రష్యా నుంచి చౌక చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్ పోటీ పడుతోందా?

ప్రస్తుతం భారత్‌లోని మొత్తం వార్షిక ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 20 శాతం వరకూ పెరిగింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం భారత్‌లోని మొత్తం వార్షిక ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 20 శాతం వరకూ పెరిగింది
    • రచయిత, శృతి మేనన్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

రష్యా నుంచి దూరం జరగాలని యుక్రెయిన్‌తోపాటు పశ్చిమ దేశాలు కోరుతున్నప్పటికీ, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి.

ఇటీవల జపాన్‌లోజరిగిన జీ7 దేశాల సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ కలిశారు. అయితే, వీరిద్దరు చర్చించిన అంశాలపై చాలా తక్కువ వివరాలు మీడియాలో అందుబాటులో ఉన్నాయి.

రష్యా చమురు దిగుమతులను చాలా పశ్చిమ దేశాలు తగ్గించాయి. ముఖ్యంగా చమురు విక్రయాల ద్వారా రష్యా సంపాదించే ఆదాయానికి గండి కొట్టాలని అమెరికా, మిత్ర పక్షాలు భావిస్తున్నాయి.

రష్యా నుంచి ఆసియాకు ఎంత చమురు వస్తోంది?

2022 ప్రారంభంలో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు తక్కువగా ఉండేవి. అయితే, ఆ ఏడాది చివరినాటికి ఇవి గణనీయంగా పెరిగాయి.

ప్రస్తుతం భారత్‌లోని మొత్తం వార్షిక ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 20 శాతం వరకూ పెరిగింది. 2021లో ఇది కేవలం రెండు శాతం మాత్రమేనని బ్యాంక్ ఆఫ్ బరోడా గణాంకాలు చెబుతున్నాయి.

సముద్ర మార్గంలో చమురు రవాణా విషయంలో చైనాను కూడా భారత్ అధిగమించింది.

అయితే, చైనా పైప్ లైన్ ద్వారా రోజుకు ఎనిమిది లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సముద్ర మార్గంలో వచ్చే చమురు దీనికి అదనం.

రష్యా నుంచి వచ్చిన చమురును శుద్ధిచేసి మళ్లీ అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ పంపిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి వచ్చిన చమురును శుద్ధిచేసి మళ్లీ అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ పంపిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌ మీద రష్యా దాడి మొదలైనప్పుడు, భారీ డిస్కౌంట్‌పై రష్యా నుంచి యూరల్స్(Urals) ముడి చమురును కొనడాన్ని భారత్ మొదలుపెట్టింది.

అయితే, ఇటీవల కాలంలో రష్యా ఈఎస్‌పీవో బ్లెండ్ (ఈస్ట్-సైబీరియా పసిఫిక్ ఓషన్ బ్లెండ్) చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌లో చమురును శుద్ధిచేసే సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.

సముద్ర మార్గంలో రష్యా నుంచి చైనా చమురు దిగుమతులు 2022లో పెరిగాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఇప్పుడు గరిష్ఠానికి వెళ్లాయి.

ఇతర దేశాలు కూడా భారీ డిస్కౌంట్‌పై వస్తున్న రష్యా ముడి చమురును కొంటున్నాయి.

తుర్కియే కూడా రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది.

మరోవైపు రష్యా ముడిచమురు దిగుమతులపై యూరోపియన్ యూనియన్ ఆంక్షల నుంచి బల్గేరియాకు మినహాయింపు ఉంది. ఫలితంగా సముద్ర మార్గం గుండా రష్యా నుంచి బల్గేరియా చమురు దిగుమతి చేసుకుంటోంది.

డిస్కౌంట్‌పై చమురును కొనేందుకు పాకిస్తాన్ కూడా రష్యాతో ఒప్పందం చేసుకుంది.

అయితే, ఈ దిగుమతులేవీ భారత్, చైనా దిగుమతుల పరిమాణంతో పోల్చలేం.

సముద్ర మార్గంలో రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతులను యూరోపియన్ యూనియన్ పూర్తిగా నిలిపివేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్ర మార్గంలో రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతులను యూరోపియన్ యూనియన్ పూర్తిగా నిలిపివేసింది

మళ్లీ పెరిగిన రష్యా ఎగుమతులు

యుక్రెయిన్‌పై దాడి తర్వాత, మొదట్లో రష్యా చమురును కొనుగోలుచేసే వారి సంఖ్య తగ్గింది. కొన్ని విదేశీ ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు కూడా తమ దిగుమతులను నిలిపివేశాయి.

ఒకానొక సమయంలో రష్యన్ యూరల్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 30 డాలర్ల (రూ.2,470) కంటే తక్కువకు పడిపోయింది. అంటే బెంట్ క్రూడ్ కంటే దీని విలువ తగ్గిపోయింది.

అయితే, డిసెంబరు 2022లో జీ7 దేశాలు, ఈయూ నాయకులు కలిసి ‘‘ప్రైస్ క్యాప్’’ను తీసుకొచ్చారు. రష్యా చమురు ఒక బ్యారెల్ 60 డాలర్లు (రూ.4,959) కంటే తక్కువగానే ఉండేలా చూడటమే ఈ ఆంక్షల లక్ష్యం. దీని ద్వారా రష్యా ఆదాయానికి గండి కొట్టాలని వారు భావించారు.

సముద్ర మార్గంలో రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతులను యూరోపియన్ యూనియన్ పూర్తిగా నిలిపివేసింది. చమురు ఉత్పత్తుల దిగుమతులపైనా నిషేధం విధించింది.

ఈ ఏప్రిల్‌లో రష్యా చమురు ఎగుమతులు గత ఏడాది స్థాయికి మళ్లీ పెరిగాయి. ఆదాయం మాత్రం 27 శాతం తగ్గిపోయిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో ఆయిల్ పామ్‌: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చులు తగ్గుతాయా?

యుక్రెయిన్‌పై దాడి అనంతరం రష్యా నుంచి భారత్ దిగుమతి చేస్తున్న చమురుపై అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసింది. అయితే, ఈ విషయంలో భారత్‌పై ఎలాంటి ఆంక్షలూ విధించలేదు.

రష్యా నుంచి వచ్చిన చమురును శుద్ధిచేసి మళ్లీ అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ పంపిస్తోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

భారత్ నుంచి ఈయూకు డీజిల్, జెట్ ఇంధనం దిగుమతులు కూడా పెరిగాయి.

ఎక్కడ తక్కువ ధరకు చమురు వస్తే, అక్కడ కొంటామని భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో భారత చమురు శుద్ధి సంస్థలు చెల్లింపులు చేయడం కష్టం అవుతోంది. ప్రస్తుతం భారత సంస్థలు రష్యా చమురును అమెరికా డాలర్లతో కొనుగోలు చేస్తున్నాయి. అయితే, వేరే మార్గాల్లో చెల్లింపుల కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి.

చైనా ప్రభుత్వ చమురు సంస్థలు డాలరుకు బదులుగా చైనీస్ కరెన్సీలో చెల్లింపులు చేస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఇరాక్: చమురు మంటలతో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారులు

ఆసియాకు ఎంత గ్యాస్ వస్తోంది?

తుర్క్‌మెనిస్తాన్ మీదుగా వెళ్లే మధ్య ఆసియా పైప్‌లైన్ నుంచి గ్యాస్‌ను ఎక్కువగా చైనా దిగుమతి చేసుకుంటోంది.

‘‘పవర్ ఆఫ్ సైబీరియా’’ పేరుతో మరో పైప్‌లైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇది ఈ దశాబ్దం చివరి నాటికి పూర్తి కావచ్చు. దీంతో చైనాకు అతిపెద్ద గ్యాస్ సరఫరాదారుగా రష్యా మారే అవకాశం ఉంటుంది.

రష్యా నుంచి ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) కూడా ఆర్కిటిక్ నుంచి సముద్ర మార్గంలో దిగుమతి చేసుకునేందుకు చైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది.

2022లో రష్యా నుంచి చైనా ఎల్‌ఎన్‌జీ దిగుమతులు భారీగా పెరిగాయి.

భారత్‌లోనూ 50 శాతం గ్యాస్ అవసరాలకు విదేశాల నుంచి వచ్చే దిగుమతులే ఆధారం. చాలా వరకు గల్ఫ్ దేశాల నుంచే ఈ గ్యాస్ వస్తుంది. ఇక్కడ రష్యా నుంచి వచ్చే గ్యాస్ దిగుమతులు చాలా తక్కువ.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)