ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2023: వాతావరణ మార్పుల ప్రమాదాలను మనం నివారించగలమా?

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పులు ఇప్పుడు మానవ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. మానవ కార్యకలాపాల వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
ఈ సమస్య పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరవు, సముద్ర మట్టాలు పెరగడం, జీవజాతులు సామూహికంగా అంతం కావడం అనే విపత్కర పరిస్థితులను మానవులు, ప్రకృతి అనుభవించాల్సి వస్తుంది.
వాతావరణ మార్పులతో ప్రపంచం పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. కానీ, దీనికి తగిన పరిష్కారాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పు అంటే ఏంటి?
ముందుగా వెదర్ అంటే ఏంటో తెలుసుకుందాం. రోజూవారి జీవితంలో మనం అనుభవిస్తున్న వాతావరణాన్ని వెదర్ అంటారు.
అలాగే, చాలా ఏళ్లుగా ఒక ప్రదేశంలో సగటున నెలకొని ఉన్న వాతావరణాన్ని క్లైమేట్‌గా పిలుస్తారు. క్లైమేట్ అంటే వాతావరణ పరిస్థితి అని చెప్పొచ్చు.
అదే విధంగా ఒక ప్రదేశంలోని సగటు వాతావరణంలో వచ్చే మార్పును క్లైమేట్ చేంజ్ లేదా వాతావరణ మార్పు అని అంటారు.
వాతావరణ మార్పులు చాలా వేగంగా మారడం మనం చూస్తున్నాం. మానవులు తమ ఇళ్లు, పరిశ్రమలు, రవాణా కోసం చమురు, గ్యాస్, బొగ్గును వాడటం వల్ల ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.
ఈ శిలాజ ఇంధనాలు మండినప్పుడు, అవి గ్రీన్ హౌజ్ వాయువులను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వీటి నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఈ వాయువులు సూర్యుని వేడిని తమలో బంధించి, భూగ్రహంపై ఉష్ణోగ్రతలను పెంచుతాయి.
19వ శతాబ్దం కంటే ప్రపంచం ఇప్పుడు 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిగా ఉంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం 50 శాతం పెరిగింది.
వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను నివారించాలనుకుంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా తగ్గించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2100 నాటికి గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు పరిమితం చేయాలని సూచిస్తున్నారు.
అయితే, దీనికి తగిన చర్యలను తక్షణమే తీసుకోకపోతే 2100 నాటికి భూగ్రహం 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడెక్కుతుంది.
ప్రపంచం ఈ శతాబ్దం చివరి నాటికి 2.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడెక్కే దిశగా పయనిస్తోందని 2021 నివేదికలో క్లైమేట్ యాక్షన్ ట్రాక్ గ్రూప్ పేర్కొంది.
అసలేమీ చేయకపోతే, భవిష్యత్‌లో గ్లోబల్ వార్మింగ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్‌ను మించిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వినాశకరమైన వడగాల్పులతో పాటు సముద్ర మట్టాలు పెరగడం వల్ల లక్షలాది మంది నిరాశ్రయులుగా మారతారని హెచ్చరిస్తున్నారు. భూమికి, జంతువులకు కోలుకోలేని నష్టం జరుతుందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పుల ప్రభావాలు ఏంటి?
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ పరిస్థితులు మునుపెన్నడూ లేని విధంగా నమోదు అవుతున్నాయి.
భూగ్రహం ఇంకా వేడెక్కితే కొన్ని ప్రాంతాలు నివసించడానికి పనికి రాకుండా పోతాయి. సాగు భూములు ఎడారులుగా మారతాయి.
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది. నిరుటి వేసవిలో యూరప్ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది.
2022 జనవరి నుంచి జూలై మధ్య ఫ్రాన్స్, జర్మనీలలో సగటు కంటే ఏడు రెట్లు ఎక్కువ కార్చిచ్చులు (Land burnt)నమోదు అయ్యాయి.
ఇతర ప్రాంతాల్లో విపరీత వర్షాల కారణంగా గత ఏడాది రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయి. చైనా,పాకిస్తాన్, నైజీరియాల్లో వరదలు విలయం సృష్టించాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసించే ప్రజలకు వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు తగినంత వనరులు లేకపోవడం వల్ల వారు ఎక్కువగా నష్టపోతారని భావిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువ స్థాయిలో గ్రీన్ హౌజ్ వాయువులను విడుదల చేస్తాయి. అయినప్పటికీ వాతావరణ మార్పుల విపరీత ప్రభావాలకు గురి కావడంతో ఈ దేశాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి.
భూమి మీద సముద్రాలు, అందులోని జీవాలు కూడా వాతావరణ మార్పులతో ప్రమాదంలో ఉన్నాయి.
యూఎస్ నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్మిరిక్ అడ్మినిస్ట్రేషన్ 2022 ఏప్రిల్‌లో ప్రచురించిన పరిశోధన పత్రం ప్రకారం, 10-15 శాతం సముద్ర జాతులు ఇప్పటికే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు తేలింది.
భూమ్మీద నివసించే జంతువులకు కూడా ఆహారం, నీరు దొరకడం కష్టంగా మారుతుంది. ఉదాహరణకు మంచులో నివసించే ధ్రువపు ఎలుగుబంట్లు వాతావరణం వేడెక్కి మంచు కరిగిపోతే మనుగడ సాగించలేవు.
అవసరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ శతాబ్దంలో కనీసం 550 జీవజాతులు అంతరించేపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వాతావరణ మార్పులు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉంటుంది. ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు పరిమితం చేయకపోతే విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ఐపీసీసీ చెప్పింది. అవేంటంటే,
భారీ వర్షాల కారణంగా యూకే, యూరప్‌లు భయంకరమైన వరదల్లో చిక్కుకుంటాయి.
మధ్యప్రాచ్య దేశాలు విపరీతమైన వడగాల్పులు, కరవు బారిన పడతాయి.
పసిఫిక్ రీజియన్‌లోని ద్వీప దేశాలు సముద్రంలో మునిగిపోతాయి
అనేక ఆఫ్రికా దేశాలు కరవు, ఆహారపు కొరతను ఎదుర్కొంటాయి.
పశ్చిమ అమెరికాలో కరవు పరిస్థితులు ఏర్పడతాయి, ఇతర ప్రాంతాల్లో తీవ్ర తుపానులు సంభవిస్తాయి.
ఆస్ట్రేలియాలో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల కార్చిచ్చులు పెరుగుతాయి

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
సమష్టిగా పనిచేయడం ద్వారానే వాతావరణ మార్పులను ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి. 2015 పారిస్‌లో జరిగిన సమావేశంలో గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు.
2022 నవంబర్‌లో కాప్27 పేరుతో ఈజిప్ట్ ఒక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ నేతలను ఆహ్వానించింది. ఈ సమావేశంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కొత్త తీర్మాణాలు చేయడానికి ప్రపంచ నేతలంతా కలిసి వచ్చారు.
2050 నాటికి సున్నా స్థాయికి ఉద్గారాలను తగ్గిస్తామంటూ చాలా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.
ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, పౌరులు తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రజలు ఏం చేయవచ్చు?
ప్రభుత్వాలు, పరిశ్రమల నుంచి పెద్ద మార్పులు రావాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, సాధారణ ప్రజలు కూడా తమ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం వల్ల వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిమితం చేయవచ్చని చెబుతున్నారు. అవేంటంటే,
ప్రయాణాల కోసం తక్కువగా విమానాలను ఉపయోగించడం
కారును వాడకూడదు లేదా ఎలక్ట్రిక్ కారును వాడాలి
మాంసం, డెయిరీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలి
గ్యాస్ హీటింగ్ వ్యవస్థ నుంచి ఎలక్ట్రిక్ హీట్ వ్యవస్థకు మారాలి
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














