ఒడిశా రైలు ప్రమాదం: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

కోరమండల్ ఎక్స్‌ప్రెస్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.

భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోనుంది.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ పశ్చిమ్ బెంగాల్‌లోని హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమై, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ వరకు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.

దాదాపు 1661 కిలోమీటర్లు ప్రతి రోజూ ఈ రైలు నడుస్తుంది.

దీనికి కోరమండల్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది.

తొలిసారిగా 1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభమైంది. గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ చెబుతోంది.

తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే అతిముఖ్యమైన రైళ్లలో కోరమండల్ ఒకటి.

వీడియో క్యాప్షన్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

‘‘13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశమంతటా విస్తరించి ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించడంలో కీలకపాత్ర పోషించింది. అలాగే ఒడిశాతోపాటు పశ్చిమ్ బెంగాల్ వరకు చోళుల ప్రభావం ఉండేది. చోళులు పాలించిన ప్రాంతాన్ని తమిళంలో చోళ మండలంగా పిలుస్తుంటారు. దీనికి కోరమండలం గానూ పేరుంది. భారతదేశంలో ఆగ్నేయ(సౌత్ ఈస్ట్) తీరంలో చోళ సామ్రాజ్యం విస్తరించింది.

అలాగే బంగాళాఖాతం తీరం వెంట ఉన్న భారత్‌లోని తూర్పు ప్రాంతాన్ని చోళులు పాలించిన ప్రాంతం కావడంతో కోరమండల్ తీరంగా పేరు వచ్చింది. ఇది బ్రిటిష్ వారు పెట్టిన పేరు. కావేరీ నది సంగమ ప్రాంతం నుంచి పులికాట్ సరస్సు వరకు ఉన్న తీర ప్రాంతమే కోరమండల్. తొలుత ఇది చోళ మండలం తీరంగా పిలిచేవారు. కాలక్రమంలో బ్రిటిష్ వారు కోరమండల్ అని పిలవడం ప్రారంభించారు. ఆంగ్లంలో ‘చ’కారం.. ‘క’కారంగా మారింది.’’ అని చెన్నైకు చెందిన రచయిత చంద్రమోహన్ వివరించారు.

అలా ఈ తీర ప్రాంతం వెంట ప్రయాణించే రైలు కావడంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే శాఖ పేరు పెట్టింది.

ఈ రైలు కూడా అటు పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలను కలుపుతూ ప్రయాణిస్తుంది.

అందుకే దీనికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టారు.

కోరమండల్ రైల్వే ప్రమాదం

అలాగే భారతీయ రైల్వే చరిత్రలో సూపర్ ఫాస్ట్ రైలుగానూ దీనికి పేరుంది.

దీన్ని ఎక్కువగా తమిళనాడుకు వెళ్లే ప్రయాణికులు ఎక్కుతారు. హౌరా- చెన్నై మెయిల్ కంటే వేగంగా చెన్నైకు చేరుతుండటంతో అక్కడ ప్రయాణికులు ఎక్కువగా ఎక్కుతుంటారు.

గతంలో బెంగాల్.. నాగ్ పుర్ రైల్వేలో భాగంగా ఉండేది. తర్వాత సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్‌గా పేరు మార్చడంలో అందులో ఈ రైలు భాగమైంది.

‘‘కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ మొదట వారానికి రెండు సార్లు మాత్రమే నడిచేది.

తర్వాత 1983లో దీన్ని వారానికి 5 సార్లకు పెంచారు. తర్వాత 1986 నుంచి వారంలో అన్ని రోజులు నడవడం ప్రారంభించారు.

రైలును ప్రారంభించినప్పుడు చాలా పేర్లకు చర్చకు వచ్చాయని అప్పట్లో చెప్పేవారు.

చివరికి కోరమండల్ అనే పదం సరైనదని భావించి ఆ పేరు ఖరారు చేశారు’’ అని చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ రిటైర్డ్ జనరల్ మేనేజర్ సుధాంశు మణి ‘బీబీసీ’తో చెప్పారు.

‘‘కోరమండల్ అనే పదాన్ని మొదటగా పోర్చుగీసు వర్తకులు వాడారని కొన్నిచోట్ల పుస్తకాల్లో ఉంది. తర్వాత బ్రిటిష్ కాలంతో మాత్రం ఈ ప్రాంతానికి ఆ పేరుతో ప్రాచుర్యం వచ్చింది.

తీరం వెంబడి ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ కావడంతో కోరమండల్ అని రైల్వే శాఖ ఆ పేరు పెట్టిందనుకోవచ్చు.’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)