ఉత్తరప్రదేశ్: 10 మందిని చంపిన నిందితుడికి 42 ఏళ్ల తరువాత శిక్ష... తీర్పులు ఎందుకు ఆలస్యమవుతాయి?

కోర్టు, తీర్పు

ఫొటో సోర్స్, JITENDRA KISHORE

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి పదిమందిని హత్య చేశాడు. ఆయనకు కిందటి వారమే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనకు ఇప్పుడు 90 ఏళ్లు. కానీ, ఈ నేరం జరిగి 42 ఏళ్లు అయింది.

ఇప్పుడు శిక్షవేసి ఏం లాభమని బాధిత కుటుంబాలు వాపోతుండగా, "న్యాయం ఆలస్యమైతే, న్యాయం నిరాకరించినట్టే" అన్నదానికి ఇది సరైన ఉదాహరణ అని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సాధుపూర్ గ్రామంలో యాభైఏళ్లు దాటిన వారెవరూ 1981 డిసెంబర్ 30 సాయంత్రాన్ని మరచిపోలేరు.

"ఆరోజు సాయంత్రం 6.30 ప్రాంతంలో కొంతమంది మగవాళ్లు మా ఇంట్లోకి చొరబడి కాల్పులు మొదలెట్టారు" అని ప్రేమవతి అప్పటి సంగతులు చెప్పారు.

ఆమెకు తన వయసు సరిగ్గా తెలీదు కానీ 75 ఏళ్లు ఉండవచ్చని చెబుతున్నారు.

"వాళ్లు నన్నేమీ అడగలేదు. లోపలికి వచ్చి బుల్లెట్ల వర్షం కురిపించారు."

నిమిషాల వ్యవధిలో ఆమె ముగ్గురు పిల్లలు నేలకొరిగారు. 10, 8 ఏళ్ల అబ్బాయిలు ఇద్దరు, 14 ఏళ్ల అమ్మాయి. అక్కడిక్కడే చనిపోయారు.

కిందటివారం కోర్టు తీర్పు తరువాత ప్రేమవతిని కలవడానికి వెళ్లిన ఫొటోగ్రఫర్లు, కెమెరాపర్సన్లకు ప్రేమవతి బుల్లెట్ దిగిన తన కుడికాలు చూపించారు. గాయం మానిపోయింది కానీ, మచ్చ మిగిలిపోయింది.

ఆరోజు సాయంత్రం పది మంది దళితులను చంపారు. వారిలో ప్రేమవతి ముగ్గురు పిల్లలూ ఉన్నారు. ఆమెతో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి.

కోర్టు, తీర్పు

ఫొటో సోర్స్, JITENDRA KISHORE

కుల హత్యలు

కులం కొట్లాటల్లో చేసిన హత్యలివి. ఈ నేరానికి పాల్పడ్డ పదిమందిలో తొమ్మిది మంది చనిపోయారు.

బతికి ఉన్న ఒకే ఒక్క నిందితుడు గంగా దయాల్‌కు ఫిరోజాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి హర్విర్ సింగ్ గత బుధవారం జీవితఖైదుతో పాటు రూ. 55,000 జరిమానా కూడా విధించారు. అది కట్టకపోతే మరో 13 నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

గంగా దయాల్ యాదవ కులస్తుడు.

విచారణ జరుగుతున్న కాలంలో నిందితులలో తొమ్మిది మంది చనిపోయారని కోర్టు తీర్పులో పేర్కొంది.

చాలామంది ప్రాసిక్యూషన్, డిఫెన్స్ సాక్షులు కూడా చనిపోయారని కోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది రాజీవ్ ఉపాధ్యాయ్ బీబీసీతో చెప్పారు.

నేరానికి, తీర్పుకు మధ్య 40 ఏళ్లకు పైనే గడిచిపోయాయి. దాంతో, కేసు రూపురేఖలు అస్పష్టంగా మారాయి.

ప్రేమవతి, ఇతర దళిత గ్రామస్థులు తమకు ఎవరితోనూ ఎలాంటి శతృత్వం లేదని చెబుతున్నారు.

అయితే, యాదవ కులానికి చెందిన వ్యక్తి నడుపుతున్న రేషన్ షాపుపై కొందరు దళితులు ఫిర్యాదు చేయడంతో రెండు కులాల మధ్య గొడవలు పెరిగాయని, అది హింసకు దారితీసిందని ఉపాధ్యాయ్ చెప్పారు.

కోర్టు, తీర్పు

ఫొటో సోర్స్, JITENDRA KISHORE

'తీర్పు ముందే వచ్చి ఉంటే బాగుండేది'

అప్పట్లో ఈ హత్యల ఘటన వార్తల్లోకెక్కింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తమ గ్రామానికి వచ్చారని, తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు.

అప్పటి ప్రతిపక్ష బీజేపీ సీనియర్ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి ఆ గ్రామానికి వెళ్లారు.

"చనిపోయినవారిని తిరిగి తీసుకురాలేం కానీ, న్యాయం చేకూరేలా చేస్తానని ఆయన వాగ్దానం చేశారు" అనిప్రేమవతి చెప్పారు.

ఇప్పటి కోర్టు తీర్పు గురించి తమ ఊరికి వచ్చి తమతో మాట్లాడిన జర్నలిస్టుల ద్వారా తెలిసిందని ఆమె చెప్పారు.

"నిజంగా న్యాయం చేకూరిందా లేదా అన్నది ఆ దేవుడికే తెలియాలి" అన్నారు ప్రేమవతి.

ప్రేమవతి పక్క ఇంట్లో ఉంటున్న మహరాజ్ సింగ్ కూడా ఈ ఘటనలో తన కుటుంబ సభ్యులను కోల్పోయారు. అప్పటికి ఆయనకు చాలా చిన్న వయసు. ఆనాటి ఘటన గురించి కథలు కథలుగా విన్నారు.

"ఎట్టకేలకు న్యాయం జరిగింది. కానీ, తీర్పు రావాల్సినప్పుడు రాలేదు. ఇది ముందే వచ్చి ఉంటే చాలా సంతోషించేవాళ్లం" అన్నారు మహరాజ్ సింగ్.

"తీర్పు చెప్పడానికి కోర్టులకు 42 ఏళ్లు పట్టింది. నేరం జరిగిన అయిదారేళ్లకు తీర్పు వచ్చి ఉంటే మా పెద్దల ఆత్మలు శాంతించి ఉండేవి" అని ఆయన అన్నారు.

కోర్టు, తీర్పు

ఫొటో సోర్స్, JITENDRA KISHORE

తీర్పు ఎందుకు ఆలస్యమైంది?

దీనికి కారణాలను లాయర్ ఉపాధ్యాయ్ వివరించారు. హత్యలు జరిగిన సమయంలో నేరం జరిగిన గ్రామం మెయిన్‌పురి అనే జిల్లాలో భాగంగా ఉంది. కానీ, 1989లో ఇది కొత్తగా ఏర్పడిన ఫిరోజాబాద్ జిల్లాలో భాగమైంది.

అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు 2001లో కేసును ఫిరోజాబాద్ కోర్టుకు మార్చిన తర్వాత దీని గురించి అందరూ మరచిపోయారు. కేసు ఫైల్స్ మెయిన్‌పురిలోనే మగ్గిపోయాయి.

2021లో మాత్రమే విచారణ ప్రారంభమైందని ఉపాధ్యాయ్ చెప్పారు. న్యాయస్థానాలలో ఉన్న బకాయిలను క్లియర్ చేయడానికి, పాత కేసులను అత్యవసర ప్రాతిపదికన క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది.

"నేరం చేస్తే చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు, వెంటాడుతూనే ఉంటుంది అని ప్రజలకు సందేశం ఇవ్వడానికి ప్రభుత్వం, జ్యుడీషియరీ ప్రయత్నిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

అయితే, న్యాయం సరైన సమయంలో జరగాలని ఇతర న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కోర్టు, తీర్పు

ఫొటో సోర్స్, JITENDRA KISHORE

'న్యాయం ఆలస్యమైతే, న్యాయం నిరాకరించినట్టే'

"ఇది కచ్చితంగా 'న్యాయం ఆలస్యమైతే, న్యాయం నిరాకరించినట్టే' అనే నానుడికి ఉదాహరణ. తీర్పు రెండు మూడేళ్లు ఆలస్యమైతే ఫరవాలేదు. మరీ 40 ఏళ్లు?" అన్నారు లాయర్ అక్షత్ బాజ్‌పాయ్.

"ముఖ్యంగా ప్రేమవతి లాంటి దళితులు, అణగారిన వర్గాలకు సకాలంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వపై ఉంది" అని బాజ్‌పాయ్ అభిప్రాయపడ్డారు.

"భారత నేర న్యాయ వ్యవస్థ వైఫల్యం వల్లే బాధితులు, వారి కుటుంబాలు 42 ఏళ్లపాటు యాతన అనుభవించారు" అన్నారాయన.

కోర్టులో తీర్పు ఇంత ఆలస్యమైన కేసు ఇదొక్కటే కాదు. దేశంలో క్రిమినల్ కేసుల్లో విచారణలు, తీర్పులు చాలా ఆలస్యంగా జరుగుతాయి. ఇవి ఏళ్లకు ఏళ్లు కొనసాగుతాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా.

ఈ కారణంగానే, చాలా కేసులు పెండింగ్‌లో ఉంటూ కోర్టుల్లో కొండల్లా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంటుకు ఫిబ్రవరిలో తెలిపింది.

న్యాయమూర్తులు తగిన సంఖ్యలో లేకపోవడమే జాప్యానికి ప్రధాన కారణమని భారత క్రిమినల్ చట్టంలో నిపుణులు, లైవ్ లా వెబ్‌సైట్ వ్యవస్థాపకులు ఎంఏ రషీద్ అన్నారు.

"దేశంలో ఉన్న జనాభా బట్టి మనకున్న న్యాయమూర్తులు చాలా తక్కువ. ఉన్న జడ్జిలపై ఎనలేని భారం పడుతోంది. అందుకే విచారణలు ముగియడానికి, తీర్పు చెప్పడానికి చాలా సమయం పడుతోంది" అని రషీద్ చెప్పారు.

మనకున్న "ప్రాచీన విధానల" వల్ల కూడా జాప్యం జరుగుతోందని రషీద్ ఆరోపించారు. ఈ పద్ధతుల్లో చాలా సమయం పోతుందని, సాక్షులను విచారించడం ఆలస్యమవుతోందని అన్నారు. ఉదాహరణకు, ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ, న్యాయమూర్తి సాక్ష్యాలను చేతితో వ్రాయవలసి ఉంటుంది.

హైకోర్టులో అప్పీళ్లు తుది విచారణ జాబితాలో చేరడానికి కనీసం ఐదు నుంచి పదేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. ఆ తరువాత మరో ఐదు పదేళ్లు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

"అందుకే 20 లేదా 30 ఏళ్ల తరువాత అప్పీలు దశలో దోషులు నిర్దోషులుగా విడుదలయ్యే కేసులు కూడా భారతదేశంలో తరచూ కనిపిస్తాయి" అని రషీద్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)