కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూట్ : ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఆగుతుంది

రైలు ప్రయాణికురాలు

ఫొటో సోర్స్, Getty Images

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మందికి పైగా మరణించారు.

భారత్‌లో జరిగిన అత్యంత విషాదకర రైలు ప్రమాదాలలో ఇదొకటి.

పెద్ద సంఖ్యలో మృతులు, భారీ సంఖ్యలో క్షతగాత్రులు ఉండడంతో ఈ ప్రమాదం కారణంగా దేశమంతా విషాదం నెలకొంది.

తెలుగు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్తున్నారు.

అయితే, ఘోర ప్రమాదంలో చిక్కుకున్న ఈ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుంది? దీని వేగం ఎంత? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఆగుతుందో ఓసారి చూద్దాం..

Railway station

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడ నుంచి ఎక్కడకు

ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తుంది. వారంలో ఏడు రోజులూ ఈ రైలు సర్వీస్ ఉంటుంది.

షాలిమార్ స్టేషన్ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రైల్వే స్టేషన్లలో ఒకటి. అంటే ఇది కోల్‌కతా, చెన్నై నగరాల మధ్య తిరిగే రైలు.

పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రయాణిస్తుంది.

కోల్‌కతా నుంచి బయలుదేరే రైలు నంబర్ 12841, చెన్నై నుంచి బయలుదేరే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నంబర్ 12842గా వ్యవహరిస్తారు.

దేశంలో వేగంగా ప్రయాణించే రైళ్లలో కోరమండల్ కూడా ఒకటి. గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.

ఈ రైలు బయలుదేరే చోటు, గమ్యస్థానంతో కలిపితే ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో మూడు స్టేషన్లు, ఒడిశాలో 6, ఆంధ్రప్రదేశ్‌లో 5, తమిళనాడులో ఒక స్టేషన్‌లో ఆగుతుంది.

Railway station

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఆగుతుందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

విజయవాడ చెన్నైల మధ్య ఇది నాన్ స్టాప్ ట్రైన్. ఈ రెండు స్టేషన్ల మధ్య ఇంకెక్కడా ఇది ఆగదు.

విజయవాడ, చెన్నైల మధ్య సుమారు 430 కిలోమీటర్ల దూరాన్ని నాన్‌స్టాప్‌గా 6 గంటల 50 నిమిషాలలో ఇది చేరుకుంటుంది.

అయితే, ఈ రైలులో ఆహార సరఫరా అవసరాల నిమిత్తం ఒంగోలు స్టేషన్‌లో ఆపుతారు. కానీ, ఒంగోలు నుంచి రాకపోకలకు టికెట్ జారీ చేయరు. విజయవాడ, చెన్నై మధ్య దూరానికి టికెట్ తీసుకుని ఒంగోలులో దిగొచ్చు.

ఈ రైలు ప్రారంభించిన కొత్తలో షాలిమర్, చెన్నై మధ్య భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడలలో మాత్రమే ఆగేది.

అనంతర కాలంలో ప్రయాణికులు డిమాండ్ల మేరకు మరికొన్ని స్టేషన్లలో ఆగే సదుపాయం కల్పించారు. దీంతో ప్రయాణ సమయం పెరిగింది.

తెలుగు ప్రయాణికులు

వేగంగా చేరుకునే అవకాశం ఉండడం, ఆగే స్టేషన్ల సంఖ్య తక్కువ కావడం, శుభ్రత వంటి కారణాలతో చాలామంది ప్రయాణికులు ఈ రైలులో వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తారు.

విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలలో ఆగుతుండడంతో తెలుగు ప్రయాణికులు ఎక్కువగా ఇందులో రాకపోకలు సాగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)