ఒడిశా రైలు ప్రమాదం: ‘ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్’ లోపమే కారణమన్న రైల్వే మంత్రి.. ఇంతకూ ఏమిటీ ఈ వ్యవస్థ?
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ కోసం
ఒడిశా రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపమే కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు.
‘‘ఈ అంశంపై రైల్వే భద్రతా విభాగం కమిషనర్ దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ఈ నివేదిక చేతికి వస్తుంది. అయితే, ప్రమాదానికి మూల కారణం ఏమిటో మేం గుర్తించాం. దీనికి బాధ్యులు ఎవరో కూడా గుర్తించాం. ప్రస్తుతం రైల్వే పట్టాల పునరుద్ధరణపై దృష్టిపెడుతున్నాం’’ అని ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన చెప్పారు.
దీంతో అసలు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? దీని వల్ల ప్రమాదం ఎలా జరిగింది? అన్న ప్రశ్నలు వినిపించాయి. ఇప్పుడు వాటికి సమాధానాలు చూద్దాం.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఈఐ) రైల్వే సిగ్నలింగ్‌లో కీలకపాత్ర పోషించే టెక్నాలజీల్లో ఒకటి. రైళ్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టుకోకుండా సురక్షితంగా వెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ రైళ్లకు ఒకే పట్టాలపై వెళ్లకుండా ఇది చూస్తుంది.
ఒక రైలు సిగ్నల్ మరో రైలు సిగ్నల్‌తో విభేదించకుండా ఆ మార్గంలోని అన్ని రైళ్లూ సమన్వయంతో ముందుకు వెళ్లేలా ఇది చూస్తుంది.
ఆ రైలు మార్గం సురక్షితంగా ఉందని లేదా ఆ మార్గంపై వేరే ఏ రైలూ లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఇది సిగ్నల్ ఇస్తుంది.
ఈ టెక్నాలజీతో రైళ్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టుకోవడం లేదా ఇతర రైలు ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయి. మొత్తంగా రైల్వే ఆపరేషన్లలో భద్రత కూడా పెరుగుతుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్, కంప్యూటర్స్ ఉంటాయి. ఇవి నిత్యం రైళ్ల కదలికలను ఒక కంట కనిపెడుతుంటాయి.
ఒకప్పుడు రైళ్లు సమన్వయంతో ముందుకు వెళ్లేలా చూసేందుకు సిబ్బందే నేరుగా రాడ్లు, లివర్లతో పనిచేసేవారు. ఒక రైలును దారి మళ్లించేందుకు ఈ రాడ్లను, లివర్లను చేతులతో నొక్కేవారు.
అయితే, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో చాలావరకు నిర్ణయాలన్నీ సాఫ్ట్‌వేర్‌పైనే జరుగుతాయి. దీని కోసం సెన్సర్లు, ఫీడ్‌బ్యాక్ డివైజ్‌లను వాడతారు. ఫలితంగా నిర్దేశిత సమయంలో రైలు ఎక్కడుందో పక్కాగా తెలుసుకోవచ్చు.
సిగ్నల్, ట్రాక్ సర్క్యూట్‌లు, ఇతర డేటా పాయింట్ల నుంచి కూడా ఈ సిస్టమ్‌కు సమాచారం అందుతుంది.
ఈ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్ వెల్లడించారు. అయితే, ఈ టెక్నాలజీలో ఏ విభాగంలో సమస్య తలెత్తిందో తెలియాల్సి ఉంది.
దీంతో పాటు యాక్సెల్ కౌంటర్స్, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను రైల్వే శాఖ ఉపయోగిస్తుంది.
యాక్సెల్ కౌంటర్స్ (ఏసీ) టెక్నాలజీ ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాల ఆధారంగా పనిచేస్తుంది. పట్టాలపై ఏదైనా ట్రైన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు.
ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీసీ) టెక్నాలజీ పట్టాలను భిన్న బ్లాక్‌లుగా విడగొడుతుంది. ఇక్కడ ఒక బ్లాకులో ఒక రైలు మాత్రమే ఉండాలి. దీనికి అనుగుణంగానే సిగ్నిల్స్‌ను ఇస్తుంటారు.
హ్యూమన్ ఎర్రర్, మాన్యువల్ ఇంటర్‌వెన్షన్‌లు వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు ఈ టెక్నాలజీలు పనిచేస్తాయి.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్ లోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగింది. ఆ లూప్‌లైన్‌పై అప్పటికే గూడ్స్ రైలు ఆగివుంది. దాన్ని గంటకు 126 కి.మీ. వేగంతో ఢీకొట్టడంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలుతప్పింది. ఇంతకీ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ తీసుకున్న ఆ లూప్‌లైన్ ఏమిటి? ఇలాంటి లైన్‌లను ఎందుకు ఏర్పాటుచేస్తారు?
ఏమిటీ లూప్‌లైన్?
రైల్వే స్టేషన్లకు సమీపంలో ప్రధాన రైల్వే లైన్‌లను కలుపుతూ కొన్ని ఇతర లైన్‌లు ఏర్పాటుచేస్తారు. వీటి వల్ల స్టేషన్‌లో ఎక్కువ రైళ్లను నిలిపేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు వేరే రైళ్లకు మార్గం ఇవ్వడం లాంటి ఆపరేషన్లలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొంతదూరం వెళ్లిన తర్వాత, మళ్లీ ఈ లూప్‌లైన్‌లను ప్రధాన రైల్వే లైన్‌కు కలుపుతారు.
సాధారణంగా లూప్‌లైన్‌లు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజిన్లతోపాటు మొత్తం రైలును ఆపేందుకు అవకాశం ఉంటుంది.
అయితే, ప్రస్తుతం 1,500 మీటర్ల పొడవుండే లూప్‌లైన్‌లను ఏర్పాటు చేసేందుకు రైల్వే ప్రాధాన్యం ఇస్తోంది. అంటే ప్రస్తుతమున్న లూప్‌లైన్‌లకు రెండింతలు పొడవుండే లైన్‌లను ఏర్పాటుచేస్తోంది.

ఫొటో సోర్స్, ani

ఫొటో సోర్స్, AFP
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
‘‘కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్’’ ఏమిటి?
అయితే, కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఆ టెక్నాలజీ?
ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్)నే కవచ్‌గా పిలుస్తున్నారు. దీన్ని 2011-12లో తీసుకొచ్చారు.
ఈ టెక్నాలజీలో భాగంగా రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలతో పాటు రైలు పట్టాల్లో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇవి ఒక దాంతో ఒకటి అనుసంధానమై, రైళ్లలోని బ్రేక్స్‌ను నియంత్రిస్తాయి. డ్రైవర్లనూ ఇవి అప్రమత్తం చేస్తాయి.
ఈ టెక్నాలజీలో రైలు కదలికల సమాచారం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే ఇది హెచ్చరికలు చేస్తుంది. ఇలా సిగ్నల్ జంప్ చేయడంతోనే చాలా వరకు రైలు ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
కచ్చితత్వంతో ప్రమాదాలను నియంత్రించే ఈ వ్యవస్థ ప్రస్తుతం హావ్‌డా-చెన్నై మార్గంలో అందుబాటులో లేదు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA
డ్యాష్‌బోర్డ్ ఎలా పనిచేస్తుంది?
పట్టాలపై ఎక్కడ ఏ రైలు ఉందో చూపించే డిజిటల్ డ్యాష్‌బోర్డు అందుబాటులో ఉన్నప్పుడు ప్రమాదం ఎలా జరిగిందని కూడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ డిజిటల్ డ్యాష్‌బోర్డు?
స్టేషన్ మాస్టర్, రైల్వే గార్డులు, ఇతర సిబ్బందితో రైళ్లను నడిపే లోకోపైలట్ మాట్లాడేందుకు రైళ్లలో డ్యాష్‌బోర్డు అందుబాటులో ఉంటుంది.
అయితే, ఈ డ్యాష్‌బోర్డు అనేది లోకోమోటివ్ ఇంజిన్ మోడల్, టైప్‌ల మీద ఆధారపడి ఉంటుంది.
ఈ డ్యాష్‌బోర్డును లోకోపైలట్‌లు నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎప్పుడు, ఎలా ముందుకు వెళ్లాలో ఇది సూచిస్తుంది.
అయితే, ప్రస్తుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏ మోడల్ డ్యాష్‌బోర్డు ఉంది? గూడ్స్ రైలు పట్టాలపై ఆగుందనే సమాచారం దీనిలో కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే, ఎందుకు కోరమండల్ ఆ లూప్‌లైన్‌లోకి వెళ్లింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- ‘ది కేరళ స్టోరీ’: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?
- కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















