జపాన్: ఈ దేశంలో మీరు ఏది పోగొట్టుకున్నా మళ్లీ దొరుకుతుంది

"పారిస్‌లో వస్తువులు ఎక్కడికీ పోవు సార్" అంటాడు మన్మథుడు సినిమాలో బ్రహ్మానందం. దాని సంగతేమోగానీ, జపాన్‌లో నిజంగానే వస్తువులు ఎక్కడికీ పోవు.
ఆ దేశంలో ప్రతి ఏడాది లక్షల మంది తమ వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ, పోయిన వస్తువులు దాదాపు దొరికేస్తాయి.
జపాన్‌లో ఎక్కడెక్కడో పోగొట్టుకున్న వస్తువులన్నీ టోక్యోలోని లిడాబాషిలో ఉన్న 'లాస్ట్ ప్రాపర్టీ సెంటర్'కు చేరుతాయి.
అలా పోగొట్టుకున్న వస్తువులు ఎవరికైనా కనిపిస్తే వారు వాటిని టోక్యోలోని లిడాబాషిలో ఉన్న లాస్ట్ ప్రాపర్టీ సెంటర్‌కు పంపిస్తారు. ప్రజలు పోగొట్టుకున్న వస్తువులను ఆ కేంద్రంలో భద్రపరుస్తారు.
2019లో రికార్డు స్థాయిలో 41.5 లక్షల వస్తువులు ఈ సెంటర్‌కు చేరాయి. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 6,00,000 వస్తువులు ఉన్నాయి.
ప్రతిరోజూ సుమారు 7,700 వస్తువులు తమ సెంటర్‌కు చేరుతాయని లాస్ట్ ప్రాపర్టీ సెంటర్ హెడ్ యుకికో ఇగరాషి చెప్పారు.
"జపాన్ మొత్తంగా చూస్తే టోక్యోలోనే 20 శాతం వస్తువులు పోగొట్టుకుంటారు. ఎక్కువ రికవరి రేటు ఉన్నది మాత్రం మొబైల్ ఫోన్లకే. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో 90 శాతం వాళ్ల యజమానులకు తిరిగి చేరుతాయి" అంటూ ఇగరాషి చెప్పుకొచ్చారు.
రెండో స్థానంలో వాలెట్లు, పర్సులు ఉన్నాయి. ఇవి 70 శాతం దొరికేస్తాయని ఆమె తెలిపారు.
"సాధారణంగా జనాలు పోగొట్టుకునే మరో వస్తువు సర్టిఫికెట్లు, పత్రాలు. డ్రైవింగ్ లైసెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, క్రెడిట్ కార్డులు మొదలైనవి పొగొట్టుకుంటూ ఉంటారు."
అవన్నీ చాలావరకు పోగొట్టుకున్న రోజునే దొరికేస్తాయి. వాటిని ఆరోజే యజమానులకు అప్పగిస్తారు. అయితే, కొన్ని వస్తువులు మాత్రం అంత సులువుగా దొరకవు.
"అన్నింటికన్నా తక్కువ రికవరి రేటు ఉన్నవి గొడుగులు. 1 శాతం కన్నా తక్కువ. ఓ గొడుగు పోతే పెద్ద ఖర్చు లేకుండా మరో గొడుగు కొనుక్కోవచ్చు. కాబట్టి, పోగొట్టుకున్నవారు వాటి కోసం వెతకరు" అని చెప్పారు ఇగరాషి.

ఫిర్యాదు చేయడం సులువు
జపాన్‌లో ఈ వ్యవస్థ ఇంత విజయం సాధించడానికి కారణం ఏంటి?
"ప్రాథమికంగా, పోగొట్టుకున్న వస్తువులన్నింటినీ కోబన్ అంటే పోలీస్ స్టేషన్‌కు చేరవేస్తారు" అని ఇగరాషి చెప్పారు.
"సాధారణంగా ఒక పోలీసు అధికారి విధులేంటంటే, ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడం, దొరికిన వస్తువులను భద్రపరచడం, వాటికి సంబంధించిన రిపోర్టులు తయారుచేయడం. అలాగే, తప్పిపోయిన వారిని, తాగినవాళ్లని భద్రంగా కాపాడడం, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో తెలుసుకోవడం, ట్రాఫిక్ ప్రమాదాలు, నేరస్థులపై దృష్టి పెట్టడం" అని సుకియాబాషి కోబన్‌లో అధికారి వాడా వివరించారు.
ప్రపంచంలో మిగిలిన దేశాల కన్నా కోబన్ ఆఫీసర్లు కొంత భిన్నంగా కనిపిస్తారు. ప్రజా సమూహాలతో కలిసి పని చేసే కోబాన్ అధికారులతో మాట్లాడడానికి ప్రజలు సంతోషంగా ముందుకు వస్తారు. తమకు ఏదైనా వస్తువు దొరికితే వెంటనే వారికి అందజేస్తారు.
కమ్యూనిటీ ఆధారిత విధానం, అన్నిచోట్లా వ్యాపించి ఉన్న కోబన్ వ్యవస్థ వలన పోగొట్టుకున్న వస్తువుల గురించి ఫిర్యాదు చేయడం, దొరికిన వాటిని కోబన్‌లో అప్పజెప్పడం సులువు.
"రోజుకు సగటున ఏడు పోగొట్టుకున్న వస్తువులు సుకియాబాషిలో కోబన్‌కు చేరుతాయి" అని వాడా చెప్పారు.

పోయిన వస్తువుల గురించి ఫిర్యాదు చేయకపోతే?
పోయిన వస్తువుల గురించి ఫిర్యాదు చేస్తే అవి దాదాపుగా దొరికేస్తాయి. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే? అప్పుడు, దొరికిన వస్తువుల మాటేమిటి?
"వస్తువుల యజమానులు కోబన్‌కు వచ్చి వాటిని తీసుకోకపోతే, మళ్లీ వాటిని లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్‌కే పంపించేస్తారు" అని ఇగరాషి చెప్పారు.
ఆ సెంటర్‌లో కూడా వాటిని ఎవరూ తీసుకోకపోతే, మూడు నెలల తరువాత వాటిని సెంటర్‌కు చేర్చిన వ్యక్తే తీసుకోవచ్చు.
వాళ్లూ తీసుకోకపొతే, వాటిని ప్రభుత్వానికి అప్పజెప్తారు. ప్రభుత్వం ఆ వస్తువులను వేలం వేయవచ్చు.
"ఒకసారి 8,800 డాలర్లు (సుమారు రూ. 6.5 లక్షలు) ఉన్న కవర్ నాకు తెచ్చి ఇచ్చారు. అదెప్పటికీ మర్చిపోలేను. చాలా ఆశ్చర్యమేసింది" అని వాడా చెప్పారు.
"అంత డబ్బు తిరిగి దొరకడం అరుదైన విషయమే. నాకైతే ఓ వ్యక్తి కట్టుడు దంతాలను మరిచిపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ వ్యక్తి ఆరోజు ఆ దంతాలు లేకుండా ఇంటికి ఎలా వెళ్లాడనే ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇలాంటి ప్రత్యేకమైన, అరుదైన వస్తువులు ఎన్నింటినో పోగొట్టుకుంటూ ఉంటారు" అని చెప్పారు ఇగరాషి.
ఇంకా రకరకాల అరుదైన వస్తువులు కూడా తమ కేంద్రానికి వస్తుంటాయని చెప్పారు. దొరికిన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు పటిష్టమైన వ్యవస్థ ఉండడం వల్లే చాలా మందికి పోగొట్టుకున్నవి దొరుకుతున్నాయని, అయితే ఈ వ్యవస్థ జపాన్ ప్రజల నడవడిక వల్లే విజయవంతమైందని ఆమె అన్నారు.

జపాన్ సంస్కృతి, నైతిక విలువలే కారణం
పోయిన వస్తువులను యజమానులకు తిరిగి అందించడంలో జపాన్ ప్రజల పాత్రను విస్మరించలేం.
"జపాన్‌లో బోధించే నైతిక విలువలే ఇందుకు కారణమని నా అభిప్రాయం. ఇప్పటికీ, దొరికిన వస్తువులను తిరిగి ఇవ్వాలని పిల్లలకు నేర్పుతాం. పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు కోబన్‌కు వచ్చి దొరికిన వస్తువులు ఇచ్చి వెళ్లడం తరచూ చూస్తుంటాం. చివరికి 100 రూపాయలు దొరికినా ఇచ్చేస్తారు" అని ఇగరాషి అన్నారు.
"పోగొట్టుకున్న వస్తువులకు సంబంధించిన చట్టం జపాన్‌లో 1,000 ఏళ్లకు పైగా అమల్లో ఉంది. స్కూళ్లలో నైతిక విలువల పాఠాలు బోధించే సంప్రదాయం ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తోందని నేను నమ్ముతాను" అని ఇగరాషి అభిప్రాయపడ్డారు.
జపాన్‌లో చాలామందికి పోలీసులతో మొదటిసారి పరిచయమయ్యేది దొరికిన వస్తువులు తిరిగి ఇవ్వడానికి కోబన్‌కు వెళ్లినప్పుడే అని క్యోటో సాంగ్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ మసాహిరో తమురా అన్నారు.
"ఇది పోలీసులకు, ప్రజలకు మధ్య ఒక దగ్గర సంబంధాన్ని ఏర్పరుస్తుంది" అని ఆయన వివరించారు.
జపాన్‌లో "హిటోనో-మీ" అంటే 'సమాజం కన్ను' అని అర్థం. ఈ భావన కూడా ఆ దేశంలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతోందని చెప్పవచ్చు.
పోలీసులు పక్కన లేనప్పుడు కూడా తప్పు చేయకూడదని జపాన్ సంస్కృతి బోధిస్తుంది.
"చాలాసార్లు మన వ్యక్తిగత నైతికత మన ప్రవర్తనను నిర్దేశిస్తుంది. అలాగే సమాజం పట్ల ఉన్న దృష్టి కూడా మన ప్రవర్తనను నిర్ణయిస్తుంది. ఇతరులు మన ప్రవర్తనను ఎలా చూస్తారన్నది జపనీయులకు చాలా ముఖ్యం. పోయిన వస్తువుల పట్ల వారి వైఖరి, సమాజంలో వారికున్న గుర్తింపుకు ముడిపడి ఉంటుంది" అని తమురా చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా నైతిక క్రమశిక్షణకే పెద్దపీట వేస్తారు.
"జపాన్‌లో విపత్తులు సంభవించినప్పుడు కూడా క్రైమ్ రేటు పెరగదు. దీనికి మినహాయింపు ఫుకుషిమా విపత్తు. ఆ సమయంలో మాత్రమే నేరాల సంఖ్య పెరిగింది. చట్టం, న్యాయం కన్నా సమాజం దృష్టికే జపనీయులు ఎక్కువ భయపడతారు" అని తమురా వివరించారు.
కరోన్ కారణంగా లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్‌కు వచ్చే వస్తువుల సంఖ్య తగ్గింది. అయినాగానీ, 28 లక్షల వస్తువులు ఆ సెంటర్‌కు చేరాయి.

ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా
- మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
- మాయావతి, ములాయం సింగ్‌ల మధ్య వైరం పెంచిన గెస్ట్‌హౌస్ ఘటన, ఆ రోజు ఏం జరిగిందంటే..
- కరోనా నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
- ‘చారిత్రక కట్టడాల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం కాదు.. అవి చెప్పే కథలు వినాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













