ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీల్లో వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు: ‘పందులు కాసుకునే వాడివి నీకెందుకురా చదువు అన్నారు’

ఫొటో సోర్స్, PTI
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో 2014 నుంచి 2021 మధ్య మొత్తం 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో వెల్లడించింది.
ఈ అంశంపై డీఎంకే ఎంపీ ఏకేపీ చిన్‌రాజ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఏడేళ్లలో ఆత్మహత్య చేసుకున్న 122 మంది విద్యార్థుల్లో 24 మంది షెడ్యూల్డు కులాల వారు (ఎస్‌సీ) కాగా, 41 మంది ఇతర వెనుకబడిన తరగతుల వారు (ఓబీసీ) ఉన్నట్లు వివరించారు.
చనిపోయిన వారిలో ముగ్గురు షెడ్యూల్డు తెగలకు చెందిన వారు (ఎస్‌టీ), మరో ముగ్గురు మైనారిటీ కేటగిరీకి చెందిన వారు ఉన్నట్లు తెలిపారు.
మొత్తంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో 58 శాతం మంది ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులే కావటం గమనార్హం.

ఆధారం: కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే అధికం...
ఈ కాలంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారిలో.. ఐఐటీ విద్యార్థులు 34 మంది ఉంటే, ఐఐఎంల విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విద్యార్థులు తొమ్మిది మంది ఉండగా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీల) విద్యార్థులు నలుగురు ఉన్నారు.
మొత్తంగా చూసినపుడు ఆత్మహత్య చేసుకున్న 122 మందిలో సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులు అధికంగా (37 మంది) ఉన్నారు. ఆ తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీల) విద్యార్థులు 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
వేధింపులు, వివక్ష నిరోధానికి చర్యలు చేపట్టాం: కేంద్రమంత్రి
''విద్యార్థులపై వేధింపులు, వివక్షను నిరోధించటానికి ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పలు చర్యలు చేపట్టాయి. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి యూజీసీ (విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం) రెగ్యులేషన్స్ 2019ని కూడా రూపొందించాం. ఇంకా.. విద్యార్థులపై చదువు ఒత్తిడిని తగ్గించటానికి.. సహ విద్యార్థుల సాయంతో విద్యాభ్యాసం, ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య పరిచయం వంటి చర్యలను విద్యా మంత్రిత్వశాఖ చేపట్టింది'' అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను కూడా కేంద్రమంత్రి వివరించారు.
''మనోదర్పణ్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంబ సభ్యులకు.. వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యం కోసం కోవిడ్ మహమ్మారి కాలంలోనూ, ఆ తర్వాతా సైకలాజికల్ మద్దతు అందించటానికి అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.
దీనికితోడు విద్యార్థులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం ఆయా విద్యా సంస్థలు.. వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించటంతో పాటు నిరంతరం యోగా శిక్షణ, ఇండక్షన్ ప్రోగ్రామ్‌లు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అలాగే విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ అభివృద్ధి కోసం, వారిలో ఒత్తడిని తగ్గించటానికి స్టూడెంట్ కౌన్సెలర్లను కూడా నియమిస్తున్నాయని వివరించారు.
''అంతేకాదు.. సహ విద్యార్థుల్లో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తే వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా విద్యార్థులు, వార్డెన్లు, కేర్‌టేకర్లకు అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా అలాంటి లక్షణాలున్న విద్యార్థులకు సమయానికి క్లినికల్ కన్సల్టేషన్ సాయం అందించటానికి వీలవుతుంది'' అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Rohit Vemula/ Facebook
బెంగళూరు ఐఐఎస్‌సీ హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల తొలగింపు
మరోవైపు.. దేశంలో శాస్త్ర పరిశోధనకు సంబంధించి ప్రముఖ విద్యా సంస్థ అయిన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ)లోని హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లను తొలగిస్తున్నారు. అందుకు కారణం.. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు తమ హాస్టల్ గదుల్లో ఆత్మహత్య చేసుకోగా.. వారిలో ముగ్గురు ఉరివేసుకుని చనిపోయారు.
ఈ నేపథ్యంలో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లను తొలగించి, వాటి స్థానంలో టేబుల్ ఫ్యాన్లు కానీ, గోడకు బిగించే ఫ్యాన్లు కూడా పెట్టాలన్నది ప్రణాళికగా ద ప్రింట్ ఒక కథనంలో చెప్పింది.
వైద్య నిపుణుల సిఫారసుల మేరకు తాము చేపట్టిన చర్యల్లో భాగంగా సీలింగ్ ఫ్యాన్లు తొలగిస్తున్నామని ఐఐఎస్‌సీ తాము ఈమెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పినట్లు ద ప్రింట్ తెలిపింది. ఆ కథనం ప్రకారం.. క్యాంపస్‌లోని విద్యార్థులతో కౌన్సిలర్లు ఫోన్ చేసి వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకోవటం కూడా తాము చేపట్టిన చర్యల్లో ఒకటని ఐఐఎస్‌సీ వివరించింది.
అయితే.. ఇటువంటి చర్యలతో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగవని.. పలువురు సీనియర్ విద్యార్థి నాయకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, BIBIN THOMAS
'జెండర్ సెన్సిటివిటీ పెరిగింది కానీ, క్యాస్ట్ సెన్సిటివిటీ పెరగలేదు'
విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చెప్పిన తాజా లెక్కలు కేవలం క్యాంపస్‌లలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి లెక్కలేనని.. యూనివర్సిటీల్లో కాకుండా ఇళ్లకు వెళ్లి, వేరే చోట్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి లెక్కలు ఇందులో లేవని ద్రవిడ బహుజన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాజీ పరిశోధక విద్యార్థి డాక్టర్ జిలుకర శ్రీనివాస్ పేర్కొన్నారు.
''ఆత్మహత్యలు అనేవి వ్యవస్థ చేసిన హత్యలు. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి ప్రీమియర్ విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల వంటి క్యాంపస్‌లన్నీ అగ్రకులాల వారి కనుసన్నల్లో నడిచే అగ్రహారాలనే విమర్శ ఉంది. ఈ క్యాంపస్‌లలో చనిపోయిన వారిలో బీసీలు, ఎస్‌సీ, ఎస్‌టీలు, మైనారిటీలు ఎక్కువగా ఉన్నట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి'' అని డాక్టర్ జిలుకర వ్యాఖ్యానించారు.
''క్యాంపస్ బయట మెజారిటీగా ఉన్న బీసీలు సైతం, క్యాంపస్‌ల లోపల మైనారిటీలుగా ఉన్నారు. క్యాంపస్‌లలో అగ్రకులాల వారు బీసీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారు. విద్యార్థులు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు'' అని ఆయన ఆరోపించారు.
వ్యవస్థలో జెండర్ సెన్సిటివిటీ పెరిగింది కానీ.. క్యాస్ట్ సెన్సిటివిటీ పెరగలేదని డాక్టర్ జిలుకర శ్రీనివాస్ చెప్పారు. ''ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీల పట్ల సెన్సిటివ్‌గా ఉండే అవగాహన, చైతన్యం లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉన్నత విద్యా సంస్థల్లో గ్రీవెన్స్ సెల్స్, కౌన్సెలర్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. చాలా చోట్ల ఏర్పాటు కాలేదని, ఏర్పాటు చేసినా అవి అందించే మద్దతు అరకొరగానే ఉందని డాక్టర్ జిలుకర పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'క్యాంపస్‌లలో వివక్ష మూడు రకాలు'
''సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలన్నిటికీ కారణం వివక్షే కాకపోయినా.. ఎక్కువ శాతం మరణాలకు అదే కారణం..'' అని హెచ్‌సీయూ సీనియర్ విద్యార్థి, అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకుడు మున్నా అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల వివక్ష ఫీలై ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
''ఒకటి.. గ్రామీణ నేపథ్యం. గ్రామాల నుంచి వచ్చిన వాళ్లు కష్టపడి సీటు సంపాదిస్తారు. క్యాంపస్‌కు వచ్చిన వాళ్లకు బేసిక్స్ చెప్పకుండా మెయిన్ కోర్సులోకి వెళ్లిపోవటం వల్ల వాళ్లు సఫర్ అవుతుంటారు. ఇంగ్లిష్ భాష కూడా వారికి సమస్యగా ఉంటుంది.
రెండోది.. ఫ్యాకల్టీ టార్గెట్ చేయటం. కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, రంగును బట్టి.. ఫ్యాకల్టీ నుంచి వివక్ష ఎదురవుతుంది. మార్కులు ఇవ్వటం, డిజర్టేషన్‌లలో ఈ వివక్ష కనిపిస్తుంది.
మూడోది.. గైడ్‌లను ఇవ్వకపోవటం, ఇచ్చినా కూడా సరిగా గైడ్ చేయకపోవటం. 'గొర్రెలు కాసేటోడు, బర్రెలు కాసేటోడు ఈడికొచ్చి కూచున్నారు.. మీకెందుకురా ఈ చదువు' అంటూ వివక్ష చూపుతారు.
ఈ మూడు ప్రధాన కారణాల వల్ల... కొంతమంది వివక్ష ఫీలయ్యి, నిరుత్సాహంతో, నిస్సహాయతతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు'' అని మున్నా వివరించారు.

ఫొటో సోర్స్, NAVEEN KUMAR K/BBC
'పందులు కాసుకునే వాడివి నీకెందుకురా చదువు... అన్నారు'
''2008లో చనిపోయిన పీహెచ్‌డీ విద్యార్థి సెంథిల్ కుమార్ చనిపోవటానికి కారణాలు ఇలాంటివే. ఆయనది తమిళనాడు. ఎస్‌టీ వర్గానికి చెందిన విద్యార్థి. ఫెలోషిప్ కోసం వెళితే.. 'పందులు కాసుకునేవాడివి నీకెందుకురా ఈ చదువు' అని వ్యాఖ్యానించటంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. స్కాలర్‌షిప్ రాకపోవటంతో అప్పులయ్యాయి. ఇంట్లో ఈయనకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు'' అని మున్నా తెలిపారు.
అలాగే 2016లో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు కూడా ఇటువంటి సామాజిక, రాజకీయ వివక్ష, వేధింపులే ప్రధాన కారణమన్నారు.
''క్యాంపస్‌లో అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా రోహిత్ వేముల రాజకీయంగా గొంతెత్తటంతో.. ఒక సంస్థను టార్గెట్ చేశారు. అందులోని విద్యార్థులందరూ ఎస్‌సీలే. తమపై విధించిన సస్పెన్షన్ మీద మూడు నెలల పాటు పోరాడారు. ఈ అన్యాయాలకు పరిష్కారం ఉండదనే వేదనతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Rohit Vemula/Facebook
'స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు సమయానికి అందవు'
అణగారిన వర్గాల వారు అగ్రస్థాయి విద్యా కేంద్రాల్లో ఎదుర్కొనే వివక్ష స్కాలర్‌షిప్‌ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుందని ఏఎస్ఏ నేత మున్నా చెప్తున్నారు. ''ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉచిత విద్య ఇస్తాము.. మీరు వెళ్లి చదువుకోండి అని ప్రభుత్వం చెప్తుంది. అయితే.. 'ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లు వస్తాయి, డబ్బులు వస్తాయి.. అన్నీ ఫ్రీగా వస్తాయి.. వీళ్లు మెస్సుల్లో పడి బకాసురుల్లాగా తింటారు. ఫ్రీగా వస్తాయి కాబట్టి తింటానికే వస్తారు. చదువుకోవటానికి కాదు' అని చాలా మంది అభిప్రాయం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''వాస్తవానికి జరిగేది ఏమిటంటే.. చదువుకోవటానికి ప్రభుత్వం ఇస్తుందనే భరోసాతో వీళ్లు ఊర్ల నుంచి వస్తారు. కానీ.. ప్రభుత్వం వీళ్లకి ఏ నాడూ సమయానికి స్కాలర్‌షిప్ ఇవ్వదు. స్కాలర్‌షిప్‌లు సమయానికి రాకపోవటం వల్ల 'మీరు ఫీజులు కట్టలేదు కాబట్టి మీరు పరీక్షలు రాయటానికి వీలు లేదు. అడ్మిషన్ రద్దు చేస్తాం' అంటూ నోటీసులు వస్తుంటాయి. దీంతో విద్యార్థులు కుంగిపోతుంటారు'' అని ఆయన వివరించారు.
సెంట్రల్ యూనివర్సిటీల్లో, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్న విద్యా సంస్థల్లో బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయని.. వాటిని నింపితే ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర వర్గంలో ఎంతోకొంత సాలిడారిటీ ఉంటుందని.. విద్యార్థులు గాలి పీల్చుకోవటానికి అవకాశం ఉంటుందని డాక్టర్ జిలుకర అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
- సముద్రంలో కూలిపోయిన హెలీకాప్టర్.. 12 గంటల పాటు ఈతకొట్టి, ప్రాణాలతో బయటపడ్డ 57 ఏళ్ల మంత్రి
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆంధ్రప్రదేశ్: ఇళ్ల నిర్మాణం పూర్తయినా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?
- త్రిపుర: ఇద్దరు లాయర్లు, ఒక జర్నలిస్టు అరెస్ట్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
- ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- మోర్బీ డ్రగ్స్ కేసు: గుజరాత్లో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడానికి, అఫ్గానిస్తాన్కూ ఏమిటి సంబంధం?
- హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించే మాత్ర... ఏప్రిల్ నుంచి ఇంగ్లండ్‌లో అందుబాటులోకి
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















