ఒడిశా, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ : భారత్‌లో ఘోర రైలు ప్రమాదాలు ఇవే

కోరమండల్ రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 233 మంది మరణించారని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా చెప్పారు.

ఈ ప్రమాదంలో 900 మందికి గాయాలయ్యాయని తెలిపారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌, హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌‌, ఒక గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

భారత్‌లో ఈ శతాబ్దంలో జరిగిన అత్యంత ఘోర రైల్వే ప్రమాదాలలో ఇదొకటి.

ఈ ప్రమాద మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అయితే, అంతకుముందు 2009 ఫిబ్రవరిలో కూడా ఒకసారి హౌరా నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన 14 కోచ్‌లు ఒడిశాలోని జాజ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి.

ఆ ప్రమాదంలో 16 మంది మరణించగా, 50 మందికి గాయాలయ్యాయి.

ఒడిశాలో ప్రస్తుతం జరిగిన ప్రమాద నేపథ్యంలో, భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన రైల్వే ప్రమాదాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

కోరమండల్ రైల్వే ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

భారతదేశంలో ఇప్పటి వరకూ జరిగిన రైలు ప్రమాదాలు

  • 1956 లో మహబూబ్‌నగర్‌లో గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం జరిగి 112 మంది మరణించారు.
  • 1956లో తమిళనాడులో అరియలూర్ వద్ద మద్రాస్ ట్యూటికోరన్ ఎక్స్‌ ప్రెస్ నదిలో పడి 156 మంది మరణించారు. వరదలకు వంతెన కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూనే అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు.
  • 1981 జూన్ 6న బీహార్‌లోని సమస్తిపూర్ వద్ద బాగ్మతి నదిలో రైలు పడి భారీ ప్రమాదం జరిగింది. అనధికారికంగా మొత్తం 800 మంది చనిపోయుంటారని అంచనా. ఆ నదిలో నుంచి 212 మృతదేహాలను వెలికి తీశారు. ఇది భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం.
  • 1987 జూలై 8న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల వద్ద దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినప్పుడు 53 మంది మరణించారు.
  • అదే ఏడాది తమిళనాడులోని అరియలార్ వద్ద నదిలో రాక్‌ఫోర్ట్ రైలు పడి 75 మంది మరణించారు.
  • 1988 జూలై 8న బెంగళూరు త్రివేండ్రం ఐస్‌లాండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి కేరళలో ఒక సరస్సులో పడి 107 మంది మరణించారు.
  • 1990 జూన్ 6న మన రాష్ట్రంలోని గొల్లగూడలో జరిగిన ప్రమాదంలో 36 మంది మరణించారు.
  • 1990 అక్టోబర్ 9న కాకతీయ రైలు ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 1992 ఏప్రిల్ 7న తెనాలిలో బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 20 మంది మరణించారు.
  • 1994 మే 3న నల్గొండ జిల్లాలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఒక ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో 35 మంది మరణించారు.
  • 1995 ఆగస్టు 20న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ – కాళింది ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొని 302 మంది మరణించారు. కొందరి లెక్కల ప్రకారం 400 కంటే ఎక్కువ మంది మరణించి ఉంటారని అంచనా. ఇది దేశ చరిత్రలో రెండో అతిపెద్ద రైల్వే ప్రమాదం.
  • 1998 నవంబర్ 26న పంజాబ్‌లో జరిగిన ప్రమాదంలో జమ్ముతావి – సీల్దా రైళ్లు ఢీకొని 212 మంది మరణించారు.
  • 1999 ఆగస్టు 2న బెంగాల్‌లో అవద్ ఎక్స్‌ప్రెస్ – బ్రహ్మపుత్ర మెయిల్‌లు ఢీకొని 288 మంది మరణించారు. సిగ్నలింగ్ లోపంతో రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రావడంతో ఇది జరిగింది. సిగ్నలింగ్ వంటి సిబ్బంది తప్పిదంతో జరిగిన పెద్ద ప్రమాదంగా దీనిని భావిస్తారు.
  • 2002లో హౌరా రాజధాని రైలు బీహార్ వద్ద ధావి నదిలో పడి 130 మంది మరణించారు.
  • 2002 డిసెంబర్ 21న కర్నూలు జిల్లా రామలింగాయపల్లి వద్ద కాచిగూడ బెంగళూరు రైలు పట్టాలు తప్పి 20 మంది మరణించారు.
  • 2003 జనవరి 3న కాచిగూడ మన్మాడ్ ఎక్స్‌ ప్రెస్ మహారాష్ట్రలో ఆగి ఉన్న రైలు పైకి దూసికెళ్లి, 20 మంది మరణించారు. ఈ కేసులో మానవ తప్పిదాన్ని గుర్తించి ఆ రైలు డ్రైవర్‌తో పాటూ, ఆరుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
  • 2003 జూలై 2న గోల్కొండ ఎక్స్‌ప్రెస్ బ్రేక్ ఫెయిలై వరంగల్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పి, రోడ్డుపై పడింది. అందులో 21 మంది మరణించారు.
  • 2005 అక్టోబర్ 29 రేపల్లె సికిందరాబాద్ ప్యాసింజర్ రైలు నల్గొండ జిల్లా రామన్నపేట వలిగొండ మధ్య పట్టాలు తప్పి115 మంది మరణించారు.
  • 2006 జూలై 11న ముంబయి లోకల్ రైళ్లలో ఏడు బాంబులు పేలి 181 మంది మరణించి, 900 మందికి గాయాలయ్యాయి.
  • 2006 డిసెంబర్ 2న బీహార్‌లో భగల్‌పూర్ వద్ద 150 సంవత్సరాల నాటి పాత వంతెన రైలుపై కూలి 47 మంది మరణించారు.
రైల్వే ప్రమాదాలు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

  • 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళలో 68 మంది మరణించారు.
  • 2008 ఆగస్టు 1న వరంగల్ జిల్లాలో గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి 31 మంది మరణించారు.
  • 2009 ఫిబ్రవరి 14న హౌరా నుంచి చెన్నై వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన 14 కోచ్‌లు ఒడిశాలోని జాజ్పూ‌ర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఆ ప్రమాదంలో 16 మంది మరణించగా, 50 మందికి గాయాలయ్యాయి.
  • 2010 మే 28న బెంగాల్‌లో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం, ఆ తర్వాత గూడ్స్ రైలు దూసుకొచ్చిన ఘటనలో 150 మరణించారు.
  • 2012 మే 22న అనంతపురం పెనుకొండలో హంపి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2012 జూలై 30 అర్థరాత్రి నెల్లూరులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంలో 47 మంది మరణించారు.
  • 2013 ఆగస్టు 19న బిహార్ లోని ధమరా ఘాట్ స్టేషన్లో సహర్స రైలు ఢీకొని 35 మంది కన్నుమూశారు.
  • 2013 డిసెంబరు 28న బెంగళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వచ్చి ఏపీలోని కొత్త చెఱువు దగ్గర 26 మంది చనిపోయారు
  • 2014 మేలో దివ జంక్షన్ సవాత్వాడి స్టేషన్ మధ్య పాసింజర్ రైలు పట్టాలు తప్పి 20 మంది చనిపోయారు
  • 2014 మేలో గోరక్ ధామ్ ఎక్స్ ప్రెస్ యూపీలోని ఒక స్టేషన్లో గూడ్స్‌ను ఢీకొని 25 మంది మరణించారు.
  • 2014 జూలై 23న మెదక్ జిల్లాలో ట్రాక్ క్రాస్ చేసిన స్కూల్ బస్సును నాందేడ్ సికిందరాబాద్ ఎక్స్ ప్రెస్ ఢీకొని 20 మంచి చనిపోయారు
  • 2015 మార్చిలో డెహ్రాడూన్ వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ రాయబరేలి, యూపీ దగ్గర పట్టాలు తప్పి 58 మంది చనిపోయారు.
  • 2015 ఆగస్టులో మధ్య ప్రదేశ్‌లో కామయాని ఎక్స్‌ప్రెస్, జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాల తప్పి 31 మంది మరణించారు.
  • 2016 నవంబరులో యూపీ పుఖ్రయాన్ దగ్గర ఇండోర్ రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 150 మంది చనిపోయారు.
  • 2017 జనవరిలో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం దగ్గర పట్టాలు తప్పి 41 మంది కన్నుమూశారు.
  • 2017 ఆగస్టులో యూపీ ముజఫర్ నగర్ దగ్గర కళింగ ఉత్కల ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 23 మంది చనిపోయారు.
  • 2018 అక్టోబరులో అమృత్ సర్ లో దసరా చూస్తోన్న జనాల వద్దకు రైలు దూసుకెళ్లి 59 మంది మరణించారు.
  • 2020 మేలో జాల్నా దగ్గరలో ట్రాక్ మీద పడుకున్న 16 మంది వలస కూలీలపై రైలు దూసుకెళ్లి మరణించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)