డీలిమిటేషన్: లోక్‌సభ సీట్ల విభజన చేస్తే దక్షిణాది డమ్మీ అయిపోతుందా?

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, CENTRALVISTA.GOV.IN

ఫొటో క్యాప్షన్, కొత్త పార్లమెంట్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వలన తక్కువ లోక్ సభ స్థానాలు పొందడం బాధాకరం. కేంద్రం మాటలను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పెంపులో లబ్ధి పొందడం దురదృష్టకరం. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలు ఈ డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో ప్రాధాన్యత కోల్పోతాయి.’’

దేశవ్యాప్తంగా జరుగుతోన్న డీలిమిటేషన్ చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అన్నమాటలివి.

కేవలం కేటీఆరే కాదు, దక్షిణ భారతదేశానికి చెందిన పలు పార్టీల నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతకాలంగా. తమిళనాట డీఎంకే ఎంపీలు పలువురు ఈ డీలిమిటేషన్ పక్రియ వల్ల దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడారు.

ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలి అనేది ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ధరణ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సీట్లు 1971 జనాభా లెక్కల ప్రకారం విభజించినవి. 71 తరువాత దక్షిణ భారత రాష్ట్రాలు జనాభాను బాగా తగ్గిస్తూ వచ్చాయి. అదే సమయంలో ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాలు జనాభాను పెంచుతూ పోయాయి. దీంతో జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు లోక్ సభలో సీట్ల సంఖ్య తగ్గుతుంది. జనాభాను పెంచిన ఉత్తర రాష్ట్రాలకు లోక్ సభలో సీట్లు పెరుగుతాయి.

అదే జరిగితే దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నీ తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పటికీ ఉత్తర భారత ఆధిపత్యంపై అనేక విమర్శలున్నాయి. ఆఖరికి ఎంపీ స్థానాల్లో కూడా దక్షిణాది బలం తగ్గిపోతే, ఇక దక్షిణ భారతం నామమాత్రం అయిపోతుంది, ఎవరూ పట్టించుకోరు అని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది. జనాభా ఆధారంగా నియోజవకర్గాలను విభజిస్తే దక్షిణ భారతానికి తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు, దక్షిణాదికి చెందిన పలువురు విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలేంటీ డీలిమిటేషన్?

నియోజకవర్గం సరిహద్దులు నిర్ణయించి, ఏ నియోజకవర్గంలో ఎంత మంది జనాభా ఉండాలి, ఏఏ గ్రామాలు, మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయించే ప్రక్రియను పునర్విభజన లేదా డీలిమిటేషన్ అంటారు.

ఒక నియోజవకర్గంలో లక్ష మంది కలసి ఒక ఎంపీని ఎన్నుకుని, మరో నియోజకవర్గంలో పాతిక లక్షల మంది ఒకే ఎంపీని ఎన్నుకోవడం కాకుండా, ప్రతీ ఓటుకీ సమాన విలువ ఉండాలన్న సిద్ధాంతం ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది.

డీలిమిటేషన్ కమిషన్ అనే ఒక వ్యవస్థను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్ ఈ పనిచేస్తుంది.

డీలిమిటేషన్

ఒక ఓటు – ఒక విలువ

భారతదేశ పౌరులందరి ఓటుకూ ఒకే విలువ ఉండాలని రాజ్యాంగం కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం యూపీలో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు.

అంటే ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఎక్కువ, యూపీ ఓటర్ విలువ తక్కువ అవుతుంది కదా.. అలా జరగకుండా ఉండటం కోసం జనాభా ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారు.

ఇప్పటి వరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది?

1952, 1962, 1972, 2002లలో పునర్విభజన సంఘాలు ఏర్పాటు అయ్యాయి.

రాజ్యాంగంలోని 82, 170 ప్రకరణల ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరుగుతుంది.

పునర్విభజన జరిగినప్పుడే సీట్ల సంఖ్య పెంచడం, తగ్గించడం కూడా చేస్తారు.

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత పార్లమెంట్

ఇప్పుడు ఎందుకీ చర్చ?

1952లో లోక్ సభ ఏర్పడినప్పుడు 489 మంది ఎంపీలు ఉండేవారు. 1972 డీలిమిటేషన్లో 545 సీట్లకు పెరిగింది. ఆ తరువాత మళ్లీ సీట్లు పెరగలేదు.

ఇన్నాళ్లకు మళ్లీ లోక్ సభ ఎంపీల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు చర్చకు కారణం అయ్యాయి. ప్రస్తుతం లోక్ సభలో 545 మంది ఎంపీలు ఉన్నారు.

వీరంతా జనం ప్రత్యక్షంగా ఓటేసి ఎన్నుకునే వారు. అయితే ఇప్పుడు ఆ సీట్ల సంఖ్య 800కు పైగా పెంచుతారని వార్తలు వచ్చాయి.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం నిర్మించింది. కొత్త లోక్ సభలో ఏకంగా 900 మంది ఎంపీలు ఒకేసారి కూర్చునేలా ఏర్పాటు చేసింది.

దీంతో త్వరలోనే ఎంపీల సంఖ్య పెరగడం ఖాయం అన్న వార్తలు దేశమంతా చర్చకు కారణం అయ్యాయి.

సీట్లు పెరిగితే నష్టం ఏంటి?

నష్టం ఏమీ లేదు. కానీ ఆ పెరిగే సీట్లు కొన్ని రాష్ట్రాల్లోనే పెరుగుతాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో పెరగవు అనేది అసలు సమస్య. దీంతో కేంద్రంలో ఏ పార్టీ ఉండాలనేది కొన్ని రాష్ట్రాలే డిసైడ్ చేస్తాయి, మిగతా రాష్ట్రాలు డమ్మీ అయిపోతాయనేది ఆందోళన.

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, SEAN GALLUP/GETTY IMAGES

ఆందోళనకు కారణం ఏంటి?

నిజానికి చాలా విషయాల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్న ఆరోపణలు ఎప్పుడూ ఉంటున్నాయి.

వివిధ ప్రాజెక్టులు, రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ హోదాలు, కేంద్ర నిధులు.. ఇలాంటి విషయాల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కుతుందంటూ తరచూ దక్షిణాది నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు.

బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, డీఎంకే నుంచి పీటీ రాజన్ వంటి వారు ఈ విషయంలో అనేకసార్లు స్పందించారు. తాజాగా లోక్ సభలో దక్షిణాది సీట్లు తగ్గిపోతున్నాయనది కొత్త ఆందోళన.

ముందుగా దక్షిణాది ఎంపీ సీట్ల గురించి మాట్లాడే ముందు, నిధుల విషయంలో కేంద్ర వివక్ష సంగతి చూద్దాం. ‘‘దక్షిణ భారతం అభివృద్ధి చెందుతున్నందుకు, వివిధ రంగాల్లో విజయం సాధిస్తున్నందుకు శిక్షకు గురవుతోంది’’ అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణకు వివిధ సందర్భాల్లో నిపుణులు, నాయకులు చూపిన సాక్ష్యాలు ఆర్థిక సంఘం విడుదల చేసే నిధులు.

1951తో పోలిస్తే 2022 నాటికి దక్షిణ భారత జనాభా 6 శాతం తగ్గింది. అప్పట్లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల జనాభా 26.2 శాతం ఉంటే ఇప్పుడు అది 19.8 శాతానికి తగ్గింది.

కేంద్రం నియమించే ఆర్థిక సంఘాలు (ఫైనాన్స్ కమిషన్లు) రాష్ట్రాలకు పన్నుల వాటాను పంచి పెడతాయి. అవి ఆయా రాష్ట్రాలకు చాలా పెద్ద ఆదాయ వనరు. అయితే, ఈ పన్నుల వాటా అన్ని రాష్ట్రాలకూ 42 శాతం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అక్కడి వరకూ బావుంది. అయితే వివిధ పన్నుల పంపిణీలో వారు ఒక ఫార్ములా అనుసరిస్తున్నారు. దాని ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభాకు 15 శాతం, విస్తీర్ణానికి 15 శాతం వెయిటేజ్ ఉంటుంది. వాటి ఆధారంగా నిధుల పంపిణీలో వ్యత్యాసం ఉంటుంది. అంటే జనాభా తక్కువ ఉంటే తక్కువ నిధులు ఎక్కువ ఉంటే ఎక్కువ నిధులు అవుతున్నాయి.

ఈ ఫార్ములా కింద ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దాదాపు 4 నుంచి 20 శాతం వరకూ ఆదాయన్ని కోల్పోతున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా తగ్గింది.

డీలిమిటేషన్

నిజానికి జనాభా తగ్గించమని కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేసింది కేంద్రం. భారతదేశ ఎదుగుదలకు అన్ని రకాలుగా జనాభా పెరుగుదలే అడ్డంకి అని చెప్పి, ఆ విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టింది. కేంద్రం మాట విని జనాభాను బాగా కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు జనాభా తక్కువ కాబట్టి, మీకు నిధులూ తక్కువే అనే సరికి షాక్ అయ్యాయి.

ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే, ప్రస్తుత ఆర్థిక సంఘంలో అంటే రాష్ట్రాలకు నిధులు ఇచ్చే సంస్థలో ఒక్కరంటే ఒక్కరు కూడా దక్షిణ భారత మూలాలు ఉన్న వాళ్లు లేరు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మళ్లీ సీట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.

భారత రాజకీయాల్లో హిందీ మాట్లాడే లేదా హిందీని సులభంగా అర్థం చేసుకోగలిగే ప్రజలున్న రాష్ట్రాలకూ, హిందీయేతర రాష్ట్రాలకూ రాజకీయ వాతావారణంలో చాలా తేడా ఉంది. దక్షిణ భారతమే కాకుండా, తూర్పున ఒడిశా, బెంగాల్, పశ్చిమాన మహారాష్ట్ర, ఉత్తరాన పంజాబ్ వంటి రాష్ట్రాల్లో జాతీయ దృక్పథంతో పాటూ ప్రాంతీయ ఉనికి కూడా చాలా కీలకమైనది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి. వాళ్లు దిల్లీ వేదికగా రాజకీయం చేయడానికి ఎంపీ సీట్లు ఎంతో కీలకం. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది.

ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేకు స్థానికంగా పలుకుబడి ఎక్కువ ఉంటుంది. ఎంపీ పదవి పెద్దదే అయినా ఎంపీ ఎమ్మెల్యేకి బాస్ కాదు.. అదే హరియాణా వంటి రాష్ట్రాల్లో ఎంపీకి పలుకుబడి ఎక్కువ. ఎంపీలు ఎమ్మెల్యేల కంటే చాలా పవర్‌ఫుల్. అందుకే బీజేపీ వంటి పార్టీల్లో ఉత్తరాదిన ప్రముఖ నాయకులు ఎంపీలుగా పోటీ పడటానికి ఇష్టపడతారు, ముఖ్యమంత్రి అభ్యర్థులు అయితే తప్ప..

మరోవైపు బీజేపీకి ప్రస్తుతం దక్షిణ భారతంలో సాలిడ్ గా గెలుస్తామన్న భరోసా ఉన్న రాష్ట్రాలు లేవు. దీంతో ఆ పార్టీ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలి అంటే ఉత్తరాదిన సీట్లు పెంచుకోవాలనే వ్యూహం పాటిస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్, డీఎంకే సహా పలు పార్టీలు ఈ ఆందోళన వెలిబుచ్చాయి.

అదే సమయంలో వివిధ అంశాలపై రాష్ట్ర – కేంద్ర పెత్తనం విషయంలో ఇటీవల సమస్యలు వస్తున్నాయి. రాజ్యాంగంలో ఎవరి పవర్ వాళ్లకు స్పష్టంగా ఉన్నప్పటికీ, నీట్ వంటి విషయాల్లో మొదలైన వివాదం, రవాణా రంగం, విద్యా రంగం వంటి అనేక అంశాల్లో రాష్ట్ర – కేంద్ర మధ్య అధికార వివాదంగా మారింది.

డీలిమిటేషన్

దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి అనడానికి ఆధారం ఏంటి? అసలీ లెక్కలు ఎక్కడివి?

2019 మార్చిలో భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కార్నిజీ అనే సంస్థ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించిన పత్రంలోని లెక్కలను అందరూ ఇప్పుడు ఉటంకిస్తున్నారు. ‘‘ఇండియాస్ ఎమర్జెంగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్‘‘ పేరుతో మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్ అనే అధ్యయనకారులు ఈ పత్రాన్ని ప్రచురించారు. దేశంలో ఓటర్లకు పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం సరిగా ఉండడం లేదన్న విషయాన్ని ఈ పత్రం చర్చిస్తుంది.

ఈ సంస్థ అధ్యయనం ప్రకారం, 2026 లో ఉండే జనాభా ప్రకారం లోక్ సభ సీట్లు పెంచాల్సి వస్తే మొత్తం సీట్ల సంఖ్య 848కి పెరుగుతుంది. అందులో 143 సీట్లు ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే వెళతాయి. బిహార్‌కి 79 సీట్లు వస్తాయి. ఆంధ్ర, తెలంగాణ కలిపి 54 సీట్లు వస్తాయి. మొత్తం దక్షిణ భారతం నుంచి ఉండే ఎంపీలు 164 అయితే, యూపీ, బిహార్ రెండు రాష్ట్రాల నుంచే 222 మంది ఎంపీలు వస్తారు. దాని వల్ల కేంద్రంలో, పార్లమెంటులో ఆ రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుంది. దక్షిణాది ప్రాబల్యం తగ్గుతుంది అనేది వాదన.

ఆ అధ్యయనం ప్రకారం ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే 63 ఎంపీ స్థానాలు పెరుగుతుంటే, మొత్తం దక్షిణ భారతం అంతా కలిపి కేవలం 35 సీట్లే పెరుగుతాయి.

2011 జనాభా లెక్కలను బట్టి దేశంలో 2026 నాటికి ఇంత జనాభా పెరగవచ్చు అని అంచనా వేసి, ఆ 2026లో ఉండే జనాభా ఆధారంగా ఇచ్చిన సీట్ల నిష్పత్తి ఇది.

కానీ జనాభా లెక్కలు 2026లో జరగుతాయా? 2031లో జరగుతాయా అన్నది స్పష్టత లేదు కాబట్టి ఆ ఎంపీ సీట్ల సంఖ్యను నికరంగా తీసుకోలేం. అంకెలుగా వాటిని తీసుకోలేం కానీ, పెరిగే నిష్పత్తి మాత్రం దాదాపు అలాగే ఉండవచ్చు అనేది స్పష్టం.

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఎంపీ సీట్లు – కేంద్ర నిధులు: తగ్గడానికి కారణం ఏంటి?

జనాభా!

అవును.. 1970ల మధ్య నుంచి 1980ల వరకూ భారతదేశం జనాభా నియంత్రణకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఆరుగురు పది మంది పిల్లలను కనకుండా ఒకరిద్దరు పిల్లల్నే కనాలంటూ ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. ఆ దిశగా దక్షిణ భారతంలో మార్పు వచ్చింది. తక్కువ మంది పిల్లల్ని కన్నారు. జనాభా తగ్గింది.

కానీ ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఆ ప్రచారం సరిగా చేయలేదు. ఫలితమూ లేదు. దీంతో అక్కడ జనాభా అలాగే ఉండిపోయింది. కొన్ని దశాబ్దాల తరువాత చూస్తే, ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో విపరీతమైన జనాభా ఉంది.

జనాభా ఎక్కువ ఉంటే అనేక సమస్యలు, తక్కువ ఉంటే అనేక లాభాలు. దీంతో దక్షిణ భారతం హిందీ రాష్ట్రాల కంటే చాలా విషయాల్లో ముందుండటానికి కారణమైంది జనాభా నియంత్రణ. ఇప్పుడదే శాపంగా కూడా మారబోతోంది అనేది ఆరోపణ.

1976 వరకూ డీలిమిటేషన్ జరిగినప్పుడు రాష్ట్రాల వారీగా ఎంపీల సంఖ్య మారిపోయేది. అప్పటి వరకూ అన్నిచోట్లా జనాభా పెరుగుదల ఒకేలా ఉండేది కాబట్టి రాష్ట్రాల మధ్య ఒకట్రెండు సీట్లు పెరిగినా, తగ్గినా పెద్ద తేడాలు రాలేదు. సమస్య కాలేదు. కానీ, ఆ తరువాత జనాభా కట్టడి విషయంలో రాష్ట్రాల మధ్య మార్పులు వచ్చాయి కాబట్టి, అలా రాష్ట్రాల మధ్య సీట్లు మారుస్తూపోతే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు, తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తక్కువ సీట్లు అయి మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రమే మారే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. అప్పుడు దిల్లీలో ఇక్కడి ఎంపీలకు ఉన్న కాస్త పలుకుబడి కూడా పోతుంది.

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, TELANGANA CMO

దీంతో 1976లో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చు కానీ, ఒక రాష్ట్రానికి ఉన్న ఎంపీల సంఖ్యను మార్చకూడదు అనేది ఆ సవరణ సారాంశం. అంటే జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య నికరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తోన్న నియోజకవర్గాలన్నీ అలా మార్చినవే. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దు మార్చారు తప్ప నియోజకవర్గాల సంఖ్య మార్చలేదు.

కానీ తరువాత జరగబోయే డీలిమిటేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. 1976లో జనాభాతో సంబంధం లేకుండా రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అని చెప్పుకున్నాం కదా.. అప్పట్లో దానికి పాతికేళ్ల డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ ఇప్పుడు పూర్తయిపోతోంది.

అంటే 1976 నుంచి 2001 వరకూ మొదటి డెడ్ లైన్ పూర్తయింది. 2001 నాటికి భారతదేశంలోని రాష్ట్రాల మధ్య జనాభా అంతరాలు తగ్గిపోతాయి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో 2001లో మరోసారి ఈ ఫ్రీజింగ్ గడువు మరో 25 ఏళ్లకు పెంచారు. అంటే 2026 అన్నమాట. ఇప్పుడు 2026 తరువాత వచ్చే డీలిమిటేషన్లో ఆయా రాష్ట్రాలకు వచ్చే ఎంపీల సంఖ్య మార్చే అవకాశం చట్ట ప్రకారం కుదురుతుంది. ఇదే దక్షిణాది పార్టీల భయానికి కారణం.

ఒకవైపు 2026 గడువు పూర్తవడం, మరోవైపు కేంద్రం ఎంపీల సంఖ్య పెంచాలనుకోవడం.. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ వ్యూహాలపై అనుమానాలు కలసి ఇప్పుడు డీలిమిటేషన్ చర్చ ప్రారంభం అయింది.

జనాభా

ఫొటో సోర్స్, Getty Images

వాస్తవానికి 2021 జనాభా లెక్కలు జరగలేదు. కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి.

చట్ట ప్రకారం 2026 తరువాత జనాభా లెక్కలు ఎప్పుడు జరిగితే అప్పుడు, వాటి ఆధారంగా నియోజవకర్గాల పునర్విభజన జరగాలన్నది మరో నిబంధన.

దక్షిణ భారతంలో బీజేపీకి భవిష్యత్తులేదు. హిందీ బెల్టులోనే వారు గెలుస్తారు – ఇది కొందరి విశ్లేషణ.

ఈ మూడు విషయాలనూ వేర్వేరుగా కాకుండా కలిపి చూస్తే ప్రస్తుత వివాదం అర్థం అవుతుంది. ‘‘బీజేపీ తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, దక్షిణాదిన సీట్లు తగ్గించి, హిందీ బెల్టులో సీట్లు పెంచాలని చూస్తోంది. అందుకోసం 2039 వరకూ ఆగకుండా అంతకు ముందే డీలిమిటేషన్ చేయాలన్నది వారి ప్లాన్. అందుకోసం 2021 జనాభా లెక్కలను కోవిడ్ తగ్గిపోయినప్పటికీ, కావాలని ఆలస్యం చేసి 2026 తరువాత జరిగేలా చూసి, అప్పుడు వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయబోతోంది.’’ – ఇది కొందరు సోషల్ మీడియా వేదికగా చెప్పిన సొంత విశ్లేషణ.

ఈ వార్తలే దక్షిణ భారత పార్టీలను కంగారు పెట్టాయి. ‘‘అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పడు అన్యాయం అవుతున్నాయి. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వలన తక్కువ లోక్ సభ స్థానాలు పొందడం బాధాకరం. కేంద్రం మాటలను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్ సభ సీట్ల పెంపులో లబ్ధి పొందడం దురదృష్టకరం. కేవలం 18 శాతం జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు 35% జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయి. జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలు ఈ డిలిమిటేషన్ విధానం వలన భవిష్యత్తులో ప్రాధాన్యత కోల్పోతాయి.’’ అని అన్నారు కేటీఆర్.

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, SAM PANTHAKY

అంత కంగారు పడక్కర్లేదు

అయితే ఈ విషయంలో ఇప్పుడు జరుగుతోన్న చర్చకు అంత ప్రాధన్యత ఉండదు అంటున్నారు విశ్లేషకులు. డీలిమిటేషన్ కి చాలా సమయం ఉందనీ, పైగా కేంద్రం అంత మొండిగా ముందుకు వెళ్లే అవకాశం లేదనీ వారి మాట.

రాజ్యాంగం సవరణ చట్ట ప్రకారం 2026 తరువాత జరగబోయే జనాభా లెక్కతో డీలిమిటేషన్ జరగాలి. అంటే 2031 జనాభా లెక్కల ఆధారంగా ప్రక్రియ ఉంటుంది. 2031లో జనాభా లెక్కలు వేస్తే, వాటి నివేదికలు రావడానికి రెండేళ్లు కనీసం పడుతుంది. వాటి ఆధారంగా డీలిమిటేషన్ నివేదిక రావడానికి మరో రెండేళ్లు కనీసం పడుతుంది. అంటే అంతా సవ్యంగా జరిగితే ఈ డీలిమిటేషన్ 2039 ఎన్నికల నాటికి అమల్లోకి వస్తుందన్న మాట…

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Reuters

2039కి ఇంకా పదహారేళ్లు ఉంది!

‘‘2031 జనాభా లెక్కలు వచ్చాక డీలిమిటేషన్ జరుగుతుంది. అప్పుడు కూడా రాష్ట్రాల సీట్ల సంఖ్య మార్చాలి అంటే 2/3 మద్దతుతో రాజ్యాంగ సవరణ చేయాలి. దేశంలోని సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అప్పుడే సీట్లు మారతాయి. సగం రాష్ట్రాలు ఒప్పుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి సంఖ్య మారుతుంది అని కంగారు పడక్కర్లేదు. పైగా లోక్ సభ సీట్లు పెంచుతారా అన్నది స్పష్టత లేదు. ఎందుకంటే కొత్త పార్లమెంటులో సెంట్రల్ హాల్ లేదు కాబట్టి, రెండు సభలూ కలిపి కూర్చోవాల్సి వస్తే ఇబ్బంది లేకుండా పెద్ద హాల్ నిర్మించారు తప్ప, సీట్లు పెంచడం కోసమే ఇలా చేశారు అనలేం.’’ అని బీబీసీతో అన్నారు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.

‘‘చట్ట ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సింది 2026 తరువాత వచ్చే మొదటి జనాభా లెక్కల ప్రకారం. అంటే 2031 అవుతుంది. ఆ లెక్కలు రావడానికి 2033 అవుతుంది. డీలిమిటేషన్ కమిషన్ పనిచేయడానికి మరో రెండేళ్లు. అంటే 2035. అంటే 2039 ఎన్నికల నాటి సంగతి ఇది. ఒకవేళ మోదీ కావాలని 2021 జనాభా లెక్కలను ఆలస్యం చేసి 2025 వరకూ సాగదీసినా అది 2026 తరువాత వచ్చే మొదటి జనాభా లెక్కలు అవ్వవు.’’ అన్నారు విశ్లేషకులు ఇనుగంటి రవి కుమార్. ఆయన 2009 డీలిమిటేషన్ పై భారత ఎన్నికల సంఘానికి స్వతంత్ర్య అభిప్రాయాలను అందించిన వ్యక్తుల్లో ఒకరు.

డీలిమిటేషన్

ఫొటో సోర్స్, PTI

పరిష్కారం ఏంటి?

రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు పెంచకుండా, ప్రతీ రాష్ట్రానికీ నియమిత శాతం ప్రకారం సీట్లు పెంచేలా చర్యలు ఉండాలని ఎక్కువ మంది చెబుతున్నారు. ‘‘ఉదాహరణకు లోక్ సభలో 30 శాతం సీట్లు పెంచితే, అప్పుడు ఉత్తర ప్రదేశ్ కీ 80 కి మరో 24 చేరతాయి. అలానే ఆంధ్రలో 25 కి 7 సీట్లు చేరతాయి.’’ అలాంటి పద్ధతి వల్ల ఇబ్బంది ఉండదు.

‘‘దశాబ్దాల కాలంలో జనాభా పెరుగుదల తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ హుందాగా చేస్తుందా లేక వివక్ష చూపిస్తుందా అని జనాభా లెక్కల తరువాతే తేలుతుంది. అలా వివక్ష చూపిస్తే మాత్రం దక్షిణాదిలో అన్ రెస్ట్ వస్తుంది.’’ అన్నారు రవి కుమార్.

కొందరు విశ్లేషకులు అసలు లోక్ సభ సీట్లు పెంచాల్సిన అవసరం లేదనే వాదిస్తున్నారు. అయితే పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా ప్రజలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండడమే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాబట్టి సీట్ల సంఖ్య పెంచాలని ప్రతిపాదిస్తున్నారు ఇంకొందరు అధ్యయనకారులు.. ఏమైనా ఈ పంచాయితీ మళ్లీ జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే తేలుతుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)