కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఫొటో సోర్స్, Savita Patel
- రచయిత, సవిత పటేల్
- హోదా, బీబీసీ కోసం
సుఖ్‌జిందర్ కౌర్ కాలిఫోర్నియా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆమె పగలనక, రేయనక రోగులకు సేవ చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. కానీ, కాస్త విరామం తీసుకున్నప్పుడో లేదా భోజన సమయంలోనో వివక్ష వివిధ రూపాల్లో ఆమెకు ఎదురవుతోంది.
సుఖ్‌జిందర్ కౌర్ ఒక దళితురాలు. తోటి ఉద్యోగుల్లో దక్షిణాసియాకు చెందిన వారి నుంచి వచ్చే వివక్షాపూరిత వ్యాఖ్యలను మౌనంగా భరిస్తున్నానని ఆమె చెప్పారు.
ఆ ఆస్పత్రిలో ఆమె అయిదేళ్లుగా పనిచేస్తున్నారు. తన కులాన్ని ఎప్పుడూ బయటపెట్టుకోలేదు. పేరు కూడా మార్చుకున్నారు. ఈ కథనంలో కూడా ఆమె పేరు మార్చాం.
"చమార్లు (దళితులు) మురికిగా ఉంటారని, చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రంగా ఉంచరని అగ్రకులాల నర్సులు నిందిస్తుంటారు" అని ఆమె చెప్పారు.
కుల వివక్ష నిషేధ చట్టం వస్తే, ఈ విషయాన్ని హెచ్ఆర్ వరకు తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు.
చమార్ అనేది దళితులను అవమానించడానికి వాడే పదం. దీన్ని వాడితే చట్ట ప్రకారం శిక్షపడవచ్చని భారత సుప్రీంకోర్టు చెబుతోంది.
కాలిఫోర్నియాలో దళితులు గృహ, విద్య, వృత్తిపరమైన, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని దళిత్ యాక్టివిస్టులు చెబుతున్నారు.
వారికి రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ ఐషా వహాబ్ 'SB-403' బిల్లును ప్రతిపాదించారు.
జెండర్, జాతి, మతం, వైకల్యం మొదలైన వాటితో పాటు వివక్ష నిరోధక చట్టాల పరిధిలో కులాన్ని కూడా చేర్చాలని ఈ బిల్లు చెబుతోంది.
కాలిఫోర్నియా కాంగ్రెస్‌లో ప్రస్తుత సెషన్‌లో ఈ బిల్లుపై విస్తృతంగా చర్చ జరుగుతోందని వహాబ్ బృందం తెలిపింది.
ఈ మధ్య జరిగిన సెనేట్ జ్యుడీషియరీ కమిటీ విచారణ కోసం 700 మందికి పైగా స్టేట్‌హౌస్‌కు వచ్చారు. చాలా మంది దూరాల నుంచి వచ్చారు. కొందరు దీనికోసం రాత్రి అక్కడే ఉండిపోయారు. ఓ వెయ్యి మంది ఫోన్‌లో తమ అభిప్రాయం చెప్పడం కోసం ఎంతసేపైనా ఎదురుచూశారు.

ఫొటో సోర్స్, PREM PARIYAR
ఈ బిల్లును వ్యతిరేకించేవారూ అధిక సంఖ్యలోనే ఉన్నారు. కానీ, మద్దతు ఇస్తున్నవారి సంఖ్య అంతకుమించి ఉందని చెబుతున్నారు.
మే 11న రాష్ట్ర సెనేట్‌లో ఈ బిల్లు 34-1 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ(దిగువ సభ)కు వెళ్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమలులోకి వస్తే, అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియా అవుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సియాటెల్ నగరం కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. దక్షిణాసియా వెలుపల ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన తొలి నగరం ఇదే. ఆ స్ఫూర్తితోనే కాలిఫోర్నియా రాష్ట్రం, మార్చిలో కుల వివక్ష నిరోధక చట్టం ప్రతిపాదన తీసుకొచ్చింది.
కాలిఫోర్నియాలోని ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే సంస్థ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది. 40కి పైగా అమెరికన్, అంతర్జాతీయ దళిత, మానవ హక్కుల కార్యకర్తలు, సంస్థలు ఇందులో భాగంగా ఉన్నాయి. అన్ని జాతులు, మతాలు, కులాలకు సమాన హక్కులు ఉండాలన్న లక్ష్యంతో, వివక్షకు వ్యతిరేకంగా ఈ సంఘం పనిచేస్తోంది.

ఫొటో సోర్స్, Savita Patel
అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం
అమెరికాలోని కాలిఫోర్నియాలో దక్షిణాసియా వాసులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో కొన్ని ఇక్కడే ఉన్నాయి.
కాలిఫోర్నియాలోని వివిధ నగరాల్లో, వ్యవసాయ ప్రాంతాల్లో గురుద్వారాలు కుల వివక్ష వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచాయి.
అమెరికాలో అయిదు లక్షల మందికి పైగా సిక్కులు ఉన్నారు. వాళ్లలో సగం కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే ఉన్నారు.
రెండు పెద్ద సిక్కు సంఘాలు 'సిక్కు కొయిలిషన్', 'సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్' ఈ బిల్లుకు మద్దతిస్తున్నాయి.
సిక్కుల్లో రవిదాసియా వర్గం ఈ బిల్లు కోసం క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తోంది. కాలిఫోర్నియాలోని దళితుల్లో ఈ వర్గమే అతిపెద్దది. సుమారు 15 వేల నుంచి 20 వేల మంది జనాభా ఉంటారు.
రవిదాసియా సమూహం 4వ శతాబ్దపు గురువు రవిదాస్ బోధనలను అనుసరిస్తుంది. గురు రవిదాస్ ‘దిగువ’ కులానికి చెందినవారు.
రేణు సింగ్ చాలా కాలంగా మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నారు. గురుద్వారాలకు వచ్చే సిక్కు కుటుంబాలతో మాట్లాడుతూ, కుల వివక్ష, దానిపై బిల్లు గురించి అవగాహన కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మహిళల్లో కులం, వివక్షపై మాట్లాడే ఆసక్తి పెరుగుతుతోందని రేణు అన్నారు. గృహ హింస ఎదుర్కొనే మహిళలు రేణు దగ్గరకు సాయం కోసం వస్తుంటారు.
"ఒక అమ్మాయి ఉంది. ఆమెది ‘తక్కువ కులం'. ఆమెకు 'అగ్ర కులం' అబ్బాయితో పెళ్లి చేశారు. రోజూ భర్త ఆమెను కొడుతుంటాడు. ఆమె తక్కువ కులానికి చెందిన వ్యక్తి, పైగా స్త్రీ కాబట్టి కొట్టవచ్చని అతడి భావన. మరొక దళిత అబ్బాయి బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అత్తమామలు తరచూ కులం పేరుతో ఈ అబ్బాయిని సూటిపోటు మాటలతో పొడుస్తారు" అంటూ రేణు కొన్ని ఉదాహరణలు చెప్పారు.
రేణు హిందువు. సిక్కు వ్యక్తిని వివాహమాడారు. వాళ్లిద్దరూ గురు రవిదాస్ అనుచరులు.
గురు రవిదాస్ అనుచరులని తెలిస్తే అగ్ర కులాల వాళ్లు స్నేహాలు కూడా వదిలేసుకుంటారని రేణు చెప్పారు.
ఇవన్నీ చూశాక కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం రావాల్సిన అవసరం ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు.
ఈ మహిళలంతా గొంతు విప్పాలని, కాలిఫోర్నియా చట్ట సభ్యులు వారి గొంతు వినాలని ఆమె కోరుకొంటున్నారు. వాళ్లు చెబుతున్న మాటలు ప్రభుత్వానికి చేరడం కోసం అనువాదం పని కూడా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Savita Patel
సౌత్ ఆసియన్ అమెరికన్ డయాస్పోరాలో కుల వివక్షపై సర్వే నిర్వహించింది ఈక్వాలిటీ ల్యాబ్. అమెరికాలో కులం, దాని ప్రభావంపై విస్తృతంగా జరిపిన తొలి అధ్యయనం ఇదే. దీని ఫలితాలను 2018లో ప్రచురించారు.
వివక్ష ఎదుర్కొంటున్న దిగువ కులాల వారు కోపంతో, ఆందోళనతో ఉన్నారని, అందుకే చాలా మంది తమ కులాన్ని దాచిపెడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది.
ఈ సర్వే అందించిన గణాంకాల ప్రకారం, అమెరికాలో కులపరమైన అణచివేతకు గురైన ప్రతి నలుగురిలో ఒకరు శారీరక హింసను, తిట్లను ఎదుర్కొంటున్నారు. విద్యాలయాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు, ఆఫీసుల్లో ముగ్గురిలో ఇద్దరు వివక్ష ఎదుర్కొంటున్నారు.
అయితే, అమెరికాలో నివాసముంటున్న చాలా మంది భారతీయులు అక్కడ కుల వివక్ష లేనే లేదని వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Savita Patel
బిల్లుపై తీవ్ర వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన దళిత కార్యకర్త దీపక్ ఆల్డ్రిన్ "ఎలాంటి వివక్షనైనా సహించకూడదు" అని భావిస్తున్నప్పటికీ, ఈ బిల్లుకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు.
"నేనిక్కడ 35 ఏళ్లుగా ఉంటున్నాను. నా కులమేంటని ఏ హిందువూ నన్ను అడగలేదు. బిల్లును సపోర్ట్ చేస్తున్న దళిత హక్కుల కార్యకర్తలు దళితులందరి తరపునా మాట్లాడట్లేదు" అని ఆయన అన్నారు.
అమెరికాలో భారతీయ మూలాలకు చెందినవారిలో చాలా మంది ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. మత సంస్థలు, వృత్తిపరమైన సమూహాలు కూడా తీవ్రంగా విభేదిస్తున్నాయి.
ఈ బిల్లు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, ఉద్యోగాల్లో కూడా తమపై ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. కాలిఫోర్నియాలో ప్రస్తుతం ఉన్న చట్టాలు ఎలాంటి వివక్షనూ సహించవని, కొత్త చట్టాలు అక్కర్లేదని భావిస్తున్నారు. ఈ బిల్లు పాస్ చేయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హిందూపాక్ట్ పరిధిలోని హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్థలు ఈ బిల్లును తిరస్కరించాలని కాలిఫోర్నియా చట్టసభ సభ్యులకు విజ్ఞప్తి చేశాయి.
హిందూపాక్ట్ కన్వీనర్ అజయ్ షా మాట్లాడుతూ, "ఈ చట్టం లోపభూయిష్టమైనది, దురుద్దేశంతో కూడుకున్నది, భారతదేశానికి చెందిన, హిందూమతం అనుసరించే పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకున్నది" అన్నారు.
ఈ బిల్లు ఇప్పటికే కులం పట్ల ‘అక్కర్లేని’ అవగాహన కల్పిస్తోందని హిందూ అమెరికన్ ఫౌండేషన్ వ్యాఖ్యానించింది.
ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ-వ్యవస్థాపకుడు సుహాగ్ శుక్లా మాట్లాడుతూ, "టెక్ కంపెనీల్లో ఉద్యోగులు అనుచితమైన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. సౌత్ ఆసియన్లు కానివారు వాళ్లను మీ కులం ఏమిటని అడుగుతున్నారు" అని చెప్పారు. ఇది ఒక ధోరణిగా మారితే జాతి ఆధారంగా వేధింపులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా బోర్డు సభ్యురాలు పుష్పిత ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"కులం అనేది ఒక తటస్థ పదం కాదు. హిందూ మతంతో ముడిపడి ఉన్న పదం. నిఘంటువుల్లో హిందూ వ్యవస్థలో అధికార క్రమాన్ని సూచించే పదమని అర్థం ఉంది. అమెరికాలో స్కూలుకు వెళ్లే పిల్లలు హిందూ మతం గురించి పాఠాల్లో నేర్చుకున్నప్పుడే కుల వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ప్రపంచ మతాలపై పాఠ్యాంశంలో హిందూ మతం ప్రస్తావన కూడా వస్తుంది" అని ఆమె అన్నారు.
కులం అనేది చాలా సంక్లిష్టమైన సమస్య కాబట్టి, ఒక వ్యక్తి కులాన్ని గుర్తించడానికి కాలిఫోర్నియా రాష్ట్రం ఎలాంటి ప్రణాళిక తీసుకువస్తుందోనని బిల్లును వ్యతిరేకిస్తున్నవారు కలవరపడుతున్నారు.
అయితే, బిల్లులో కులాన్ని గుర్తించే వివరాలు ఉండవని సెనేటర్ ఐషా వహాబ్ చెప్పారు.
"కులాన్ని ఎలా గుర్తిస్తారన్న అంశం ఇందులో లేదు. ఇది కేవలం కుల వివక్ష నిరోధక బిల్లు. విషయం కోర్టుకు వెళ్లినప్పుడు వాదోపవాదాలు, సాక్ష్యాలు అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు" అని ఆమె వివరించారు.
హిందూ అమెరికన్ ఫౌండేషన్ వేసిన మూడు కేసులు కాలిఫోర్నియా రాష్ట్రం, ఫెడరల్ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి.
"కులానికి రాజ్యాంగవిరుద్ధమైన నిర్వచనం ఇచ్చారు" అని ఆరోపిస్తూ వాళ్లు కాలిఫోర్నియా రాష్ట్రంపై ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. కుల వివక్షపై బిల్లు ఒక సమూహాన్ని వేరుపరుస్తుందని, వారిపై అదనపు పోలీసింగ్‌కు తావిస్తుందని ఆరోపించారు.
వహాబ్ ఒక అఫ్గాన్-అమెరికన్. శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టి పెరిగారు. తాను స్వయంగా కుల వివక్షను ఎదుర్కోలేదు కానీ, అదెలా ఉంటుందో తనకు తెలుసని చెబుతున్నారు.
మార్చిలో ఈ బిల్లు ప్రవేశపెట్టగానే వహాబ్ అనేక బెదిరింపులు ఎదుర్కొన్నారు. చంపేస్తామని కూడా బెదిరించారు. వహాబ్‌ను పదవి నుంచి తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
బిల్లుకు ఇంత వ్యతిరేకత రావడంపై వహాబ్ విచారం వ్యక్తంచేశారు. అయితే, వ్యతిరేకులు బిల్లును పూర్తిగా చదవాలని కోరారు.
"మీరు అగ్ర కులంలో వారైనా, దిగువ కులం వారైనా ఈ బిల్లు మిమ్మల్ని కాపాడుతుంది" అని ఆమె చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














