చైనా 11 కి.మీ. లోతైన గొయ్యి తవ్వుతోంది, అక్కడ ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అతాహువల్పా అమరిసె
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా 11,100 మీటర్లకు పైగా లోతైన పెద్ద గొయ్యి తవ్వుతోంది.
తక్లమకాన్‌లో కిందటి వారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.
వాయువ్య షిన్‌జియాంగ్ వీగర్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఉన్న తక్లమకాన్ ప్రపంచంలో అతిపెద్ద ఇసుకమేటలు ఉన్న రెండో ఎడారి.
ఈ గొయ్యి పది కంటే ఎక్కువ ఖండాంతర పొరల గుండా వెళుతుందని, భూమి అడుగున క్రెటేషస్ కాలం నాటి పొరలను తాకుతుందని ప్రభుత్వ మీడియా సంస్థ షిన్‌హువా తెలిపింది. క్రెటేషస్ కాలం అంటే 14.5 కోట్ల సంవత్సరాల క్రితం మొదలై 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ముగిసిన కాలం.
ఈ ప్రాజెక్ట్ సుమారు 457 రోజులు అంటే సుమారు ఏడాదిపైన మూడు నెలల్లో పూర్తవుతుందని, దీని కోసం 2,000 టన్నుల కంటే ఎక్కువ పరికరాలు, మెషినరీ ఉపయోగిస్తారని అంచనా.
ప్రపంచంలోనే లోతైన బావి ఇదేనా?
చైనా చేపడుతున్న అతిపెద్ద తవ్వకాల ప్రాజెక్ట్ ఇదే. అయితే, ప్రపంచంలోనే లోతైన బావి రికార్డును ఇది బ్రేక్ చేయలేదు.
రష్యాలోని కోలా బావి ప్రపంచంలోనే అత్యంత లోతైన తవ్వకం. ఈ ప్రాజెక్ట్ రెండు దశాబ్దాల పాటు సాగింది. చివరికి, 1989లో ముగిసింది. ఇది 12,262 మీటర్ల లోతైన తవ్వకం.
ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక శక్తిగా ఎదిగే క్రమంలో చైనా ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది.
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తవ్వకం ప్రారంభమైన రోజే చైనా 2030కి ముందే చంద్రునిపై కాలు మోపే ప్రాజెక్ట్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపింది.
అయితే, ఎవరెస్ట్ కంటే పొడవైన, ఒక వాణిజ్య విమానం గరిష్ఠంగా ఎగరగలిగే ఎత్తు కంటే లోతైన బావిని ఎందుకు తవ్వుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
రెండు లక్ష్యాలు
చైనా ప్రభుత్వ పెట్రోకెమికల్ కార్పొరేషన్ 'సినోపెక్' ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. భూమి "లోతులను అన్వేషించడమే" తమ లక్ష్యమని ఆ సంస్థ చెప్పింది.
ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రెండేళ్ల క్రితం భూమి లోతులను అన్వేషించాలని స్థానిక శాస్త్రవేత్తలను కోరారు. తదనుగుణంగా, ఈ ఏడాది అతిపెద్ద బావి తవ్వే పని ప్రారంభమైంది.
"ఈ బావి తవ్వకానికి రెండు లక్ష్యాలు ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధన, చమురు, గ్యాస్ శోధన" అని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (సీఎన్‌పీసీ) ప్రతినిధి లైవు షియోగాంగ్ తెలిపారు.
ఇది చైనాలో అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీ. ప్రపంచంలోని అతిపెద్ద చమురు, గ్యాస్ కంపెనీల్లో ఒకటి.
లోతైన తవ్వకాలు, కొత్త యంత్రాల తయారీలో పెట్రోచైనా సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని లైవు షియోగాంగ్ ఒక వీడియోలో తెలిపారు.
పెట్రోచైనా సీఎన్‌పీసీ నియంత్రణలో నడిచే దిగ్గజ సంస్థ. ఇది హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీ.
"భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతును అధ్యయనం చేయడానికి సాధారణంగా సీస్మిక్ టోమోగ్రఫీ వంటి పద్ధతులను ఉపయోగిస్తాం. ఈ పద్ధతులు చాలా ఉపయోగకరం. పరిశోధనలకు మద్దతుగా భౌతిక సాక్ష్యాలను అందిస్తాయి" అని చిలీకి చెందిన జియోఫిజిసిస్ట్ (భూభౌతిక శాస్త్రవేత్త) క్రిస్టియన్ ఫారియాస్ బీబీసీకి చెప్పారు. క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ టెముకోలో సివిల్ వర్క్స్, జియాలజీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారాయన.
చైనా ప్రాజెక్ట్ "అత్యంత వినూత్నమైన సాంకేతికతలను పరీక్షించడానికి అవకాశమిస్తుంది" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్యాస్, చమురు
దేశంలో కొత్తగా గ్యాస్, చమురు తవ్వకాల కోసం అన్వేషిస్తున్నామని సీఎన్‌పీసీ తెలిపింది.
భూగర్భంలో హైడ్రోకార్బన్ నిక్షేపాలు సాధారణంగా 5,000 మీటర్ల లోతుల్లో కనిపిస్తాయి. ఇవి మందమైన రాతిపొరలు ఏర్పడే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమవుతాయి.
కొన్నిసార్లు సముద్రానికి దూరంగా ఎడారి ప్రాంతాల్లో బేసిన్ల వద్ద కూడా లభ్యమవుతాయి.
అలాంటి ఒక ప్రాంతం తారిమ్ బేసిన్. అక్కడే తక్లమకాన్ ఎడారి ఉంది. ఇది పెద్ద పెద్ద చమురు, గ్యాస్ రిజర్వాయర్లకు నెలవు కాగలదు.
అయితే, అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రతలు, క్లిష్ట భూగర్భ పరిస్థితుల కారణంగా సాంకేతిక సవాళ్లు ఎదురుకావచ్చని నిపుణులు అంటున్నారు.
"గొయ్యి స్థిరత్వం పెద్ద సవాలు కావచ్చు" అని ప్రొఫెసర్ ఫారియాస్ అన్నారు.
రష్యా 12 కిలోమీటర్ల లోతుకు తవ్వగలిగింది కానీ, అలాంటి తవ్వకాలు ఈ కాలంలో చాలా కష్టమని నిపుణులు అంటున్నారు.
అదీ కాకుండా, తక్లమకాన్ ఎడారి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ తీవ్రంగానే ఉంటాయి. ఉష్ణోగ్రత చలికాలంలో - 20ºC లకు పడిపోతుంది. వేసవిలో 40ºC లకు చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఒడిశా రైలు ప్రమాదం: ఆత్మీయుల ఆచూకీ దొరకక తల్లడిల్లుతున్న కుటుంబాలు
- తెలంగాణ: 43 కులాలకు భవనాలు, స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం, కులాల జనాభాను ఎందుకు రహస్యంగా పెట్టింది?
- తలనొప్పి: ఎన్ని రకాలు? ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏవి?
- సాక్షి మలిక్: రైల్వే ఉద్యోగంలో తిరిగి చేరా, లైంగిక వేధింపులపై పోరాటం కొనసాగిస్తా
- ఆంధ్రప్రదేశ్: మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ... ఎనిమిదేళ్ళ కింద ఏర్పాటైన ఆఫీసులో ఎవరైనా ఉన్నారా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















