తెలంగాణ: 43 కులాలకు భవనాలు, స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం, కులాల జనాభాను ఎందుకు రహస్యంగా పెట్టింది?

తెలంగాణ సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల కింద అమలు చేస్తాయి.

బాగా ఒత్తిడిలో ఉండే వర్గాలకు అప్పటి పరిస్థితిని బట్టి అదనపు ఏర్పాట్లు చేస్తుంది. ఉదాహరణకు, చేనేత ఆత్మహత్యలు నివారించడానికి అమలు చేసే ప్రత్యేక పథకాల వంటివి.

కుల వృత్తుల్లో ఉంటూ వాటివల్ల వచ్చే ఆటుపోట్లను తట్టుకునే వారి కోసం కొంత సహాయం అందించే పథకాలు అర్థం చేసుకోవచ్చు.

కానీ, కులం, వెనుకబాటుతనంతో సంబంధం లేకుండా ప్రతి కులానికో తాయిలం అనే పద్ధతిలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రూట్ ఎంచుకుంది తెలంగాణ ప్రభుత్వం. అదే కులానికో ఆత్మగౌరవ భవనం.

భవనాల కోసం హైదరాబాద్ నగరంలో విలువైన స్థలాలు పొందిన కొన్ని కులాలు: (కొన్ని భవనాలు పూర్తయ్యాయి. కొన్ని కావాల్సి ఉంది. కొన్ని భవనాలు ప్రభుత్వమే నిర్మించింది.)

  • బ్రాహ్మణ (ఓసీ)
  • కమ్మ (ఓసీ)
  • వెలమ (ఓసీ)
  • వెలమ, కమ్మ సంఘాలకు భూమి ఇవ్వడంపై రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి కోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కేసు విచారణలో ఉంది.
  • కాపు (ఓసీ)
  • మున్నూరు కాపు (బీసీ)
  • వడ్డెర (బీసీ)
  • ఆదివాసీ, బంజార (ఎస్టీ)
  • పద్మశాలి(బీసీ)
  • విశ్వబ్రాహ్మణ(బీసీ)
  • గౌడ్(బీసీ)
  • ముదిరాజ్(బీసీ)
  • యాదవ, కురుమ(బీసీ)
  • 36 సంచార కులాలకు కలిపి సంచార ఆత్మగౌరవ భవన్ (బీసీ)

ఇలా మొత్తం 43 కుల భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు సగర్వంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. బడ్జెట్లో కూడా ఆ లెక్కలు చెప్పారు. ఆ కులాల కోసం హైదరాబాద్ నగరంలో 60 ఎకరాల భూమి ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 90 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇవి వేర్వేరు దశల్లో ఉన్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

ఇలా కులాల వారీగా భవనాలు ఇవ్వాలని 2018లోనే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

‘‘దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తాం. వీటి కోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లా పూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించాం. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. వారి సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి, వారి వికాసానికి ఉపయోగపడే విధంగా ప్రతీ కులానికి హైదరాబాద్‌లో ప్రభుత్వమే భవనాన్ని నిర్మిస్తుంది" అని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ప్రకటించారు.

36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్ నగరంలో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తామని ఆ సందర్భంలో చెప్పిన సీఎం, "అన్ని బీసీ కులాలు, ఎస్సీలలో ఉన్న బుడగ జంగాల, మున్నూరు కాపులకు 5 ఎకరాలు-5 కోట్లు, దూదేకుల కులానికి 3 ఎకరాలు-3 కోట్లు, గంగ పుత్రులకు 2 ఎకరాలు-2 కోట్లు, విశ్వకర్మలకు 2 ఎకరాలు-2 కోట్లు, నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీ వైష్ణవ, కటిక తదితర కులస్తులకు ఒక్కో ఎకరం, ఒక్కో కోటి, బట్రాజులకు అర ఎకరం, అర కోటి రూపాయలు కేటాయిస్తున్నాం.’’ అని కూడా ప్రకటించారు.

ఆ కేటాయింపులు, నిర్మాణాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కేటీఆర్ లేదా కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆ భవనాలు ప్రారంభిస్తారు లేదా శంకుస్థాపన చేస్తారు. ఆయా కులాల మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా బీసీ, ఎస్సీ సంక్షేమ మంత్రి అక్కడ అన్ని ఏర్పాట్లూ చేస్తారు.

ఇక భవనాలే కాదు. పథకాలు కూడా కులాల వారీగా అమలు చేస్తున్నారు కేసీఆర్. ఉదాహరణకు గొల్ల, కురుమ కులాల వారికి గొర్రెల పంపిణీ చేపట్టారు.

బ్రాహ్మణులకు, దళితులకు కూడా ప్రత్యేక పథకాలున్నాయి. అమ్మాయిలకు పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కానుకను, ముస్లింలకు ఇచ్చేప్పుడు షాదీ ముబారక్ పేరుతో ఇస్తారు. గీత కార్మికులు, చేనేత కార్మికుల పథకాలు అదనం.

ఇవి కాకుండా తెలంగాణ రాకముందు నుంచీ కులాల వారీగా పనిచేస్తోన్న కోపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. బీసీలకు మొత్తం ఒకటిగా కాకుండా వేర్వేరు కులాలకు ఇవి పనిచేస్తాయి.

వాషర్మెన్, సగర/ఉప్పర, కృష్ణ బలిజ, పూసల, కుమ్మర శాలివాహన, విశ్వబ్రాహ్మణ, కల్లుగీత, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, వాల్మీకి బోయ, భట్రాజ, మేదర, ఎంబీసీ (మోస్ట్ బ్యాక్ వర్డ్) సొసైటీలు ప్రస్తుత తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ దగ్గర ఉన్నాయి.

అయితే, ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రక్రియలో బీసీ, ఎస్సీ కులాల విషయంలో ఆటంకాలు రాలేదు కానీ ఓసీ కులాల విషయంలో వివాదం ఏర్పడింది. ముఖ్యంగా బ్రాహ్మణ, కమ్మ, వెలమ కులాల విషయంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.

ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలకు హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి.

అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంపై వరంగల్‌కి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

అక్కడ ఎకరం వంద కోట్లు ఉందనీ, ఐదొందల కోట్ల స్థలాన్ని ఒక్కో కులానికీ ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలని పిటిషనర్ ప్రశ్నించారు.

వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ వైఖరిని తప్పు పడుతున్నాయి.

‘‘కులాలకు కావాల్సింది భవనాలు కాదు. సమగ్రమైన అభివృద్ధి. ఊర్లో ఉండే వారికి ఇక్కడ భవనంతో ఏం పని? కేసిఆర్ కుల భోజనాల పేరిట అగ్ర కులాలు అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా వెనుకబడిన వారిని పైకి తెచ్చే సమానత్వం ఇచ్చే పథకాలు ఏమీ లేవు. ఒక భవనం కట్టుకోలేని స్థితిలో ఉండే కులానికి భవన్ ఇవ్వవచ్చు. కానీ హోదా శక్తి ఉన్న వారికి ఇవ్వటమేంటి? ఏదైనా కులాన్ని సొంతంగా భవనం కట్టుకునే స్థాయికి తీసుకు రావాలి. అంటే చేపలు పట్టడం నేర్పాలి కానీ, చేపలు పంచి పెడితే ఎప్పటికి మారుతుంది పరిస్థితి? ఈ భవనాలన్నీ రాజకీయం కోసం తప్ప ఆయా కులాల నిజమైన అభివృద్ధికి కాదు. ఇది మంచి పద్ధతి కాదు’’ అని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ బీబీసీతో అన్నారు.

కుల భవనాలు పైపై హంగులే తప్ప నిజంగా ఆయా కులాల గౌరవంగా బతికేలా చేసేవి కాదంటున్నాయి ప్రతిపక్షాలు.

‘‘ఈ భవనాలు ఏ రకంగానూ వారికి ఉపయోగపడవు. దాని బదులు కులవృత్తులు చేసుకునే వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. కేవలం ఎన్నికల ముందు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలాంటి భవనాలు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ భవనాలు చూడ్డానికి ఎంతమంది హైదరాబాద్ రాగలరు? ఇవి చూసి ఇప్పుడు గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో కులాల భవనాలు ఇవ్వమంటే ఇవ్వగలరా? గతంలో తమిళనాడులో కూడా ఇలానే కులాల వారీగా విగ్రహాలు పెట్టారు. తరువాత కుల గొడవలు వచ్చిన ప్రతిసారీ, ఆ విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే చివరకు వాటిని తీసేయాల్సి వచ్చింది’’ అని బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర రావు అన్నారు.

‘‘అసలు మా బీజేపీని ఎదుర్కోవడం కోసమే కేసీఆర్ కులాల అంశాన్ని ముందుకు తెచ్చారు. నిజానికి బీజేపీది కులాలకు అతీతమైన సాంస్కృతిక జాతీయవాదం, హిందూత్వ అనే జీవన విధానం ద్వారా దేశమంతటా ఏకతాటి మీదకు తేవాలని ప్రయత్నిస్తోంది.

కానీ, బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడం కోసం బ్రిటిష్ వారి తరహాలో డివైడ్ అండ్ రూల్ పాలసీని కేసిఆర్ అమలు చేస్తున్నారు.

దాని ద్వారా కులాల మధ్య విభజనను ప్రోత్సహిస్తున్నారు’’ అని శేఖర రావు అన్నారు.

‘‘కేసిఆర్ కులాల వారీగా భవనాలు నిర్మించడం రాజకీయ వ్యూహమే తప్ప సామాన్యులకి ఉపయోగపడేది కాదు.

సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించేది కాదు. ఇది కులాల మధ్య అంతరాన్ని తగ్గించదు. ఒకవేళ కులాల మధ్య అంతరాలు తగ్గించే ఉద్దేశం ఉంటే ఆయన ఇలాంటి బంగళాల జోలికి పోరు.

ఆయా కులాల వారు గౌరవంగా బతకడం కోసం ఉద్యోగం, విద్య, ఉపాధి కల్పన వంటి అంశాల మీద దృష్టి పెట్టి ఉండేవారు. వాటి వల్ల కులాలకు గౌరవం దక్కుతుంది తప్ప బంగళాల వల్ల ప్రయోజనం రాదు’’ అని ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు.

kcr

ఫొటో సోర్స్, KCR/FACEBOOK

ప్రభుత్వం దగ్గర రహస్యంగా కులాల లెక్కలు

తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కేసీఆర్ ఒక సంచలన కార్యక్రమం చేపట్టారు. అది సకల జనుల సమగ్ర కుటుంబ సర్వే.

ఏళ్ల నుంచి బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో ఉన్న వారిని సైతం రప్పించి ఆ సర్వే చేశారు. ప్రైవేటు సంస్థలకు సెలవులు ఇచ్చి మరీ అందరూ సర్వేల్లో పాల్గొనేలా చేశారు.

ఆ సర్వేలో ఆర్థిక స్థితిగతులతో పాటూ కులాల వివరాలూ సేకరించారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా క్రోడీకరించి దాచి పెట్టింది. ఇప్పటి వరకూ ఆ లెక్కలను బయట పెట్టలేదు.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వారు ఎక్కడ ఎంత మంది ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారన్న వివరాలు పక్కాగా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సాధారణంగా జనాభా లెక్కలు వేస్తే ఇలాంటి సమాచారం అంతా విశ్లేషించి వెబ్ సైట్ లో పెడతారు. దీంతో సమాచారం అంతా జనాలకు తెలుస్తుంది.

కేసీఆర్ మాత్రం ఆ సమాచారం వెల్లడి చేయలేదు. ఆ సమాచారం ఆధారంగానే ఆయన రాజకీయ వ్యూహాలు చేపడుతున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ.

‘‘అధికార దుర్వినియోగం అనేది కేసిఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సొంత ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకోవడం ఆయనకు బాగా అలవాటు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని తన సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు’’ అని బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర రావు అన్నారు.

‘‘ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన సర్వే సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచడానికి అభ్యంతరం ఏంటి? వెనకబడ్డ కులాలకు సంబంధించి గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఈ సమాచారం ఆధారంగానే ఆయా కులాలను ఆకర్షించడానికి ప్రవేశ పెట్టారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ సమాచారాన్ని బయట పెట్టి, ఆయా కులాల జనాభా ప్రకారం వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలి’’ అన్నారు ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్.

kcr

ఫొటో సోర్స్, Telangana CMO

కులాలకే కాదు, మతాలకు కూడా సర్కారీ సొమ్మే

కులాల వారీగానే కాదు. మతాల అంశంలో కూడా ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆయన పలు హిందూ దేవాలయాలకు, ముస్లిం దర్గాకు విరాళాలు, ఆభరణాలు ఇచ్చారు.

తిరుపతి వేంకటేశ్వరునికి సాలగ్రామ హారం, విజయవాడ కనకదుర్గకు ముక్కుపుడక, కొరివి వీరభద్రునికి మీసాలు, వరంగల్ భద్రకాళి దేవాలయం.. ఇలా అనేక దేవాలయాలకు మొక్కులు చెల్లించారు.

సాధారణంగా హిందూ భక్తులు తమ జీవితంలో కోరికలు నెరవేరితే మొక్కులు చెల్లిస్తారు. కానీ, కేసీఆర్ మాత్రం, ‘‘తెలంగాణ రావాలని మొక్కుకున్నా’’ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి మొక్కులు చెల్లించారు.

అజ్మీర్‌లోని గరీబ్ నవాజ్ దర్గాకు కూడా విరాళం సమర్పించారు. ఇక స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఒక హిందూ దేవాలయాన్ని భారీగా అభివృద్ధి చేశారు. యాదాద్రి ఆలయ వందల కోట్లు పెట్టారు.

స్వతంత్ర భారత రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యమైన భారతదేశంలో ప్రభుత్వానికి మత ప్రమేయం ఉండకూడదు. కానీ, తనదైన ఓటు బ్యాంకు రాజకీయంతో కేసీఆర్ వివిధ మత సంస్థలకు కూడా ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)