జపాన్‌: ఇక్కడ రేప్ చేసి సులభంగా తప్పించుకుంటున్నారు, అందుకే ఈ మాటకు నిర్వచనం మారుస్తున్నారా?

మెగుమి ఒకానో

ఫొటో సోర్స్, BBC NEWS / TESSA WONG

ఫొటో క్యాప్షన్, మెగుమి ఒకానో
    • రచయిత, టెస్సా వాంగ్, సకికో షిరైషి
    • హోదా, బీబీసీ కోసం

హెచ్చరిక: ఈ కథనంలో మనసును కలచివేసే విషయాలు ఉండవచ్చు.

మెగుమి ఒకానో అత్యాచారానికి గురయ్యారు. తనను రేప్ చేసిన వ్యక్తి చట్టం నుంచి తప్పించుకోగలడని ఆమెకు తెలుసు. ఎందుకంటే, జరిగింది రేప్ కాదని జపాన్ ప్రభుత్వం కొట్టిపారేయవచ్చు.

అందుకే అతను ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలిసినా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

"అతను హాయిగా, కులాసాగా తిరుగుతున్నాడు. అది చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది" అన్నారు మెగుమి.

అయితే, ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జపాన్ పార్లమెంట్‌లో దేశంలోని లైంగిక వేధింపుల చట్టాలను సంస్కరించే బిల్లుపై చర్చ జరుగుతోంది. ఒక శతాబ్దం కాలంలో ఇది కేవలం రెండవ సంస్కరణ.

ఈ బిల్లులో చాలా అంశాలు ఉన్నాయిగానీ, అతిముఖ్యమైనది రేప్‌కి నిర్వచనం.

రేప్ అంటే "బలవంతంగా లైంగిక దాడి" చేయడం కాకుండా, "సమ్మతి లేని లైంగిక సంపర్కం" అని పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.

సెక్స్‌కు సమ్మతి అవసరం అనే పాయింట్‌ను చట్టపరిధిలోకి తీసుకురావడమే దీని ఉద్దేశం. జపాన్ సమాజంలో దీనిపై అంతగా అవగాహన లేదు. సమ్మతి ఉండాలన్న పట్టింపు లేదు.

ప్రస్తుత జపాన్ చట్టాల ప్రకారం రేప్ అంటే "ప్రతిఘటించలేని స్థితిలో లేదా స్పృహలో లేని వ్యక్తిపై బలవంతంగా లైంగిక దాడి" చేయడం.

ప్రపంచంలో చాలా దేశాల్లో రేప్ నిర్వచనం ఇప్పటికే మారింది. సెక్స్‌కు సమ్మతి ఉండాలని చాలా దేశాల చట్టాలు చెబుతున్నాయి. 'నో' అంటే 'నో' అనే అర్థం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. వాటితో పోలిస్తే జపాన్ ఇంకా వెనుకబడి ఉన్నట్టే.

జపాన్

ఫొటో సోర్స్, Getty Images

బలవంతంగా సెక్స్ చేయడం చట్టపరిధిలో నేరం కాదా?

జపాన్‌లో రేప్‌కు ఉన్న సంకుచిత నిర్వచనాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు మరింత సంకుచితంగా మార్చి, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలను కుంచించుకుపోయేలా చేశారని, బాధితులు ఫిర్యాదు చేయడానికే వెనుకాడే పరిస్థితి కల్పించారని యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు.

2014లో టోక్యోలో ఒక పురుషుడు 15 ఏళ్ల అమ్మాయిని గోడకు అణచిపెట్టి, ఆమె ప్రతిఘటిస్తున్నా ఆమెతో సెక్స్ చేశాడు. అతడికి కోర్టులో శిక్ష పడలేదు. అతడి చర్యలు "అడ్డుకోలేనంత కష్టమైనవి కాదని”, అందుకే అది రేప్ కాదని కోర్టు తీర్పు చెప్పింది.

జపాన్‌లో సమ్మతి వయసు 13 ఏళ్లు. కాబట్టి 15 ఏళ్ల పిల్ల బాలిక కాదు. ఆమెను యువతిగా కోర్టు పరిగణించింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలతో పోల్చుకుంటే ఈ వయసు చాలా తక్కువ.

"విచారణ ప్రక్రియలు, తీర్పులు మారిపోతూ ఉంటాయి. కొందరు సమ్మతికి విరుద్ధంగా ప్రవర్తించారని తేలినప్పటికీ దాడి లేదా బెదిరింపుల కిందకు రాకపోవడం వల్ల చట్టం నుంచి తప్పించుకుంటారు" అని 'స్ప్రింగ్' సంస్థ ప్రతినిధి యూ తడోకోరో చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన వాళ్లకు రక్షణ, చేయూత అందించే సంస్థ ఇది.

అందుకే మెగుమి కూడా తనపై లైంగిక దాడి జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

మెగుమి, ఆ వ్యక్తి కలిసి టీవీ చూస్తుండగా, అతను శృంగరానికి పూనుకున్నాడు. మెగుమి వద్దని వారించినా, అతను వినకుండా ముందుకువెళ్లాడు.

తరువాత దాడికి పూనుకున్నాడు. ఇద్దరూ కాసేపు పెనుగులాడారు. తరువాత మెగుమి నిస్సహాయులైపోయారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నా, ఇది ప్రస్తుత చట్టం పరిధిలోకి రానందువల్ల ఆ వ్యక్తి తప్పించుకోగలడని యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు.

మెగుమి యూనివర్సిటీలో లా చదువుకుంటున్న విద్యార్థి. జపాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్లను, కేసు పూర్వాపరాలను పరిశీలించి, ఆమెపై జరిగిన దాడి చట్ట పరిధిలోకి రాదని నిర్ణయించుకున్నారు.

అంతకుముందు కూడా ఇలాంటి కేసుల్లో బాధితులపైనే నింద మోపారని , పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం కనికరం లేకుండా అడిగిన ప్రశ్నలు "మరోసారి రేప్‌కు గురైన" భావన కలిగిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

"న్యాయం జరుగుతుందన్న ఆశతో నేను ఆ ప్రక్రియలన్నీ ఎదుర్కోదలుచుకోలేదు. అందుకే పోలీసుల దగ్గరకు వెళ్లలేదు. నా ఫిర్యాదు అంగీకరిస్తారన్న నమ్మకం కూడా కలగలేదు" అన్నారు మెగుమి.

బదులుగా యూనివర్సిటీలో వేధింపుల నుంచి రక్షణ కల్పించే కౌన్సెలింగ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వాళ్లు దర్యాప్తు చేసి దాడి చేసిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధరించారు.

యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, గోప్యత కారణంగా ఈ కేసుపై మాట్లాడడానికి ఆ కేంద్రం నిరాకరించింది.

అయితే, కౌన్సెలింగ్ కేంద్రం విచారణ పూర్తిచేసే సమయానికి దాడి చేసిన వ్యక్తి చదువు పూర్తయిపోయింది. దానివల్ల అతడికి ఎక్కువ శిక్ష వేయలేకపోయారు. హెచ్చరించి వదిలిపెట్టారని మెగుమి చెప్పారు.

"ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడేలా చేయలేకపోయాను" అని ఆమె బాధపడ్డారు.

షియోరి ఇటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షియోరి ఇటో 2019లో తనపై జరిగిన రేప్ కేసులో పోరాడి గెలిచారు

తండ్రి కూతురిపై అత్యాచారం చేసినా సందేహించిన కోర్టు.. వెల్లువెత్తిన ప్రజాగ్రహం

మెగుమి మాత్రమే కాదు, జపాన్‌లో చాలామందికి ఇవే అనుభవాలు ఎదురయ్యాయి. లైంగిక దాడి కేసుల్లో మూడింట ఒక వంతు మాత్రమే రేప్‌గా నిరూపణ అవుతాయి. మిగతా లైంగిక దాడులు చట్టం నుంచి తప్పించుకోగలవు.

అయితే, క్రమంగా ప్రజల నుంచి మార్పు కోసం డిమాండ్ ప్రారంభమైంది.

2019లో నాలుగు లైంగిక వేధింపుల కేసులలో దాడికి పాల్పడిన వ్యక్తులు నిర్దోషులుగా విడుదల కావడంతో ప్రజాగ్రహం వ్యక్తమైంది.

ఫుకుయోకాలో జరిగిన ఒక కేసులో, మద్యం మత్తులో ఉన్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పూనుకున్నారు. ఆమె మొదటిసారి రెస్టారెంట్‌లో మద్యం తీసుకున్నట్టు కోర్టులో చెప్పారు.

నివేదికల ప్రకారం, "ఆ స్థలంలో లైంగిక కార్యకలాపాలు ఆమోదయోగ్యం కావడం వల్ల పురుషులు ఆ పని చేయవచ్చని భావించినట్టు" నిందితుడు కోర్టుకు చెప్పాడు. అక్కడున్న వారెవరూ అతడిని ఆపలేదని కూడా చెప్పారు. అలాగే, సెక్స్ జరుగుతున్న సమయంలో ఆమె ఒకసారి కళ్లు తెరిచి చూశారని, "ఏదో గొణిగారని" అందుకే ఆమె సమ్మతి ఉన్నట్టు భావించానని చెప్పారు.

నగోయోలోని మరో కేసులో, ఒక తండ్రి తన టీనేజీ కూతురిపై ఏళ్ల తరబడి అత్యాచారం జరిపాడు. అయితే, తనకు నచ్చని స్కూల్లో చేర్పించారన్న కోపంతో ఆ అమ్మాయి తిరగబడడంతో తండ్రి అలా ప్రవర్తించాడని కోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఆ అమ్మాయి తన తండ్రి చర్యలను ప్రతిఘటించలేని మానసిక స్థితిలోకి వెళ్లిపోయారని సైకియాట్రిస్ట్ చెప్పినప్పటికీ, కోర్టు సందేహించింది.

ఈ కేసుల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో, మళ్లీ విచారణ జరిపి దాడికి పాల్పడిన వ్యక్తులను దోషులుగా కోర్టు నిర్థరించింది.

లైంగిక వేధింపుల బాధితులకు సంఘీభావం తెలిపేందుకు 'ఫ్లవర్ డెమో ' అనే ప్రచారాన్ని హక్కుల కార్యకర్తలు జాతీయ స్థాయిలో ప్రారంభించారు.

మీటూ ఉద్యమం, జర్నలిస్ట్ షియోరి ఇటో కేసులో విజయం జపాన్‌లో జాతీయ స్థాయిలో చర్చలకు, చట్టపరమైన సంస్కరణలకు ఊతమిచ్చాయని హక్కుల కార్యకర్తలు చెప్పారు.

2019లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు.

ఫొటో సోర్స్, NURPHOTO

ఫొటో క్యాప్షన్, 2019లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు

కొత్త చట్టంలో ఏముంది?

రేప్‌ను పునర్నిర్వచించే కొత్త చట్టంలో బాధితులు "అసమ్మతిని వ్యక్తపరచడానికి కష్టపడే" ఎనిమిది సందర్భాలను స్పష్టపరిచారు.

మద్యం లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్నప్పుడు, హింస, బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు, భయపడడం లేదా అచేతనంగా మారిపోయి ప్రతిఘటించలేనప్పుడు, ఎదుటి వ్యక్తి తన "అధికారాన్ని" ఉపయోగించినప్పుడు, అంటే ఎదురుతిరిగితే నష్టం కలుగుతుందని బాధితులు భావించి మౌనంగా ఉన్న స్థితి.. ఇలా ఎనిమిది సందర్భాలను ప్రస్తావించారు.

అలాగే సమ్మతి వయసును 16 ఏళ్లకు పెంచనున్నారు.

అయితే, ఈ సందర్భాలను ఇంకొంచం స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని, వాటిలో కొంత గందరగోళం ఉందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. మైనర్లకు మరింత రక్షణ కల్పించే దిశగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

ఏది ఏమైనా, ఈ చట్ట సంస్కరణలు రూపు దాల్చితే బాధితులకు, మార్పు కోరుకుంటున్నవారికి అది అపూర్వమైన విజయం అవుతుంది.

"దీని వల్ల సమ్మతి అంటే ఏంటి, సమ్మతి తెలుపలేదంటే అర్థమేమిటి అనే అంశాలపై ప్రజల్లో కూడా చర్చ ప్రారంభమవుతుంది. అవగాహన పెరుగుతుంది" అని టోక్యోకు చెందిన హ్యూమన్ రైట్స్ నౌ వైస్ ప్రెసిడెంట్ కజుకో ఇటో అన్నారు.

జూన్ 21 లోగా జపాన్ పార్లమెంటులో ఎగువ సభ ఈ బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి.

గడువు దాటిపోతే సంస్కరణలలో అనిశ్చితి నెలకొంటుంది. ఇప్పటికే ఆలస్యం జరుగుతోందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.

వీడియో క్యాప్షన్, దాన్ని ఆయన కుటుంబానికి అప్పగించిన ఓ మీడియా సంస్థ

'సెక్స్‌కు, లైంగిక దాడికి మధ్య తేడా తెలియాలి'

కోర్టులోనే కాకుండా ప్రజల్లోనూ సెక్స్ పట్ల అవగాహన పెరగాలని, దాని విస్తృతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జపాన్‌లో లైంగిక హింస, దాడులు ఇప్పటికీ తెరచాటు వ్యవహారాలే. వాటి గురించి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈమధ్యనే వీటిపై జనం గొంతు విప్పుతున్నారు.

సెక్స్ ఎడ్యుకేషన్‌లో పాఠాలు వివరంగా కాకుండా, పూత పూసి చెబుతున్నారని, సమ్మతి గురించి అసలు చెప్పడంలేదని విశ్లేషకులు అంటున్నారు.

జపాన్‌లో పిల్లలకు పోర్న్‌సైట్స్ సులువుగా అందుబాటులో ఉంటాయని, వాటిలో స్త్రీలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా సెక్స్‌లో పాల్గొనాల్సిరావడం సర్వసాధారణమైన విషయంగా చూపిస్తున్నారని, అదే భావనతో పిల్లలు పెరుగుతున్నారని కుజుకే ఇటో అన్నారు.

మరోవైపు, జపాన్‌లో లైంగిక వేధింపుల బాధితులకు ఆర్థిక సహాయం, నైతిక స్థైర్యం అందించాలని లాయర్, హక్కుల కార్యకర్త సాకురా కమితిని అన్నారు.

అయితే, లైంగిక దాడులకు పాల్పడేవారికీ ప్రభుత్వం, సమాజం నుంచి సహాయం కావాలని ఆమె అంటున్నారు.

"చాలావరకు లైంగిక నేరస్థులు మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతుంటారు. దీన్ని ఆపాలి. లేదంటే బాధితులు పెరిగిపోతారు" అని ఆమె అన్నారు.

అన్నిటికన్నా ముందు, చట్ట సంస్కరణల బిల్లు పాస్ అయి, అమలులోకి రావడం ప్రధానమని హక్కుల కార్యకర్తలు భావిస్తున్నారు.

చట్టం మారితే తనపై జరిగిన లైంగిక దాడిని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మెగుమి కూడా చెప్పారు.

లైంగిక హింస బాధితులు, మైనారిటీ హక్కులపై ప్రచారం చేస్తూ భవిష్యత్తులో ఒక లా ఫర్మ్ స్థాపించాలని మెగుమి యోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)