ఎన్‌సీఆర్‌బీ డేటా: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?

ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని బాధపడుతున్న అమ్మాయి (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ గురించి చర్చించేటప్పుడు బీజేపీ రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న గుజరాత్ గురించి కూడా విమర్శకులు ప్రస్తావిస్తున్నారు.
    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'ది కేరళ స్టోరీ' సినిమా వచ్చాక, చాలా రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన మహిళల గురించి చర్చ జరుగుతోంది.

కేరళలో 32 వేల మంది మహిళలు మిస్సయ్యారనే కథాంశంతో ఈ సినిమా తీశారు. భారత యువతులను ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు బ్రెయిన్ వాష్ చేసి, విదేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఈ సినిమా చెబుతోంది. కేరళలో వాస్తవ పరిస్థితులను తెలియజేసేలా ఈ సినిమా ఉందని కొన్ని వర్గాలు వాదిస్తుండగా, ఈ చిత్రాన్ని సంఘ్ పరివార్ దుష్ప్రచారంగా మరికొన్ని వర్గాలు చూస్తున్నాయి.

అయితే ‘ది కేరళ స్టోరీ’ సినిమా కేంద్రంగా వస్తున్న రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన మహిళల అంశం చర్చలోకి వచ్చింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎంత మంది మహిళలు కనిపించకుండా పోయారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మిస్సింగ్‌కు కారణాలు ఏమిటి, కనిపించకుండాపోయిన మహిళల ఆచూకీని ఎంత మేర గుర్తించగలుగుతున్నారనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.

కేరళ గురించి చర్చించేటప్పుడు బీజేపీ రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న గుజరాత్ గురించి కూడా విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతోపాటు ఈ రెండు రాష్ట్రాల లెక్కలూ ఈ కథనంలో చూద్దాం.

ది కేరళ స్టోరీ

ఫొటో సోర్స్, SUNSHINE PICTURES/YOUTUBE

ఫొటో క్యాప్షన్, ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమా వచ్చాక, దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన మహిళల అంశం చర్చలోకి వచ్చింది.

ఏపీ, తెలంగాణల్లో ఎంత మంది మహిళలు 'మిస్సింగ్'?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేల మంది మహిళలు కనిపించకుండా పోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు చెబుతున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల్లో 2016-20 మధ్య కాలంలో మహిళల మిస్సింగ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి.

ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 29,943 మంది, తెలంగాణలో 48,753 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, 2021లో ఏపీలో 10,085 మంది, తెలంగాణలో 13,360 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

వీరిలో చాలా మంది ఆచూకీని గుర్తించగలిగినప్పటికీ, కనిపించకుండాపోయిన మహిళల నికర సంఖ్య వేలల్లో ఉంది.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చాలా మంది ఆచూకీని గుర్తించగలిగినప్పటికీ, కనిపించకుండాపోయిన మహిళల నికర సంఖ్య వేలల్లో ఉంది.

కేరళ, గుజరాత్‌లలో పరిస్థితేంటి?

ది కేరళ స్టోరీకి ఆధారంగా ఆ సినిమా బృందం చెబుతున్న కేరళలో 2016 నుంచి 2020 వరకు ఐదేళ్లలో 34,079 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

అదే సమయంలో గుజరాత్‌లో 41,621 మంది మహిళలు మిస్సయ్యారు.

2021 లెక్కల ప్రకారం, కేరళలో 6,183 మంది, గుజరాత్‌లో 9,812 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిస్సింగ్ కేసుల నమోదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండే అవకాశం లేదు.

అక్రమ రవాణాయే ప్రధాన కారణం

మహిళల మిస్సింగ్ కేసుల్లో మానవ అక్రమ రవాణా బారిన పడుతున్న వారే ఎక్కువ.

మానవ అక్రమ రవాణాలో శ్రమ, లైంగిక దోపిడీ ప్రధానంగా కనిపిస్తున్నాయి. విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడం, బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఈ మిస్సింగ్ కేసుల నమోదు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రాంతాల్లో తక్కువ కేసులు, మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాంటి ప్రాంతాలు, మానవ అక్రమ రవాణాకు ప్రారంభ స్థానంగా గానీ, లేదంటే గమ్యస్థానంగా గానీ ఉంటున్నాయి. అలాంటి చోట ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారంతో ప్రచురించే 'క్రైమ్ ఇన్ ఇండియా' నుంచి వివరాలు సేకరించి ఎన్సీఆర్బీ రిపోర్ట్ రూపొందిస్తోంది.

చాలా కేసుల్లో ఇలా కనిపించకుండా పోవడానికి కారణాలు తెలియవు. ఒకవేళ మిస్సింగ్ అయిన వ్యక్తి లేదా మహిళను గుర్తిస్తే విచారణలోనే అందుకు కారణాలపై స్పష్టత వస్తోంది.

దేశంలో ఏటా లక్షల మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2016లో 1,74,021 మంది; 2017లో 1,88,382 మంది, 2018లో 2,23,621 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

మహిళలు కనిపించకుండా పోయే కేసులు 2016-18 మధ్య మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా నమోదయ్యాయి.

మానసిక సమస్యలు, గృహహింస, నేరాల వల్ల బాధితులుగా మారిన మహిళలు, తప్పుడు సమాచారం వంటివి మిస్సింగ్‌ కేసుల్లో ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఎన్సీఆర్బీ తన నివేదికలో తెలిపింది.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మిస్సింగ్ కేసులను కేటగిరీలుగా వర్గీకరించాలా?

మహిళల ట్రాఫికింగ్, సోషల్ మీడియా పరిచయాలు, ఆన్‌లైన్ ప్రేమ వ్యవహారాలు, బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వారు, ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని యువతులు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటనలు కూడా మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్నాయి.

‘పరువు’ పోతుందని చెబుతూ ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయిలను తిరిగి తీసుకొచ్చేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు.

మహిళల ట్రాఫికింగ్ విధానం కూడా మారిందని, ఆన్‌లైన్ ట్రాఫికింగ్ జరుగుతోందని విశాఖకు చెందిన మహిళా యాక్టివిస్ట్ కత్తి పద్మ తెలిపారు.

''ట్రాఫికింగ్ ముఠాలు ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమపేరుతో బయటి ప్రాంతాలకు రప్పించి మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. వ్యభిచార గృహాలకు అమ్మేయడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నాయి. అసలు మహిళలు ఏమవుతున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉంటున్నాయి.

ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి లభించే అవకాశం తక్కువగా ఉంటోంది. పెళ్లైన మహిళలు కనిపించకుండా పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. భర్తతో విభేదాలు, గృహ హింస, వివాహేతర సంబంధాలు కూడా మిస్సింగ్ కేసులకు కారణమవుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ఏర్పడిన పరిచయాలు కూడా ఇందుకు కారణమే'' అని బీబీసీతో కత్తి పద్మ అన్నారు.

మహిళల మిస్సింగ్ కేసులను కేటగిరీలుగా విభజించాల్సిన అవసరముందని, అన్నింటినీ ఒకేలా చూడడం సరికాదని, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముస్లిం మహిళల యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా సార్వత్ అన్నారు. మిస్సింగ్ కేసుల వివరాలను విభాగాల వారీగా ఎన్సీఆర్బీ సేకరించాలని కోరారు.

‘‘మహిళలను అక్రమంగా తరలించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. మరికొందరు మహిళలు తమ ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతల కోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ వారిని బానిసలుగా మార్చేస్తున్నారు. కుటుంబంతో, భర్త, పిల్లలతో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండడం లేదు.

ట్రాఫికింగ్ ముఠాలు మహిళల అక్రమ రవాణా చేస్తున్న విషయాలు అందరికీ తెలుసు. వ్యభిచారంలోకి దించుతున్న విషయాలు కూడా తెలుసు. కానీ ఎలాంటి చర్యలూ ఉండవు. మిస్సింగ్ కేసులను పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేస్తుంటారు. వాటి గురించి పట్టించుకునే వారు ఉండరు’’ అని బీబీసీతో లుబ్నా అన్నారు.

ద కేరళ స్టోరీ

ఫొటో సోర్స్, THE KERALA STORY

కాస్త మెరుగైన స్థితిలో ఏపీ, తెలంగాణ

ఆచూకీ కనిపించకుండా పోయిన మహిళల కేసుల ఛేదనలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాస్త మెరుగ్గానే ఉన్నాయి.

2016కి ముందు వరకూ పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఆచూకీ లభించని మహిళల సంఖ్య (అన్‌ట్రేస్‌డ్) ఏపీలో 2,506గా ఉంది. 2016లో మరో 4,454 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు.

అయితే, అదే ఏడాది 3,970 మంది మహిళల ఆచూకీ గుర్తించినట్లు నివేదికలో ఎన్సీఆర్బీ చెప్పింది.

2016కి ముందు వరకూ ఆచూకీ లభించని మహిళల సంఖ్య తెలంగాణలో 2,323గా ఉండగా, ఆ ఏడాది మరో 9,238 మంది మహిళలు కనిపించకుండా పోయారు.

వారిలో 8,463 మంది మహిళలను గుర్తించారు.

ఆ ఏడాది రికవరీ పర్సంటేజీ ఏపీలో 57గా నమోదు కాగా, తెలంగాణలో 73.2గా నమోదైంది.

ఆంధ్రప్రదేశ్‌లో మిస్సింగ్ మహిళలు, ఆచూకీ లభించిన మహిళల లెక్కలు:

మహిళల మిస్సింగ్
ఫొటో క్యాప్షన్, ఆధారం : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక

తెలంగాణలో మిస్సింగ్ మహిళలు, ఆచూకీ లభించిన మహిళల గణాంకాలు:

మిస్సింగ్ మహిళలు
ఫొటో క్యాప్షన్, ఆధారం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక

కేరళలో మిస్సింగ్ మహిళలు, ఆచూకీ లభించిన మహిళల లెక్కలు:

మిస్సింగ్ మహిళలు
ఫొటో క్యాప్షన్, ఆధారం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక

గుజరాత్‌లో మిస్సింగ్ మహిళలు, ఆచూకీ లభించిన మహిళల లెక్కలు:

మిస్సింగ్ మహిళలు
ఫొటో క్యాప్షన్, ఆధారం: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక
మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

రికవరీ లెక్కలు చెబుతున్నదేమిటి?

2016 నుంచి 2021 వరకు ఆరేళ్లలో మిస్సింగ్ మహిళల రికవరీ పర్సంటేజీ ఆంధ్రప్రదేశ్‌లో సగటున 74.53గా, తెలంగాణలో 79.6గా ఉంది.

అదే కాలంలో రికవరీ పర్సంటేజీ సగటున కేరళలో అత్యధికంగా 93.21గా ఉంది. గుజరాత్‌లో ఇది 64.98గా ఉంది.

మహిళల మిస్సింగ్ కేసులు, అందుకు ప్రధాన కారణాలు, రికవరీ పర్సంటేజీపై తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల స్పందన తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ, సీఐడీ చీఫ్ సంజయ్‌, తెలంగాణ సీఐడీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)