రష్యా - యుక్రెయిన్ యుద్ధం: భారీ డ్యామ్ ధ్వంసం.. ప్రమాదంలో వేల మంది ప్రాణాలు

ఫొటో సోర్స్, Reuters
దక్షిణ యుక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఉన్న అతిపెద్ద నోవా కఖోవ్కా డ్యామ్ ధ్వంసమైంది.
దీంతో డ్యామ్‌లోని నీరంతా భారీ ఎత్తున లోతట్టు ప్రాంతాలకు చేరుతోంది.
ఈ డ్యామ్‌ను రష్యా పేల్చి వేసిందని యుక్రెయిన్ సైన్యం, నాటో ఆరోపిస్తుండగా యుక్రెయినన్లే ఈ పని చేశారని రష్యా అధికారులంటున్నారు.
ఈ డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ డ్యామ్ నీటితో పెను విపత్తు సంభవించే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఈ డ్యామ్ ఎక్కడుంది?
యుక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంతంలో నోవా కఖోవ్కా నగరంలో కఖోవ్కా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉంది. ఇది ప్రస్తుతం రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఉంది.
సోవియట్ కాలంలో ఈ డ్యామ్‌ను ఏర్పాటు చేశారు. నిప్రో నదిపై ఉన్న ఆరు డ్యామ్‌లలో ఇదీ ఒకటి.
అమెరికాలోని యూటాలో ఉన్న గ్రేట్ సాల్ట్ లేక్‌కు సమానమైన నీటి నిల్వ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందని రాయిటర్స్ కథనం తెలిపింది.

ఏం జరిగింది?
ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలలో ఈ డ్యామ్ భారీగా ధ్వంసమైనట్లు కనిపిస్తోంది.
యుద్ధ ప్రభావిత జోన్‌లోకి ఇప్పటికే డ్యామ్ నీరంతా చేరింది. ఖేర్సన్ వైపు ఈ నీరు వెళ్తోంది.
తొలుత ఈ డ్యామ్ ఎప్పుడు ధ్వంసమైందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ, బీబీసీ వెరిఫై చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో గత కొన్ని రోజుల నుంచే డ్యామ్‌కు ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసింది.
తొలుత జూన్ 2న ఈ డ్యామ్ రోడ్డు ధ్వంసమవ్వడం కనిపించింది. ఆ తర్వాత జూన్ 6 వరకు నీటి ప్రవాహంలో ఎలాంటి మార్పు లేదు.
జూన్ 6న సర్క్యులేట్ అవుతున్న వీడియోలో డ్యామ్ గోడ విరిగిపోవడం, పక్కనున్న భవనాలు కూలిపోవడం స్పష్టంగా కనిపించింది. రోడ్డు ధ్వంసం కావడానికి, డ్యామ్ కూలిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా అన్నది ఇంకా తెలియలేదు.
నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారందరూ ఎంత వీలైతే అంత త్వరగా ఖాళీ చేయాలని ఖేర్సన్ అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
నోవా కఖోవ్కాలో భవనాల చుట్టూ నీరు చేరిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆఫీసు చుట్టూ చేరిన నీటిలో హంసలు కూడా తిరుగుతున్నాయి.
డ్యామ్ దెబ్బతినడంతో ఈ ఉదయానికి ఎనిమిది గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని, మరిన్ని గ్రామాలు ఈ డ్యామ్ నీటిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని యుక్రెయిన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖేర్సన్ ప్రాంతానికి చెందిన రాజకీయ నేత ఓలెక్సాండర్ ప్రోకుడిన్ చెప్పారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని బస్సు, రైళ్లలో తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకరమైన జోన్‌గా పిలిచే ప్రాంతాల్లో 16 వేల మంది ఉన్నట్లు చెప్పారు.
ఈ ఆనకట్ట పూర్తిగా దెబ్బతిందని, దీన్ని పునరుద్ధరించలేమని యుక్రెయిన్ హైడ్రో పవర్ డ్యామ్ ఆపరేటర్ యూకేఆర్‌హైడ్రోఈనెర్హో చెప్పారు.

డ్యామ్ ధ్వంసానికి కారణమేంటి?
ఈ డ్యామ్ ఎందుకు ధ్వంసమైందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. రష్యానే ఈ డ్యామ్‌ను పేల్చి వేసిందని యుక్రెయిన్ సైన్యం ఆరోపిస్తోంది.
ప్రతిదాడిలో భాగంగా రష్యా ఆక్రమిత ప్రాంతంలోకి సైన్యాన్ని తరలించేందుకు డ్యామ్‌పై ఉన్న రోడ్డును యుక్రెయిన్ దళాలు వాడుకోవచ్చని రష్యా భావించి ఉండొచ్చు. అందువల్లే డ్యామ్‌పై రష్యా దాడి చేసి ఉండొచ్చనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో, రష్యా అధికారులు మాత్రం ఈ డ్యామ్ కూల్చివేతకు కారణం యుక్రెయినేనని ఆరోపిస్తున్నారు. ఇది విద్రోహ చర్య అని విమర్శిస్తున్నారు. క్రిమియా ప్రాంతానికి నీటిని లేకుండా చేసేందుకే ఇలా చేశారని రష్యా ఆరోపిస్తోంది.
యుక్రెయిన్, రష్యా ఇరు దేశాల వాదనలను బీబీసీ ఇంకా వెరిఫై చేయలేదు.
దక్షిణ యుక్రెయిన్‌లో ఈ డ్యామ్ ఎంతో కీలకంగా ఉంది. ఎన్నో అవసరాలకు ఈ డ్యామ్‌ను వాడుతున్నారు.

ఫొటో సోర్స్, PLANET LAB PBC
రష్యా ఆక్రమిత క్రిమియాకు ఈ డ్యామ్ కీలకం
ఈ రిజర్వాయర్‌లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేస్తారు. ఈ నీటిని ఎగువ ప్రాంతాల్లోని ప్రజలకు సరఫరా చేస్తారు.
కఖోవ్కా ఎగువ ప్రాంతాల్లోని ప్రజలు తమ పంటలు పండించుకునేందుకు ఈ డ్యామ్ నీటినే వాడుతున్నారు.
ప్రస్తుతం ఈ డ్యామ్‌ను ధ్వంసం చేయడంతో ఎగువ ప్రాంతాల్లోని వేల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. స్థానిక ప్రజలకు, రైతులకు నీటి సరఫరాలో ఆటంకం కలగనుంది.
సుమారు 100 మైళ్ల ఎగువన రష్యా ఆక్రమిత ప్రాంతమైన జాపోరిజ్జియాలో ఉన్న అణు విద్యుత్ కేంద్రానికి కూలింగ్ వాటర్‌ను ఈ జలాశయమే అందిస్తోంది.
ఈ కూలింగ్ వాటర్ కోసం ఈ రిజర్వాయర్‌పైనే ఆధారపడ్డారు.
అణు విద్యుత్ కేంద్రం భద్రతకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని, కానీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) తెలిపింది.
అణు విద్యుత్ కేంద్రానికి అవసరమైన కూలింగ్ వాటర్ అందించేందుకు ప్రత్యామ్నాయ వనరులున్నాయని, ఆ కేంద్రానికి పక్కనే ఉన్న పెద్ద చెరువు వీటిలో ఒకటని చెప్పింది.
నిప్రో నుంచి నీటిని క్రిమియాకు చేర్చేందుకు కూడా ఈ డ్యామే కీలకం. అంటే ఈ ప్రాంతానికి కూడా నీటి సరఫరాకు ఆటంకం వాటిల్లనుంది.
2014లో క్రిమియాను రష్యా తన అధీనంలోకి తీసుకున్న తర్వాత, నోవా కఖోవ్కా నుంచి నీటిని తీసుకెళ్లడాన్ని యుక్రెయిన్ అడ్డగించింది. ఇది క్రిమియాలో నీటి సంక్షోభానికి దారి తీసింది.
గత ఏడాది యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత ఈ నీటి సరఫరా మార్గాన్ని రష్యా దళాలు తిరిగి ప్రారంభించాయి.
డ్యామ్ ధ్వంసం కావడంతో, మరోసారి ఆ ప్రాంతంలో నీరు కనిష్ట స్థాయులకు పడిపోనుంది.
యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత, డ్యామ్‌లపై పలు దాడులు చేసింది రష్యా. దీంతో పెద్ద ఎత్తున నీరు వరదలా పారి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?
- రష్యా నుంచి వస్తున్న ముడి చమురుతో భారత్‌కు లాభమేనా?
- యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా వ్యూహాలు మారుస్తోందా... బెలూన్లతో యుక్రెయిన్ సైన్యాన్ని తికమకపెడుతోందా
- రష్యా నుంచి అర్జెంటీనాకు చేరుకుంటున్న వేలమంది గర్భిణులు, అరెస్టు చేస్తున్న పోలీసులు, ఎందుకు?
- పుతిన్ సైన్యంలో క్రిమినల్స్: 'ఆ సైనికుడు తనను తాను పేల్చుకుని తనతో ఉన్న ముగ్గురు యుక్రెయిన్ సైనికులను హతమార్చాడు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















