వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే: ఈ 7 ఆహార పదార్థాలతో ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు...జాగ్రత్త

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీల అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో 26 మంది అమ్మాయిలు వాంతులు, వికారం, తలనొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారు. ముందురోజు రాత్రి హాస్టల్‌లో ఆహారం తీసుకున్న తర్వాత వీరికి ఫుడ్ పాయిజనింగ్ అయింది.
గత మార్చిలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో బీసీ బాలుర వసతి గృహంలోనూ 29 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌తో ఆసుపత్రిలో చేరారు.
ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 16 లక్షల మందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతోందని, ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో రోజుకు ఐదేళ్లలోపు పిల్లలు 340 మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.
ఏటా జూన్ 7న ప్రపంచ ‘‘ఫుడ్ సేఫ్టీ డే’’గా డబ్ల్యూహెచ్‌వో నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహార పదార్థాలు ఏమిటి, ఆహారం నుంచి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లాంటి వివరాలు చూద్దాం.
సరిగ్గా వండని లేదా పచ్చి మాంసం, సరిగ్గా కడగని కూరగాయలు, పచ్చి పాలు, ఇతర పాల ఉత్పత్తులు, ఎక్కువకాలం నిల్వ ఉంచిన గుడ్లు, సరిగ్గా శుభ్రంచేయని చేపలు, అపరిశుభ్రమైన మొలకలు, ఎక్కువ నిల్వచేసిన పిండి లాంటి వాటివల్ల ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీపీ) చెబుతోంది. వీటిలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. పచ్చి మాంసం
పచ్చి మాంసం లేదా సరిగ్గా వండని మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే ‘‘ఫుడ్ పాయిజనింగ్’’ అయ్యే అవకాశం ఎక్కువ. వీటిలో కంపిలోబ్యాక్టర్‌గా పిలిచే బ్యాక్టీరియా ఉంటుంది. ఒక్కోసారి సాల్మనెల్లా, క్లస్ట్రీడియమ్ పెర్‌ఫ్రింజెన్స్, సాల్మొనెల్లా, ఈ.కోలై లాంటి సూక్ష్మజీవులు కూడా ఉండొచ్చు.
అందుకే పచ్చి మాంసాన్ని ఎప్పడూ కడగొద్దని సీడీసీపీ చెబుతోంది. ‘‘వీటిని కడిగితే బ్యాక్టీరియా ఆ గిన్నెలు, చుట్టుపక్కల పరిసరాలకు వ్యాపిస్తుంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం కలుషితం అవుతుంది’’ అని సీడీసీపీ పేర్కొంది. మాంసాన్ని సరిగ్గా వండితే, ఈ బ్యాక్టీరియా చనిపోతుందని వివరిస్తోంది.
‘‘మాంసం ఏదైనా మిగిలితే, వండిన రెండు గంటల్లోనే ఫ్రిడ్జిలో పెట్టేయాలి’’అని సీడీసీపీ సూచిస్తోంది.
పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జిలో పెట్టాల్సి వస్తే, దాన్ని ముక్కలుగా చేయాలని, అప్పుడే వేగంగా ఫ్రీజ్ అవుతుందని, ఫలితంగా బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు తగ్గుతాయని సీడీసీపీ వివరిస్తోంది.
మరోవైపు పచ్చిమాంసంతో సిస్టిసిరోసిస్ లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని డాక్టర్ ప్రతిభా లక్ష్మి చెప్పారు. ‘‘మాంసం సరిగా వండకపోతే చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే పూర్తిగా వండిన తర్వాతే మంసాన్ని తీసుకోవాలి’’ అని ఆమె అన్నారు.
మరోవైపు నాన్‌వెజ్-ఫాస్ట్ ఫుడ్‌తో తరచూ ఫుడ్ పాయిజనింగ్ కావడానికి దాన్ని సరిగ్గా వండకపోవడమే కారణమని డాక్టర్ ఆర్.ఎస్.బీ నాయుడు చెప్పారు. ‘‘రెస్టారెంట్లు, వీధి చివర్లో కనిపించే ఫుడ్ కౌంటర్లలో కనిపించే కబాబ్స్, టిక్కాలలో మాంసాన్ని సూక్ష్మజీవులు చనిపోయేవరకూ వండరు. అందుకే వీటి వల్ల తరచూ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. కడగని కూరగాయలు..
తాజా పచ్చి కూరగాయలు, ఆకుకూరలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ, ఒక్కోసారి ఇవి ఫుడ్ పాయిజనింగ్‌తోపాటు ఇన్ఫెక్షన్లకూ కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి కూరగాయల్లో ఒక్కోసారి సాల్మనెల్లా, ఈ.కోలై, లిస్టీరియా లాంటి సూక్ష్మజీవులు ఉండొచ్చు. పొలం నుంచి మన ఇంటికి వచ్చే మధ్యలో ఎక్కడైనా ఇవి కలుషితం కావచ్చు.
ఒక్కోసారి మన వంటగదిలోని ఇతర పదార్థాల వల్లా ఇవి సూక్ష్మజీవులతో కలుషితం కావచ్చు. అందుకే వీటిని జాగ్రత్తగా శుభ్రంచేసిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి.
ఆ కూరగాయలను ఎక్కడ పండించారు అనే విషయం ఇక్కడ చాలా ముఖ్యమని డాక్టర్ ప్రతిభా లక్ష్మీ చెప్పారు. ‘‘కొన్నిసార్లు అనారోగ్యకర వాతావరణంలో కూరగాయలను పండిస్తున్నారు. చాలారకాల పురుగు మందులను కూడా వాడుతున్నారు. కాబట్టి కూరగాయలైనా లేదా పళ్లైనా ఉప్పు నీళ్లలో కడిగిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. లేకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది’’ అని ఆమె అన్నారు.
ప్రతిభా లక్ష్మి చెప్పిన విషయాలతో ఆర్.ఎస్.బీ నాయుడు ఏకీభవించారు. ‘‘ఇక్కడ పరిశుభ్రత గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు పానీ పూరీతో ఫుడ్‌పాయిజనింగ్ అవుతోందనే వార్తలు వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దానిలో ఉపయోగించే కూరగాయలను సరిగ్గా కడకపోవడం లేదా వంట చేసేటప్పుడు అపరిశుభ్రత లేదా దాన్ని ఇచ్చే వ్యక్తి పరిశుభ్రత పాటించకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతుంటాయి’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. పచ్చి పాలు, ఇతర పాల ఉత్పత్తులు
పాశ్చురైజ్ చేయని పచ్చిపాలు, వీటితోచేసే పదార్థాల వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ.
ఎందుకంటే పచ్చి పాలలో కంపిలోబ్యాక్టర్, క్రిప్టోస్పోరిడియమ్, ఈ.కోలై, లిస్టీరియా, సాల్మొనెల్లా లాంటి సూక్ష్మజీవులు ఉండొచ్చు. వీటితో చేసే ఐస్ క్రీమ్, పెరుగు కూడా హానికరమే.
‘‘పాశ్చురైజేషన్’’ లేదా వేడి చేయడంతో పాలలో సూక్ష్మజీవులు నశిస్తాయి. వేడి చేయడంతో పాలలో పోషకాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు.
పచ్చి పాలలో ఉండే లిస్టీరియా చాలా ప్రమాదకరమని, దీని వల్ల గర్భస్రావాలు, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం లాంటి సమస్యలు వచ్చే ముప్పు ఉంటుందని సీడీసీపీ చెబుతోంది.
పచ్చి పాలతో అబ్డామినల్ టీబీ ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని డా. ప్రతిభా లక్ష్మి చెప్పారు. ‘‘చాలా మంది పచ్చిపాలను తీసుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే మనం తల్లి పాలను తాగుతాం కదా. అవి పచ్చి పాలే కదా అంటున్నారు. వీటికి పశువుల నుంచి తీసే పాలకు చాలా తేడా ఉంటుంది. ఆవులు లేదా గేదెల నుంచి పాలు తీసే వ్యక్తి తన చేతులను ఎంత శుభ్రంగా ఉంచుకున్నారు? ఎలాంటి గిన్నెలను వాడారు? ఎలాంటి పరిస్థితుల్లో వాటిని నిల్వ చేశారు? లాంటి చాలా అంశాలు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పాలను కాసేపు వేడిచేసి తీసుకుంటే మంచిది’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, AFP
4. పచ్చి గుడ్లు
పచ్చి గుడ్లలో సాల్మనెల్లా ఉండొచ్చు. చూడటానికి శుభ్రంగా, ఎక్కడా పగిలినట్లులేని గుడ్లలోనూ ఈ సూక్ష్మజీవులు ఉండొచ్చు.
అందుకే పాశ్చురైజేషన్ చేసిన లేదా ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటే మంచిది. గుడ్లలోని తెల్ల, పచ్చని సొనలను గట్టిపడే వరకూ ఉడకబెట్టాలని సీడీసీపీ చెబుతోంది. నిల్వ చేసేటప్పుడు కూడా ఫ్రిడ్జిలో తగిన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని సూచిస్తోంది.
గుడ్లను వీలైనంత వరకు తాజావే తీసుకోవాలని క్లినికల్ డైటీషియన్ నీతా దిలీప్ చెప్పారు. ‘‘గుడ్లు కొన్నిసార్లు ఆలస్యమైతే పాడైపోతుంటాయి. అప్పుడు వీటితో చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు తాజా గుడ్లను తేదీ చూసి మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే మంచిది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, OQBA/GETTY IMAGES
5. పచ్చి చేపలు..
పచ్చి చేపల్లో బ్యాక్టీరియాతోపాటు కొన్ని వైరస్‌లు కూడా ఉండొచ్చు. వీటి వల్ల అనారోగ్యంతోపాటు మరణానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఉంటుంది.
అందుకే చేపలను బాగా శుభ్రంచేసిన తర్వాత వండుకొని తినాలని సీడీసీపీ సూచిస్తోంది.
‘‘కలుషితమైన నీటిలో పెరిగే రొయ్యలు, చేపల్లో నోరోవైరస్ ఉండొచ్చు. అందుకే వీటిని శుభ్రం చేయడంతోపాటు పచ్చివాసన పోయేవరకు శుభ్రంగా వీటిని వండాలి’’ అని సీడీసీపీ చెబుతోంది.
చేపల విషయంలో అవి ఎక్కడ పెంచారో వాటిని అమ్మేవారిని అడిగి తెలుసుకోవాలని డా.ప్రతిభా లక్ష్మి సూచిస్తున్నారు.
‘‘ఇప్పుడు చాలా చేపలను అనారోగ్యకర, కలుషిత వాతావరణంలో పెంచుతున్నారు. అలాంటి చేపలను తింటే చాలా ఇన్ఫెక్షన్లు వస్తాయి. పచ్చి చేపలను అయితే అసలు తీసుకోకూడదు. చేప మందు కూడా అంతే, అసలు ఆ చేపలను ఎలా పెంచుతున్నారు? వాటిని ఇచ్చే వారి చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయి? లాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
6. మొలకలతోనూ జాగ్రత్త
మొలకలు ఆరోగ్యానికి మంచివి. అయితే, ఇవి పెరిగేందుకు కాస్త వేడి, తేమతో కూడిన వాతావరణం అవసరం. అయితే, ఇదే వాతావరణంలో సూక్ష్మజీవులు కూడా వేగంగా పెరుగుతాయి. దీంతో వీటిలోనూ సాల్మనెల్లా లాంటి బ్యాక్టీరియా ఉండొచ్చు.
మొలకల విషయంలో ఎంత సేపు ఉంచాం, వాటికి ఎంత గాలి తగిలింది? లాంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని డాక్టర్ ప్రతిభా లక్ష్మి చెప్పారు. ‘‘మొలకలు ఏవైనా మరీ తడిలో ఎక్కువసేపు ఉంచకూడదు. అలానే గాలి ఆడలేని ప్రదేశంలోనూ ఎక్కువసేపు పెట్టకూడదు. గాలి బాగా తగిలితే చాలావరకు సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండదు’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
7. నిల్వ పిండి
ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన గోధుమ పిండిలోనూ సుక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పిండిని పచ్చిగా తినొద్దని సీడీసీపీ సూచిస్తోంది.
పిండి ఎంత తాజాగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని క్లినికల్ డైటీషియన్ నీతా దిలీప్ అన్నారు. ‘‘పిండైనా లేదా కూరగాయలైనా ఏవైనా మరీ ఎక్కువ రోజులు అలానే ఇంట్లో ఉంచుకోకూడదు. కాలం గడిచేకొద్దీ వీటిలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది’’ అని ఆమె అన్నారు.
అయితే, ఫుడ్ పాయిజనింగ్ అవుతుందనే భయంతో బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉండేందుకు అతిశుభ్రత పాటించడం కూడా మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.
‘‘బ్యాక్టీరియా అన్నిసార్లు చెడే చేయదు. దీని వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన కడుపులో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి’’ అని డాక్టర్ ప్రతిభా లక్ష్మి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















