ట్రైన్ యాక్సిడెంట్: ‘బోగీల కింద మనుషుల కాళ్లు, చేతులు.. అంతా 10 నిమిషాల్లోనే జరిగింది’ - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
''బోల్తా పడిన బోగీల నుంచి మేం ఎంతమందిని బయటకు తెస్తున్నా ఇంకా మరికొన్ని చేతులు మాకు కనిపిస్తూనే ఉన్నాయి. అలా రాత్రంతా చేస్తూనే ఉన్నాం” అని బాలాసోర్ రైలు ప్రమాద స్థలానికి సమీపంలోనే నివసించే దాస్ బీబీసీతో చెప్పారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన బీబీసీ ప్రతినిధి అక్కడి పరిస్థితిని వివరించారు.
‘బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాద స్థాయిని భువనేశ్వర్‌కు వరుసగా వెళ్తున్న అంబులెన్సులు చెప్పాయి’
శనివారం ఉదయం 4:30 సమయంలో భువనేశ్వర్, కటక్ జాతీయ రహదారిపై అంబులెన్సులు శబ్దం చేసుకుంటూ వెళ్తున్నాయి. పది నిమిషాలలో లెక్కేస్తే డజన్లకొద్దీ అంబులెన్సులు వెళ్లడం కనిపించింది. హైవేపై వెళ్తున్న ఆ అంబులెన్సులు బాలాసోర్ రైలు ప్రమాద తీవ్రతను ముందుగానే మాకు కళ్లకు కట్టాయి.
కటక్ దాటిన తర్వాత బ్రష్ చేసేందుకు ఒక చోట కుళాయి ఉన్న దుకాణం వద్ద ఆగాం. మేం ఆగిన కాసేపటికే అక్కడికి బాలాసోర్ వెళ్తూ రెండు ఖాళీ అంబులెన్సులు ఆగాయి. కుళాయి ఉందనే వాళ్లు కూడా ఆపారు. అయితే, వాళ్లు ఆపింది అంబులెన్సుపై ఉన్న రక్తపు మరకలు కడగడానికి.
“ఇది మూడో ట్రిప్పు, రెండు ట్రిప్పుల్లో నేను 14 మందిని కటక్ ఆసుపత్రికి తీసుకొచ్చాను. మళ్లీ వెళ్తున్నాను. రాత్రి 11 గంటల నుంచి ఈ పనే చేస్తున్నా. వాహనం నిండా రక్తం మరకలైపోయాయి. అందుకే కడుగుదామని ఆగాం. అక్కడ పరిస్థితి ఏం బాగాలేదు. చూస్తే తట్టుకోలేరు” అని తన అంబులెన్సుని కడుగుతూ డ్రైవర్ బిష్ణు కుమార్ నాతో చెప్పారు.

బహానాగా బజారు గ్రామ నివాసి దాస్ చెప్పిన ప్రకారం, శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాదం జరిగింది. చీకట్లో చూసిన దాస్‌కు ఆ ప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపించలేదు కానీ, ఉదయాన్నే అక్కడికి చేరుకున్న నాకు ఇటువంటి ప్రమాదం జరుగుతుందా? అని ఆశ్చర్యమేసింది.
సహాయక చర్యల్లో భాగంగా అక్కడికి వచ్చిన ఒక రైలు ఇంజిన్‌పైకి ఎక్కి అక్కడి దృశ్యాన్ని చూస్తే రైలు బోగీలు కుప్పలు పోసి, వాటిని మరో రైలుతో బలంగా ఢీకొట్టినట్లు కనిపించింది.
అలాంటి దృశ్యాలు సినిమాల్లోనే కనిపిస్తాయి. ఒకవైపు వంకలు తిరిగినట్లు పట్టాలు, వాటితో పాటే రైలు బోగీలు చెల్లాచెదురుగా కనిపించాయి. మరో వైపు బోల్తాపడిన బోగీల కింద కనిపిస్తున్న మనుషుల కాళ్లు, చేతులు.
ఒక గూడ్స్, రెండు ప్రయాణికుల రైళ్లు.. అంటే మూడు రైళ్ల మధ్య జరిగిన ఈ ప్రమాదాన్ని అస్సలు ఊహించలేరు.

ఫొటో సోర్స్, ANI
'డెడ్‌బాడీలు బయటికి పోతున్నాయి.. కొత్తవి వస్తున్నాయి'
ఈ ప్రమాదంలో మృతులు, క్షతగ్రాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉంది.
మొదట రైల్వే అధికారులతో మాట్లాడినప్పుడు ఆరుగురు వరకు మరణించారని చెప్పారు. ఆ తర్వాత 10 గంటల సమయంలో 50 దాటొచ్చన్నారు. శనివారం సాయంత్రానికి 290కి పైగానే అని తేల్చారు అధికారులు. అంతేకాదు క్షతగాత్రులు కూడా 900కి పైమాటే.
సంఘటన స్థలం నుంచి అరకిలోమీటర్ దూరంలో ఉన్న బహానాగా బజార్ గ్రామ హైస్కూల్ లోపలికి వెళ్తే.. అక్కడ వందలాది మృతదేహాలు, వాటిలో తమ వారు ఉన్నారా? లేదా? అని వెతుక్కుంటున్న కుటుంబ సభ్యులు కనిపించారు.
మృతదేహాలన్నీ తెల్లని గుడ్డతో కప్పేసి, ఆధారాలు చూపిన వారికి వాటిని అప్పగిస్తున్నారు అధికారులు. అక్కడి నుంచి ఎన్ని మృతదేహాలు బయటకు వెళ్తున్నాయో, అన్ని మృతదేహాలు ప్రమాద స్థలం నుంచి అక్కడికి వచ్చి చేరుతున్నాయి.
ఆ దృశ్యాలు ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో జరిగిందో, దాని ఫలితం ఎలా ఉందో చెప్పాయి.
అక్కడి నుంచి బాలాసోర్ ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డుపైకి చేరుకునేసరికి ప్రమాదాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలతో భువనేశ్వర్ నుంచి బాలాసోర్ వెళ్లే జాతీయ రహదారి బ్లాక్ అయిపోయింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
ఎలాగో 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాం. ఆ ప్రాంతమంతా బాధితులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది, సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఎన్జీవోలతో నిండిపోయింది. అక్కడున్న అన్ని వార్డులూ రైలు ప్రమాద బాధితుల వార్డులుగా మారిపోయాయి.

సర్జరీ వార్డు, ఆర్థోపెడిక్, ప్రసూతి, పిల్లల వార్డు.. ఇలా ఏ వార్డులో చూసినా ప్రమాద బాధితులే. కాళ్లు, చేతులు, తలపై కట్లు కట్టుకుని కనిపిస్తున్నారు. నొప్పి తట్టుకోలేకపోతున్నామనే కేకలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే ఈ ఆసుప్రతిలో ఎక్కువగా కనిపించారు.
ఆస్పత్రిలో ముగ్గురు తెలుగువారు కనిపించారు. ఒకరు శ్రీకాకుళానికి చెందిన మహిళ, మరో ఇద్దరు విశాఖకు చెందిన భార్యాభర్తలు. వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు ప్రయాణాలు చేస్తుండగా ఇలా జరిగిందని చెప్పారు.
ప్రమాదం జరిగినప్పుడు రుబ్బురోలులో తిప్పినట్లు కొన్ని క్షణాలు అనిపించిందని, ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డామని విశాఖకు చెందిన అరుణ చెప్పారు.
“కొందరు అరుస్తూ మా కళ్లముందే ప్రాణాలు వదిలేశారు” అని ఆమె తెలిపారు.

“ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానా?”
''కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడే మా మేనల్లుడు నాకు యూట్యూబ్‌లో ప్రమాద దృశ్యాలు చూపించాడు. చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంత ప్రమాదం నుంచి నేను బయటపడ్డానా? అని అనిపిస్తోంది” అని శ్రీకాకుళానికి చెందిన అను చెప్పారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు కొందరు నిద్రపోతుంటే.. తాను నిద్రపోయేందుకు సిద్ధమవుతున్నా అని ఆమె అన్నారు.
ఆస్పత్రి బయట, వార్డుల్లోనూ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, యువకులు చాలా మంది ఆహారం, బట్టలు, చెప్పులు అందిస్తూ కనిపించారు.
డాక్టర్ల సంఖ్య తగినంత లేకపోవడం, ఆసుపత్రిలో సదుపాయాలు కూడా తక్కువగా ఉండడంతో బాలాసోర్ ఆస్పత్రి లోపల, బయట చెట్ల కింద కూడా ప్రమాద బాధితులే కనిపించారు. ప్రమాదంలో గాయపడిన వారి కోసం అనేక మంది యువకులు రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. వారు కూడా అక్కడ కనిపించారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు, మరమ్మతులు తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఘటనా స్థలంలోనే కేంద్ర మంత్రులు, అధికారులతో ప్రధాని రివ్యూ చేశారు. తర్వాత హెలికాఫ్టర్‌లో బాలాసోర్‌కు చేరుకున్న ప్రధాని అక్కడి ఫకీర్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.
అలాగే, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాలాసోర్ ఆసుపత్రికి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పారు. బాలాసోర్ ఆసుపత్రికి ఇటు ఒడిశా, అటు పశ్చిమ బెంగాల్ నుంచి రాజకీయ నాయకులు రావడం, అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడడం కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, INDIANRAILWAYS
‘కవచ్ వ్యవస్థ ఉంటే ప్రమాదం జరిగేది కాదు’
మరోవైపు బోల్తాపడిన బోగీలను తీసేందుకు సహాయ బృందాలు ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్న రైలింజన్ డ్రైవర్ ఆర్కే సింగ్ బీబీసీతో మాట్లాడారు.
"ఏదైనా లోపం వల్లో, మానవ తప్పిదం వల్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినప్పుడు, అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ 2022లో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
రెండు రైళ్లు ఒకే ట్రాక్‌లో వస్తే.. అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. రైలు వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. నిర్ణీత సమయంలో డ్రైవర్ బ్రేకులు వేయడంలో విఫలమైతే.. ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.
ప్రస్తుతం ఈ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నారు. కానీ, కవచ్ వ్యవస్థ ఇంకా ఒడిశా రూట్లలో అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు'' అని ఆయన చెప్పారు.
ప్రమాదం జరిగిన సమీప గ్రామం బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్న వారు చెప్తున్న దాని ప్రకారం, ఈ మూడు రైళ్ల ప్రమాదం మొత్తం 10 నిమిషాల్లోనే జరిగింది.
ఇవి కూడా చదవండి:
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- ‘ది కేరళ స్టోరీ’: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?
- కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














