ఒడిశా రైలు ప్రమాదం: నాలుగు లైన్లు , మూడు రైళ్లు.. నిమిషాల్లోనే విధ్వంసం ఎలా జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
ఒడిశాలోని బాలేశ్వర్‌లో బహానగా రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొన్ని నిమిషాల్లోనే భారీ విధ్వంసం చోటుచేసుకుంది.
ఆగివున్న గూడ్సు రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడం, అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న మరో రైలు మీదకు కోరమండల్ బోగీలు దూసుకెళ్లడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎలా సంభవించింది? ఎప్పుడు ఏం జరిగింది? ప్రాథమిక విచారణ నివేదికలో ఏం బయటపడింది? లాంటి వివరాలను ఈ కథనంలో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మొదలైంది?
మొదట జూన్ 2 మధ్యాహ్నం 3.20 గంటలకు 12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. పశ్చిమబెంగాల్‌లోని షాలీమార్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఈ రైలు ఖరగ్‌పుర్, బాలాసోర్ స్టేషన్‌లను సమయానికి చేరుకుంది. తర్వాత స్టేషన్ భద్రక్.
సరిగ్గా 7.01 నిమిషాలకు బహానగా బజార్ స్టేషన్‌ను దాటుకుంటూ కోరమండల్ వెళ్లిపోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
బహానగా బజార్ స్టేషన్ పరిస్థితి ఏమిటి?
బహానగా బజార్ స్టేషన్‌లో ఒక అప్ లైన్ (చెన్నై వైపు వెళ్లేది), ఒక డౌన్ లైన్ (హావ్‌డా వైపు వెళ్లేది) ఉన్నాయి. మరో రెండు లూప్‌లైన్‌లు కూడా వీటితో అనుసంధానమై ఇక్కడ ఉన్నాయి.
ఈ లూప్‌లైన్ మీద రైళ్లను నిలుపుకోవచ్చు. వేరే రైళ్లకు దారి ఇచ్చేందుకు వీటిపై రైళ్లు ఆపుతుంటారు. సాధారణంగా ముఖ్యమైన, వేగంగా వెళ్లే రైళ్ల కోసం ప్రధాన మార్గాలను సిద్ధంగా ఉంచేందుకు లూప్‌లైన్‌లు ఉపయోగపడుతుంటాయి.
నిర్దేశిత సమయానికే కోరమండల్ బహానగా సమీపానికి వచ్చింది. అయితే, అప్పటికే చెన్నై వైపు వెళ్లే అప్ లైన్‌తో అనుసంధానమైన లూప్‌లైన్‌పై ఒక గూడ్స్ రైలు ఆగివుంది. అప్‌లైన్ మీద నుంచి ఆగకుండా కోరమండల్ వెళ్లిపోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
తప్పు ఎక్కడ జరిగింది?
ఈ ప్రమాదంపై రైల్వే సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ ప్రాథమిక పరిశీలన నివేదికను రూపొందించింది. దాని ప్రకారం.. ప్రధాన లైన్ అంటే అప్ లైన్‌లో వెళ్లేందుకు కోరమండల్‌కు సిగ్నల్ ఇచ్చారు. కాసేపటికి మళ్లీ సిగ్నల్‌ను వెనక్కి తీసుకున్నారు.
దీంతో గంటకు 127 కి.మీ. వేగంతో వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అప్ లూప్ మీదకు వచ్చింది. అయితే, అప్పటికే ఆ లూప్‌లో గూడ్స్ ఉంది. భారీ వేగంతో ఆ గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది. ఫొటోలను గమనిస్తే, గూడ్స్‌పైకి కోరమండల్ ఇంజిన్, బోగీలు దూసుకువెళ్లినట్లు ఘటన స్థలంలో తీసిన చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మూడో రైలు ఎక్కడి నుంచి వచ్చింది?
నిజానికి ప్రమాదానికి ముందు కోరమండల్ పూర్తి వేగంతో వెళ్తోంది. అప్పుడు బ్రేక్‌లు వేసినా కొన్ని కి.మీ.ల తర్వాతే రైలు ఆగుతుంది.
సరిగ్గా సాయంత్రం 6.55 నిమిషాలకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొట్టడంతో భారీ శబ్దం వచ్చింది. ప్రమాదం తీవ్రతకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పది బోగీలు అప్ లూప్‌లైన్ మీద నుంచి డౌన్ మెయిన్ లైన్ మీదకు వెళ్లిపోయాయి.
అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే డౌన్ లైన్ నుంచి వ్యతిరేక దిశలో 12864 మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ యశ్వంత్‌పుర్-హావ్‌డా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. అప్పుడు ఆ రైలు గంటకు 116 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది.
కోరమండల్ బోగీలు వచ్చిపడటంతో యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు కూడా పట్టాలు తప్పాయి.
మొత్తానికి నాలుగు (రెండు లూప్, రెండు మెయిన్ ) లైన్లపై ఈ మూడు రైళ్లు విధ్వంసం సృష్టించాయి.

దర్యాప్తులో ఏం తేలింది?
ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు సాయం అందించేందుకు స్థానికులు పెద్దయెత్తున తరలివచ్చారు. రాత్రి 7.15 గంటలకు స్థానిక అధికారులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు.
తాజా ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటెర్‌లాకింగ్‌లో లోపాలే కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
‘‘దర్యాప్తు నివేదిక చేతికి వచ్చింది. ఘటనకు బాధ్యులను మేం గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుల వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టిపెడుతున్నాం’’ అని ఆయన అన్నారు.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ (ఈఐ) అనేది మైక్రోప్రాసెసర్ ఆధారిత ఇంటర్‌లాకింగ్ సిస్టమ్. భిన్న రైళ్ల మధ్య సిగ్నల్స్ సమన్వయంతో ఉండేలా చూడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రైళ్ల కోసం రూట్‌లను సిద్ధం చేయడం, సిగ్నల్స్ ఇవ్వడానికి ఈఐను ఉపయోగిస్తుంటారు. దీనితోపాటు యాక్సెల్ కౌంటర్స్ (ఏసీ), ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీసీ) టెక్నాలజీలను సిగ్నలింగ్ కోసం రైల్వే ఉపయోగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- ‘ది కేరళ స్టోరీ’: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?
- కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















