ఒడిశా రైలు ప్రమాదం: రైళ్లు పట్టాలు ఎందుకు తప్పుతాయి?

కోరమండల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి సమాధానాలు లేని అనేక ప్రశ్నలు ఉన్నాయి. మూడు రైళ్లు ఢీకొనేలా అసలు ఏం జరిగిందనేదానికి సమగ్ర దర్యాప్తుతో మాత్రమే సమాధానం దొరుకుతుంది.

శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, కొన్ని వందల మంది గాయపడ్డారు.

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ రైల్వేకు పేరు ఉంది. భారత రైల్వే ఏటా 2.5 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.

దేశవ్యాప్తంగా లక్ష కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాకులున్నాయి. నిరుడు 5,200 కి.మీ మేర కొత్త ట్రాకులను నిర్మించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఏటా 8,000 కి.మీ ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గంటకు 100 కి.మీ వేగంతో నడిచే రైళ్లకు అనుగుణంగా చాలా వరకు ట్రాకులను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఇటీవలే ఒక చర్చ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

గంటకు 130 కి.మీ వేగంతో నడిచే రైళ్ల కోసం, 160 కి.మీ వేగంతో వెళ్లే రైళ్ల కోసం గణనీయంగా ట్రాకులను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, Reuters

దేశవ్యాప్తంగా వేగంగా ప్రయాణించే రైళ్లను నడపాలనే ప్రభుత్వ ప్రణాళికల్లో ఇది కూడా ఒక భాగం. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి, అహ్మదాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ లైన్‌ను నిర్మిస్తున్నారు.

అయినప్పటికీ, రైళ్లు పట్టాలు తప్పడమనేది ప్రాణాంతకంగా మారుతూనే ఉందని రైల్వే బోర్డు మాజీ చైర్మన్ వివేక్ సహాయ్ అన్నారు.

రైలు పట్టాలు తప్పడానికి అనేక కారణాలు ఉంటాయని ఆయన చెప్పారు. ట్రాకుల నిర్వహణ సరిగా లేకపోయినా, కోచ్ లోపభూయిష్టంగా ఉన్నా, డ్రైవింగ్‌లో తప్పిదం జరిగినా రైలు పట్టాలు తప్పుతుందని ఆయన వివరించారు.

రైలు ప్రమాదాలకు 70 శాతం కారణం పట్టాలు తప్పడమే అని 2019-20 నాటి రైల్వే సేఫ్టీ రిపోర్టు పేర్కొంది. అంతకుముందు ఏడాది పట్టాలు తప్పడం వల్ల అయ్యే రైలు ప్రమాదాలు 68 శాతంగా ఉండగా 2019-20 నాటికి రెండు శాతం పెరిగింది. ఇక రైళ్లకు నిప్పు అంటుకోవడం వల్ల 14 శాతం, ఢీకొనడం వల్ల 8 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.

33 ప్యాసింజర్ రైళ్లు, 7 గూడ్సు రైళ్లు అంటే మొత్తం 40 రైళ్లు పట్టాలు తప్పినట్లు నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. ట్రాకులలో పగుళ్లు, నాసిరకం ట్రాకుల కారణంగా ఇందులో 17 రైళ్లు పట్టాలు తప్పినట్లు పేర్కొంది.

రైళ్లలో లోపాలు అంటే ఇంజిన్, కోచ్‌లు, వేగన్లలో సమస్యల కారణంగా కేవలం 9 రైళ్లు పట్టాలు తప్పినట్లు నివేదిక తెలిపింది.

లోహాలతో తయారైన రైల్వే ట్రాకులు వేసవిలో వ్యాకోచించి, శీతాకాలంలో సంకోచిస్తాయి. కాబట్టి వాటిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. వదులుగా మారే ట్రాకులను బిగించడం, స్లీపర్లను మార్చడం, స్విచ్‌లు, లూబ్రికేటర్లను నిరంతరం పరిశీలించాలి. ఇలాంటి తనిఖీలను కాలినడకన, ట్రాలీల్లో, లోకోమోటివ్ వాహనాల ద్వారా నిర్వహిస్తారు.

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

110 నుంచి 130 కి.మీ వేగంతో నడిచే రైళ్ల రాకపోకలు సాగే ట్రాకులను ప్రతీ మూడు నెలలకోసారి ట్రాక్ రికార్డింగ్ కార్లు తనిఖీ చేయాలని సిఫార్సులు ఉన్నాయి.

2017 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు రైలు పట్టాలు తప్పిన ఘటనలపై కేంద్ర ఆడిటర్లు ఇచ్చిన రిపోర్టులో కలవరపరిచే అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే,

  • ట్రాకుల సామర్థ్యాన్ని, స్థితిగతులను అంచనా వేయడానికి ట్రాక్ రికార్డింగ్ కార్ల ద్వారా చేసే తనిఖీల్లో 30-100 శాతం వరకు లోటుపాట్లు ఉన్నాయి.
  • రైలు పట్టాలు తప్పిన ప్రమాదాలకు సంబంధించిన 1,129 దర్యాప్తు నివేదికలను అధ్యయనం చేస్తే, ఈ ప్రమాదాలకు 24 అంశాలు కారణం అవుతున్నట్లు (కారకాలు) తేలింది.
  • రైలు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాకుల నిర్వహణ సరిగా లేకపోవడం. 171 కేసుల్లో దీనివల్లే ప్రమాదం జరిగింది.
  • మెకానికల్ కారణాల వల్ల 180 కేసుల్లో రైలు పట్టాలు తప్పాయి. ఇందులో మూడోవంతు కోచ్‌లు, వ్యాగన్లలో లోపాల కారణంగానే ప్రమాదాలు జరిగాయి.
  • రైలు పట్టాలు తప్పడానికి మరో ప్రధాన కారణం డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం, అధిక స్పీడుతో వెళ్లడం.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎందుకు పట్టాలు తప్పిందనేది దర్యాప్తులో మాత్రమే తేలుతుంది. రైళ్లు ఢీకొనకుండా నిరోధించే ‘‘యాంటీ కొలిషన్ డివైజెస్’’ పరికరాలను రైళ్లలో ఏర్పాటు చేయాలనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ వ్యవస్థ ప్రస్తుతానికి దిల్లీ-ముంబై, దిల్లీ-కోల్‌కతా వంటి ప్రధాన రూట్లలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, AFP

2010లో పశ్చిమబెంగాల్‌లో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి గూడ్సు రైలును ఢీకొట్టిన ప్రమాదంలో 150 మందికి పైగా చనిపోయారు. ఇందులో మావోయిస్టుల కుట్ర ఉన్నట్లు అప్పటి దర్యాప్తులో తేలింది. అయితే, శుక్రవారం నాటి ప్రమాదంలో మావోయిస్టులకు సంబంధించిన సూచనలు లేవు.

2021-22లో పట్టాలు తప్పడం, ఒకదానిని ఒకటి ఢీకొనడం, అగ్ని ప్రమాదం, పేలుళ్లు, క్రాసింగ్‌ల వద్ద వాహనాలు ఢీకొట్టడం వంటి కారణాలతో 34 రైలు ప్రమాదాలు సంభవించాయని రైల్వే శాఖ చెప్పింది.

అయితే, 2022-23 నాటికి ఈ ప్రమాదాల సంఖ్య 48కి పెరిగినట్లు ద హిందూ వార్తా పత్రిక మే 31న ఒక కథనంలో నివేదించింది.

పెరుగుతున్న ప్రమాదాల పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నివేదిక చెప్పింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వేలో సిబ్బంది సుదీర్ఘ పని గంటలను విశ్లేషించి తగు దిద్దుబాటు చర్యలు తక్షణమే తీసుకోవాలని కోరింది. శుక్రవారం నాటి ప్రమాదం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోనే జరిగింది.

వీడియో క్యాప్షన్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: ప్రత్యక్ష సాక్షి కథనం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)