Uttarakhand: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకులు మృతి.. 20 మంది గల్లంతు

హిమాలయాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎల్సా మాయిష్మాన్
    • హోదా, బీబీసీ న్యూస్

భారత హిమాలయాల్లో పర్వతారోహణ చేస్తున్న బృందంపై మంచు చరియలు విరిగిపడటంతో 10 మంది చనిపోయారు. మరో 20 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు.

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో 34 మంది ట్రైనీలు, ఏడుగురు శిక్షకులు.. పర్వాతారోహణ శిక్షణలో పాల్గొంటున్నారు.

మౌంట్ ద్రౌపది దండా-2 పర్వత శిఖరం నుంచి దిగుతున్న సమయంలో మంచు చరియలు విరిగిపడ్డాయని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ తెలిపింది.

పర్వతారోహకులంతా సమీపంలోని ఈ ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారే.

సముద్రమట్టానికి 18,602 అడుగుల (5,670 మీటర్లు) ఎత్తులో ఉండే ఈ పర్వత శిఖరం నుంచి మంచు చరియలు దూసుకురావటంతో వీరంతా ఓ పగులులోకి కొట్టుకుపోయారు.

ఉత్తరాఖండ్

ఫొటో సోర్స్, ANI

ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని రక్షించామని, ఇంకా 20 మంది ఆచూకీ తెలియటం లేదని పోలీసులు చెప్పారు.

ఈ ప్రమాదానికి సంబంధించి మంగళవారం ఉదయం 9:30 గంటల సమయంలో అధికారులకు సమాచారం అందిందని సహాయ సిబ్బంది చెప్పారు.

సహాయ చర్యల్లో భారత వాయు సేన తోడ్పాటునందిస్తోంది. వర్షం, హిమపాతం వల్ల మంగళవారం రాత్రి సహాయ చర్యలు నిలిచిపోయాయి. బుధవారం తిరిగి ప్రారంభించారు.

''ఈ రోజు ఆరు మృతదేహాలను వెలికి తీశాం. ఇప్పటి వరకూ 10 మృతదేహాలను వెలికితీశాం'' అని ఉత్తరాఖండ్ పోలీస్ చీఫ్ అశోక్ కుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకోవటం కష్టమని, భారత వాయుసేన పర్వతం వద్ద ఏరియల్ రెక్కీ నిర్వహిస్తోందని ఆయన అంతకుముందు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

''నెహ్రూ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్తరకాశిలో నిర్వహిస్తున్న పర్వతారోహణ యాత్ర మీద మంచుచరియలు విరిగిపడి విలువైన ప్రాణాలు కోల్పోవటం తీవ్ర ఆవేదనకు గురిచేసింది'' అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఈ ప్రమాదం జరగటానికి వారం రోజుల ముందు.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్కీ మౌంటెనీర్ హిలరీ నెల్సన్ నేపాల్ హిమాలయాల్లో ప్రాణాలు కోల్పోయారు.

హిలరీని తన తరానికి చెందిన గొప్ప పర్వతారోహకుల్లో ఒకరిగా భావిస్తారు. ఆమె మౌంట్ మానాస్లు శిఖరానికి చేరుకున్న తర్వాత ఓ లోతైన పగులులో పడిపోయి చనిపోయారని వార్తలు వచ్చాయి.

ఆమె అదృశ్యమైన రోజునే.. అదే పర్వతం మీద శిఖరానికి దిగువభాగంలో మంచు చరియలు విరిగిపడి ఒక వ్యక్తి చనిపోగా, మరో 10 మందికి పైగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)