కర్ణాటక: గేదెలను చంపుతున్నారు, గోవులను వధిస్తే ఇబ్బంది ఏమిటన్న మంత్రి.. ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్

ఆవులు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వం ఏర్పాటుచేసిన నాలుగు వారాలకే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది.

"గేదెలను చంపగలిగితే, ఆవులను ఎందుకు చంపకూడదు?" అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కె.వెంకటేశ్ వ్యాఖ్యానించి, బీజేపీ విమర్శలకు తావిచ్చారు.

గోహత్య నిరోధక చట్టం, పశువుల సంరక్షణ చట్టం 2020 లో మార్పులు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా అక్కడి ప్రతిపక్ష బీజేపీ రెండు రోజుల రాష్ట్రవ్యాప్త నిరసనలను ప్రకటించింది.

బీజేపీ అధికారంలో ఉండగా ఈ చట్టంలో మార్పులు చేశారు. గోహత్యను పూర్తిగా నిషేధించారు. 13 ఏళ్ల లోపు గేదెలు, ఎద్దులను చంపవద్దని చట్టం తెచ్చారు.

చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూనే కఠిన శిక్షలు కూడా విధించారు. నేరం రుజువైతే, మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 వేల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

అంతేకాదు ఇదే కేసులో మరోసారి నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష, లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది.

మంత్రి ఎందుకు స్పందించాల్సి వచ్చింది?

గోహత్య నిరోధక చట్టంలో మార్పు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందా అని మంత్రి వెంకటేశ్‌ను ఒక విలేఖరి ప్రశ్నించడంతో ఈ వివాదం అలుముకుంది.

కర్ణాటకలో వ్యవసాయంతో ముడిపడి ఉన్న ప్రజలకు ముసలి పశువులను సంరక్షించడం, చనిపోయిన జంతువులను పారవేయడం కష్టంగా మారుతోందని విలేఖరి మంత్రి దృష్టికి తెచ్చారు.

మంత్రి స్పందిస్తూ- గోవధ నిషేధం రైతులపై దుష్ప్రభావం చూపుతోందన్నారు.

సంతానం లేని గేదెలను, ఎద్దులను వధిస్తున్నారని, మరి గోవులను చంపడంలో ఇబ్బంది ఏంటి అని వెంకటేశ్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మంత్రి తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. చనిపోయిన తన ఆవుల కళేబరాలను వెలికి తీయడానికి బుల్ డోజర్లను పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.

రైతులకు మేలు జరిగేలా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

మంత్రి ప్రకటన అనంతరం పలువురు బీజేపీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

భారతీయులకు ఆవులతో అనుబంధం ఉందని, ఆవును తల్లిగా ఆరాధిస్తారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

మైసూర్ మహారాజు ఆ ఒక్క షరతే విధించారు: బీజేపీ

కాంగ్రెస్‌ పార్టీ తన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎంజీ మహేశ్‌ అన్నారు.

''ఆవును గౌరవించడం మతపరమైన అంశం మాత్రమే కాదు. కొడగు జిల్లాలోని కుశాల్‌నగర్, హసన్ రోడ్‌లోని రాతి కల్వర్టులను (కొండ వాగులపై నిర్మించిన వంతెనలు) కూడా ప్రజలు పూజిస్తారు. ఇవి బస్సు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడాయి'' అని మహేశ్‌ అన్నారు.

''దీని వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మారుతుందన్న వాదన ఉంది. ఇదొక్కటే కాదు, దీనికి సంబంధించి ఇంకా చాలా వాదనలు ఉండొచ్చు. హిందువుల్లో గొడ్డు మాంసం తినడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉండొచ్చు. అయితే మనం గో హత్యను ఆపి, ఆదర్శవంతమైన వైఖరిని తీసుకోవాలి. మైసూరు రాజ్యం భారతదేశంలో విలీనమైన కాలంలో గోహత్యపై వ్యతిరేకత ఉండేది.

రాష్ట్రంలో ఎక్కడా గోహత్య చేయరాదని మైసూర్ మహారాజు కేంద్ర ప్రభుత్వం ముందు ఒకే ఒక షరతు పెట్టారు'' అని మహేశ్‌ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఆధారంగానే తమ నిరసన ఉంటుందని ఆయన బీబీసీతో అన్నారు.

సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, FB/SIDDARAMAIAH

ఫొటో క్యాప్షన్, సిద్ధరామయ్య

సీఎం సిద్ధరామయ్య ఏమన్నారు?

నైతికంగా ఈ అంశంపై ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

గోవధ నిరోధక చట్టంలో మార్పులపై ఇప్పటివరకు కేబినెట్‌లో కూడా చర్చించలేదని ఆయన తెలిపారు.

''ఎన్నికల సమయంలో మేం ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తున్నాం. వారికి(కాంగ్రెస్‌కు) మాట్లాడటానికేం లేదు. సాగునీటికి రూ.1.5 లక్షల కోట్లు, రైతు రుణమాఫీ హామీలను అమలు చేయలేకపోయారు. అది ప్రజా వ్యతిరేక పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల ద్వారా రాష్ట్రాన్ని దోచుకున్నారు'' అని సిద్ధరామయ్య విమర్శించారు.

పశువులు

ఫొటో సోర్స్, Getty Images

విశ్లేషకులు ఏమంటున్నారు?

గోవధ నిరోధక చట్టంలో మార్పుల వివాదంపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

"బీజేపీ రాజ్‌గురుగా భావించే ఎస్‌ఎల్ బైరప్ప 'పూర్వ' అనే పుస్తకాన్ని రచించారు. దాన్ని పలు భారతీయ భాషలలోకి అనువదించారు. పాండవులను కలవడానికి కొంత మంది ఋషులు వెళ్లినప్పుడు, ద్రౌపది వారికి దూడ మాంసాన్ని వడ్డించింది. అంటే మహాభారత కాలం నుంచి ఆవు మాంసం తింటున్నారు" అని రాజకీయ విశ్లేషకుడు ఏకే భాస్కర్ రావు బీబీసీ హిందీకి తెలిపారు.

ఆహారం అనేది వ్యక్తిగత ఇష్టమన్నారు భాస్కర్ రావు. ఏనుగులు మాంసాన్ని తినవని, సింహాలు, పులులు మాంసాన్ని తప్ప మరేమీ తినవన్నారు.

నేడు కర్ణాటకలో లేవనెత్తడానికి బీజేపీకి ఎలాంటి అంశం లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

చనిపోయిన జంతువులను పారవేసే రైతుల సమస్యపై దృష్టి సారించడంలో భాగంగా మంత్రి వెంకటేశ్ స్వయంగా బీజేపీ చేతిలోకి ఒక వివాదాన్ని ఇచ్చారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోక ముందే బీజేపీ హడావుడి చేస్తోందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌ నారాయణ్ బీబీసీ హిందీతో అన్నారు.

''కాంగ్రెస్ నేతల మాటలను వక్రీకరించి పార్టీపై దాడి చేయడం బీజేపీ అలవాటుగా మార్చుకుంది. ఎద్దులను చంపవచ్చు, సంతానం లేని ఆవులను ఎందుకు చంపకూడదని మాత్రమే వెంకటేశ్ తన ప్రకటనలో అన్నారు" అని నారాయణ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)