ఒడిశా రైలు ప్రమాదం: మార్చురీ నుంచి తమకు పిలువు రావద్దని అక్కడున్న వారంతా ప్రార్ధిస్తున్నారు, కానీ....

రైలు ప్రమాదం

మార్చురీ నుంచి తమకు పిలుపు రావద్దని అక్కడున్న వారు కోరుకుంటున్నారు. కానీ, దాని నుంచి తప్పించుకునే దారి లేదని వారికి తెలుసు.

ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనను గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేసేందుకు బీబీసీ ప్రతినిధి సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రమాదం తర్వాత బాలాసోర్ ఆస్పత్రి వద్ద నెలకొన్న పరిస్థితులు ఆయన మాటల్లోనే....

ఒడిశాలోని బాలాసోర్ ఆస్పత్రికి శనివారం మధ్యాహ్నం చేరుకున్నా. మార్చురీ ఎక్కడ అని అక్కడి వారిని అడిగాను.

మార్చురీ వైపు వెళ్తుండగా, అక్కడ ఉన్న మహిళలు, పురుషులు, యువకుల ముఖాల్లో ఆందోళన కనిపించింది. మార్చురీ లోపలి నుంచి ఏం వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వారిలో ఉంది.

వారిలో కొందరు మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చారు. మరికొందరు మృతదేహాలను గుర్తించేందుకు అక్కడ ఉన్నారు.

సంతోష్ కుమార్ సాహుకి శుక్రవారం రాత్రి ఆయన అత్తమామల ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. గూడ్సుని ఢీకొట్టి ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో తమ బంధువు ఉన్నట్లు ఆయనకు తెలిసింది.

ఒక్క వాహనం కూడా దొరకలేదు..

''నా భార్య సోదరుడు బాలాసోర్‌లో పనిచేస్తుంటారు. జయపూర్‌ (ఒడిశా)లో ఉంటున్న ఆయన భార్య, ఇద్దరు పిల్లల వద్దకు ప్రతివారం వచ్చి వెళ్తుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అలాగే చేస్తున్నారు'' అని సాహు చెప్పారు.

శుక్రవారం రాత్రి ఫోన్ వచ్చిన తర్వాత బాలాసోర్ జిల్లా ఆస్పత్రికి బయలుదేరాలని సాహు అనుకున్నారు. కానీ, ఆయనకు వెళ్లేందుకు వాహనాలు దొరకలేదు. శనివారం ఉదయం ఓ కారులో బయలుదేరి ఇక్కడకు వచ్చారు. ఆయన తన బావ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి బయట నిల్చుని ఉన్నారు.

ఆశిష్ అనే మరో యువకుడు కూడా బాలసోర్ జిల్లా ఆసుపత్రికి త్వరగా చేరుకోవాలని తొందరలో ఉన్నారు. అయితే, ఆయన రవాణా ఇబ్బందులు ఎదురుకాలేదు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికి దగ్గర్లోనే ఓ హాస్టల్‌లో ఆయన ఉంటున్నారు.

సాహు, ఆశిష్ ఇద్దరికీ శుక్రవారం రాత్రి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. అయితే, అందుకు కారణాలు మాత్రం వేరు.

రైలు ప్రమాదం

''వార్డులోకి వెళ్లడం కష్టమైంది''

ఆశిష్ సహా సుమారు వందమందికి పైగా వైద్య విద్యార్థులకి శుక్రవారం రాత్రి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎమర్జెన్సీ.. వెంటనే ఆస్పత్రికి రావాలని చెప్పారు.

మేము బాలాసోర్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు బయట వైద్య విద్యార్థి ఆశిష్‌తో మాట్లాడాం.

''కేవలం 24 గంటల్లో ఆస్పత్రి ఎలా మారిపోయిందో మీరు అస్సలు ఊహించలేరు. గాయాలతో ఎంతోమంది ఇక్కడున్నారు. మేము కనీసం వార్డుల్లోకి కూడా వెళ్లలేకపోయాం. ఒకరికి వైద్యం చేస్తుండగానే, త్వరగా రావాలని మరొకరు వేడుకుంటున్నారు'' అని ఆశిష్ చెప్పారు.

వైద్య విద్యార్థులందరినీ గ్రూపులుగా విడగొట్టి, వివిధ విభాగాలకు చెందిన సీనియర్ వైద్యులకు సహాయకులుగా కేటాయించారని ఆయన అన్నారు.

శిక్షణలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్లు, వైద్యులు, నర్సులు, వలంటీర్లు.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరినీ ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిలిపించారు.

బాలాసోర్ ఆస్పత్రి ఒక జిల్లా ఆస్పత్రి. ఇక్కడ ఎక్కువ సదుపాయాలు లేవు. ఒకేసారి భారీగా రోగులు వస్తే వైద్యం అందించే పరిస్థితి అక్కడ లేదు.

కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి వార్డుల్లో కనిపించింది. రైలు ప్రమాద బాధితులు ఆస్పత్రిలో నేలపైనే కూర్చుని కనిపించారు. వారిలో కొందరు స్పృహలో ఉన్నారు. మరికొందరు లేరు. స్పృహలో ఉన్నవారు గాయాలతో, తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారు.

రైలు ప్రమాదం

'శిథిలాల కింద ఉన్నాను'

ఆస్పత్రి లోపల వార్డులోకి వెళ్లాం. అక్కడ చికిత్స పొందుతున్న రిత్విక్ పాత్రాని కలిశాం. వాళ్లు షాలిమార్ - చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్తున్నారు. నుదిటిపై రక్తంతో తడిసిన ఓ కట్టు, కాలికి మరో కట్టుతో బెడ్‌పై పడుకుని ఉన్నారు రిత్విక్. చాలా మంది అక్కడ నేలపైనే పడుకుని ఉన్నారు.

''పెద్ద శబ్దం వచ్చినట్టు గుర్తుంది. ఆ తర్వాత అంతా తల్లకిందులైంది. నేను స్పృహలోనే ఉన్నప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయాను. శిథిలాల కింద నాతో పాటు చాలా మంది ఉన్నారు.'' అని పాత్రా చెప్పారు.

రిత్విక్ పాత్రా దక్షిణాది రాష్ట్రానికి వెళ్తున్నారు. అయితే, ఆయన పక్కనే ఉన్న పంకజ్ పాశ్వాన్ దక్షిణాది నుంచి తన సొంత రాష్ట్రం బిహార్‌కు వెళ్తున్నారు.

పంకజ్ యశ్వంత్‌పూర్ - హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.

''అసలు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. శిథిలాల కింద నుంచి నాకు నేనే బయటకు వచ్చా. మా రైలు, గూడ్సు రైలు ఢీకొన్నాయని ఆ తర్వాత విన్నా.'' అని పంకజ్ చెప్పారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో జనరల్(అన్‌రిజర్వుడ్) బోగీలు ఉన్నాయని మాకు తెలిసింది. అనుకోకుండా, అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి వచ్చిన వారు ఈ జనరల్ బోగీల్లో ప్రయాణిస్తారు.

ఈ జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్న వారి పేర్లు, వివరాలు రైల్వే రికార్డ్స్‌లో లేవు. దాదాపు 160 మంది మృతదేహాలను గుర్తించకలేకపోవడానికి అదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రైలు ప్రమాదం

సాయం చేసేందుకు ముందుకొచ్చిన సామాన్య ప్రజలు

ప్రమాదానికి కారణాలు ఏవైనప్పటికీచ బాలాసోర్ ఆస్పత్రిలో అంతమందికి వైద్యం అందించేందుకు సదుపాయాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో, బాధితులను పెద్దాస్పత్రులకు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్న వైద్యశాలలకు తరలించాలని నిర్ణయించారు.

శుక్రవారం రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎన్జీవో కార్యకర్త సమీర్ జతానియా ఆస్పత్రిలోనే ఉండి బాధితులకు సాయం చేస్తున్నారు.

''పరిస్థితి విషమంగా ఉన్న వారిని తరలించాలనేది మంచి నిర్ణయం. ఎక్కువ మందికి వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రిలో సదుపాయాలు లేవు'' అని ఆయన చెప్పారు.

''ప్రమాదం గురించి తెలియగానే సాయం చేసేందుకు సామాన్య ప్రజలు ముందుకొచ్చారు. మొదట అంతా గందరగోళంగా ఉంది. అంబులెన్సులు ఒకటి తర్వాత మరొకటి బాధితులను తీసుకొస్తూనే ఉన్నాయి. బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు అటూఇటూ పరిగెడుతున్నారు.'' అని జతానియా అన్నారు.

''ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సాయం చేసేందుకు వలంటీర్లు వచ్చారు. గాయాలపాలైన వారికి ఆహారం, నీళ్లు ఇస్తున్నారు. మేము అందరికీ మందులు పంచే పనిలో ఉన్నాం. రక్తం దానం చేసేందుకు సుమారు 300 మంది క్యూలో నిల్చున్నారు.'' అని ఆయన చెప్పారు.

శనివారం ఉదయం 3 గంటలకు ప్రమాద బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించే పని మొదలైంది.

మెరుగైన వైద్యం కోసం బాధితులను కటక్, భువనేశ్వర్, కోల్‌కతాలోని ఆస్పత్రులకు తరలించాలనే నిర్ణయం చాలా మంచిదని మెడికల్ స్టూడెంట్ ఆశిష్, ఎన్జీవో కార్యకర్త సమీర్ జతానియా అన్నారు.

తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన ఆస్పత్రులకు తరలించినప్పటికీ, వారిని పరామర్శించేందుకు వస్తున్న వీవీఐపీల రాక మాత్రం ఆగేలా కనిపించలేదు.

రైలు ప్రమాదం

అవసరమైతే డీఎన్‌ఏ టెస్టులు

బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చాలా మంది వ్యక్తుల ఆచూకీ ఇంకా తెలియలేదు.

ఇది మాకు పెద్ద సవాల్ అని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అన్నారు.

''చనిపోయిన 187 మంది వివరాలు ఇంకా తెలియలేదు. మృతుల ఫొటోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తాం. మృతదేహాలను భువనేశ్వర్‌కు తరలించేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేశాం.'' అని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకూ 170 మృతదేహాలు భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. మిగిలిన 17 మృతదేహాలను బాలాసోర్ నుంచి భువనేశ్వర్‌కు తీసుకువస్తున్నారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు 85 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి: