రాజ్యసభ: వర్షాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంటులో గందరగోళంపై రూల్ బుక్ ఏం చెబుతోంది

భారత పార్లమెంటు భవనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత పార్లమెంటు భవనం
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందే సమావేశాలు ముగిశాయి. లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది.

పని గంటల్లో రెండు సభలూ బాగా వెనుకబడ్డాయి. లోక్‌సభ కేవలం 21 శాతం పనిచేయగా, రాజ్యసభ 28 శాతం పనిచేసింది.

అధికార పార్టీ, విపక్షాలు ఒకరిని ఒకరు దుయ్యబట్టుకోవడం, ఆందోళనలకు దిగడంతో సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. దాంతో, చాలా సమయం వృథా అయింది.

రాజ్యసభలో చివరి రోజు జరిగిన వివాదం సిగ్గుచేటని, తీవ్రంగా ఖండించదగినదని విపక్షాలను అధికార పార్టీ ఎంపీలు నిందించారు.

గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు మాట్లాడుతూ, విపక్షాలు మొసలి కన్నీరు కార్చే బదులు దేశానికి క్షమాపణలు చెప్పుకోవాలని అన్నారు.

ఆగస్టు 4, ఆగస్టు 9, ఆగస్టు 11 తేదీల్లో జరిగిన సంఘటనల గురించి ఈ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఆగస్ట్ 4న ఆరుగురు టీఎంసీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ ఒకరోజు పాటు సభ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

సస్పెండ్ అయిన ఎంపీలు అద్దాలు పగలగొట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేశారని, ఈ సంఘటనలో ఒక ఉద్యోగిని గాయపడ్డారని తెలిపారు.

ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చామని, ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు.

అనంతరం, ఆగస్టు 9 నాటి సంఘటనలను ప్రస్తావిస్తూ, "రాజ్యసభలో రైతుల సమస్య గురించి చర్చ జరుగుతోంది. ఎలాంటి బిల్లులూ పాస్ చేసే ప్రయత్నం జరగలేదు. బీజేడీ ఎంపీలు మాట్లాడుతుండగా విపక్షాలు హంగామా చేశాయి. కొంతమంది ఎంపీలు టేబుల్‌పై ఎక్కారు. రూల్ బుక్‌ను సభాపతి కుర్చీవైపు విసిరారు. ఆ సమయంలో ఆ కుర్చీలో ఎవరూ లేకపోవడం అదృష్టం. కానీ, ఆ చర్య ద్వారా సభాపతిపై , సెక్రటరీ జనరల్‌పై దాడి చేసినట్లు స్పష్టమైంది. వారు చేస్తున్నది మంది పనే అని వారు అనుకున్నారు. జరుగుతున్నదాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు" అని అన్నారు.

ఆగస్టు 11 నాటి ఘటనలు వివరిస్తూ, "ఓబీసీ బిల్లు మినహా ఇన్స్యూరెన్స్ బిల్లు, మరే ఇతర బిల్లులను ఆమోదించినా ఫలితాలు దారుణంగా ఉంటాయని విపక్ష నేతలు బెదిరించారు" అని చెప్పారు.

PIB

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, PIB

కాగా, అధికార పార్టీ ఎంపీల ఆరోపణలను ఖండిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు నుంచి రోడ్డు వరకు నిరసన మార్చ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించాయి.

రాజ్యసభలో ఇన్స్యూరెన్స్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు బయట నుంచి సెక్యూరిటీ సిబ్బందిని రప్పించారని, వారు సాధారణ భద్రతా సిబ్బందిలో భాగం కాదని, విపక్ష నేతల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ మంత్రులు రాజ్యసభ సభాపతికి విజ్ఞాపన పత్రం సమర్పించారు.

దీని తరువాత, రాజ్యసభలో జరిగిన గొడవల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండున్నర నిముషాల ఈ వీడియోలో సభలో జరిగిన గందరగోళం స్పష్టంగా కనిపిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కేంద్ర ప్రభుత్వం కావాలనే సెలెక్టివ్‌గా చిన్న క్లిప్‌ను బయటకు వదిలిందని, దమ్ముంటే, మొత్తం క్లిప్ బయటపెట్టాలంటూ విపక్షాలు సవాలు చేశాయి.

సభలో జరిగిన గందరగోళంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విపక్షాలు అంటున్నాయి.

ఈ గందరగోళంపై రూల్ బుక్ ఏమి చెబుతోందో చూద్దాం.

రూల్ బుక్

ఫొటో సోర్స్, Bookgrab

పార్లమెంటు సభ్యుల ప్రవర్తన

రూల్ బుక్‌లోని విషయాలను అర్థం చేసుకునేందుకు.. 2007 నుంచి 2012 వరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా ఉన్న వివేక్ అగ్నిహోత్రితో ‘బీబీసీ’ మాట్లాడింది.

రాజ్యసభ నిర్వహణ కోసం నియమావళితో కూడిన ఒక ప్రత్యేకమైన రూల్ బుక్ ఉంది. ఇందులో ఎంపీల ప్రవర్తన గురించి వివరంగా ఉంది.

ఈ పుస్తకంలో రూల్ నంబర్ 235 కింద, ఎంపీల ప్రవర్తన గురించి ప్రత్యేకంగా మూడు విషయాలను ప్రస్తావించారని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు.

1. రాజ్యసభలో ప్రసంగిస్తున్నప్పుడు ఎంపీలు తమ సీట్లలోనే కూర్చోవాలి. వారు అక్కడినుంచి కదలకూడదు.

2. మాట్లాడడానికి తమ వంతు వచ్చేవరకు మౌనం పాటించాలి.

3. సభా కార్యక్రమాలకు ఏ విధంగానూ భంగం కలిగించరాదు. గుసగుసలాడడం, మాట్లాడడం చేయకూడదు.

పైవాటిలో ఏది పాటించకపోయినా రూల్ బుక్ ప్రకారం ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

రాజ్యసభలో గందరగోళం

ఫొటో సోర్స్, Rstv

నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుంది?

ఇందుకోసం కూడా మూడు నియమాలు ఉన్నాయి.

1. ఎంపీల ప్రవర్తన సక్రమంగా లేకపోతే సభాపతి, ఎంపీలను సభ నుంచి బయటకు పంపించవచ్చు. లేదా సస్పెండ్ చేయవచ్చు. సస్పెషన్ కాలం ఒకరోజు మొదలుకొని సెషను మొత్తం ఉండవచ్చు.

2. విషయాలు తీవ్రరూపం దాలిస్తే, రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి లేదా ప్రివిలేజ్ కమిటీ పంపవచ్చు.

ఎంపీల దుష్ప్రవర్తన అంటే లంచం తీసుకుని ప్రశ్నలు అడగడం లేదా ఎంపీల మధ్య వివాదాలు, కొందరు ఎంపీలు కలిసి రచ్చ చేయడం.. ఇలా ఏవైనా కావొచ్చు.

లంచం లాంటి అంశాలు ఎథిక్స్ కమిటీకి వెళతాయి. ఎంపీల హక్కులకు భంగం కలిగించే విషయాలు ప్రివిలేజ్ కమిటీకి వెళతాయి.

ఆగస్టు 11 నాటి ఘటనపై నివేదికను రెండు కమిటీలకూ పంపవచ్చని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ఏ కమిటీకి పంపించాలనే విషయం సభాపతి చేతిలో ఉంటుంది.

కమిటీ సభులందరూ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, వారి సలహాలను సభకు పంపుతారు. వారి సలహాలను సభ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ కమిటీలు ఎంపీలపై తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు మాత్రమే చేస్తాయి. అత్యధికంగా ఎంపీల సభ్యత్వం తొలగించమని సిఫారసు చేయవచ్చు.

ఇప్పటివరకూ ఏ మంత్రి సభ్యత్వం తొలగించిన సంఘటన జరగలేదని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

ప్రస్తుతం, రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా హరివంశ్, ఎథిక్స్ కమిటీ ఛైర్మన్‌గా రాజ్యసభ ఎంపీ శివ ప్రతాప్ శుక్లా ఉన్నారు. రెండు కమిటీలలో వివిధ పార్టీలకు చెందిన పది మంది సభ్యులు ఉన్నారు.

3. ఈ రెండు కమిటీలు కాకుండా మూడవ పద్ధతిగా ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్ వివరించారు.

వర్షాకాలం సమావేశాల్లో జరిగిన గందరగోళంపై దర్యాప్తు చేసేందుకు ఇలాంటి ఉన్నత స్థాయి కమిటీనే ఏర్పాటు చేయాలని ప్రస్తుతం బీజేపీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన విపక్షాల నేతలు

ఫొటో సోర్స్, TWITTER/SHARAD PAWAR

ఫొటో క్యాప్షన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన విపక్షాల నేతలు

రాజ్యసభకు హారజైన మార్షల్ లేదా భద్రతా సిబ్బంది బాధ్యతలు

ఆరోజు రాజ్యసభలో సాధారణ భద్రతా సిబ్బందికి అదనంగా బయట నుంచి సెక్యూరిటీ సిబ్బంది వచ్చారని విపక్షాలు, రాజ్యసభ ఛైర్మన్‌కు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో ఆరోపించాయి. వీరు మహిళా సభ్యులతో సభ్యంగా ప్రవర్తించారని కూడా పేర్కొన్నారు.

సాధారణంగా రాజ్యసభలో ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు? ఎంతమంది ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు?

పార్లెమెంటు ఉభయసభలకు ఒకటే భద్రతా సిబ్బంది ఉంటుందని వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ దేశ ఉపాధ్యక్షుడు కావడం వలన భద్రతా సిబ్బంది పూర్తి భాద్యత లోక్‌సభ స్పీకరుపైనే ఉంటుంది. అందుకే అన్ని రకాల పరిపాలనా బాధ్యతలు లోక్‌సభ స్పీకర్‌పైనే ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఎంపికైనవారిలో కొందరు లోక్‌సభలోనూ, కొందరు రాజ్యసభలోనూ రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తారు.

రాజ్యసభలో ఎంతమంది భద్రతా సిబ్బంది ఉండాలనే విషయంలో కచ్చితమైన నియమాలు లేవని, సభ తీరుతెన్నుల బట్టి భద్రాతా సిబ్బంది సంఖ్యను సభాపతి నిర్ణయించవచ్చని సుభాష్ కశ్యప్ చెప్పారు.

భద్రతా సిబ్బంది ఏ పార్టీకీ పక్షపాతం వహించకూడదు. వారి బాధ్యత సభల, సభ్యుల రక్షణ మాత్రమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)