అని కంచన్ చెప్పారు.

బాధిత కుటుంబాలకు తమ ఆత్మీయుల ఆచూకీ తెలియజేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. చాలా పెద్ద ప్రమాదం కావడంతో ఆచూకీ వెతకడం కష్టమైపోతోందని అంటున్నారు.

ప్రజలకు సహాయం చేసేందుకు అధికారులు, వాలంటీర్లు బిజినెస్ పార్క్ వెలుపల ఉన్నారు.

లోపల ఒక పెద్ద గ్లాస్ డోర్ దాటి వెళితే పెద్ద హాల్ కనిపిస్తుంది. దాన్ని రెండు భాగాలుగా విభజించారు.

ఒకవైపు, నల్లని పాలథీన్ షీట్ పరచి ఉంది. దానిపై మృతదేహాలను ఉంచారు. అవి కుళ్లిపోకుండా ఉండేందుకు ఐసుముక్కల మధ్య ఉంచారు. ఐసు కరుగుతూ ప్లాస్టిక్ షీట్ చుట్టూ నీరు చేరుతోంది.

ఒక పాడైపోయిన మొబైల్ ఫోన్, బట్టలు, పొగాకు పెట్టె, ఒక పర్స్ అక్కడ కనిపించాయి. బహుశా వాటి యజమాని చనిపోయి ఉండవచ్చు.

హాలుకు మరోవైపు, ఒక ప్రొజెక్టర్ స్క్రీన్‌పై మృతదేహాల చిత్రాలు ప్లే అవుతున్నాయి. చాలా మంది అవి చూస్తూ తమ ఆత్మీయులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బిజినెస్ పార్క్ నుంచి చుట్టుపక్కల ఆస్పత్రులకు తరలించినవారి ఫొటోలను పక్కనే ఒక టేబుల్‌పై ఉంచారు.

ఒడిశా రైలు ప్రమాదం

ఆ హాల్‌లో ఏసీ ఉందని, మృతదేహాలను ఉంచడానికి సరిపోయేంత స్థలం ఉందని బాలాసోర్ నివాసి ఒకరు బీబీసీకి చెప్పారు.

అయితే, మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

బాలాసోర్‌లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంత వేడిలో మృతదేహాలు పాడైపోకుండా చూసుకోవడం కష్టమవుతోందని అంటున్నారు.

చాలా దూరాల నుంచి కుటుంబాలు తమవారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. బాలాసోర్ చేరుకోవడానికి వారికి కొంత సమయం పడుతుంది.

"వాళ్లు వచ్చేవరకు మృతదేహాలను సంరక్షించడం సవాలుగా మరుతోంది" అని జిల్లా అధికారి నిర్లిప్తా మొహంతి బీబీసీతో చెప్పారు.

భువనేశ్వర్‌కు మృతదేహాలను పంపించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె తెలిపారు. అక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద ఆస్పత్రులు ఉంటాయి.

బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తున్నామని మొహంతి చెప్పారు. కానీ, అది సరిపోవట్లేదు.

సుమిత్ కుమార్ తన అత్త కొడుకు నీరజ్ గురించి ముందు రోజు సాయంత్రం నుంచి వెతుకుతున్నారు.

"చనిపోయిన వారి ఫొటోలలో నీరజ్ కనిపించాడు. కానీ, తన మృతదేహం దొరకలేదు" అని సుమిత్ చెప్పారు.

ప్రభుత్వం రైల్వే, బస్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని బిజినెస్ పార్క్ వద్ద వాలంటీర్‌గా సహాయం అందిస్తున్న ఉదయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

అక్కడ చాలా మంది మున్సిపల్ కార్మికులు, వాలంటీర్లుగా ఎడతెరిపి లేకుండా సహాయం అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత దిగ్భ్రాంతి కలిగిస్తోందని, చాలా అలిసిపోతున్నామని వారంతా చెబుతున్నారు.

"నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న రాత్రి 8 నుంచి పనిచేస్తున్నాను" అని సుబ్రతా ముఖి అనే మున్సిపల్ వర్కర్ చెప్పారు.

"ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తోంది. నావాళ్లను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో, అలాగే అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)