రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఉత్సాహం, ఉత్కంఠ, సందేహాల నడుమ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చినట్లు వేల మంది రాకపోయినప్పటికీ, రాహుల్ గాంధీ పాల్గొనే కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం ప్రతినిధులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రవాస భారతీయులను తీసుకురాగలిగారు.

ప్రతిపక్ష నేత కాకపోయినా, కనీసం పార్లమెంట్ సభ్యుడు కూడా కాకున్నా, రాహుల్ పాల్గొన్న కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులతో గ్యాలరీలు నిండాయి.

రాహుల్ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై ఘన విజయం తర్వాత ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.

అంతకుముందు ఆయన, 4 వేల కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర చేశారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలను ఏకం చేసేందుకు చేపట్టిన ఈ యాత్ర దాదాపు ఐదు నెలలపాటు సాగింది.

ఈ పర్యటనలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

సిలికాన్ వ్యాలీలో ఇండో అమెరికన్లు సాధించిన విజయాలను ప్రశంసించడం ద్వారా రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులను ఆకర్షించారు.

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ ప్రసంగం వినేందుకు, ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు విద్యార్థులు క్యూలు కట్టారు. ప్రవాస భారతీయులతో జరిగిన మరో కార్యక్రమంలో జోడో యాత్ర తరహాలో దేశాన్ని ఏకం చేయాలంటూ నినాదాలు చేశారు.

''జోడో యాత్ర రాహుల్ గాంధీకి టర్నింగ్ పాయింట్. దాని వల్లే కాంగ్రెస్ పార్టీ శక్తిని పుంజుకుంది.'' అని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ శామ్ పిట్రోడా చెప్పారు.

అయితే, అంతర్జాతీయంగా అంత ఫాలోయింగ్ లేని ఓ భారత రాజకీయ నాయకుడు ప్రవాస భారతీయులను ఆకర్షించాలని ఎందుకు అనుకుంటున్నారు?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, CONGRESS

ప్రవాసులు శక్తిమంతులు

అమెరికాలో స్థిరపడిన విదేశీయులతో పోలిస్తే భారతీయుల్లో అధిక ఆదాయ వర్గాలకు చెందిన వారే ఎక్కువ. వాళ్లు అమెరికా, భారత్‌లోని రాజకీయ పార్టీలకు పెద్దమొత్తంలో నిధులు కూడా సమకూరుస్తారు.

ప్రవాస భారతీయులు అమెరికా రాజకీయాల్లోనూ ఓటర్లుగా, అభ్యర్థులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో కాస్త శక్తిమంతులుగానే భావిస్తారు.

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చిన ఏషియన్ అమెరికన్లలో ప్రవాస భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని 2019లో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.

''ఇక్కడ జరిగే ఇలాంటి కార్యక్రమాలు భారత్‌లో ఎన్నికల అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.'' అని వాషింగ్టన్‌లోని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కి చెందిన మేధావి మిలన్ వైష్ణవ్ చెప్పారు.

''అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత ఇమేజ్ పెంచుకోవడం రాహుల్ గాంధీకి అంత సులువైన విషయమేమీ కాదు'' అని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన సంజోయ్ చక్రవర్తి చెప్పారు. ఆయన ‘ది అదర్ వన్ పర్సెంట్: ఇండియన్స్ ఇన్ అమెరికా’ రచయిత కూడా.

అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నప్పటికీ, ''ఆయన్ను చాలా మంది ఒక జోక్‌గా చూస్తారు. అందువల్ల ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.'' అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ పర్యటనకు ఇది సరైన సమయం కాదని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఆయన గౌరవార్థం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో జూన్ 22న ఏర్పాటు చేసిన డిన్నర్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

ఇలాంటి సమయంలో పోటీపడడం చాలా కష్టమని వైష్ణవ్ అన్నారు.

''మీరు విదేశీ రాజకీయ నాయకులైతే ఇక్కడ చాలా గౌరవం దక్కుతుంది. అయితే, ఒకేసారి ఇద్దరూ పర్యటనలు పెట్టుకుంటే ఒకరితో మరొకరిని పోల్చి చూస్తారు''

ప్రవాస భారతీయుల్లో మోదీకి ఓ రాక్‌స్టార్ లాంటి ప్రత్యేకమైన స్థానముంది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గతంలో ఇలాంటివి లేవు

భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుండడంతోపాటు అమెరికాతో బలమైన స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. అటు అమెరికా రాజకీయాలతో పాటు, భారత విదేశాంగ విధానంలోనూ ప్రవాస భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

2000 సంవత్సరంలో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి తొలిసారి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

2014లో మాడిసన్ స్క్వేర్‌లో జరిగిన కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

''మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ నిండిపోయేంత జనాదరణ ఉన్న ప్రపంచ నాయకుడు ఎవరైనా ఉన్నారా?'' అని వైష్ణవ్ ప్రశ్నించారు. ''మరొకరు ఉన్నారని నేను అనుకోవడం లేదు'' అన్నారాయన.

2019లో హోస్టన్‌లో జరిగిన కార్యక్రమానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌తో కలిసి వచ్చిన ప్రధాని మోదీని చూసేందుకు 50 వేల మంది ప్రవాస భారతీయులు తరలివచ్చారు. పోప్ తర్వాత ఒక విదేశీ నాయకుడికి అంత భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది మోదీకే. ఇది అసాధారణమని అప్పట్లో ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు.

భారత్‌కు చెందిన నాయకుల కోసం విదేశాల్లో ఇంత పెద్ద ర్యాలీలు జరిగిన సంఘటనలు గతంలో లేవని చక్రవర్తి చెప్పారు.

''భారత ప్రధానులు చాలాసార్లు వచ్చారు. ఉన్నత స్థాయి అధికారులను కలిసేవారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిగేవి. కానీ, ఇలా బహిరంగ కార్యక్రమాలు నిర్వహించలేదు.''

''ఏదైనా భారీగా చేయడం మోదీ స్టైల్. అది కనిపిస్తోంది'' అని వైష్ణవ్ చెప్పారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకంత ఆసక్తి?

అయితే, భారత్‌లో ఓటు కూడా వేయని ప్రవాస భారతీయులకు అక్కడి రాజకీయాలపై ఎందుకంత ఆసక్తి?

ప్రవాస భారతీయులకు కుటుంబం, సంస్కృతి, ఆర్థికపరంగా తమ మాతృభూమితో బలమైన సంబంధాలున్నాయి. సొంత దేశంలో వ్యక్తిగత పెట్టుబడులు కూడా ఉన్నాయి.

''ప్రవాస భారతీయుల్లో చాలా మంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిలో చాలా మంది వెనక్కి వెళ్లొచ్చు, లేదంటే ఇక్కడే స్థిరపడొచ్చు. అయితే, వారిలో చాలా మందికి భారత్‌లో భూములు, ఇళ్లు, స్టాక్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు ఉన్నాయి.'' అని కాలిఫోర్నియాకు చెందిన పూజ లఖియా అన్నారు.

''ప్రవాస భారతీయులతో సంబంధాలు కొనసాగించడం భారత రాజకీయ నాయకులకు చాలా అవసరం'' అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, రాహుల్ గాంధీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అంత ఆసక్తి చూపించలేదని ఆమె అన్నారు. తాను మోదీ అభిమానినని ఆమె చెప్పారు.

ఇక్కడ కాలేజీ ఫీజులు ఎక్కువగా ఉండడంతో, తాము భారత్‌లోని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల నుంచి లబ్ధి పొందామనే విషయాన్ని ప్రవాస భారతీయులు గుర్తిస్తున్నారు.

ప్రవాస భారతీయుల వ్యాపార లావాదేవీల ద్వారా భారత్‌కు ప్రయోజనం చేకూరుతోందని, గతేడాది 108 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయని సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఓ అధికారి చెప్పారు.

ప్రవాస భారతీయులు అమెరికాలో విలాసవంతమైన జీవితం గడుపుతూ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

భారత రాజకీయ నాయకుల కార్యక్రమాలకు భారీగా తరలిరావడం ద్వారా ''దేశానికి దూరంగా ఉన్నా మా హృదయాలు మీతోనే ఉన్నాయనే సందేశం ఇస్తున్నారు'' అని రాహుల్ గాంధీకి ఆతిథ్యమిచ్చిన కాలిఫోర్నియా యూనివర్సిటీ ట్రస్టీ అను మైత్రా చెప్పారు.

విదేశాల్లో ఉన్నంత మాత్రాన దూరంగా ఉన్నట్టు కాదని ఆమె అన్నారు.

''తొలినాళ్లలో అమెరికా వచ్చి స్థిరపడిన భారతీయులకు తమ మాతృదేశంతో బలమైన సంబంధాలున్నాయి. భారత్‌‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశభక్తితో పెరిగాం.'' అని సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యాపారవేత్త తలత్ హసన్ చెప్పారు.

బాలీవుడ్ సినిమా స్వదేశ్‌లో మాదిరిగా సొంత దేశానికి తిరిగి రావాలని, దేశానికి ఏదో ఒకటి చేయాలని కలలుగనే వాళ్లు చాలామంది ఉంటారు. ఈ సినిమాలో హీరో (షారుఖ్ ఖాన్) నాసా శాస్త్రవేత్త కాగా, తన ఊరును అభివృద్ధి చేయడానికి తిరిగి స్వదేశానికి వచ్చినట్లు చూపిస్తారు.

ఈ సినిమా కథకు స్ఫూర్తి అయిన భారతీయ అమెరికన్ ఇంజినీర్ రవి కూచిమంచి, రాహుల్ గాంధీ ప్రసంగం వినడానికి ఈ వారంలో కాలిఫోర్నియా వెళ్లారు.

‘‘ఆయనలో నిజాయితీ కనిపించింది. మా నుంచి తనకు ఏం కావాలో ఆయనే చెప్పాలి’’ అని రవి కూచిమంచి అన్నారు.

స్వదేశానికి ఏదైనా చేయలని ప్రవాసుల్లో కనిపిస్తున్న సుముఖత సెంటిమెంట్‌ను దాటిపోయిందని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన అంజలి అరోండేకర్ అన్నారు. ‘‘మేం ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును పంపడం ఒక్కటే కాదు. దేశంతో ఏదో ఒకవిధంగా కనెక్ట్ కావాలని చూస్తున్నాం’’ అని ఆమె అన్నారు.

ఇటు భారతీయ రాజకీయ నాయకులకు కూడా ప్రవాస భారతీయులతో మాట్లాడే అవకాశాలు పెరుగుతున్నాయి.

‘మీ గాంధీ’ అనే ఒక ఈవెంట్‌ను నిర్వహించిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన దిన్షా మిస్త్రీ కూడా ఇదే మాట చెప్పారు. పక్షపాత ధోరణి లేని ఈ క్యాంపస్ అనేకమంది భారతీయ నేతలకు సందర్శన ప్రాంతంగా మారిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పక్కనే కూర్చున్న ఆయన, ప్రధానమంత్రి మోదీని కూడా తమ క్యాంపస్‌కు ఆహ్వానించారు.

వీడియో క్యాప్షన్, బఖ్మూత్ కోసం జరుగుతున్న పోరాటంలో భారీ మూల్యం చెల్లించిన ఓ కుటుంబం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)