అమెరికా: 'కుల వివక్ష'పై కాలిఫోర్నియా సెనేట్‌లో బిల్లు

ఫొటో సోర్స్, PREM PARIYAR
అమెరికాలోని కాలిఫోర్నియా సెనేట్‌లో కుల వివక్షను చట్టవిరుద్ధం చేసే బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు.
ఇది ఆమోదం పొందితే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలకు నిలయమైన కాలిఫోర్నియా కులం ఆధారంగా వివక్షను నిషేధించిన మొదటి అమెరికా రాష్ట్రం అవుతుంది.
కాలిఫోర్నియాలోని వివక్ష నిరోధక చట్టాలలో లింగ, జాతి, వైకల్యంతో పాటు కులాన్ని కూడా చేర్చాలని ప్రతిపాదిస్తూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ ఐషా వహాబ్ ఈ బిల్లును రూపొందించి, ప్రవేశపెట్టారు.
కాగా, నెల రోజుల ముందు సీటెల్ కుల ఆధారిత వివక్షను నిషేధించిన మొదటి నగరంగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఐషా ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో దక్షిణాసియా ప్రజలు ఉన్నారు.
వీరిలో చాలామంది సాంకేతిక సంస్థలలో పని చేస్తున్నారు.
ఐషా శాన్ అఫ్గాన్-అమెరికన్ చట్టసభ సభ్యురాలు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత అమెరికా జంట సంరక్షణలో పెరిగారు.
తాను కుల వివక్షను అనుభవించనప్పటికీ, పెరిగిన ప్రదేశం కారణంగా దానిని అర్థం చేసుకున్నానని వెల్లడించారు.
"నా తల్లిదండ్రులు వివిధ కులాలకు చెందిన వ్యక్తులు కావడంతో వారి కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఈ దేశానికి వలస వచ్చారని నా స్నేహితులు నాకు చెప్పారు" అని బీబీసీకి వహాబ్ చెప్పారు.
భారతదేశం, నేపాల్‌తో సహా దక్షిణాసియా దేశాలలో మనుగడలో ఉన్న సామాజిక వివక్ష పురాతన రూపాలలో కుల వ్యవస్థ ఒకటి.
ఇండియాలో దళితులు , ఇతర కొన్ని కులాలను వెనుకబడిన వర్గాలుగా పరిగణించేవారు.
వారికి కోటాలు, వివక్ష వ్యతిరేక చట్టాల రూపంలో రాజ్యాంగపరమైన రక్షణలను అందించాయి.
దళిత ఉద్యమకారులు, విద్యావేత్తలు పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా యూఎస్‌లో కూడా ఇటువంటి గుర్తింపు అవసరమని అంటున్నారు.
వారిలో చాలా మంది సంవత్సరాలుగా కులం, దాని సంక్లిష్టతలపై ఇదే విధమైన అవగాహనను వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, PREM PARIYAR
'టెక్ పరిశ్రమలో కులం ఆధారంగా ప్రాజెక్టులు'
టెక్ పరిశ్రమ ఇటీవలి కాలంలో ఈ సమస్యతో పోరాడుతోంది.
2020లో ఒక భారతీయ దళిత ఇంజనీర్ సిలికాన్ వ్యాలీ ప్రధాన కార్యాలయంలోని కంపెనీలో కుల వివక్షను ఎదుర్కొన్నారనే ఫిర్యాదు ఆధారంగా కాలిఫోర్నియా రెగ్యులేటర్లు సిస్కో సిస్టమ్స్ కంపెనీపై దావా వేశారు.
అంతేకాదు 2021లో దళిత హక్కుల కార్యకర్త తెన్మొళి సౌందరరాజన్‌కు ఉద్యోగులతో మాట్లాడేందుకు వచ్చిన ఆహ్వానాన్ని కంపెనీ రద్దు చేయడంతో గూగుల్ న్యూస్‌లో సీనియర్ మేనేజర్ తనూజా గుప్తా రాజీనామా చేశారు.
ఈ సంఘటనలు కాలిఫోర్నియా ప్రజలకు "పని ప్రదేశాలు, విద్యాసంస్థలలో వివక్ష ఉండరాదు" అనే దానిని హైలైట్ చేస్తున్నాయని పౌర హక్కుల సంస్థ ఈక్వాలిటీ ల్యాబ్స్ వ్యవస్థాపకులు సౌందరరాజన్ చెప్పారు.
కుల వివక్షకు చట్టబద్ధమైన పరిష్కారం అవసరమని బిల్లుకు మద్దతిచ్చే వారు చెబుతున్నారు. వారిలో ఒకరైన మాయా కాంబ్లే తన పనిని రహస్యంగా చేస్తున్నారు.
ఆమె ఒక పెద్ద అమెరికా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత సహోద్యోగులకు తాను దళితురాలినని వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు మాయా చెప్పారు.
గతంలో పని చేసే స్థలంలో ఒకప్పుడు సవాలుతో కూడిన అసైన్‌మెంట్‌లతో తనను విశ్వసించిన మేనేజర్ తన కులాన్ని తెలుసుకున్న తర్వాత తన వైఖరిని మార్చుకున్నారని ఆమె పేర్కొన్నారు.
తదుపరి పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తనకు "అనారోగ్యం" ఉన్నందున దానికి దూరంగా ఉండమని చెప్పారని మాయా గుర్తుచేసుకున్నారు.
"ఇది నాకు, నా సహోద్యోగులకు దిగ్భ్రాంతిని కలిగించింది" కుల వివక్ష చట్టం ఉన్నట్లయితే తాను ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు.
"హెచ్‌ఆర్‌కి కులం గురించి ఏమీ తెలియదు. ఇది అంటరానితనంతో ముడిపడి ఉందని నేను వారికి ఎలా చెప్పగలను?" దశాబ్దాల క్రితం తాను విద్యార్థిగా యుఎస్‌కి వచ్చినప్పుడు తనకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని మాయా గుర్తుచేసుకున్నారు.
కుల వివక్ష చట్టంపై గూగుల్, ఆపిల్ సంస్థలు ఏమంటున్నాయి?
కాలిఫోర్నియాలోని అనేక విద్యా, కార్పొరేట్, రాజకీయ సంస్థలు ఇప్పటికే కుల వివక్ష వ్యతిరేక విధానాలను రూపొందించాయి.
గత ఏడాది అమెరికాలోని అతిపెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయ వ్యవస్థ అయిన కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ (కాల్ స్టేట్) కులాన్ని రక్షిత వర్గంగా చేర్చింది.
అదే ఏడాది ఆపిల్ సంస్థ కుల వివక్షను నిషేధించడానికి రెండేళ్ల క్రితం తన ఉద్యోగుల విధానాన్ని నవీకరించినట్లు ప్రకటించింది.
2021లో కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ తన ప్రవర్తనా నియమావళిలో కులాన్ని రక్షిత వర్గంగా చేర్చింది.
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లోని వర్కర్స్ యూనియన్ వహాబ్ బిల్లుకు మద్దతునిస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
బిల్లును వ్యతిరేకిస్తున్న వారెవరు?
కాలిఫోర్నియాలో దక్షిణాసియా జనాభా పెరుగుతున్నందున, కులం పెద్ద సమస్యగా మారింది.
అయితే, ఈ బిల్లును అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి చట్టాలు భారతీయ, దక్షిణాసియా సంఘాలను ప్రత్యేక చట్టపరమైన పరిశీలన ద్వారా ఒంటరిగా మారుస్తాయని నమ్ముతున్నారు.
తమకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయని వాదిస్తున్నారు.
2021లో సిలికాన్ వ్యాలీ 'శాంటా క్లారా కౌంటీ మానవ హక్కుల కమిషన్' కులాన్ని రక్షిత వర్గంగా గుర్తించే ప్రక్రియపై కొన్ని దక్షిణాసియా గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఓటింగ్‌ను నిలిపివేసింది.
సియాటెల్ సిటీ కౌన్సిల్ ఓటింగ్‌కు ముందు దాదాపు 100 సంస్థలు, వ్యాపార సంస్థలు కుల ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరుతూ లేఖలు రాశాయి.
ఆ సమయంలో హిందూ అమెరికన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా బీబీసీతో మాట్లాడుతూ కుల వివక్ష తప్పన్నారు.
ప్రధాన హిందూ సూత్రాలను ఇది ఉల్లంఘిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. జనాభాలో 2 శాతం కంటే తక్కువ ఉన్న తమ కమ్యూనిటీని పోలీసు చట్టంలో ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా అది ప్రతికూలత చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ ఫౌండేషన్ ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రంపై ఫెడరల్ కోర్టులో "రాజ్యాంగ విరుద్ధమైన కులం నిర్వచనం" కోసం దావా వేస్తోంది.
వివక్ష రహిత విధానంలో కులాన్ని కాలిఫోర్నియా స్టేట్ చేర్చడాన్ని సవాలు చేయడంలో ఈ సంస్థ సాయం చేస్తుంది.
తోటి శాసనసభ్యులు తనకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు ఐషా వహాబ్ చెప్పారు. ఆల్ఫాబెట్, మెటా ప్రధాన కార్యాలయం ఉన్న జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తోటి డెమొక్రాటిక్ సెనేటర్ జోష్ బెకర్.
జోష్ స్పందిస్తూ "దేశంలో ద్వేషం, జాత్యహంకారం పెరుగుతున్న దశలో కుల వివక్ష గురించి భయపడుతున్నపుడు, దాన్ని మార్చే విధానంలో దేనికైనా మద్దతిస్తానని తెలిపారు.
ఇదేం సులభమైన ప్రక్రియ కాదు, ఐషా ఏడాదైనా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ఎందుకంటే బిల్లును సెనేట్ కమిటీలు, రాష్ట్ర సెనేట్, అసెంబ్లీ ఆమోదించాలి. అది చట్టంగా మారాలంటే గవర్నర్ సంతకం చేయాలి.
ఇవి కూడా చదవండి
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














