ప్రపంచ పర్యావరణ దినోత్సవం: సోలార్ ప్యానెళ్లు సరికొత్త ముప్పు కాబోతున్నాయా? పరిష్కారం ఇదేనా?

సోలార్ పవర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోలార్ ప్యానెల్ తయారీలో మహిళ (ఫైల్ ఫొటో )
    • రచయిత, డేనియల్ గోర్డాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సౌర ఫలకాలే ( సోలార్ ప్యానెళ్లు) సరైన మందు అని ఎక్కడ చూసినా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కూడా రాయితీలతో వీటి ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.

కానీ, వీటి జీవిత కాలం పాతికేళ్లు మాత్రమే. మరి పాతికేళ్ల తర్వాత పనికి రాకుండా పోయే కోట్ల కొద్దీ సోలార్ ప్యానెళ్ల గతి ఏంటి? వాటన్నింటినీ తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

"ప్రపంచంలో ఇప్పుడు ఒక టెరావాట్ కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానెళ్లు బిగించి ఉన్నాయి. ఒక మామూలు సోలార్ ప్యానెల్‌ దాదాపు 400 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇళ్ల మీదా, సౌర విద్యుత్ ప్రాజెక్టులతో కలిపి సుమారు 250 కోట్ల ప్యానెళ్లు పెట్టి ఉండవచ్చు" అని డాక్టర్ రాంగ్ డెంగ్ చెప్పారు.

ఆయన ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలో సోలార్ ప్యానెల్ రీసైక్లింగ్‌ నిపుణుడు.

సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం నేషనల్ సోలార్ మిషన్ ఏర్పాటు చేసింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిషన్‌కు అనుసంధానంగా సోలార్ మిషన్ పని చేస్తుంది.

దేశవ్యాప్తంగా 2022 నవంబర్ ఆఖరు నాటికి వ్యవస్థాపిత సోలార్ విద్యుత్ ఉత్పత్తి 61.97 గిగా వాట్లని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వెబ్‌సైట్ చెబుతోంది.

భారత్ 2021 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు ఆ సైట్ లో ఉంది.

సోలార్ పవర్

ఫొటో సోర్స్, LAURENT JULLIAND

ఫొటో క్యాప్షన్, సోలార్ ప్యానెళ్ల స్క్రాప్

రాబోయేది విపత్తే: నిపుణులు

బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ దేశంలో కోటి సోలార్ ప్యానెళ్లు బిగించి ఉన్నాయి. కానీ, వాటిని స్క్రాప్ చేసి, రీసైకిల్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు.

రాబోయే కాలంలో ఎదురుకాబోయే ఈ ప్రపంచ పర్యావరణ విపత్తును నివారించడానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు మొదలుపెట్టాలని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

‘‘రీసైక్లింగ్ యూనిట్లు మరిన్ని అందుబాటులోకి రాకపోతే 2050 నాటికి ఈ స్క్రాప్ కొండలా పేరుకుపోతుంది’’ అని ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ యుటే కొల్లియర్ హెచ్చరించారు.

‘‘మనం చాలా సోలార్ ప్యానెళ్లు తయారు చేస్తున్నాం. మంచిదే. కానీ, అదే స్థాయిలో వ్యర్థాలు కూడా రాబోతున్నాయి’’ అని కొల్లియర్ అన్నారు.

సౌర ఫలకాలను పూర్తిగా రీసైక్లింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ ఈ జూన్ చివర్లో ఫ్రాన్స్‌లో ప్రారంభం కాబోతోంది.

రోసి (ROSI) అనే ఈ కంపెనీ ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్ పట్టణం దగ్గర ఉంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా సోలార్ ప్యానెళ్లను 99 శాతం రీసైక్లింగ్ చేయవచ్చని భావిస్తున్నారు.

గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్‌లను రీసైక్లింగ్ చేయడంతోపాటు, ప్యానెళ్లలో ఉన్న వెండి, రాగి వంటి అన్ని విలువైన వస్తువులను ఈ ఫ్యాక్టరీలో సేకరించగలరు.

మామూలు పరిస్థితుల్లో వీటిని సేకరించడం చాలా కష్టమైన పని. కలెక్షన్ తర్వాత వీటిని రీసైకిల్ చేయవచ్చు. వాటి ద్వారా మరింత మెరుగైన కొత్త సోలార్ ప్యానెళ్లను తయారు చేయవచ్చు.

సంప్రదాయ పద్దతుల్లో రీసైక్లింగ్ చేసేటప్పుడు, అల్యూమినియం, గ్లాస్‌లను మాత్రమే సేకరించగలుగుతారు. కానీ, పాత పద్దతుల్లో సేకరించిన గ్లాస్‌లో తక్కువ నాణ్యత ఉంటుందని రోసి ప్లాంట్ చెబుతోంది.

సోలార్ పవర్

ఫొటో సోర్స్, ROSI

ఫొటో క్యాప్షన్, సోలార్ ప్యానెళ్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా వెండిలాంటి విలువైన లోహాను తీయవచ్చు.

అనువైన కాలంలో కొత్త ఫ్యాక్టరీ

సోలార్ ప్యానెళ్ల వినియోగం బూమ్ ఉన్న సమయంలో రోసి ప్లాంట్ తెరుచుకోబోతోంది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం 22% పెరిగింది. వివిధ దేశాలలో ఇళ్లు, ఫ్యాక్టరీల పైకప్పులతోపాటు ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేశారు.

చాలా సందర్భాల్లో సౌర యూనిట్లను వాటి లైఫ్ ముగిసే వరకు ఉపయోగించడం ఆర్ధికంగా అంత లాభదాయకం కాదు. ఈ సమయంలోనే కొత్త డిజైన్లు, మరింత సమర్థవంతమైన ప్యానెళ్లు తయారవుతుంటాయి. అందువల్ల వీటిని 10-15 సంవత్సరాల్లోనే అప్‌డేట్ చేయడం, కొత్తవి మార్చడం చేయాల్సి ఉంటుంది.

వీటి వినియోగంలో ప్రస్తుత వృద్ధి ఇలాగే కొనసాగితే, సోలార్ ప్యానెళ్ల స్క్రాప్ పరిమాణం బాగా పెరిగే అవకాశం ఉందని కొలియర్ చెప్పారు.

"2030 నాటికి, మనకు 40 లక్షల టన్నుల స్క్రాప్ వస్తుందని అంచనా వేస్తున్నాం. అయితే, ఇది ఇప్పటికీ మేనేజ్ చేయదగిన పరిమాణమే. 2050 నాటికి మనకు 2 కోట్ల టన్నుల స్క్రాప్ వస్తుంది’’ అని కొలియర్ వివరించారు.

సోలార్ పవర్

ఫొటో సోర్స్, JON TILLOTT

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వ్యాప్తంగా సోలార్ ప్యానెళ్ల వినియోగం పెరుగుతోంది.

రీసైక్లింగ్ సవాళ్లు

సోలార్ ప్యానెళ్లను రీసైక్లింగ్ చేసే యూనిట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటీవలి కాలం వరకు రీసైకిల్ చేసే అవసరం కలగలేదు. ఇప్పుడిప్పుడే ఆ పనులు మొదలవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సౌర ఫలకాలలో మొదటితరం ప్యానెళ్ల లైఫ్ ముగుస్తోంది. వీటిని ప్రాసెస్ చేసేందుకు అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో వోల్టాయిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేయడంలో ఫ్రాన్స్ ఇప్పటికే యూరోపియన్ దేశాలలో అగ్రగామిగా ఉందని నికోలస్ డెఫ్రెన్నే చెప్పారు. ఆయన పని చేసే సోరెన్ సంస్థ, రోసితో పాటు మరికొన్ని రీసైక్లింగ్ కంపెనీలతో పార్టనర్ షిప్ కలిగి ఉంది. ఫ్రాన్స్ అంతటా సౌర ఫలకాలను స్క్రాప్ చేయడంలో ఈ కంపెనీ సమన్వయం చేస్తుంది.

‘‘మేం చేసిన అతి పెద్ద స్క్రాప్ రీసైక్లింగ్ కు మూడు నెలల కాలం పట్టింది’’ అని డెఫ్రెన్నే చెప్పారు.

గ్రెనోబుల్‌లోని రోసి ప్లాంట్‌లో సోలార్ ప్యానెళ్ల నుంచి రాగి, సిలికాన్, వెండి వంటి పదార్థాలను రీసైకిల్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ప్రతి సోలార్ ప్యానెల్‌లో ఈ పదార్థాలు చాలా కొద్ది మొత్తంలోనే ఉంటాయి. పైగా అవి ఇతర వస్తువులలో కలిసి ఉంటాయి. వాటిని విడదీయడం ఇప్పటికైతే ఆర్ధికంగా లాభదాయకం కాదని చెబుతున్నారు.

అయితే, అవి చాలా విలువైన లోహాలు కాబట్టి వాటిని సేకరించడం తప్పదని, ఇందులో మెరుగైన విధానాల వల్ల మంచి ఫలితాలు రావొచ్చని డెఫ్రెన్నే అభిప్రాయపడ్డారు.

"రీసైకిల్ చేసిన 60% కంటే ఎక్కువ సౌర ఫలకాల బరువులో వాటి బరువు కేవలం 3% ఉంటుంది" అని ఆయన చెప్పారు.

భవిష్యత్తులో కొత్త సౌర ఫలకాలను తయారు చేయడానికి అవసరమైన దాదాపు మూడు వంతుల పదార్థాలను, రీసైక్లింగ్ ద్వారా తిరిగి పొందవచ్చని సోరెన్‌ సంస్థలోని నిపుణులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, తమ సొంత వినియోగానికే కాకుండా, ప్రభుత్వానికి కూడా కరెంటు అమ్ముతున్న రైతులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)