కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని సావర్కర్‌తో ముడిపెట్టారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
ఆ రోజు వినాయక్ దామోదర్ సావర్కర్ 140వ జయంతి. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంత్యక్రియలు కూడా ఈ రోజే జరిగాయి.
సావర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంటును ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
సావర్కర్ అండమాన్ సెల్యులార్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు బ్రిటీష్ ప్రభుత్వానికి క్షమాపణ చెబుతూ లేఖ రాసినందుకు ఆయన విమర్శలకు గురయ్యారు.
అంతేకాకుండా మహాత్మా గాంధీని హత్య చేసే కుట్రలో సావర్కర్ పాత్ర ఉందని పలువురు చరిత్రకారులు, రచయితలు విశ్వసిస్తారు. అయితే ఇది నిరూపణ కాలేదు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వార్త తెలియగానే మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేస్తూ "సావర్కర్ జయంతి అయిన మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
భవనానికి 'సావర్కర్ సదన్' అని, సెంట్రల్ హాల్‌కు 'క్షమాపణ గది' అని పేరు పెట్టాలి" అని వ్యంగ్యంగా తెలిపారు.
ఈ చర్య మన వ్యవస్థాపకులను పూర్తిగా అవమానించడమేనని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్, అంబేడ్కర్ వంటి నాయకులను పూర్తిగా తిరస్కరించడమేనని చెప్పారు.
2023 నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం కాబట్టి కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి అనువైన రోజు అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు.
''సావర్కర్ జన్మదినమైన మే 28న ప్రారంభం జరుగుతుంది, ఎంతవరకు సందర్భోచితం'' అని ఆయన ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER/OM BIRLA
ప్రారంభోత్సవంపై నిరసన స్వరాలు
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజ్యాంగంలోని ప్రాధాన్యతా క్రమం ప్రకారం కొత్త పార్లమెంటును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ ప్రారంభించాలని, ప్రధాని కాదని చెబుతున్నారు.
''పార్లమెంట్‌ను ప్రారంభించేందుకు రాష్ట్రపతిని రానివ్వకపోవడం, వేడుకలకు ఆహ్వానించకపోవడం దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమే'' అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. 1975 ఆగస్టులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ అనెక్స్ భవనాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పార్లమెంట్ లైబ్రరీని ప్రారంభించారని అన్నారు. మీ (కాంగ్రెస్) ప్రభుత్వ అధినేత వాటిని ప్రారంభించగలిగితే, మా ప్రభుత్వ అధినేత ఎందుకు అలా చేయకూడదని ఆయన ప్రశ్నించారు.
ఇదిలాఉండగా బుధవారం జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాలని నిర్ణయించాయి.
బహిష్కరణకు గల కారణాలను ఉమ్మడి ప్రకటనలో విపక్షాలు వివరిస్తూ.. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కనపెట్టాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మన ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం మాత్రమే కాకుండా ప్రత్యక్ష దాడి అంటూ ఆరోపించాయి. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఫొటో సోర్స్, ANI
'లేని సమస్యను సృష్టిస్తున్నారు': పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
సీనియర్ జర్నలిస్ట్, రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించి 'ది ఆర్‌ఎస్‌ఎస్: ఐకాన్స్ ఆఫ్ ది ఇండియన్ రైట్' అనే పుస్తకాన్ని రాశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటులో రాష్ట్రపతి, ఉభయ సభలు ఉంటాయని స్పష్టంగా చెప్పారని ఆయన అంటున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం గానీ ప్రధానమంత్రికి గానీ వ్యక్తిగతంగా పార్లమెంటులో ఎటువంటి పాత్ర లేదన్నారు.
"కాబట్టి ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భూమి పూజ చేసి, ప్రారంభించడం సరికాదు. రాష్ట్రపతి దానిని ప్రారంభించాలి. ఆయన అందుబాటులో లేకుంటే ఉపరాష్ట్రపతి లేదా ఉభయ సభలకు అధ్యక్షత వహించే వారు ఎవరైనా సరే చేయాలి. పార్లమెంటుకు సంబంధించినంత వరకు అది ప్రాధాన్యతా క్రమం" అని నీలాంజన్ తెలిపారు
భారతదేశంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ మూడు వేర్వేరుగా ఉన్నాయని నీలాంజన్ ముఖోపాధ్యాయ నొక్కిచెప్పారు.
"ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్‌ను నడపడం లేదు. రాజ్యాంగం చెప్పింది అదే. కాబట్టి ఇది రాజ్యాంగ ఉల్లంఘన" అని వారు అంటున్నారు.
అలాగే గతంలో కొందరు రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేశారని నీలాంజన్ చెప్పారు.
ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ పార్లమెంట్ అనెక్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ 1987లో అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంట్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు.
అప్పటి లోక్‌సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ పార్లమెంట్ లైబ్రరీ భవనం భూమి పూజను చేశారని, 2002లో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రారంభించారని నీలాంజన్ చెప్పారు.
ప్రధాని ఒక భవనానికి భూమిపూజ చేయడం, దానిని ప్రారంభించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని 19 ప్రతిపక్ష పార్టీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం కోరారు.
గతంలో అనేక పర్యాయాలు పార్లమెంట్ సముదాయంలోని భవనాలను ప్రధానులు ప్రారంభించారని, ఇప్పుడు ప్రతిపక్షాలు లేనిపోని సమస్యగా మార్చడం విచారకరమన్నారు.
"బహిష్కరించడం, లేని సమస్యను సృష్టించడం దురదృష్టకరం. వారి నిర్ణయాన్ని పునరాలోచించుకుని కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. లోక్‌సభ స్పీకర్ పార్లమెంటుకు సంరక్షకుడు. ఆయనే ప్రధానమంత్రిని ఆహ్వానించారు'' అని జోషీ అన్నారు.
అదే సమయంలో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం చారిత్రక ఘట్టమని, ప్రతి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం మంచిది కాదన్నారు.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంత్యక్రియలు కూడా మే 28న జరిగాయి.
"నెహ్రూ వర్ధంతి రోజున కొత్త పార్లమెంటును ప్రారంభించడం కూడా చాలా ప్రతీకాత్మకం" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
సావర్కర్ గురించి ఏమంటున్నారు?
సావర్కర్‌కు సంబంధించిన వివాదాల గురించి తుషార్ గాంధీ ''సావర్కర్ విషయంలో చాలా అంశాలు ఉన్నాయి, ఆయన ఇష్టపడే అంశం ఆధారంగా ఆయన్ని పూజించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు'' అని చెప్పారు.
''సావర్కర్ ఇంగ్లండ్‌లో ఉంటూ భారతదేశంలో విప్లవాన్ని ప్రోత్సహించినప్పుడు విప్లవాత్మక రూపాన్ని తీసుకున్నాడని అంగీకరించాలి. విప్లవకారుడి నిర్వచనం ప్రకారం సావర్కర్‌ను విప్లవకారుల మద్దతుదారుగా చెప్పొచ్చు, కానీ ఒక విప్లవకారుడిగా పిలవలేం'' అని తుషార్ తెలిపారు.
కాలాపానీ జైలులో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు రాసినందుకు సావర్కర్‌పై విమర్శలు ఉన్నాయి.
"కాలాపానీకి వెళ్లిన ఖైదీలందరిపై అంతే క్రూరంగా వ్యవహరించారు. బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పిన అతికొద్ది మందిలో సావర్కర్ ఒకరు. కాలాపానీలో శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన బతికి ఉంటే, తిరిగి రావాలి. సావర్కర్‌ను వీరుడిగా పిలిస్తే వారందరినీ అవమానించినట్టే.'' అని అన్నారు తుషార్.
క్షమాపణలు చెప్పి, స్వేచ్ఛగా బయటకు వచ్చి బ్రిటీష్‌వారితో పోరాడాలనేది సావర్కర్ వ్యూహమని ఆయన మద్దతుదారులు, అభిమానులు అంటున్నారు.
ఇవన్నీ తర్వాత ఆలోచనలని తుషార్ కొట్టిపారేశారు.
"ఒకవేళ ఇది సావర్కర్ వ్యూహం అని భావించినా, మినహాయింపు వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్య్ర పోరాటానికి చేసిన సాయం ఏమిటి? ఒక్క రుజువు లేదు. మినహాయింపు వచ్చిన తర్వాత కనిపించేది ఆయన కాంగ్రెస్‌లో చేరడం. అన్ని సత్యాగ్రహాలను ఎలా అడ్డుకోవాలనే దానిపై బ్రిటిష్ వారితో కలిసి పనిచేశారు. కాబట్టి క్షమాపణలు ఒక వ్యూహంగా పేర్కొనడం సాకు" అని తుషార్ ఆరోపించారు.
సావర్కర్ రాసిన క్షమాపణల గురించి ప్రసార భారతి చైర్మన్‌గా ఉన్న ఎ. సూర్య ప్రకాష్ స్పందిస్తూ.. మహాత్మాగాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రాసిన పిటిషన్లను పరిశీలిస్తే.. సావర్కర్ పిటిషన్లకు వాటికీ తేడా ఏమీ ఉండదని అంటున్నారు.
సావర్కర్ జీవితంపై 'మూడు ప్రశ్నలు'
"వాళ్లు భారతమాత గొప్ప బిడ్డకు వ్యతిరేకంగా ఈ నీచమైన ప్రచారాన్ని నడుపుతున్నారు. 1857 నాటి స్వాతంత్య్ర పోరాటంపై 1910 లో సావర్కర్ ఒక పుస్తకాన్ని రాసినప్పుడు బ్రిటిష్ వారు దాన్ని నిషేధించారు. సావర్కర్ ఎంత గొప్ప దేశభక్తుడు, విప్లవకారుడు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ముందు అది చదవాలి. భారతదేశ స్వేచ్ఛ కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు" అని సూర్య ప్రకాష్ తెలిపారు.
''సావర్కర్‌కు సంబంధించి మూడు ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది వీర్ అనే ఇంటిపేరు సంపాదించడానికి ఆయన జాతీయ ఉద్యమంలో ఏం చేశారు? రెండోది ఆయన పిరికివాడా? ఇక మూడోది మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడా?'' అని నీలాంజన్ ముఖోపాధ్యాయ అడుగుతున్నారు.
"ఈ మూడింటిపై ఇంకా ప్రశ్నార్థక గుర్తులు ఉన్నాయి. భారతదేశం ఎంచుకున్న ప్రజాస్వామ్య మార్గానికి మద్దతు ఇవ్వని వ్యక్తి 140వ జయంతి సందర్భంగా మనం నిజంగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలా?. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం రోజు దాన్ని ప్రారంభించి ఉంటే మరింత సముచితంగా ఉండేది'' అని నీలాంజన్ చెబుతున్నారు.
మరోవైపు సావర్కర్ మద్దతుదారులు ఆయన దీనికి అర్హులని విశ్వసిస్తున్నారు.
సావర్కర్ జయంతి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని సూర్యప్రకాశ్ చెప్పారు.
''దేశంలోని గొప్ప వీరులు, విప్లవకారులను స్వాతంత్య్ర పోరాటం నుంచి పక్కకు నెట్టడానికి నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయాలు ప్రయత్నించాయి. వారిలో వీర్ సావర్కర్, బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి వీరులు ఉన్నారు. ఇప్పుడు సరిదిద్దే ప్రక్రియ జరుగుతోంది" అని అన్నారు.
సర్దార్ పటేల్, అంబేడ్కర్ మాదిరే వీర్ సావర్కర్‌కు కూడా తన పనికి ప్రశంసలు దక్కలేదని సూర్యప్రకాశ్ అంటున్నారు.

ఫొటో సోర్స్, SAVARKARSMARAK.COM
సావర్కర్‌ను వ్యతిరేకిస్తోందెవరు? మద్దతిస్తోందెవరు?
ధీరేంద్ర ఝా సుప్రసిద్ధ రచయిత. ఆయన "గాంధీస్ అస్సాస్సిన్: ది మేకింగ్ ఆఫ్ నాథూరామ్ గాడ్సే అండ్ హిజ్ ఐడియా ఆఫ్ ఇండియా", "షాడో ఆర్మీస్: ఫ్రింజ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ హిందుత్వ" వంటి పుస్తకాలు రాశారు.
సావర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం లాంటిదని ఆయన ఆరోపించారు.
"ఈ వ్యక్తి పుట్టినరోజున ప్రజాస్వామ్య దేవాలయాన్ని ప్రారంభించడం అపహాస్యం తప్ప మరొకటి కాదు" అని ధీరేంద్ర ఝా అన్నారు.
"20వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో సావర్కర్ బ్రిటన్‌లో ఉండగా బ్రిటీష్ వ్యతిరేకి. కానీ ఒకసారి జైలుకు వెళ్లి, క్షమాభిక్ష పిటిషన్లు రాయడం ప్రారంభించి, ఆపై జైలు నుంచి బయటకు వచ్చారు. దీనికి ముందు సావర్కర్ 'హిందుత్వ: ఎవరు హిందువు' అనే పుస్తకాన్ని రాశారు" అని ఆయన గుర్తుచేశారు.
ఈ పుస్తకం బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటాన్ని బలహీనపరిచే లక్ష్యంతో ఒక బ్లూప్రింట్‌ను అందజేస్తుందని ధీరేంద్ర ఝా అభిప్రాయపడ్డారు.
హిందువుల ప్రధాన శత్రువు బ్రిటీష్ వారు కాదని, ముస్లింలేనని హిందువులను ఒప్పించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
సావర్కర్ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనలేదు: ధీరేంద్ర ఝా
"జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, సావర్కర్ ఈ బ్లూప్రింట్‌ను చాలా జాగ్రత్తగా అనుసరించారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి ఆయనెప్పుడూ దగ్గరికి రాలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత, ఆయన ఎల్లప్పుడూ బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఆయన భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి దారితీసే ప్రక్రియను అణగదొక్కడానికి ప్రయత్నించారు. సావర్కర్ ఆలోచన ఏంటంటే జాతీయవాదులు పోరాడుతున్న లౌకిక ప్రజాస్వామ్య ఆలోచనకు వ్యతిరేకంగా హిందూ దేశాన్ని స్థాపించడం" అని ధీరేంద్ర ఝా ఆరోపించారు.
సావర్కర్ యూరోపియన్ నియంతృత్వంతో ప్రభావితమయ్యారని ధీరేంద్ర ఝా అభిప్రాయపడ్డారు.
"ఆయన జర్మనీలో నాజీయిజాన్ని, ఇటలీలో ఫాసిజాన్ని పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ఫాసిస్ట్ భావజాలాలు తప్పనిసరిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి. అలాగే గాంధీ హత్యకు కుట్రలో ఆయన ప్రమేయంపై ఆరోపణలున్నాయి.ఆ సమయంలో తగిన సాక్ష్యాధారాలు లేనందున అతన్ని వదిలేశారు. తర్వాత హత్య కుట్రను ఛేదించడానికి ఏర్పాటు చేసిన కపూర్ విచారణ కమిషన్ తన నివేదికలో సావర్కర్ ఆ కుట్రలో భాగమని స్పష్టంగా తెలిపింది" అని ఝా గుర్తుచేశారు.
"మీరు ఈ ప్రభుత్వం సరళిని పరిశీలిస్తే అది సావర్కర్, గోల్వాల్కర్లు నిర్దేశించిన సూత్రాలపై నడుస్తోందని మీకు అర్థమవుతుంది. ఆ సూత్రాలు లౌకిక ప్రజాస్వామ్య ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నాయి. సావర్కర్ జయంతి సందర్భంగా పార్లమెంటును ప్రారంభించి ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను కాకుండా సావర్కర్, గోల్వాల్కర్లు నిర్దేశించిన సూత్రాలను ఆరాధిస్తున్నట్లు సందేశం పంపడానికి ప్రయత్నిస్తోంది'' అని ఝా ఆరోపించారు.
"ఎవరైనా కొత్త పార్లమెంటును ప్రారంభించవలసి వస్తే, ఆ వ్యక్తి భారత రాష్ట్రపతి అవుతారని నేను నమ్ముతున్నా. అందులో ఎటువంటి సందేహం లేదు." అని ఝా అన్నారు.
సావర్కర్‌ను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది: సూర్య ప్రకాశ్
సావర్కర్ అసాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అని, ఆయన మహాత్మాగాంధీకి చాలా భిన్నంగా ఉండేవారని ఎ. సూర్యప్రకాష్ అభిప్రాయపడ్డారు.
"ఉదాహరణకు మహాత్మా గాంధీ కుల వ్యవస్థకు వ్యతిరేకం కాదు. సావర్కర్ కుల వ్యవస్థకు వ్యతిరేకం. సావర్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థ నిర్మూలన కోసం గట్టిగా మాట్లాడారు. బలమైన, ఆధునిక దేశం, సైన్స్ పురోగతి, సైనికీకరణ భారత్‌ను కోరుకున్నారు'' అని ఆయన తెలిపారు.
మహాత్మాగాంధీ అనుచరులు సావర్కర్‌ను పూర్తిగా వ్యతిరేకించారని సూర్యప్రకాష్ ఆరోపించారు.
''చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని సావర్కర్ ఆలోచనలు, ఆయన రాజకీయ భావజాలాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. శతాబ్దానికి పూర్వమే ఆయన సిఫారసులు చేశారు" అని సూర్యప్రకాశ్ చెప్పారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసిస్తూ చాలా విషయాలు చెప్పారని సూర్యప్రకాశ్ గుర్తుచేశారు.
సావర్కర్‌కు లక్షలాది మందిని ప్రేరేపించే సామర్థ్యం ఉందని సూర్యప్రకాశ్ అభిప్రాయపడ్డారు.
"నెహ్రూవియన్లు, గాంధేయులు సావర్కర్ వారసత్వాన్ని పాతిపెట్టడానికి నిరంతరం ప్రయత్నించారు. మేం దాన్ని అనుమతించలేం. సావర్కర్ సహకారాన్ని భారతదేశం గుర్తించాలని భావిస్తున్నా" అని అన్నారు.

ఫొటో సోర్స్, AFP/BBC
గాంధీ హత్యకు కుట్ర కేసులో కోర్టుకు సావర్కర్
మహాత్మా గాంధీ హత్యకు కుట్రలో సావర్కర్ ప్రమేయం ఉందని ఆరోపణలొచ్చాయి, ఆయనపై విచారణ కూడా జరిగింది.
కానీ, ఆరోపణలు రుజువుకాకపోవడంతో నిర్దోషిగా విడుదలయ్యారు.
సావర్కర్‌ను న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసిందని చెప్పేవాళ్లు ఆయన్ను గౌరవంగా నిర్దోషిగా ప్రకటించలేదని తుషార్ గాంధీ వాదిస్తున్నారు.
"ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలను ఎందుకు సమర్పించలేదని మేం ఆశ్చర్యపోతున్నామని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.
సావర్కర్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఇద్దరు సాక్షులూ బలహీనంగా ఉన్నారు.
కోర్టు వారిని విడిచిపెట్టిందని వాదిస్తున్నారు కానీ, తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందు సమర్పించకపోవడంతో అలా చేసింది.
ఎవరైనా నిర్దోషి అని నిరూపణ కావడానికి , సాక్ష్యం లేని కారణంగా విడుదల చేయడానికి మధ్య వ్యత్యాసం ఉంది" అని తుషార్ అన్నారు.
దిల్లీ కోర్టు మొత్తం కేసును విచారించిందని, సావర్కర్‌కు శిక్ష పడలేదని సూర్య ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
"నెహ్రూవియన్లు, గాంధేయవాదులు ఏదో ఒకవిధంగా గాంధీ హత్యలో సావర్కర్‌ను ఇరికించాలని కోరుకున్నారు.
ఎటువంటి ఆధారాలు లేవు. మహాత్మాగాంధీని మీరు చంపాలని సావర్కర్ ఎక్కడా చెప్పలేదు. నిజానికి ఆ వ్యక్తులపై అలాంటి హింసకు ఆయన వ్యతిరేకం.
ఆధారాలు లేవు. గాంధీ హత్య విచారణలో న్యాయమూర్తి నిర్ణయం అదే. తీర్పు తర్వాత కేసు ముగిసినట్లే. గాంధీ హత్యలో సావర్కర్ పాత్ర ఉందని ఎవరైనా చెప్పడం చాలా అన్యాయం" అని సూర్యప్రకాశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఉద్దేశపూర్వకమే'
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సావర్కర్ పుట్టిన తేదీని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అది ఊహించిందేనని మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అన్నారు.
''ప్రశ్నలు చుట్టుముట్టిన ఓ వ్యక్తి పుట్టినరోజున ఇదంతా చేయడం యాదృచ్చికం కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగింది.
మొత్తం కసరత్తు ఒక మూర్ఖత్వం. కొత్త పార్లమెంటును నిర్మించడానికి అంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. గొప్పగా చెప్పుకునే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని ప్రధానమంత్రి కోరుకున్నారు.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంతో "భారతదేశంపై తన విజన్‌ని ప్రదర్శించే ప్రయత్నం" అని తుషార్ గాంధీ చెప్పారు.
"కొత్త పార్లమెంట్‌లో నిర్మించిన సారనాథ్ అశోక స్తంభం సింహాలు నరమాంస భక్షక సింహాలను ప్రతిబింబిస్తున్నాయి.
ఒరిజినల్ స్మారక చిహ్నంలో సింహాలు శక్తికి చిహ్నాలు. అయితే భయపడాల్సిన అవసరం లేదు.
కాబట్టి ప్రతిదానిలో మార్పు తీసుకురావాల్సిన అవసరానికి ప్రతిరూపమే కొత్త పార్లమెంట్ హౌస్" అని ఆయన అన్నారు.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి తేదీని అనుకోకుండా ఎంచుకున్నారనుకున్నామని, అది సావర్కర్ జయంతి అని తర్వాత తెలిసిందని తుషార్ గాంధీ చెప్పారు.
"పార్లమెంటును ఉద్దేశపూర్వకంగా ఆ తేదీన ప్రారంభిస్తారు. తద్వారా అది హిందూ దేశానికి చిహ్నంగా ఉండబోతోందని సందేశం వెళ్తుంది.
2024 ఎన్నికలలో భారతదేశం లౌకికవాదంగా ఉంటుందా లేదా హిందూ దేశంగా మారుతుందా? అనే దానిపై పోరాటం ఉంటుంది." అని తెలిపారు.

ఫొటో సోర్స్, @JPNADDA
ఈ విషయంలో రాజకీయాలేంటి?
సావర్కర్‌ను జాతీయ చిహ్నంగా ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నీలాంజన్ ముఖోపాధ్యాయ ఆరోపించారు.
మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల సావర్కర్ పట్ల విపరీతమైన గౌరవం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సావర్కర్ విషయంలో విపక్ష రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నందున, దానిని బీజేపీ తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
లోక్‌సభకు అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన మొదటి విలేకరుల సమావేశంలో "నా పేరు సావర్కర్ కాదు. నా పేరు గాంధీ, గాంధీ క్షమాపణలు చెప్పలేదు" అని అన్నారు.
ఈ ప్రకటన తర్వాత సావర్కర్‌ను అవమానిస్తే తమ పార్టీ సహించదని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఈ విషయమై రాహుల్ గాంధీతో మాట్లాడారని, అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరినట్లు వార్తలు వచ్చాయి.
రాజకీయ కారణాల వల్ల సావర్కర్‌కు ఎక్కువగా మద్దతు ఉందని నీలాంజన్ ముఖోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.
"కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకించే వారిని సావర్కర్ వ్యతిరేకులని బీజేపీ చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
కానీ ప్రతిపక్షం కూడా ఒక ట్రిక్ ప్లే చేసింది. ప్రధానమంత్రి ప్రారంభించడంపైనే వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. సావర్కర్ జయంతిపై మౌనం పాటిస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాల ప్రమేయం ఉందనే వాదనను ధీరేంద్ర ఝా ఖండించడం లేదు.
ఉద్ధవ్ ఠాక్రే లేదా శివసేనను తిరిగి తమ వైపుకు తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యాలలో ఒకటని ఆయన చెప్పారు.
అయితే ఎలా చూసినా సావర్కర్, గోల్వాల్కర్‌లు అందించి, మోదీ అనుసరిస్తున్న సూత్రాలను వ్యాప్తి చేయడమే లక్ష్యమని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- జనాభాలో చైనాను దాటేసిన భారత్ సూపర్ పవర్‌గానూ మారుతుందా?
- సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి?
- మహిళా రెజ్లర్లు: '#MeToo' నిరసనతో ఒలింపిక్ కలలు చెదిరిపోతాయా?
- శుభ్‌మన్ గిల్: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీల తరువాత క్రికెట్ కింగ్ ఇతడేనా?
- ఐపీఎల్ 2023: ఫోర్ కొడితే రూ.50 వేలు, సిక్స్ కొడితే రూ.లక్ష.. హైదరాబాద్‌లో బెట్టింగ్ ఇలా జరుగుతోంది
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














