మేకప్ కిట్‌లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు, పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులు - ఏంటీ వివాదం?

కుటుంబ నియంత్రణ

ఫొటో సోర్స్, ALOK DHANUA

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం అందించిన పహల్ కిట్

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ప్రవేశపెట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా ఈ పథకం కింద రాష్ట్రంలోని ఝబువా జిల్లాలో సామూహిక వివాహాల్లో అమ్మాయిలకు మేకప్ కిట్లు ఇచ్చారు.

అయితే, ఈ కిట్లలో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు ఉన్నాయన్న వ్యవహారం వివాదంగా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో డిండోరి జిల్లాలో ఇలాంటి సామూహిక వివాహ వేడుకలకు ముందు బాలికలకు ప్రెగ్నెన్సీ టెస్టులు జరిగాయన్న వార్తలు వచ్చాయి.

వైద్య పరీక్షల సాకుతో పిలిపించి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని ఓ మహిళ బీబీసీకి చెప్పింది. అయితే, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని జిల్లా అధికారులు బీబీసీకి చెప్పారు.

అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువ. మే 29న ఇక్కడ జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో 292 మంది మహిళలకు పెళ్లిళ్లు జరిగాయి.

ఈ వివాహం సందర్భంగా తనకు ప్రభుత్వం నుంచి మేకప్‌ కిట్ అందిందని ఓ మహిళ బీబీసీకి చెప్పారు.

మేకప్ వస్తువులు ఉన్నాయనుకుని దాన్ని తెరవగా, అందులో రెండు బొట్టు బిళ్లలు, దువ్వెన, కొన్ని ట్యాబెట్లు, ఇంకా ‘ఆ వస్తువులు’ ఉన్నాయని ఆమె చెప్పారు. వాటిని తాను కాల్చేసినట్లు బీబీసీకి వెల్లడించారు.

గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లు అనే మాటలకు చెప్పడానికి బిడియపడి, ‘ఆ వస్తువులు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

మరి గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లను ఎందుకు కాల్చేశారని ప్రశ్నించగా, ‘‘వాళ్లు మాకు ఇచ్చారు. కానీ, వాటిని దాచుకుని ఏం చేసుకుంటాం’’ అని ఆమె ప్రశ్నించారు.

ఝబువా కలెక్టర్ తన్వి హుడా ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక ట్యాబ్లెట్లు ఉన్న విషయాన్ని ఆమె ఖండించారు.

అయితే, కొత్తగా పెళ్లయిన వారికి కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కల్పించేందుకు వాటిని మామూలుగా అధికారులు అందించి ఉంటారని కలెక్టర్ చెప్పారు.

మరోవైపు, డిండోరిలో ఇంతకు ముందు జరిగిన సామూహిక వివాహానికి ముందు, అమ్మాయిలకు గర్భస్థ పరీక్షలు నిర్వహించారన్న వార్తలు వినిపించాయి.

ఈ విషయంపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక యువతి ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు. ‘‘నేను వివాహం కోసం రిజిస్టర్ చేసుకున్నాను. పెళ్లికి ముందు మెడికల్ టెస్టులని నన్ను పిలిచారు. అక్కడ మూత్ర పరీక్షలు చేశారు. మరుసటి రోజు పెళ్లికి వాళ్లు నిరాకరించారు. నేను గర్భవతినని, పెళ్లి చేయడం కుదరదని చెప్పారు. నేను గర్భవతిని కాదని వాదించాను. అసలు పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి ? ఈ రూల్ ఎక్కడుంది?’’ అని ఆమె ప్రశ్నించారు.

అయితే, డిండోరి కలెక్టర్ వికాస్ మిశ్రా మాత్రం, తాము ఎవరికీ ఇలాంటి పరీక్షలు చేయలేదని చెప్పారు.

కుటుంబ నియంత్రణ

ఫొటో సోర్స్, ALOK DHANUA

యువతుల ఫిర్యాదులపై విచారణ జరిపాం: అధికారులు

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి తీవ్రంగా ఉన్న జిల్లాల్లో మధ్యప్రదేశ్‌లోని డిండోరి కూడా ఒకటి అని కలెక్టర్ వికాస్ మిశ్రా బీబీసీకి తెలిపారు. ఇది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి.

"ఆరోగ్య అధికారులు ఈ వ్యాధికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఐదుగురు బాలికలు తమకు నెల రోజులుగా పీరియడ్స్ రాలేదని చెప్పారు. మహిళా డాక్టర్, ఇంకా ఈ అమ్మాయిల మధ్య సంభాషణ జరిగింది. విచారించిన తర్వాత వారు గర్భిణులని తేలింది. వివాహానికి ముందు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలలో ఉంది’’ అని కలెక్టర్ చెప్పారు.

"ఈ అమ్మాయిలను సామూహిక వివాహాలలో పాల్గొనడానికి అనుమతి నిరాకరించడంలో ఈ విషయం బయటపడింది." అని కలెక్టర్ చెప్పారు. వారిలో ఎవరికీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయలేదని కలెక్టర్ చెప్పారు.

మరి అమ్మాయిలు గర్భవతులైతే సామూహిక వివాహాలలో పాల్గొనకూడదా? ఈ ప్రశ్నకు కలెక్టర్ సమాధానమిచ్చారు. ‘‘వీరు గర్భవతులు కాబట్టి, వీరు ఇంతకు ముందే పెళ్లాడారా అన్నది విచారించి, జరగలేదని తేలితే జరిపిస్తాం.’’ అని కలెక్టర్ తెలిపారు.

పెళ్లికి ఒకరోజు ముందు యువతులకు మూత్ర పరీక్షలు నిర్వహించి సామూహిక వివాహానికి నిరాకరించారన్న ఆరోపణలను డిండోరి జిల్లా బచ్చర్ గ్రామ సర్పంచ్ మేదిని మరావీ కూడా సమర్ధించారు.

"అది రక్తపరీక్ష కాదు. మూత్ర పరీక్ష. గర్భం గురించి తెలుసుకోవడానికి చేసిన పరీక్ష. వివాహం చేసుకోవడానికి వచ్చిన అమ్మాయిలందరికీ ఈ పరీక్ష జరిగింది. ఈ విషయాన్ని అధికారులకు కూడా చెప్పాను" అని ఆమె చెప్పారు.

తాము ఈ అమ్మాయిలను పెళ్లి కోసం తీసుకెళ్తే నిరాకరించారని, టెస్టుల తర్వాత వారి పేర్లను జాబితా నుంచి తీసేశారని మరావి ఆరోపించారు.

అయితే, అలాంటి పరీక్షలేవీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ రిపోర్టును మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అందజేసినట్లు చెబుతున్నారు.

కుటుంబ నియంత్రణ

ఫొటో సోర్స్, NEHA BAGGA FB PAGE

ప్రతిపక్షాల విమర్శలు

గర్భస్థ శిశు పరీక్షలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

‘‘మేం కుటుంబ నియంత్రణకు వ్యతిరేకం కాదు. కానీ, పేద గిరిజన బాలికలకు ఈ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలా చేయడం వారి గోప్యత హక్కుకు భంగం కలిగించడమే’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పీయూష్ బాబెల్ అన్నారు.

అయితే, డిండోరి కేసు దర్యాప్తులో ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నేహా బగ్గా అన్నారు.

ఝబువా కేసు విషయంలో ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని, దీని కింద కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని, అందుకోసం ‘పహల్‌ కిట్‌’ ఇస్తున్నామని చెప్పారు.

" కుటుంబ నియంత్రణపై పట్టణ ప్రాంత ప్రజలకు అవగాహన ఉంది, దాన్ని గ్రామీణ, గిరిజన ప్రజలకు ఎందుకు దూరం చేయాలి. వారికి కౌన్సెలింగ్ తర్వాత ఈ కిట్‌లు ఇచ్చారు, అందులో తప్పేముంది" అని బగ్గా ప్రశ్నించారు.

‘‘ ప్రజలకు బలవంతంగా స్టెరిలైజేషన్ చేసిన చరిత్ర ఉన్న పార్టీ, కుటుంబ నియంత్రణ గురించి బీజేపీకి అవగాహనా పాఠాలు నేర్పాలనుకోవడం హాస్యాస్పదం’’ అని బగ్గా అన్నారు.

కుటుంబ నియంత్రణ

ఫొటో సోర్స్, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సామూహిక వివాహాల్లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం గిరిజనుల ఓట్లకు గాలం వేసిందని నిపుణులు అంటున్నారు.

అనేక సందేహాలు...

ఇలాంటి సామూహిక వివాహాల కేసుల్లో అనేక మోసాలు తెరపైకి వచ్చాయని, వాటి విచారణ కొనసాగుతోందని సంధ్య టైమ్స్ ఎడిటర్ సంజయ్ ప్రకాశ్ చెబుతున్నారు.

"చాలా జంటలు అప్పటికే వివాహం చేసుకుని, డబ్బు కోసం రెండోసారి వివాహానికి వస్తున్నారు. వారిలో చాలామంది గర్భందాల్చి ఉంటున్నారు. అధికారులు కూడా ఇటువంటి నకిలీ వివాహాలకు సహకరిస్తున్నారు" అని సంజయ్ ప్రకాశ్ అన్నారు.

‘‘ఈ సామూహిక వివాహాలకు ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని సూచించాలి. కుటుంబ నియంత్రణ మీద అవగాహన కల్పించాలి. అలా కాకుండా మాత్రలు, కండోమ్‌లు ఇవ్వడం ఎందుకు? ముందుగా వారిలో ఎందరికి పెళ్లయిందో గుర్తించాలి’’ అని ఆయన అన్నారు.

గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఇలాంటివి ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సీనియర్ జర్నలిస్టు అలోక్ దీక్షిత్ ప్రశ్నించారు.

"ఒక అమ్మాయి గర్భవతి అయినంత మాత్రాన పెళ్లికి నిరాకరించాలా? ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోకుండా, వారి మేకప్ కిట్‌లో ట్యాబ్లెట్లు, కండోమ్‌లు పెట్టి వారిని అవమానించడమే’’ అని ఆయన అన్నారు.

శివరాజ్ చౌహాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామూహిక వివాహ పథకాలు ఓటర్లను, ముఖ్యంగా మహిళలను వారి పార్టీకి చేరువ చేస్తాయని, ఎన్నికలలో గెలుపొందడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న తండ్రి కోసం పెళ్లి కాకుండానే తల్లి అయిన కూతురు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)