ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను మార్చితే ఏమవుతుంది? పర్వతారోహకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఫొటో సోర్స్, C. SCOTT WATSON
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎవెరెస్ట్ బేస్ క్యాంప్‌ను దిగువకు తరలించే యోచనలో ఉన్నట్టు నేపాల్ ప్రభుత్వం నిరుడు జూన్‌లో తెలిపింది.
గ్లోబల్ వార్మింగ్, మానవ చర్యల వల్ల ప్రస్తుతం ఉన్న చోటు పర్వతారోహకులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పింది. కానీ, షెర్పా కమ్యూనిటీ, ఇతర పర్వతారోహణ నిర్వాహకుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచన విరమించుకుంది.
ప్రస్తుతం ఈ క్యాంప్ ఖుంబు హిమానీనదంపై ఉంది. ఇది వేగంగా కరిగిపోతోంది. దాని వల్ల పర్వతారోహకులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
ఏటా వందలాది ఎవరెస్ట్ ఎక్కేందుకు వస్తారు. వారంతా మొదట బేస్ క్యాంప్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి ఎవెరెస్ట్ అధిరోహణ మొదలవుతుంది.
బేస్ క్యాంప్‌ను మార్చడం కష్టమని, అందుకు ప్రత్యామ్యాయంగా అనువైన స్థలం కూడా లేదని షెర్పా నాయకులు బీబీసీతో చెప్పారు.
పర్వతారోహణ రంగానికి షెర్పా వర్గం వెన్నెముక వంటిది. కాబట్టి వాళ్ల అభిప్రాయం కీలకమైనది.
బేస్ క్యాంప్ మార్చడంపై విముఖత ఉందని, ఇటీవల పర్వతారోహణ రంగంలో ఉన్నవారితో సంప్రదింపులు జరిపినప్పుడు 95 శాతం కంటే ఎక్కువమంది ఈ ఆలోచనను కాదన్నారని నేపాల్ పర్యాటక శాఖ అధికారులు, నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్ సభ్యులు చెప్పారు.
ప్రస్తుతానికి ఈ ఆలోచనను విరమించుకుంటున్నట్లు అధికారులు బీబీసీకి తెలిపారు. అయితే, దీనిపై అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు.

'ఒక్క షెర్పా కూడా అంగీకరించలేదు'
"బేస్ క్యాంప్‌ను తరలించడానికి మా కమ్యూనిటీలో ఒక్కరు కూడా అంగీకరించలేదు. దాన్ని మార్చడానికి మాకు కారణాలేమీ కనిపించలేదు. సమీప భవిష్యత్తులో కూడా అంత అవసరం రాదు" అని 'ఖుంబు పసంగ్లహము' చైర్‌పర్సన్ మింగ్మా షెర్పా అన్నారు.
ఖుంబు పసంగ్లహము అనేది ఎవరెస్ట్ ప్రాంతంలో బేస్ క్యాంప్ సహా అత్యధిక భాగాన్ని కవర్ చేసే గ్రామీణ మునిసిపాలిటీ.
'నేపాల్ నేషనల్ మౌంటైన్ గైడ్స్ అసోసియేషన్' ప్రెసిడెంట్ ఆంగ్ నోర్బు షెర్పా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
"70 ఏళ్లుగా బేస్ క్యాంప్ అక్కడే ఉంది. దాన్ని ఇప్పుడెందుకు మార్చాలి? ఒకవేళ మార్చాలనుకున్నా, ప్రత్యామ్నాయ స్థలం కోసం పరిశోధన ఏది?" అని ఆయన ప్రశ్నించారు.
అలాగే, ఇది అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన సమస్య కాదని నేపాల్ పర్యాటక మంత్రి సూడాన్ కిరాటి అన్నారు. ఆయన ఇటీవలే ఈ శాఖ బాధ్యతలు స్వీకరించారు.
"బేస్ క్యాంప్‌ను మార్చడంపై ఆసక్తి లేదా ఆందోళన ఎక్కడా కనిపించలేదని" ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, C. SCOTT WATSON
పలుచనవుతున్న హిమనీనదం, పెరుగుతున్న ముప్పు
కిందటి ఏడాది బేస్ క్యాంప్ మార్చాలని నేపాల్ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, కొత్త బేస్ క్యాంప్ 5,364 మీ (17,598 అడుగులు) ఎత్తులో, ప్రస్తుతం ఉన్న దాని కన్నా 200 నుంచి 400 మీటర్ల (656 అడుగుల నుంచి 1312 అడుగులు) దిగువున ఉంటుందని తెలిపింది.
హిమనీనదం లేని స్థలానికి బేస్ క్యాంప్ మార్చాలన్నది ఆలోచన. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే, హిమనీనదాలు కరిగే వేగం పెరుగుతుంది. ఆ ముప్పు లేకుండా ఉండాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది.
హిమాలయాల్లో ఉన్న అనేక హిమనీనదాలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేగంగా కరిగిపోతున్నాయి. ఖుంబు కూడా అలాగే కరిగిపోతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
2018లో లీడ్స్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో, బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉన్న భాగం సంవత్సరానికి 1 మీటరు చొప్పున పలుచనవుతోందని తేలింది.
ప్రపంచంలోనే ఎత్తైన హిమానీనదం ఖుంబు. దీనిపై ఉన్న సరస్సులు, చెరువులు కలిసిపోయి, విస్తరిస్తున్నాయని, దీనివల్ల పర్వతారోహకులకు సవాళ్లు పెరుగుతున్నాయని క్షేత్ర స్థాయి అధ్యయనాలు చెబుతున్నాయి.
"మంచు కరుగుతుంటే రాతి శిథిలాల కింద చలనం పెరుగుతుంది. దాంతో, నీటి మడుగులు ఏర్పడతాయి. అవి క్రమంగా సరస్సులుగా మరతాయి" అని అబెరిస్ట్‌విత్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బ్రైన్ హబ్బర్డ్ వివరించారు. హిమనీనదంలో మంచు పరిస్థితులను తనిఖీ చేయడానికి నిర్వహించిన మూడేళ్ల ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించారు ఆయన.
బేస్ క్యాంప్ మధ్యలో నుంచి నీటి ప్రవాహాలు మొదలవుతున్నాయని, హిమనీనదం బీటలు వారిపోతోందని, పగుళ్లు చాలా త్వరగా, ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయని పర్వతారోహకులు, అధికారులు చెబుతున్నారు.
బేస్ క్యాంప్‌ను తరలించే ఆలోచన మంచిదేనని, భవిష్యత్తులో మరిన్ని మంచుఫలకాలు, కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని 'ఆల్పెన్‌గ్లో ఎక్స్‌పెడిషన్స్' వ్యవస్థాపకుడు అడ్రియన్ బలింగర్ అభిప్రాయపడ్డారు. ఈ కంపెనీ పర్వతారోహకులకు గైడెన్స్ అందిస్తుంది.
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో పెరిగే ప్రమాదాలపై తనకు అవగాహన ఉందని నేపాల్ పర్వతారోహణ సంఘం అధ్యక్షుడు నిమా నురు షెర్పా అన్నారు.
"కానీ, బేస్ క్యాంప్ ఎక్కడికి మార్చాలన్న దానిపై స్పష్టత లేదు. అందుకే ఈ ఆలోచనకు మద్దతు లభించట్లేదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖుంబు ఐస్‌ఫాల్ గండం
వాటర్‌ఫాల్ లాటిదే ఐస్‌ఫాల్. గడ్డకట్టుకుపోయిన జలపాతంలా ఉంటుంది. హిమన నదాల వద్ద పై నుంచి కిందకు ఏటవాలుగా ఐస్‌ఫాల్స్ ఏర్పడతాయి.
ప్రస్తుతం బేస్ క్యాంప్ ఉన్న స్థలం పొద్దున్నే పర్వతారోహణ మొదలెట్టడానికి అనువుగా ఉంటుందని షెర్పా కమ్యూనిటీలో పర్వతారోహకులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనికి ఆనుకుని ఖుంబు ఐస్‌ఫాల్ ఉంది. ఎవెరెస్ట్ అధిరోహణలోని పెద్ద గండాల్లో ఇదీ ఒకటి.
ఎవరెస్ట్ శిఖరానికి సౌత్ కోల్ మార్గంలో ఖుంబు ఐస్‌ఫాల్ ఉంది. ఇది వేగంగా పడిపోతూ ఉంటుంది. అందువల్ల మార్గంలో పగుళ్లు ఏర్పడతాయి. దాంతో, మంచు దిమ్మలు స్థానభ్రంశం చెందుతూ ఉంటాయి. ముందస్తు సూచనలేమీ లేకుండా ఇవన్నీ జరుగుతాయి. అంతే కాకుండా, రెండు వైపులా ఉన్న పర్వత సానువుల నుంచి హిమపాతాలు, పెద్ద పెద్ద రాళ్లు కింద పడి దీన్ని ఢీకొంటాయి.
పొద్దున్నే ఖుంబు ఐస్‌ఫాల్ దాటేస్తే మంచిదని, ఎండెక్కుతున్న కొద్దీ ఇది ప్రమాదకరంగా మారుతుందని, వేడికి మంచు కరగడం వల్ల మంచు దిమ్మలు, సెరాక్స్ దొర్లుకుంటూ వచ్చి పడతాయని షెర్పా అధిరోహకులు చెబుతున్నారు.
"క్యాంప్‌ను దిగువ ప్రాంతానికి తరలిస్తే, అధిరోహలకు సుమారు మూడు గంటల నడక పెరుగుతుంది. దానివల్ల ఖుంబు ఐస్‌ఫాల్‌కు చేరుకోవడం ఆలస్యం అవుతుంది. అధిరోహణ ప్రమాదకరంగా మారుతుంది" అని మింగ్మా వివరించారు.
ఏప్రిల్ 12న ఖుంబు ఐస్‌ఫాల్ వద్ద హిమపాతం ఢీకొనడంతో ముగ్గురు షెర్పా అధిరోహకులు చనిపోయారు.
బేస్ క్యాంప్‌ను కిందకు తరలించినప్పటికీ, పర్వతారోహకుల బృందాలు మునుపటి బేస్ క్యాంప్ ప్రాంతానికే చేరుకుని, అక్కడినుంచి అధిరోహణ ప్రారంభిస్తాయని మింగ్మా అంటున్నారు. ఎందుకంటే, అక్కడ ఆగితే మర్నాడు పొద్దున్నే అధిరోహణ మొదలెట్టి ఖుంబు ఐస్‌ఫాల్ దాటడం సులువు.
బేస్ క్యాంప్‌ను తరలిస్తే ఎవరెస్ట్ అధిరోహణలో మొదటి దశ పొడవైపోతుందని, అది అంత అనుకూలం కాదని ఆస్ట్రియాకు చెందిన అంతర్జాతీయ యాత్రా నిర్వాహకుడు లుకాస్ ఫర్టెన్‌బాచ్ అంటున్నారు. ఆయన ఏటా అనేకమంది పర్వతారోహకులను ఎవరెస్ట్‌కు తీసుకొస్తారు.
"బేస్ క్యాంప్‌ను కిందకు తరలిస్తే, ప్రస్తుతం ఉన్న బేస్ క్యాంప్ ప్రదేశాన్ని మధ్యస్థ బేస్ క్యాంప్‌గా మార్చుకుంటారు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బేస్ క్యాంప్‌లో పెరుగుతున్న రద్దీ
అయితే, ప్రస్తుతం ఉన్న బేస్ క్యాంప్ బాగా రద్దీగా మారుతోందన్నది వాస్తవమని పర్వతారోహణ రంగంలో ఉన్నవారంతా అంగీకరిస్తున్నారు.
ఈ సీజన్‌లో నేపాల్ రికార్డు స్థాయిలో 478 ఎవరెస్ట్ అధిరోహణ అనుమతులు మంజూరుచేసింది. అంటే 1,500 మందికి పైనే పర్వతంపైన ఉంటారు. వీళ్లకు సపోర్ట్ సిబ్బంది కూడా ఉంటారు.
ఇంతకుముందు 2021లో అధికంగా 403 అనుమతులు ఇచ్చారని టూరిస్ట్ విభాగం అధికారులు చెప్పారు.
ఎవరెస్ట్ ఎక్కడానికి చార్జీలు మనిషికి 11,000 డాలర్లు (సుమారు రూ. 9,08,847).
"గత కొన్నేళ్లల్లో బేస్ క్యాంప్ పరిణామం రెట్టింపు పెరిగింది. చాలా భారీ స్థాయిలో ఈ నిర్వహణ జరుగుతోంది" అని 'ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ నేపాల్' అధ్యక్షుడు దంబర్ పరాజులి చెప్పారు.
అయితే, నియంత్రణ లేకుండా క్యాంప్ సైజు పెరగడం, ఇప్పటికే సున్నితంగా ఉన్న వాతావరణాన్ని మరింత దెబ్బ తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"డీలక్స్ సర్వీసుల్లాంటివి కూడా వచ్చేశాయి. మసాజ్ పార్లర్లు, వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి. వీటి కోసం పెద్ద పెద్ద గుడారాలు, ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో లగ్జరీ కోరుకోకూడదు. బేస్ క్యాంప్‌లో ఎలాంటివి ఉండాలి, ఏవి ఉండకూడదు అని చెబుతూ ఒక నియమావళి తయారుచేయాలని మేం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం" అని ఆయన చెప్పారు.
బేస్ క్యాంప్ వద్ద ఇలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసని మంత్రి కిరాటి చెప్పారు.
"బేస్ క్యాంప్ టూరిస్ట్ మార్కెట్‌లాగ తయారైంది. ఇది అంగీకారం కాదు. మేం త్వరలో తనిఖీకి వెళ్లి, అవన్నీ ఆగేలా చూస్తాం. ఇప్పుడు ఇదే మాకు ప్రాధాన్యం" అని కిరాటి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం మన తాత ముత్తాతలు ఇంకా బతికే ఉన్నారా?
- వరకట్నం: భారత్‌లో అబ్బాయిలు ఎంత ఎక్కువగా చదువుకుంటే కట్నం అంతగా పెరుగుతోందా, రీసెర్చ్‌లో ఏం తేలింది?
- ప్యాటీ హార్ట్స్: తనను కిడ్నాప్ చేసిన వారితో కలిసి బ్యాంకులను దోచుకున్న మీడియా టైకూన్ మనవరాలి కథ
- రెజ్లర్లపై దిల్లీ పోలీసుల కేసు, మళ్లీ ఆందోళనకు దిగుతామన్న సాక్షి మలిక్
- మోదీ తొమ్మిదేళ్ల పాలన: ఇవీ మా 9 విజయాలన్న బీజేపీ.. 9 ప్రశ్నలతో కాంగ్రెస్ విమర్శలు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














