కారు వాడుతున్నారా? ఈ 9 టిప్స్ మీకోసమే

కారు డ్రైవింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

“నేను కనీసం 40 వేల కిలోమీటర్లు కూడా తిరగలేదు, అప్పుడే టైర్ మార్చమంటే ఎలా” అంటూ నిహారిక కారు షోరూం మెకానిక్‌తో గొడవ పడుతోంది.

“మీరు చెప్పేది కరెక్టే మేడం, కానీ ఆ టైర్లకు నాలుగేళ్లు దాటిపోయాయి, మార్చాల్సిందే” అంటూ ఆ షోరూం మెకానిక్ వాదన.

“మొన్న వర్షం పడుతున్నప్పుడు నేను ఏసీ అపితే, అలా చేయకూడదని చెప్పింది మా ఫ్రెండ్, వాడకపోయినా టైర్లు మార్చాల్సిందే అంటున్నాడు ఈ మెకానిక్, అసలు కారు గురించి నాకు చాలా విషయాలు తెలియదా ఏంటి?” అని తనలో తానే అనుకుంటూ షోరూం నుంచి బయటికి వచ్చింది నిహారిక.

నిహారిక లాగే, మనలో చాలా మందికి కారు వాడుతున్నా దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపోవచ్చు. అవేమిటనే దానిపై ఆటోమెబైల్ ఇంజినీరుగా 15 ఏళ్లు అనుభమున్న సత్యగోపాల్‌తో బీబీసీ మాట్లాడింది.

కారు టైర్లు

1. కారు వాడకపోయినా టైర్లు మార్చాల్సిందేనా?

మనం కారును వాడినా, వాడకపోయినా, ఎక్కువ కిలోమీటర్లు తిరగకపోయినా మూడు, నాలుగేళ్లకు ఒకసారి టైర్లు మార్చుకోవాలి.

అప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదాలు జరగవు.

మనం కారుపై పది, ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేశామనుకోండి. సాధారణంగా టైరులో ఉంటే గాలి పరమాణువుల పీడనం 30 నుంచి 35కు పెరుగుతుంది.

ఆ పెరుగుదలను టైర్ తట్టుకోగలగాలి. అయితే కొత్త టైర్లలా మూడు నాలుగేళ్లు వాడేసిన టైర్లు ఆ పీడన పెరుగుదలను తీసుకోలేవు.

అది మనం గుర్తించలేం. అలాంటి సమయంలో 80 కిలోమీటర్ల స్పీడ్ దాటిన తర్వాత పాత టైర్లు పేలిపోవడానికి ఆస్కారం ఉంది.

ఎందుకు అలా పేలిపోయిందో సాధారణంగా గుర్తించలేం. కానీ కారణం మాత్రం టైర్లు పాతబడిపోవడమే.

కారులో హాజర్డ్ బటన్

2. హాజర్డ్ బటన్ ఎప్పుడు ఆన్ చేయాలి?

ఏ కారులోనైనా హాజర్డ్ (త్రికోణాకారపు) బటననేది కామన్‌గా ఉంటుంది.

దీనిని ప్రమాదకరమైన పరిస్థితులు, పంక్చర్లు అయినప్పుడు అత్యవసరంగా రోడ్ల పక్కన ఆపాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాడాలి.

కానీ చాలా మంది కూడళ్లలో ఆపినప్పుడు కూడా వాడేస్తుంటారు.

ఎప్పుడు పడితే అప్పుడు హాజర్డ్ బటన్ వాడితే దాని ప్రాధాన్యం పోతుంది.

హాజర్డ్ బటన్ వల్ల కారుకున్న నాలుగు లైట్లు ఆన్ అయి బ్లింక్ అవుతూ ఉంటాయి. దీంతో ఎవరైనా మన కారును చూస్తే మనం ప్రమాదంలో ఉన్నామని గుర్తిస్తారు. దీనిని అత్యంత ముఖ్యమైన సమయాల్లోనే వాడాలి.

కారు డ్రైవింగ్

3. ఎయిర్ బ్యాగ్ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోనవసరం లేదా?

ఎయిర్ బ్యాగ్‌‌ను సెకండరీ రెసిస్టెంట్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) అంటాం.

ఫస్ట్ రెసిస్టెంట్ సిస్టం సీటు బెల్ట్.

ప్రమాదం జరిగినప్పుడు మనం స్టీరింగ్ మీద పడతాం. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే, అది బాంబుతో సమానం. అది మనకు మరింత ప్రమాదాన్ని తెస్తుంది.

అదే సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా మనం సీటుకు ఆనుకునే ఉంటాం.

అప్పుడు ఎయిర్ బ్యాగ్ మన మీదకు ఓపెన్ అవుతూ మెల్లగా వస్తుంది. దాని వలన రక్షణ కలుగుతుంది.

4. కారులో పర్ఫ్యూమ్ ఉపయోగించవచ్చా?

పర్ఫ్యూమ్‌లలో ఆల్కహాల్ కొద్ది మోతాదులో ఉంటుంది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు లోపల ఆక్సిజన్ కాస్త తక్కువే ఉంటుంది.

ఆ ఆక్సిజన్‌కు ఈ పర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ కలిసి రసాయన చర్య పొందితే, కారు లోపల శ్వాస ఇబ్బందులున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

పైగా కారులో అన్నీ ఎలక్ట్రిక్ భాగాలే ఉంటాయి. అగ్నిప్రమాదం జరిగితే పర్ఫ్యూమ్‌ దానిని మరింత పెంచుతుంది.

అందుకే పర్ఫ్యూమ్‌ వాడకుండా ఉంటేనే మంచిది.

కారులో ఏసీ

5. ఫాగ్ ఏర్పడినప్పుడు ఏం చేయాలి?

చల్లని సమయాల్లో, వర్షం పడినప్పుడు వాతావరణంలో మార్పులు అకస్మాత్తుగా వస్తాయి.

అలాంటి సమయాల్లో కారులో ఉన్న ఉష్ణోగ్రతలకు, బయట ఉష్ణోగ్రతలకు మధ్య తేడా వల్ల విండో షీల్డ్ మీద, వెనుక అద్దం మీద ఫాగ్ ఏర్పడుతుంది.

దానిని పోగొట్టాలంటే కారులో ఏసీ కొద్ది సేపు ఆన్‌లో ఉంచాలి. అలా చేస్తే ఫాగ్ తొందరగా తొలగిపోతుంది.

అలాంటి వాతావరణంలో డ్రైవింగ్‌లో ఉంటే విండో గ్లాసెస్‌ను ఒకట్రెండు ఇంచులు కిందకు దించి వెళ్లగలిగితే ఫాగ్ ఏర్పడదు.

6. కారులో హీట్ తగ్గించాలంటే ఏం చేయాలి?

ఎండలో పార్కు చేసిన కారులో హీట్ పెరుగుతుంది. కారు తీసే ముందు ‘క్రాస్ విండోస్’ ఓపెన్ చేయాలి.

అంటే ముందు వైపు లెఫ్ట్ డోర్ ఓపెన్ చేసి, వెనుక వైపు రైట్ డోర్ ఓపెన్ చేసి కాసేపు ఉంచితే... లోపలున్న వేడంతా వెళ్లిపోతుంది. ఈ టెక్నిక్ చాలా బాగా పని చేస్తుంది.

అలాగే కారు స్టార్ట్ చేసే ముందు అద్దాలు దించి కనీసం అర కిలోమీటరు డ్రైవ్ చేసి ఈలోపు బ్లోవర్ ఆన్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న వేడి బయటకు వెళ్లిపోతుంది.

దాని తర్వాత ఏసీ వేసుకుంటే కూలింగ్ తొందరగా అవుతుంది. బ్లోయర్ ఆన్ చేసుకుని కొద్దిసేపటి తర్వాత ఏసీ ఆన్ చేయడమన్నది సరైన విధానం.

కారు డ్రైవింగ్

7. గమ్యం చేరుకోగానే కారును వెంటనే ఆపకూడదా?

ఒక 50 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసిన తర్వాత కారును ఆపాల్సి వస్తే వెంటనే ఆపకూడదు.

తప్పనిసరిగా రెండు నుంచి మూడు నిముషాలు ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి తర్వాత ఆపాలి.

ఎందుకంటే ఆ సమయంలో కూడా కారులోని ఉష్ణోగ్రతల కారణంగా లోపలున్న టర్బో ఛార్జర్స్, ఇతర పరికరాలు అన్ని కూడా ఒక్కసారిగా సాధారణ స్థితికి రాలేవు.

అందుకే అవి సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం ఇచ్చి అప్పుడు కారు ఇంజిన్ ఆపాలి.

అప్పుడే ఇంజిన్‌లోని ఆయిల్స్ కూడా సాధారణ స్థితికి వచ్చి లూబ్రికేషన్ బాగా జరుగుతుంది.

8. డౌన్ రోడ్లపై కారును న్యూట్రల్ చేసి వెళ్లవచ్చా?

ఎక్కడైనా డౌన్ రోడ్లు రాగానే ద్విచక్రవాహనదారులు పెట్రోల్ పొదుపు చేయడం కోసం బండి ఇంజిన్‌ను ఆఫ్ చేస్తారు. కానీ కారుకు అలా చేయకూడదు.

ఎందుకంటే కారును డౌన్ రోడ్లపై న్యూట్రల్ చేస్తే బండిపై మొత్తం నియంత్రణ కోల్పోతాం.

డ్రైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నా కూడా అలా చేయడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గేర్ మార్చేటప్పుడు గేరుతో పాటు ఆటోమేటిక్ బ్రేకింగ్ కూడా జరిగేటట్లు ఏర్పాటు ఉంటుంది.

ఘాట్ రోడ్లపై లేదా బాగా డౌన్ ఉన్న రోడ్లపై జర్నీ చేసేటప్పుడు ఈ సిస్టమ్ వలన కారు కంట్రోల్ మన చేతిలో ఉంటుంది.

అదే న్యూట్రల్ చేశామనుకోండి, బ్రేక్ కూడా పని చేయదు. అది ప్రమాదానికి దారి తీస్తుంది.

కారు డ్రైవింగ్

9. కారు ఎత్తు మారుతుందా?

కారులో ఎక్కే వారి సంఖ్యను బట్టి కారు ఎత్తులో స్వల్ప మార్పు వస్తుందనే విషయాన్ని గమనించాలి.

ఆ మార్పు ప్రకారం కారు లైట్్‌ అడ్జెస్ట్ చేసుకోడానికి లెవెలర్ ఉంటుంది.

ఆ లెవెలర్ అడ్జెస్ట్ మెంట్ ఏంటంటే నలుగురు ఎక్కినప్పుడు హైబీం లైట్ ఓవర్ ల్యాప్ అయిపోయి పైకి వెళ్లిపోతుంది. దీనిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ దీనిని అడ్జెస్ట్ చేసుకోడానికి లెవెలర్ వాడాలి.

ఇది డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎంత ముఖ్యమో, ఎదురుగా వస్తున్న వారికి కూడా అంతే ముఖ్యం. వారి కళ్లలో లైట్ పడకుండా, రోడ్డుపై లైట్ బౌన్స్ అయ్యేలా చేస్తుంది.

ఈ లెవలర్ వల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది.

వీడియో క్యాప్షన్, కారు చక్కగా నడపడానికి 9 టిప్స్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)