‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడు అభిరామ్ నటన ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Youtube/ Anandi Art Creations
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
హింస, అహింస మార్గాలలో ఏది మంచిది ? నేటి సమాజానికి ఏది అవసరం ? ఇందులో ఏ వాదమైనా సమాజానికి సంపూర్ణంగా అర్థమైందా? అనే కోణాన్ని ఆవిష్కరించేందుకు దర్శకుడు తేజ రాసుకున్న కథే ''అహింస''.
దర్శకుడు తేజ చిన్న సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. సుమారు ముప్పై లక్షల రూపాయలతో 'చిత్రం' తీసి అప్పట్లో కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టారు. కొత్తవారిని పరిచయం చేయడంలో కూడా ఆయనది ప్రత్యేకమైన శైలి. ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి నటులకు తొలి ప్రయత్నంలోనే బ్రేక్ ఇచ్చి వాళ్లను స్టార్స్‌ను చేశారు.
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మనవడు, సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' తెరకెక్కించారు.
ఒక ప్రముఖ సినీ కుటుంబం నుంచి ఓ నటుడు వస్తున్నాడంటే అందరి దృష్టి ఆ సినిమాపై ఉంటుంది. అందులో తేజ దర్శకుడు కావడంతో ‘అహింస’పై ఆసక్తి ఏర్పడింది.
మరి తేజ తన మ్యాజిక్ రిపీట్ చేశారా? కొత్త నటుడు అభిరామ్ ఎలా కనిపించారు? ఆయనకు విజయం దక్కిందా?
కథేంటి?
బుద్ధుడు అహింసా మార్గాన్ని ప్రబోధించాడు. దానికి అందరూ ప్రభావితం కావడం వల్లే చరిత్రలో భారతదేశంపై విదేశీ దాడులు ఎక్కువగా జరిగాయనే వాదన నేపథ్యంలోనే ఈ సినిమా తీస్తున్నట్లు తేజ చెప్పారు.
అహింస మార్గం ఉత్తమమని భావించిన రఘు (అభిరామ్), భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ధర్మాన్ని కాపాడేందుకు హింసా మార్గాన్ని ఎంచుకోవడం న్యాయమేనన్న ఆలోచన వైపు ఎలా వచ్చాడనేది ఈ చిత్రం కథ.
సిద్ధాంతాలు, వాదాలు, తత్వాల నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే, ఏ వాదమైనా అంతిమంగా ప్రేక్షకులని మెప్పించాలి. ఆలోచింపజేయాలి. వినోదాన్ని పంచాలి. అప్పుడే సినిమా నిలబడుతుంది.
ఈ విషయంలో మాత్రం అహింస వెనుకబడిపోయింది. దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్‌పై స్పష్టత కరువైందనిపిస్తుంది. ఒక వాదాన్ని కథాంశంగా తీసుకుని, దాన్ని సమర్థవంతంగా చెప్పడంలో దర్శకుడే తడబడిపోయాడు.

ఫొటో సోర్స్, Youtube/Anandi Art Creations
బావామరదళ్ల ప్రేమ
ప్రేమ కథలను డీల్ చేయడంలో దిట్ట తేజ. చిత్రం, నువ్వు నేను, జయం, ఇలా ఎన్నో గుర్తుండిపోయే ప్రేమకథలతో అలరించిన దర్శకుడాయన. అహింసలో కూడా ఒక ప్రేమకథ ఉంది.
రఘు, అహల్య (గీతిక) బావామరదళ్లు. బావ అంటే అహల్యకు ఇష్టం. చీమకు కూడా అపకారం తలపెట్టని అహింసావాది రఘు. సినిమా మొదట్లో రఘు క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఆ తర్వాత ప్రేమకథలోకి వచ్చాడు.
నిజానికి ఈ చిత్రంలో ప్రేమ కథ చాలా కీలకం. తర్వాత జరిగిన కథంతా ఈ ప్రేమపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను ఇంకా బలంగా తీర్చిదిద్ది, ఆ ప్రేమను ప్రేక్షకులు కూడా ఫీలయ్యేట్లు చేసుంటే.. ఆ పాత్రల ప్రయాణం మరోలా ఉండేది.
కానీ అది జరగలేదు. హఠాత్తుగా లైంగిక దాడి ఘటనను తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు.. కథను అటు తిప్పి, ఇటు తిప్పి చివరికి కోర్టు రూమ్ డ్రామాగా మార్చేశాడు.
కోర్టురూమ్ డ్రామాలో కొత్తదనం ఉందా?
ఫస్టాఫ్‌లో అహింస కథ ఊహించని విధంగా కోర్టు రూమ్ డ్రామాగా మారిపోతుంది.
అయితేే ఈ డ్రామాలో కొత్తదనం లోపించింది. సమాజంలో పలుకుబడి ఉన్న ఓ పెద్దమనిషి కొడుకులు అత్యాచారం చేయడం, సాక్షులను కొనేయడం, బాధితుల వైపు వాదించే వారిని అంతం చేయడం.. ఇదంతా అరిగిపోయిన ఫార్ములా.
తేజ మళ్లీ అవే సీన్లు వాడుకున్నారు. పైగా ఆ సన్నివేశాలన్నీ చాలా సాగదీతగా అనిపిస్తాయి.
సెకండాఫ్‌లో అహింస కథ ఆసక్తిగానే మొదలవుతుంది. అహల్యను రఘు హాస్పిటల్ నుంచి తీసుకెళ్లే సన్నివేశం తేజ మార్కును గుర్తు చేస్తుంది. అంతకుముందు రఘు ఊపిరి ఊదే సీన్ కూడా బావుంటుంది.
హాస్పిటల్ నుంచి అహల్యను అడవిలోకి తీసుకెళ్లిన రఘులో ధైర్యం వస్తుంది. హీరో పాత్రలో మార్పు వచ్చినా కథ మాత్రం అక్కడక్కడే తిరుగుతుంటుంది.
పైగా హీరోకు అప్పటివరకూ ఉన్న కష్టాలు సరిపోవన్నట్లు అడవిలో ఆయుధాల వ్యాపారం చేసుకునే లుండి గ్యాంగ్ పేరుతో మరో ట్రాక్ యాడ్ అవుతుంది.
ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి హీరో గన్ అడగడం, ఆ గ్యాంగ్ నాయకుడు ప్రవర్తించే తీరు ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడుతుంది. ఆ ట్రాక్ తీసిన విధానం చూస్తే ఇదంతా అవసరమా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Youtube/ Anandi Art Creations
అది తేజ మార్క్ కాదే!
అహింస కథను ఉత్కంఠ కలిగించే కోణంలో మొదలుపెడతాడు దర్శకుడు.
ప్రతినాయకుడు ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) రఘును వెతుక్కుంటూ అడవుల్లోకి వెళతాడు. ఐదేళ్లు గడిచినా తిరిగిరాడు.
రఘుని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక పోలీస్ అధికారిని నియమిస్తారు. అతని ద్వారా రఘు కథ ప్రేక్షకులకు తెలుస్తుంటుంది.
రఘు ఏమయ్యాడు? దుష్యంత రావు ఎక్కడికి వెళ్లాడు? అనే ఉత్కంఠ క్రియేట్ చేయడం దర్శకుడి ఆలోచన కావచ్చు. కానీ, ఈ వ్యవహారం అంత ఉత్కంఠభరితంగా అనిపించదు.
రఘు తల పట్టుకొస్తే పాతిక ఎకరాల భూమి ఇస్తానని దుష్యంత రావు ఆఫర్ ఇవ్వడం, గ్రామస్థులు అడవి బాట పట్టడం, అంతకుముందు కొడుకుల శవాల్ని ఇంట్లో పెట్టుకొని దుష్యంత రావు ఐటెం సాంగ్.. ఇవన్నీ చూస్తే తేజకు ఏమైంది, ఇది తేజ మార్క్ కాదే అనిపిస్తుంది.
పాత నమూనా
క్యారెక్టర్స్ విషయంలో తేజకు ఒక మార్కు ఉంది. జయం, నువ్వు నేను నాటి పాత్రలను ఆయన మళ్లీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు.
హీరోని అమాయకుడిగా, హీరోయిన్‌ని కాస్త గడుసుగా డిజైన్ చేయడం, మితిమీరిన కష్టాలు కలిగించడం వంటివన్నీ తేజ మార్క్.
అయితే, జయం నాటి పరిస్థితులు వేరు. ఇప్పటికి యువత ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. అహింసలో రఘు పాత్రను చూస్తున్నపుడు ఈ రోజుల్లో మరీ ఇంత అమాయక చక్రవర్తులు ఉంటారా అనిపిస్తుంది.
ఈ కాలానికి తగట్టు ఇంకాస్త ఆ పాత్రను బెటర్ చేయాల్సింది.

ఫొటో సోర్స్, Twitter/Anandi Art Creations
అభిరాం నటన మెరుగవ్వాలి
అభిరామ్‌కు ఇది మొదటి సినిమా. చూడటానికి బావున్నారు. ఓ మామూలు కుర్రాడిలా సరిపోయారు. కానీ నటన చాలా మెరుగవ్వాలి. చాలా చోట్ల బిగుసుకుపోయినట్లు కనిపించారు. పాత్రలో లీనమవ్వడం నేర్చుకోవాలి.
యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడ్డాడు. ఇందులో పరిగెత్తే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ సహజంగా తీశారు తేజ.
గీతికకు కూడా ఇది తొలి సినిమా. అందంగా ఉంది. తనది బలమైన పాత్రే. ఆ పాత్ర కారణంగానే హీరోలో మార్పు వస్తుంది.
లాయర్‌గా చేసిన సదాది మరో కీలకమైన పాత్ర. ఐతే అది కథ సగంలో ఆగిపోతుంది. రజిత్ బేడీ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. తన లుక్స్‌లో విలనిజం ఉంది.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకునే పాత్ర ఒకటుంది. చటర్జీ పాత్రలో కనిపించిన మనోజ్ టైగర్. ఇందులో ఆయనే విలన్ అనుకోవాలి. చెప్పుకోవడానికి లా ఫార్మ్ నడుపుతుంటాడు కానీ, సుపారీ తీసుకుని వచ్చిన రౌడీలా ప్రవర్తిస్తుంటాడు. సీరియస్ సన్నివేశాల్లో కూడా కొంచెం నవ్వు తెప్పించే బాడీ లాంజ్వేజ్ తనది.
రవి కాలే నటన ఓకే.
చాలా మంది కొత్త నటీనటులు కనిపించారు. వారి పాత్రలు పరిధి మేర ఉన్నాయి.
సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఫర్వాలేదనిపించినా, నీతోనే పాట మాత్రం వినడానికి, చూడడానికి కూడా బావుంది.
అనూప్ నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. సినిమాలో చాలా కొత్త లొకేషన్స్ కనిపిస్తాయి.
అయితే, ఈ కథకు అనుగుణంగా జాగ్రఫీ కుదరలేదు. ఈ కథ ఎక్కడ జరుగుతోందో, ఆ ప్రాంతం, అక్కడి జనాలను కథలోకి అంత సహజంగా తీసుకురాలేదు.
కెమరా పనితనం బావుంది. గుర్తుపెట్టుకునే మాటలైతే లేవు.
విప్లవాత్మక ప్రేమకథలను తీర్చిదిద్దడంలో పేరు తెచ్చుకున్న తేజ.. ఈ సినిమాతో జయం, నువ్వు నేను లాంటి మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయాలనుకున్నారు. దానికి కృష్ణతత్వం అనే ఫిలాసఫీని జోడించారు.
అయితే, ఆ రెండింటిలో ఏదీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పేరుకు అహింసే కానీ, అడుగడుగునా హింసను చూపించే చిత్రమిది.
ఇవి కూడా చదవండి:
- ‘అందరూ నా వక్షోజాలే చూస్తుంటే ఇబ్బందిగా ఉండేది.. ఆపరేషన్ చేయించుకుని తగ్గించుకోవాల్సి వచ్చింది’
- ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
- తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది, మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు















