‘ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ దొంగతనం’ బాధితులు 2.60 లక్షల మంది.. 4,600 కోట్ల యెన్లు చెల్లిస్తామని కాయిన్‌చెక్ హామీ

ఫొటో సోర్స్, Nippon Hoso Kyokai
హ్యాకింగ్ దాడిలో చోరీ అయిన రూ. 34,000 కోట్ల (53.4 కోట్ల డాలర్ల) విలువైన పెట్టుబడి మొత్తాన్ని దోపిడీ బాధితులకు తిరిగి చెల్లిస్తామని జపాన్‌లో అతి పెద్ద డిజిటల్ కరెన్సీ ఎక్స్చేంజ్ ’కాయిన్‌చెక్’ ప్రకటించింది.
శుక్రవారం తమ సంస్థపై జరిగిన హ్యాకింగ్ దాడిలో డిజిటల్ కరెన్సీ కోల్పోయిన బాధితులకు 4,600 కోట్ల యెన్లను తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.
టోక్యోలోని ఈ సంస్థ తన డిజిటల్ ఎక్సేంజీలోకి ’అనుమతి లేని ప్రవేశా’న్ని గుర్తించిన తర్వాత.. బిట్‌కాయిన్ మినహా మిగతా ట్రేడింగ్ లావాదేవీలు నిలిపివేసింది.
ఆ సంస్థ పేర్కొన్న హ్యాకింగ్ దాడిలో సుమారు 2,60,000 మంది వినియోగదారులు ప్రభావితులైనట్లు చెప్తున్నారు.
ఈ దాడిలో కోల్పోయిన 5,800 కోట్ల యెన్ల విలువైన ఎన్‌ఈఎం (డిజిటల్ కరెన్సీ) కాయిన్లలో దాదాపు 90 శాతం చెల్లించనున్నట్లు కాయిన్‌చెక్ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
‘ఆ కరెన్సీ ఎక్కడికి వెళ్లిందో తెలిసింది...’
కాయిన్‌చెక్ నుంచి దోపిడీకి గురైన నగదును 'హాట్ వాలెట్'లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ హాట్ వాలెట్ కూడా ఎక్స్ఛేంజిలో ఒక భాగం. ఇది ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉంటుంది. ఎక్స్ఛేంజిలోనే కోల్డ్ వాలెట్ అని కూడా మరొకటి ఉంటుంది. ఇంటర్నెట్‌తో సంబంధం లేని ఆఫ్‌లైన్‌లో నిధులు భద్రంగా ఉండే ఏర్పాటు కలిగిన వ్యవస్థ కోల్డ్ వాలెట్.
చోరీకి గురైన డిజిటల్ కరెన్సీని ఎక్కడికి పంపించారనే డిజిటల్ అడ్రస్ తమకు తెలిసిందని ఆ సంస్థ సీఈఓ యుసుకే ఒట్సుక పేర్కొన్నారు. ‘‘మేం దాని జాడను పసిగడుతున్నాం. ఈ కరెన్సీని అనుసరించటం కొనసాగించగలిగితే దానిని రికవరీ చేయటం సాధ్యం కావచ్చు’’ అని ఆయన చెప్పారు.
కాయిన్‌చెక్ ఈ దోపిడీపై పోలీసులకు, జపాన్ ఆర్థిక సేవల ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది.
జపాన్‌లో దాదాపు 10,000 వ్యాపార సంస్థలు క్రిప్టోకరెన్సీని అంగీకరిస్తాయని చెప్తున్నారు.
2014లో టోక్యోలోని మరో ఎక్స్చేంజీ అయిన మౌంట్‌గాక్స్ సంస్థలో 40 కోట్ల డాలర్ల విలువైన డిజిటల్ కరెన్సీ దోపిడీకి గురైనట్లు తెలిపింది. ఆ ఘటనతో ఆ సంస్థ కుప్పకూలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ దోపిడీ వల్ల ఎంత నష్టం?
మార్కెట్ విలువను బట్టి పదో పెద్ద క్రిప్టో-కరెన్సీ అయిన ఎన్‌ఈఎం విలువ.. ఈ దోపిడీ ఘటన వెలుగు చూసిన 24 గంటల వ్యవధిలో 11 శాతం పడిపోయి 87 సెంట్లకు తగ్గిపోయిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఇతర క్రిప్టోకరెన్సీల్లో శుక్రవారం నాడు బిట్‌కాయిన్ విలువ 3.4 శాతం తగ్గగా రిపుల్ 9.9 శాతం తగ్గినట్లు ఆ సంస్థ వివరించింది.
2014లో మౌంట్‌గాక్స్ తమ సంస్థ నుంచి 8,50,000 బిట్‌కాయిన్లు చోరీకి గుర్యాయని అనుకున్న నాటికన్నా శుక్రవారం నాడు డిజిటల్ కరెన్సీల నష్టం ఎక్కువగా ఉంది. అయితే నాడు చోరీకి గురైంది పాత డిజిటల్ వ్యాలెట్‌లో ఉన్న 2,00,000 బిట్‌కాయిన్లని మౌంట్‌గాక్స్ గుర్తించింది.
నాడు మౌంట్‌గాక్స్ కుప్పకూలటంతో డిజిటల్ కరెన్సీ ప్రపంచం తీవ్ర కుదుపుకు లోనయింది. దీంతో కాయిన్‌చెక్ వంటి స్థానిక కరెన్సీ ఎక్స్చేంజీలపై పర్యవేక్షణను పెంచటం కోసం జపాన్‌లో లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








