ఈజిప్ట్: ఫేస్‌బుక్ లైవ్ ఇస్తున్న ఫోన్‌ను లాక్కుని పారిపోయిన దొంగ.. పోలీసులకు సులభంగా దొరికిపోయాడు

లైవ్‌లో కనిపించిన దొంగ

ఫొటో సోర్స్, YOUM7/FACEBOOK

ఫొటో క్యాప్షన్, లైవ్‌లో కనిపించిన దొంగ

ఈజిప్ట్‌లో ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు. ఓ దొంగ కూల్‌గా బైక్ మీద వచ్చి ఆయన చేతిలో మొబైల్ లాగేసుకుని పారిపోయాడు. లైవ్ కొనసాగుతోంది. అందులో ఆ దొంగ ముఖం కనబడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

‘కూలెస్ట్ థీఫ్’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

యువామ్7 న్యూస్‌లో మహమూద్ రఘెబ్ రిపోర్టర్‌గా పని చేస్తున్నారు.

ఈజిప్ట్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కొన్ని ప్రాంతాలను గడగడలాడించింది. దాని తరువాత పరిణామాలపై రఘెబ్ ఆ రోజు లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్నారు.

షుబ్రా అల్-ఖైమా నగరంలోని ఒక బ్రిడ్జి వద్ద నిలబడి రఘెబ్ లైవ్‌లో మాట్లాడుతుండగా మొబైల్ దొంగతనం జరిగిందని యువామ్7 తెలిపింది.

రఘెబ్ ఆ వంతెనను, పరిసర ప్రాంతాలను లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా ఆ దొంగ బైక్ మీద వచ్చి ఆయన చేతిలోంచి మొబైల్ లాక్కుని పారిపోయాడు.

ఫోను పట్టుకుని బైక్ మీద వేగంగా వెళ్తుండడంతో లైవ్‌లో చాలాసేపు షేక్ అవుతూ కనిపించింది.

కాసేపటికి దొంగ ముఖం స్పష్టంగా కనిపించింది. సిగరెట్ తాగుతూ, ఎవరైనా తరుముతున్నారేమోనని అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూస్తున్న దొంగ లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపించాడు.

మొబైల్ పోగొట్టుకున్న జర్నలిస్ట్‌ను ఎవరూ పట్టించుకోలేదుగానీ కూల్‌గా దొంగతనం చేసి, సిగరెట్ వెలిగించిన దొంగను మాత్రం సోషల్ మీడియాలో సరదాగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

"నవ్వి నవ్వి చచ్చిపోయామని" ఓ యూజర్ కామెంట్ చేశారు.

"వెనక్కి ఎందుకు తిరిగి చూడడం, ప్రపంచం మొత్తం మిమ్మల్ని లైవ్‌లో చూస్తుంటే" అంటూ మరో వ్యక్తి సరదాగా కామెంట్ పెట్టారు .

రఘెబ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు 20,000 మందికి పైగా జనం ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నారు.

ఫేస్‌బుక్ గణాంకాలు ప్రకారం, దొంగతనం జరిగిన దగ్గర నుంచి 24 గంటల్లోపు ఆ లైవ్‌కు 62,00,000లకు పైగా వ్యూస్ పెరిగాయి. 45,000 మంది కామెంట్లు చేశారు .

దొంగ ముఖం లైవ్‌లో స్పష్టంగా కనిపించడంతో ఆయన్ను పట్టుకోవడం పోలీసులకు సులువైపోయింది.

ఆ దొంగను పట్టుకున్నామని ఈజిప్ట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి ప్రకటించింది.

దొంగకు సరైన ఉపాధి లేదని, దొంగిలించిన ఫోన్‌ను ఒక వ్యాపారికి అమ్మేశాడని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి: