కశ్మీర్: డ్రగ్స్ మత్తులో తేలుతున్న టీనేజర్లు.. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?

డాక్టర్ యాసిర్ రాదర్

ఫొటో సోర్స్, UMER ASIF

ఫొటో క్యాప్షన్, శ్రీనగర్‌లోని ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ యాసిర్ రాదర్
    • రచయిత, ఆకిబ్ జాబీద్
    • హోదా, బీబీసీ కోసం

మే నెలలో ఓ వర్షాకాలపు ఉదయం కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ వెలుపల పదుల సంఖ్యలో యువకులు క్యూ కట్టి నిల్చున్నారు.

వారిలో చాలా మంది టీనేజీ పిల్లలు. పక్కనే వాళ్ల తల్లిదండ్రులు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఐఎంహెచ్ఏఎన్ఎస్‌) నుంచి మందు తీసుకోవడానికి వారి వంతు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడడానికి, ఆ సమయంలో బయటపడే లక్షణాలను అదుపు చేయడానికి, అంటురోగాలు సోకకుండా నిరోధించడానికి ఈ మందు ఉపయోగపడుతుంది.

కశ్మీర్‌లో ప్రభుత్వం నడుపుతున్న ఒకే ఒక్క డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ అది.

ఒక డాక్టర్ ఓ యువకుడి కళ్లను పరీక్షిస్తూ "నువ్వు మళ్లీ హెరాయిన్ తీసుకున్నావా?" అని అడిగారు.

"అవును. నేను కంట్రోల్ చేసుకోలేకపోయా" అని అతడు జవాబు చెప్పాడు.

ఎన్నో దశాబ్దాలుగా కశ్మీర్‌లో ప్రజలు వివాదాలు, అశాంతి మధ్య మగ్గిపోతున్నారు. కశ్మీర్ భూభాగంపై భారత్, పాకిస్తాన్‌ పట్టు విడువట్లేదు. రెండు యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం కొంత భాగం భారత్ పాలనలో ఉంటే, కొంత పాకిస్తాన్ అధీనంలో ఉంది.

2019లో భారత ప్రభుత్వం కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దాంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఇప్పుడు మరో సంక్షోభం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. కశ్మీర్‌లో మాదకద్రవ్యాల వ్యసనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, యువత జీవితాలను నాశనం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. హెరాయిన్ వంటి హార్డ్ డ్రగ్స్ వినియోగం కూడా బాగా పెరిగిందని చెబుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో సుమారు 10 లక్షల మంది అంటే ఆ ప్రాంత జనాభాలో 8 శాతం గంజాయి, ఓపియాయిడ్లు వంటి మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారని ఈ ఏడాది మార్చిలో ఒక కేంద్ర మంత్రి పార్లమెంటుకు తెలిపారు.

గతంతో పోల్చేందుకు గణాంకాలు అందుబాటులో లేవు కానీ, రిహాబిలిటేషన్‌కు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు.

"ఓ పదేళ్లకు ముందు రోజుకు 10-12 డ్రగ్ అడిక్షన్ కేసులు మా ఆస్పత్రికి వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-200 కేసులు వస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం" అని ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ యాసిర్ రాదర్ చెప్పారు.

కశ్మీర్‌లో మాదకద్రవ్యాల వ్యసనం పెరగడానికి నిపుణులు అనేక కారణాలు సూచిస్తున్నారు.

ఉద్యోగాల కోరత, వివాదాస్పద ప్రాంతంలో నివసించడం వలన వచ్చే మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైన వాటి వల్ల యువత డ్రగ్స్ బారినపడుతోందని అంటున్నారు.

ఐఎంహెచ్ఏఎన్ఎఎస్‌

ఫొటో సోర్స్, UMER ASIF

ఫొటో క్యాప్షన్, ఐఎంహెచ్ఏఎన్ఎఎస్‌

పాకిస్తాన్‌తో సంబంధాలు

పెద్ద మొత్తంలో నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశాల్లో పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. దీనికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయన్నారు.

డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బును కశ్మీర్‌లో తీవ్రవాదానికి వినియోగిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ఇంతవరకు స్పందించలేదు.

కొంతమంది డ్రగ్ డీలర్లు బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ- తమకు భారత్‌లోని పంజాబ్, దిల్లీ లాంటి ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్పారు.

"ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం కొత్తగా వచ్చిన సమస్య కాదు. కానీ, ఇంతకుముందు గంజాయి, ఇతర ఓపియాయిడ్లను తీసుకునేవారు. హెరాయిన్ లాంటివి వినియోగించేవారు కాదు" అని డాక్టర్ యాసిర్ చెప్పారు.

గత ఏడాది జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో, కశ్మీర్‌లో 52 వేల మందికి పైగా ప్రజలు హెరాయిన్ వాడుతున్నట్లు అంగీకరించారు. దీన్ని పొందడానికి ఒక్కొక్కరూ నెలకు సగటున సుమారు రూ. 88 వేలు ఖర్చు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

వాస్తవంలో ఈ అంకెలు ఇంకా పెద్దవిగా ఉండవచ్చు. డ్రగ్స్ వాడుతున్నవాళ్లంతా ఆ నిజాన్ని బయటపెట్టి ఉండకపోవచ్చు.

డ్రగ్స్‌కు ఎక్కువమంది పురుషులు అలవాటు పడుతుండగా, కొంతమంది మహిళలూ దీని బారిన పడుతున్నారు.

ఫొటో సోర్స్, UMER ASIF

ఫొటో క్యాప్షన్, డ్రగ్స్‌కు ఎక్కువమంది పురుషులు అలవాటు పడుతుండగా, కొంతమంది మహిళలూ దీని బారిన పడుతున్నారు.

'మిమ్మల్ని నాశనం చేసే తియ్యటి విషం'

ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం గ్రహించిందని, దీన్ని పరిష్కరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని కశ్మీర్‌లోని ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ ముస్తాక్ అహ్మద్ రాదర్ చెప్పారు.

డ్రగ్స్ వ్యసనపరుల కోసం రీహాబిలిటేషన్ సెంటర్ల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేట్ సెంటర్లు కొన్ని ఉన్నాయి కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండే సెంటర్లు ఉన్నాయి. ఒకటి ఐఎంహెచ్ఏఎన్ఎస్ కాగా, మరొకటి పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రం.

ప్రతి జిలాల్లోను అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంట్లరను (ఏటీఎఫ్‌సీ) ప్రభుత్వం ఏర్పాటుచేసిందని డాక్తర్ ముస్తాక్ రాదర్ చెబుతున్నారు. అయితే, వీటిలో రోగులను చేర్చుకోరు. ఇవి చిన్న క్లినిక్స్‌లాంటివి. ఒక డాక్టర్, ఒక కౌన్సిలర్, ఒక నర్స్ ఉంటారు.

"ఏటీఎఫ్‌సీలలో కౌన్సిలింగ్, చికిత్స, మందులు ఉచితంగా ఇస్తారు" అని డాక్టర్ ముస్తాక్ తెలిపారు.

ఐఎంహెచ్ఏఎన్ఎస్‌లో రోగులు అడ్మిట్ కావచ్చు. కశ్మీర్ నలుమూలల నుంచి వచ్చే రోగులతో ఈ సెంటర్‌లో రద్దీ బాగా పెరిగింది. కొందరు స్వయంగా వచ్చి అడ్మిట్ అవుతున్నారు. కొందరిని తల్లిదండ్రులు లేదా బంధువులు తీసుకొస్తున్నారు. అడ్మిట్ అవుతున్నవారిలో చాలామంది పురుషులే. కొందరు ఆడవాళ్లూ లేకపోలేదు.

"ఇది(మాదకద్రవ్యం) మిమ్మల్ని నాశనం చేసే తియ్యటి విషం" అని 23 ఏళ్ల డానిష్ నజీర్ (పేరు మార్చాం) చెప్పారు. డానిష్ మూడు వారాలుగా ఈ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

నజీర్ శ్రీనగర్‌లో ఒక దుకాణం నడుపుతున్నారు. రోజూ ఆదాయంలో కొంత హెరాయిన్ కొనుక్కోవడానికి ఉపయోగించానని ఆయన చెప్పారు. నజీర్‌కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. కాబోయే భార్యకు ఆయన డ్రగ్స్ వ్యసనం గురించి తెలిసి, రీహాబిలిటేషన్‌కు వెళ్లాలని సలహా ఇచ్చారు. నజీర్ పూర్తిగా కోలుకున్నాకే వివాహం చేసుకోవాలని వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.

మరొక 15 ఏళ్ల కుర్రాడు, స్నేహితులతో కలిసి డ్రగ్స్‌కు అలవాటుపడ్డానని చెప్పాడు. అవి అక్కడ సులువుగా దొరుకుతున్నాయని తెలిపాడు.

డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

'సమాజం కూడా బాధ్యత వహించాలి'

డ్రగ్స్ సరఫరాను నిరోధించే బాధ్యత ప్రభుత్వానిదేనని యాక్టివిస్టులు అంటున్నారు.

"సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి" అని కశ్మీర్‌లోని యాక్టివిస్ట్ సయ్యద్ షకీల్ ఖలందర్ అన్నారు.

ఈ అంశంపై కశ్మీర్‌లో డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురిని సంప్రదించడానికి మేం ప్రయత్నించాం కానీ, కుదరలేదు.

కశ్మీర్ పోలీసు చీఫ్ విజయ్ కుమార్ కూడా మా టెక్స్ట్ సందేశాలకు స్పందించలేదు.

2019 నుంచి 2022 మధ్య మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద ఐదు వేలకు పైగా కేసులు నమోదైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

డ్రగ్స్‌ వ్యాపారులు, డ్రగ్స్‌ సరఫరాదారులపై పెద్దయెత్తున చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, డ్రగ్స్ సమస్య ప్రభుత్వానిది మాత్రమే కాదని, సమాజం కూడా బాధ్యత వహిస్తూ ముందుకు రావాలని ఒక పోలీస్ అధికారి బీబీసీతో చెప్పారు.

డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, ఒకే సిరింజి వాడడం వల్ల హెపటైటిస్ సీ లాంటి అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని డాక్టర్ యాసిర్ చెప్పారు.

డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు సరిపోక దొంగతనాల వంటి ఇతర నేరాలు కూడా పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

అయితే, నజీర్ లాంటి వాళ్లు ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు.

"మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. కానీ, దృఢసంకల్పం ఉంటే చేయగలరు. మీకో కుటుంబం ఉంది, వారికి మీరు కావాలి అని గుర్తుంచుకుంటే చాలు" అంటున్నారు నజీర్.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)